ప్రతి వ్యక్తిలోపలా సృష్టికర్త బీజం ఉందని సద్గురు చెప్తున్నారు, ఆ బీజం పెరగడానికి మనకు మూడు సూత్రాలు ఇస్తున్నారు.

కొంతకాలం కిందట ఒక సత్సంగంలో నన్ను ఎవరో ఇలా అడిగారు, “నేనెందరో ఆధ్యాత్మిక గురువుల్ని చూశాను.  కానీ, మీరు ఆకర్షించినంతగా నన్నెవరూ ఆకర్షించలేదు. మీలో ఏముంది?”  దానికి నేను, “మీలో లేనిది, నాలో ప్రత్యేకంగా ఏమీలేదు. అనంతమైన సంభావ్యత ఉన్న ఒక బీజాన్ని మనందరికీ ఇచ్చారు. మీరు చాలా మంచివాళ్లు, జాగ్రత్త పరులు, ఆ బీజాన్ని భద్రంగా ఉంచుకున్నారు. నేను ఆ బీజాన్ని నాశనం చేసి, దాన్ని ఓ చెట్టుగా మలచుకున్నాను.” అని చెప్పను.

మీరు విత్తనాన్ని ఓ చెట్టుగా  చేయాలంటే, విత్తనం విత్తనంగా మిగిలి ఉండలేదు.. కదా...! విత్తనాన్ని విత్తనం గానే ఉంచడం మూర్ఖత్వం. కాని మిమ్మల్ని మీరుగానే భద్రపరచుకోవడం ఇవ్వాళ సమాజంలో గొప్పవిషయంగా భావింపబడుతూ ఉంది. మిమ్మల్ని మీరు ధ్వంసం చేసుకోవడం, ఒక వ్యక్తి పరిమిత సంభావ్యతను నాశనం చేయడం గొప్ప విషయమనుకోవడం లేదు. అందువల్ల మీరు చాలా తెలివైనవాళ్లు, ఎంత తెలివైనవాళ్లంటే మీరు జీవితాన్నే మోసం చేస్తున్నారు.

కలుపుతీసే ప్రక్రియ

మనందరం ఒకే విత్తనంతో వచ్చాం. అంటే ప్రతి విత్తన్నానికీ ఒకే విధమైన  సంభావ్యత ఉంది. విత్తనం నుండి చెట్టుగా మారడానికి ఒక ప్రయాణం ఉంది. మీరు విత్తనం చెట్టుగా తయ్యారవ్వాలనుకుంటే, మీరు దాన్ని పోషించాలి, రక్షించాలి; మీరు కలుపు మొక్కలను తొలగించాలి – చాలా ఉంటాయి కలుపు మొక్కలు. అవే పిచ్చి కలుపుమొక్కలు. లక్షలాది సంవత్సరాలుగా మనవజాతిని ఇబ్బంది పెడుతున్నాయి. వాటినెలా తొలగించుకోవాలో మనుషులింకా తెలుకోలేదు. క్రోధం, అసహ్యం, అసూయ, భయం, సందేహం వంటి మామూలు విషయాలు – ఇవే పిచ్చి కలుపు మొక్కలు దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి, వాటిని ప్రత్యేకంగా పోషించవలసిన అవసరంకాని, కాపాడవలసిన అవసరంకాని లేదు – అవి వాటంతటవే పెరుగుతాయి. కాని ఒక పవిత్రబీజం మొలకెత్తి, వృద్ధి చెందాలంటే, మీరు కలుపుతీయాలి, నీళ్లు పెట్టాలి, ఎరువు వేయాలి, తగినంతగా సూర్యకిరణాలు తగిలేట్లు ఏర్పాటుచేయాలి. మీరు ఎండవేడి తగులుతుందేమో నని భయపడి, సూర్య కిరణాలను తప్పించుకోవాలనుకుంటే జీవితానికి ఆధారభూతమైన  వెచ్చదనాన్ని కూడా కోల్పోతారు.

క్రోధం, అసహ్యం, అసూయ, భయం, సందేహం వంటి మామూలు విషయాలు – ఇవే పిచ్చి కలుపు మొక్కలు దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి

ప్రాణానికి ఏది ఆధారమో, అదే ప్రాణాంతకం కూడా. నిప్పు రొట్టెను కాల్చడానికి ఉపయోగపడుతుంది. అదే ఎక్కువైతే దాన్ని మాడుస్తుంది కూడా. మీకు వంటచేయడం బాగా చేతనైతే, రొట్టెను చక్కగా కాలుస్తారు; లేకపోతే దాన్ని మాడుస్తారు. మీరు ఎండకు భయపడి తప్పించుకోవడానికి నీడలోకి పారిపోతే, ప్రాణపోషకమైన వెచ్చదనాన్ని కూడా కోల్పోతారు. రొట్టె కాల్చడం చాలా మామూలు విషయమే, కాని దానికి నేర్పు కావాలి. అది తెలిసినవాడు, దాన్ని తేలికగా కాలుస్తాడు. అదే, తెలియనివాడు మాడ్చి బొగ్గు చేస్తాడు. ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా ఇంతే. మీరు ఈ ప్రక్రియకు అనుకూలంగా ఉంటే ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు పనిచేసేట్లు చేయడం చాలా తేలిక. కానీ ఈ సాధారణ ప్రక్రియకు మీరు అడ్డుపడుతూ, సంఘర్షిస్తూ ఉంటే, అది చాలా కష్టం.

లక్షలాది సంవత్సరాలుగా మనుషులు చేస్తున్న పిచ్చిపనులనే మీరూ చేస్తూ మీ కాలాన్ని వృథా చేసుకోకండి. కనీసం ఏదైనా కొత్త పిచ్చిపని నైనా చేయాలి కదా!  అవే అర్థరహితమైన పనులు: ఈ క్షణంలో ఇది వాస్తవం అనుకుంటారు, మరుక్షణంలో కాదు అనుకుంటారు; ఈ క్షణంలో ఇది చాలా గొప్పది అనుకుంటారు , మరుక్షణంలో కాదు అనుకుంటారు. “నువ్వు అద్భుతమైన మనిషివనుకున్నాను, కాని నువ్వు ఘోరమైన మనిషివి.” అంటారు.  ఈ క్షణంలో ఇదే సరైంది అని అంటారు. మరుక్షణంలో మీలో సందేహం. మిమ్మల్ని మీరు ఇలా తయారుచేసుకోకండి. మీరేదో, మీకొక్కరికే ప్రత్యేకమైన పిచ్చి పని చేస్తున్నారంటే సరే,మంచిది. కాని ఇవి అవే పిచ్చి కలుపుమొక్కలు. కొత్త కలుపుమొక్కలేవీ లేవు – ప్రజలు ఇదంతా చేసిందే. కలుపు పెంచడమనే పని చాలామామూలు ప్రక్రియ. ఏ మూర్ఖుడైనా చేయవచ్చు.

వృద్ధికి మూడు   లు

అమెరికాలో మనకు ‘ఈశా ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్నర్ సైన్సెస్’ ఉంది. దీని సంక్షిప్త రూపం ‘ఐఐఐ’. ఈ మూడు ‘ఐ’ లు మూడు మాటల్ని సూచిస్తాయి. మొదటిది ‘ఇన్‌స్ట్రక్షన్ - బోధన’, రెండవది ‘ఇంటిగ్రిటీ – సమగ్రత ’, మూడవది ‘ఇంటెన్సిటీ అఫ్ పర్పస్ -ప్రయోజన గాఢత ’.

‘ఇన్‌స్ట్రక్షన్’ అంటే బోధన, సూచన. దాన్ని జాగ్రత్తగా తెలుసుకోండి. చెప్పింది చెప్పినట్లుగా  కచ్చితంగా పాటించండి. ‘ఇంటిగ్రిటీ’ అంటే సమగ్రత. ఇక్కడ మీకు భోదిస్తున్న ఆధ్యాత్మిక ప్రక్రియలన్నీ, అన్నిటినీ సమగ్రంగా ఐక్యత తో చుసేట్లు చేసేవే . మిమ్మల్ని మీరు ప్రత్యేకమైన వారు అనుకున్నట్లయితే అది మీకు కలుపుకొనే లక్షణం లేకపోవడం. అందరూ వదలుతున్న గాలినే మీరూ పీల్చుకొంటున్నారు. “ఇది నాకిష్టంలేదు. ఈ భూగోళం మీద మరో ప్రాణి పీల్చుకున్న గాలిని నేను పీల్చను” అని మీరు భీష్మించుకున్నారనుకోండి. మీ జీవితం అక్కడితో ముగుస్తుంది. అందువల్ల మీరు ఇక్కడ జీవించాలనుకుంటే, మీకు అన్నిటితో ఈ సమగ్ర భావం ఉండాలి. నిజానికి,  భౌతికంగా మీరు అన్నిటితోనూ ఎల్లప్పుడూ సమగ్రంగానే ఉన్నారు. కేవలం,  మానసికంగా మాత్రమే మీరు ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటున్నారు. ఇదే సమగ్రత లేకపోవడం అంటే.

మూడో ‘ఐ’ ఇంటెన్సిటీ అఫ్ పర్పస్. ప్రయోజన గాఢత. ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా మిమ్మల్ని పెద్ద మనిషిగానో, గొప్ప మనిషిగానో  చేయడం గురించి కాదు. మిమ్మల్ని శూన్యంలో కరిగిపోయేట్టు చేయడానికి. మీరు కోరుతున్నది హద్దులులేని అనంతత్వమే తప్ప పెద్దరికం కాదు. ‘పెద్ద’ అన్నంత మాత్రాన హద్దులు చెరగిపోవు. ఈ ‘పెద్ద’ అనేదానికి సరిహద్దులున్నాయి. మీరు శూన్యం అయినప్పుడు మాత్రమే మీరు హద్దులులేని వారవుతారు. కాబట్టి దీన్ని మీరు గొప్పవారు కావడానికి వినియోగించుకోవద్దు. దీన్ని లయ మవ్వడానికి ఒక ప్రక్రియగా ఉపయోగించండి.

మీరు ఈ మూడు ‘ఐ’ లు పాటిస్తే ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ప్రతిరోజూ ఇది గమనించి చూడాలి. “ఔను, నాకది తెలుసు” అనుకుంటే, అది పనిచేయదు. మీ క్రియకు ముందు చేసే పని కాదిది. మీరు ఉదయం లేవగానే దీన్ని పరీక్షించుకోండి-

“నేనివ్వాళ ఇలాగే ఉన్నానా?” అని. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం మీరు ఏదో కోరుకున్నందువల్ల అది జరిగిపోదు. మీరు ఆ కోరిక నెరవేరడానికి సరైన పనులు చేయాలి. అప్పుడే మీరు కోరుకున్నది జరుగుతుంది.

మీరిలా కొనసాగితే, ఈ మొత్తం ప్రక్రియ, మిమ్మల్ని సృష్టి తో ఐక్యం అయ్యే  స్థితికి తీసికొని వెళుతుంది. అది మీ గురించి నా కోరిక కాని, ఆలోచనకాని కాదు. అది సృష్టికర్త విధానం.

ప్రేమాశిస్సులతో,
సద్గురు