బ్రహ్మచర్యం యొక్క అసలైన అర్థం
బ్రహ్మచర్యం ఎందువల్ల ముఖ్యం
బ్రహ్మచారుల అవసరం ఏమిటి
బ్రహ్మచర్య మార్గంలో ఏమేమి ఉంటాయి
ఇదో ఆటలాంటిది కాదు
మీ వెర్రితనాన్ని ఒప్పుకోవడం

బ్రహ్మచర్యం యొక్క అసలైన అర్థం

సద్గురు: “బ్రహ్మన్” అంటే “దైవమని” లేదా “అనంతమైనదని”. “చర్య” అంటే “మార్గం”. దైవ మార్గంలో ఉంటే, అప్పుడు మీరు ఒక బ్రహ్మచారి. దైవ మార్గంలో ఉండటం అంటే, మీకు మీ సొంత ప్రణాళికలు ఉండవు. మీరు ఏది అవసరమో అదే చేస్తారు. మీ జీవితంలో ఎక్కడికి వెళ్లాలి అని గానీ, లేదా ఏం చేయాలని గానీ, లేదా మీకు ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అని గానీ మీరు నిర్ణయించుకోరు. ఇవన్నీ మీలో నుంచి తొలగించ బడ్డాయి అంతే. మీరు అయిష్టంగా ఇలా ఉండేందుకు ప్రయత్నిస్తే, అది చిత్రహింసలా ఉంటుంది. మీరు దాన్ని ఇష్టంగా చేస్తే అది మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా, అందంగా చేస్తుంది, ఎందుకంటే ఇక మిమ్మల్ని సతాయించేది ఏదీ ఉండదు. మీరు ఊరికే ఏదైతే అవసరమో అది చేస్తారు. జీవితం చాలా సరళంగా ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని మీరు అలా చేసుకుంటే, మీరు ఆధ్యాత్మిక మార్గం గురించి గానీ, మీ ఆధ్యాత్మికత గురించి గానీ బెంగ పడాల్సిన పనిలేదు. ఆ విషయం అదే జరిగి పోతుంది. దాని గురించి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు.

ప్రజలు, బ్రహ్మచారి గొప్ప త్యాగం చేస్తున్నాడనీ, జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడని అనుకుంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. వారు కేవలం వారు వేసుకున్న బట్టల కారణంగానే బ్రహ్మచారి అయితే, అవును అది నిజమే, జీవితం ఒక చిత్రహింసలా ఉంటుంది. కానీ నిజంగా దైవ మార్గాన నడుస్తున్న వ్యక్తికి, ప్రపంచం అందించే ఈ అల్పమైన సుఖాలు పూర్తిగా అర్థం లేనివిగా అవుతాయి. ఒకసారి మీరు మీలోని అంతర్గత ఆనందాన్ని అస్వాదించాక, ఇక బాహ్య సుఖాలు పూర్తిగా అర్థం లేనివి అవుతాయి.

ప్రతి ఒక్కరూ బ్రహ్మచారి కావాలి, అది జీవనశైలి పరంగానే కానవసరం లేదు, అంతర్ముఖంగా బ్రహ్మచారి అవ్వాలి.

ఉదాహరణకి ఒకరు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాలి అనుకుంటున్నారనుకుందాం. వాళ్ళు ఏళ్ల తరబడి సాధన చేసి తయారవుతారు, బహుశా ఒక జీవితకాలం పాటు తయారవుతారు. ఆ తర్వాత అతను అత్యంత కఠినమైన వాతావరణంలో, జీవితంలోని ప్రతి సుఖాన్ని, సౌఖ్యాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని ఇంకా సాధారణంగా ప్రజలు కావాలని కోరుకునే ప్రతి దాన్నీ తనకు తానుగా విడిచి వేస్తాడు. కానీ మీరు నిజంగా తనకి తాను ఇవన్నీవిడచి వేస్తున్నాడు అనుకుంటున్నారా? లేదా అతను, మీరు అసలు ఎప్పటికీ ఊహించలేని దాన్ని, తన జీవితంలో ఒక వాస్తవంగా చేస్తున్నాడు అనుకుంటారా? జీవితంలో ఏదైనా విలువైనదాన్ని సృష్టించిన ఏ వ్యక్తి అయినా సరే, సహజంగానే ఇతరులకు ఉన్న అనేకమైన చిన్న చిన్న సుఖాలని, తమకు తాము వదిలేసుకున్నవారే. బహుశా మీరు సరిగ్గా తింటూ ఉండకపోవచ్చు, సరిగ్గా నిద్రపోతూ ఉండకపోవచ్చు, లేదా మధ్యాహ్నం కునుకు తీయకపోవచ్చు, మీ భార్య లేదా భర్తతో కూర్చుని సమయం గడుపుతూ ఉండకపోవచ్చు, లేదా మీ కుటుంబంతో కలిసి భోజనం చేస్తూ ఉండకపోవచ్చు. కానీ మీరు ప్రతి దాన్ని వదిలేసేది, ఎందుకంటే మీరు ఏదో సృష్టించాలని కోరుకుంటున్నారు. తమ జీవితంలో ఏదైనా అద్భుతమైన దాన్ని సృష్టించిన ఏ పురుషుడి లేదా స్త్రీ విషయంలోనైనా ఇది వాస్తవం కాదా? బ్రహ్మచర్య విషయంలో కూడా ఇది వాస్తవమే. వాళ్లు అనంతమైన దానిని చేరుకునే మార్గంలో ఉన్నారు. అందువల్ల వారి దృష్టి, ప్రజలు విలువైనవిగా భావించే ఇతర విషయాలపైకి మళ్లదు.

ఒక గురువుగా నా పని ఏమిటంటే, ఆ అనంతమైన దాని రుచిని మీకు చూపించటమే. అప్పుడు మీరు ఆత్రంగా దాని కోసం ప్రయత్నిస్తారు. ఒకసారి మీరు రుచి చూశారంటే, ఇప్పుడిక మీరు ఆగలేరు. మీరు దాని శక్తిని, అందాన్ని, ఇంకా ఆనందాన్ని తెలుసుకోవాలనుకుంటారు. ‘బ్రహ్మచారులు’ అంటే దాన్ని రుచి చూసినవారు. ఇక ఇప్పుడు వాళ్లు దాన్ని పూర్తిగా పొందాలనుకుంటున్నారు. వాళ్లు తిన్నా తినకపోయినా పట్టించుకోరు. మిగతావారు బానిసలు అయ్యే పానీయాలు, ధూమపానం, లేదా ఇతర భౌతిక సుఖాలను వాళ్ళు పొందుతున్నారా లేదా అన్నది పట్టించుకోరు. వాళ్లు అనంతమైన దాన్ని రుచి చూశారు, ఇప్పుడు వాళ్ళకది మొత్తం పూర్తిగా కావాలి. దానికంటే ఏ మాత్రం తక్కువైనా వాళ్లు అంగీకరించరు.

సౌకర్యాలు, భద్రతల పేరిట ప్రజలు తమ జీవితమంతా వెళ్ళబుచ్చుతుంటే, వాళ్లు తమ జీవితాన్ని వృధా చేస్తున్నట్లే. వాళ్ళు పూర్తిగా తెలుసుకోవాలి. ఇది నా కోరిక కాదు, ఇది వారి కోరిక కూడా. ఇవాళ మీకు ఏదో కావాలన్న కోరిక ఉంది. అది తీరితే మీరు ఆ తర్వాత దాన్ని కోరుకుంటారు. ఆ తర్వాత మరొక దాన్ని, ఆ తర్వాత మరొక దాన్ని. మీరు నిశితంగా మీ కోరిక ప్రక్రియను గమనిస్తే, పరిమితమైన దేనితోనూ సరిపుచ్చుకునేందుకు సుముఖంగా లేరు అని మీరే చూస్తారు. పరిమితులు నచ్చినది మీలో ఏదో ఉంది. ఎప్పుడూ ఆనంతమైనదే కోరుకునేది మీలో ఏదో ఉంది. అనంతమైనది మీరు కోరుకోవాలి అనేది, నా ఆలోచనో లేదా నా మనోభావమో కాదు. సరైన స్పృహ లేకుండా, ఆనంతమైన దానిని మీరు ఎలాగూ కోరుకుంటూనే ఉన్నారు. సరైన స్పృహ లేకుండా మీరు దాని కోసం ప్రయత్నిస్తే మీరు విసిగిపోతారు అలాగే దాన్ని కనుగొనే అవకాశాలు కూడా మీకు చాలా చాలా తక్కువ. మీరు కావాలనుకునే దాని కోసం, ఎరుకతో, ఏకాగ్రతతో వెతకటం మంచిది. మీరు కోరుకుంటున్న దానికోసమే బ్రహ్మచారులు కూడా ప్రయత్నిస్తున్నారు, కానీ వారు దాన్ని నూటికి నూరు శాతం స్పృహతో ప్రయత్నిస్తున్నారు.

అంటే ప్రతి ఒక్కరూ బ్రహ్మచారి కావాలనా దానర్థం? ప్రతి ఒక్కరూ బ్రహ్మచారి కావాలి, అది జీవనశైలి పరంగానే కానవసరం లేదు, అంతర్ముఖంగా బ్రహ్మచారి కావాలి. ప్రతి ఒక్కరూ దివ్య మార్గంలో ఉండాలి. బ్రహ్మచారి అంటే కేవలం పెళ్ళి చేసుకోకుండా ఉండటం మాత్రమే కాదు. అది కేవలం సహకరించే ఒక అంశం మాత్రమే. ఒక బ్రహ్మచారిగా ఉండడం అంటే మీరు స్వతహాగానే ఆనందంగా ఉండడం. మీరు పెళ్లి చేసుకుని కూడా బ్రహ్మచారిగా ఉండొచ్చు. అది సాధ్యమే, ఎందుకంటే స్వతహాగానే మీరు ఆనందంగా ఉన్నారు - మీరు మీ భార్య లేదా భర్త నుండి ఆనందాన్ని జుర్రుకోవాలని చూడటం లేదు. అసలు అది ఉండాల్సింది అలానే. ఈ ప్రపంచం మొత్తం బ్రహ్మచారిగానే ఉండాలి. ప్రతి ఒక్కరూ స్వతహాగానే ఆనందంగా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు ఒక జంటగా అయితే, అది తమ ఆనందాన్ని పంచుకోవడానికి కావాలే తప్ప, ఒకరి నుంచి ఒకరు ఆనందాన్ని జుర్రుకోవడానికి కాకూడదు.

బ్రహ్మచర్యానికి అంత ప్రధాన్యత ఎందుకు?

బ్రహ్మచారి వ్యవస్థ అసలు ఎందుకు రూపొందించబడింది? కేవలం తమ జీవిత చరమాంకంలో సాక్షాత్కారం పొందాలని ఎవరైనా కోరుకుంటున్నట్లైతే, దాన్ని ఎన్నో విధాలుగా చేయొచ్చు. మీకు నేను ఒక తారీకున నిర్ణయించగలను. కానీ, మీరు దానిని పూర్తిగా తెలుసుకోవాలి, అన్వేషించాలి అనుకుంటే, అన్వేషించడం మాత్రమే కాకుండా, ఎంతో మందికి అది సాధ్యపడేలా చేయడంలో ఒక ఉపకరణంగా ఉండాలి అనుకుంటే, అప్పుడు బ్రహ్మ చర్యం అనేది ప్రముఖమైనది అవుతుంది. బ్రహ్మచారులు అంటే భవిష్యత్తు కోసం ఇప్పుడు మనం పెట్టే పెట్టుబడి, ఆధ్యాత్మికతను దాని అసలు రూపంలో, స్వచ్చంగా ఒక తరం నుండి మరో తరానికి అందించడం కోసం ఇప్పుడు మనం పెట్టే పెట్టుబడి. అందుకు ఒక చిన్న ప్రత్యేక దళం అవసరం. వాళ్లకి ఒక ప్రత్యేకమైన విధానంలో దీక్ష ఇస్తాము. అది వాళ్ళ శక్తులను పూర్తిగా భిన్నమైన, ఉన్నతమైన దిశలోకి మారుస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అడుగు తీసుకోవాల్సిన పనిలేదు. లేదా మేము ప్రతి ఒక్కరిని దీక్ష ఇవ్వడానికి తీసుకోము కూడా. ఎందుకంటే ఆ అవసరం లేదు, అంతేకాదు, అందరూ అందుకు అవసరమైన సాధన చేయలేరు కూడా.

మనందరం మామిడి పళ్ళు తింటున్నాము, కానీ మనలో ఎంతమంది మామిడి చెట్లను నాటి, వాటిని పెంచి, అప్పుడు ఆ మామిడి పళ్ళను తింటున్నాము?

మనందరం మామిడి పళ్ళు తింటున్నాము, కానీ మనలో ఎంతమంది మామిడి చెట్లను నాటి, వాటిని పెంచి, అప్పుడు ఆ మామిడి పళ్ళను తింటున్నాము? అందరూ మామిడిపళ్లు తినగలుగుతున్నది, ఎవరో మామిడి చెట్లను నాటారు కాబట్టే. ప్రతి సమాజంలో వెయ్యి మందిలో కనీసం ఒక పదిమంది మామిడిపండ్ల చెట్లను నాటే బాధ్యత తీసుకున్నారు. అలాగే ఈ విషయంలో కూడా, కొద్దిమంది బ్రహ్మచర్య మార్గాన్ని తీసుకోవాలి. సమాజంలో ఇతరుల శ్రేయస్సు కోసం తమని తాము అంకితం చేసుకోవడానికి సిద్దంగా ఉన్నవారు అవసరం. ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించే వారు ఎవరూ లేకపోతే, ఆ సమాజం కచ్చితంగా దుర్గతి వైపుగా వెళుతుంది. ప్రస్తుతం సమాజానికి జరుగుతున్నది ఇదే. అందరి శ్రేయస్సు గురించి ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు.

బ్రహ్మచారుల అవసరం ఏమిటి

ప్రాథమికంగా ఈ మానవ యంత్రాంగం అనేది, ఒక శక్తి వ్యవస్థ. మీరు దాన్ని అన్నివిధాలుగా తెరచి ఉంచి ప్రపంచంతో ఎన్నో లావాదేవీలు జరుపుతూ ఉండవచ్చు. లేదా మీరు దాన్ని ఒక పరిమితమైన నడవడితో ఉంచి, దాన్ని ఎంతో సమగ్రంగా ఉండేలా చేయవచ్చు. ఒక రాకెట్ పైకి వెళ్ళగలుగుతున్నది ఎందుకంటే, అది కేవలం ఒకవైపే మండుతుంది. ఒక వేళ అది కనుక అన్ని వైపులా మంటలు వదులుతూ ఉంటే, అది ఎక్కడికీ వెళ్లదు, దానిలోని ఇంధనం ఊరకే అంతా కాలిపోతుంది. లేదా అది ఎటు పడితే అటు వెళ్లి, కింద పడిపోతుంది. మీరు ఒక బ్రహ్మచారి విషయంలో చేయాలనుకుంటుంది ఏమిటంటే, అతను కేవలం ఒక వైపు మాత్రమే మండేలా చేయాలనుకుంటున్నారు. ఎవరైతే కేవలం ఒక వైపు మాత్రమే మంటలు వదులుతారో, వాళ్ళు నిటారుగా పైకి వెళతారు, ఇంకా అటువంటి ఒక వ్యవస్థను తయారు చేయడం వెనుక, మనం కోరుకునే ఒక ప్రయోజనం కూడా ఉంది.

ఈ ప్రపంచం అంతటా ఆధ్యాత్మిక ప్రక్రియ అనే విస్ఫోటాన్ని కలిగించే ఆయుధం అది.

మీరు అలా ఒక పరిమితమైన నడవడితో ఉన్నప్పుడు, అది ఒక శక్తివంతమైన ఉపకరణం అవుతుంది. ఆ ఉపకరణాన్ని ఎన్నో భిన్నమైనవి విధానాలలో ఉపయోగించవచ్చు లేదా వినియోగించవచ్చు. దాంతో ఈ ప్రపంచం అంతటా ఆధ్యాత్మిక ప్రక్రియ అనే విస్ఫోటనం చేయగల ఆయుధం అది.

ప్రతి సంస్కృతిలోనూ సన్యాసులు ఉంటూ ఉన్నారు, ఎందుకంటే ఎక్కడైతే నిజమైన ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగుతుందో అక్కడ, తాము పూర్తిగా ఒక సమగ్ర వ్యవస్థలుగా ఉండేలా, వాళ్ళు కొన్ని వ్యవస్ధలను స్థాపించాలని తలంచేవారు. ఆ వ్యవస్థకు బయటి సమాజంతో లావాదేవీలు లేకుండా చూసుకునే వాళ్ళు. దానికదే ఒక సంపూర్ణమైనది వ్యవస్థ. మీరు గనుక ప్రపంచాన్ని ఒక విధంగా తట్టి లేపాలనుకుంటే, కొన్ని ప్రక్రియలను సృష్టించి కొన్ని విషయాలను అందుకోవాలనుకున్నట్లయితే, ఇటువంటి వ్యవస్థలు అవసరం. మీరు వాతావరణాన్ని దాటిపోయే ఒక ఉపగ్రహాన్ని పంపాలనుకుంటే, అప్పుడు మీకు ఒక రాకెట్ అవసరమౌతుంది. కానీ మీరు అలా వాతవరణంలోనే తిరగాలని అనుకుంటే, అప్పుడు ఒక విమానం సరిపోతుంది. అదే ఇక్కడ తేడా. మీరు కొన్ని పరిమితులకు అతీతంగా వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు, బ్రహ్మచారులు చాలా ఆవశ్యకమవుతారు.

బ్రహ్మచర్య పధంలో ఏమేమి ఉంటాయి?

ప్రశ్న:: బ్రహ్మచర్య పధంలో ఏమేమి ఉంటాయి? తాము ఆ విధంగా జీవించగలరో లేదో తెలుసుకోవడం ఎలా?

సద్గురు::బ్రహ్మచర్యం అంటే దేనికీ అంటని గాలిలా ఉండటం. అంటే మీరు దేనినీ కోరుకోరు. ఈ గాలి అన్ని చోట్లకు వెళుతుంది, కానీ ప్రస్తుతం అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. అది సముద్రాలను దాటి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే ఊరికే ఒక జీవంగా ఉండడం - మీరు ఏ విధంగా అయితే జన్మించారో ఆ విధంగా ఉండటం - ఒంటరిగా. ఒకవేళ మీ తల్లి కవల పిల్లల్ని కన్నాసరే, మీరు ఒంటరిగానే పుట్టారు. కాబట్టి బ్రహ్మచర్యం అంటే దైవంతో అతి దగ్గరైన సంబంధాన్ని కలిగి ఉండటం - ఆ విధంగానే జీవించడం.

బ్రహ్మచర్యం అంటే మీరు ఏమీ చేయరు, మీరు జీవితాన్ని, ఈ సృష్టి కర్త మిమ్మల్ని ఏ విధంగా అయితే చేశాడో, దాన్ని అలానే కొనసాగనిస్తారు - దానిని మరేదో చేయాలని మీరు చూడరు.

బ్రహ్మచర్యం అనేది అదేదో గొప్ప విషయం కాదు. ఇక్కడ ఒక జీవంలా ఉండిపోవటమే అది. పెళ్లి చేసుకోవడం అనేది ఒక పెద్ద విషయం - మీరు చాలా పెద్దదేదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని! కనీసం, అందరూ అలా అనుకుంటారు. బ్రహ్మచర్యం అంటే మీరు ఏమీ చేయరు, మీరు జీవితాన్ని, ఈ సృష్టి కర్త మిమ్మల్ని ఏ విధంగా అయితే చేశాడో, దానిని అలానే కొనసాగనిస్తారు - మీరు దాని నుండి మరేదో చేయాలని చూడరు. కాబట్టి ఇక్కడ ఆ అడుగు తీసుకోవడం అనేది లేదు. మీరు ఏమీ చేయకపోతే, అప్పుడు మీరు ఒక బ్రహ్మచారి.

కానీ అక్కడ సాధన ఉంటుంది, ఇతర నియమాలు ఉంటాయి, మరి దాని సంగతి ఏమిటి? ఇవన్నీ మీరు ఆ విధంగా ఉండేందుకు, సహకారం అందించడానికి. ఎందుకంటే, మీరు ఈ భూమి నుండి ముడి పదార్థాలను తీసుకున్నారు, ఈ భూమి లక్షణాలు మీలోకి ప్రవేశించి, మిమ్మల్ని శాసించాలని ప్రయత్నిస్తాయి. ఒక మౌలిక లక్షణం ఏమిటంటే తామసత్వం. ఆఖరికి పొద్దున్నే లేవడానికి కూడా, బద్దకం ఉంటుంది. దివ్య పధంలో ఉండడం అంటే భూమి లక్షణాలకు లొంగకుండా ఉండటం.

దాని ఒక లక్షణం జడత్వం, మరోటి నిర్బంధతలు. మీరు భూమి నుండి ఏదైనా తీసుకుంటే, మీరు భూమిలానే అవుతారు. అది మిమ్మల్ని గిర్రున చక్రంలా తిప్పడానికి ప్రయత్నిస్తుంది. ఈ విశ్వంలో మీరు భౌతికమైనదని పిలిచే ప్రతి దానికీ మూలం, గిరగిరా చక్రంలా భ్రమిస్తూ ఉండడమే.

మీరు ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటే, అది ఎంత పెద్దదైనా సరే, మీరు మళ్ళీ మొదటికి వస్తారు. మిమ్మల్ని ఆహ్వానించక పోయినా సరే, ప్రపంచం మిమ్మల్ని కోరుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఎలాగూ వెనక్కి వస్తారు, ఎందుకంటే మీ మార్గం గుండ్రటి చక్రంలా ఉంది. ఇక్కడ నిజంగా తమని ఎవరూ ఆహ్వానించడం లేదు అని గ్రహిస్తారో, ఎవరైతే తిన్నని మార్గాన వెళ్లాలని అనుకుంటారో, వాళ్లకి సరైనది - దైవ మార్గం - అంతేగాని గ్రహాలు తిరిగే గుండ్రటి మార్గం కాదు. సహజమైన ప్రక్రియకి బదులుగా, బ్రహ్మచర్యాన్ని ఒక మార్గంగా, ఒక నియమంగా తీసుకుంటారు, అప్పుడు వాళ్ళు మళ్ళీ జీవితం యొక్క చక్రభ్రమణంలోకి పోకుండా ఉంటారు. వారు దానికి లోనుగావాలని అనుకోవడంలేదు.

ఇది చుట్టివచ్చే మార్గంలాంటిది కాదు

అందులో ఏమేమి ఉంటాయి? మీరు చాలా ఎరుకతో ఉంటే, అందులో ఏమీ ఉండదు. అది చాలా సరళమైనది. ప్రతి రోజూ పొద్దున్నే మీరు అప్పుడే పుట్టినట్టుగా లేస్తారు, అలాగే మీరు చనిపోతున్నారు అన్నట్లుగా నిద్రలోకి జారుకుంటారు. ఈ మధ్యలో, అందరికీ ఉపయోగంగా ఉండేది ఏదో చేస్తారు. ఎందుకంటే మీరు ఇంకా, ఎటువంటి పనీ చేయకుండా ఉండగలిగే స్థితికి చేరలేదు - మీరు ఏదో ఒకటి చేయాలి.

దీని ఉద్దేశ్యం ఏమిటంటే, మీరు చేసే పని మీకోసం కాకూడదు. ఎందుకంటే ఒకవేళ అది మీకోసం అయితే, మీరు గుట్టలుగుట్టలుగా బంధనాలను ఏర్పరచుకుంటారు. కాబట్టి మీరు నిరంతరం మీకోసం కాకుండా ఏదైనా పని చేస్తూ ఉంటారు. మీరు ఎంతో పని చేస్తారు, మీరు పడుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇక మీకు ఒక్క క్షణం కూడా మిగలదు, మీరు శవంగా అలా పడిపోతారు. ఆపై మీరు పక్షుల కంటే ముందే లేచి, పనిలో మునిగి పోతారు. మిగతాది అనుగ్రహం చూసుకుంటుంది..

మీరు మరీ ఎక్కువ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే బ్రహ్మచారిని తయారు చేయడానికి మేము కొంత మోతాదులో శక్తిని వెచ్చించాము. వాస్తవంగా అలా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఊరికే ఏమీ చేయకుండా ఉంటే, వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. కానీ లోపల నుండి భూమి లక్షణాలు మిమ్మల్ని శాసిస్తాయి, ఎందుకంటే, మీరు మీ శరీరాన్ని పూర్తిగా తోసివేయలేరు, దానికి స్మృతి ఉంటుంది, దానికి ఒక పెద్ద కర్మల గుట్ట ఉంటుంది, దానికి ప్రవృత్తులు ఉంటాయి.

ఈ ప్రవృత్తులు మీకు సహజమైనవి కావు. కానీ ఈ వాహనం - ఈ శరీరం - అవి మీకు సహజమైనవి అన్నట్టుగా తీసుకుంటుంది. ఉదాహరణకి మీరు అలైన్మెంట్ లేని కారు నడుపుతన్నట్లయితే, మీరు దాన్ని సరి చేయాలి. లేదంటే అది మిమ్మల్ని ఒకవైపుకు లాగేస్తూ ఉంటుంది. అలాగే శరీరానికి కూడా అలైన్మెంట్ సమస్య ఉంది. అది ఎప్పుడు ఒక వైపుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది. ఒకసారి అది కొద్దిగా ఒంగినా లేదా ఒక మలుపు తిరిగినా, ఇక అప్పుడు చక్రంలాగా గుండ్రంగా తిరగడానికి ఎంత సమయం పడుతుంది అన్నదే ప్రశ్న.

కానీ అది కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి, అలాగే వారి ఎరుక అంత గొప్పగా లేదు కాబట్టి, మీరు అదే చోటుని దాటిన ప్రతి సారీ, అది కొత్తదిగా కనిపిస్తుంది. మీరు ఏదైనా చోట మధ్యాహ్నం కూర్చుంటే, ఆ ప్రదేశం అంతా ఒక విధంగా కనబడుతుంది. మీరు అదే చోట సూర్యాస్తమయంలో కూర్చుంటే, అది ఇంకోలా కనబడుతుంది. మీరు అర్ధరాత్రి వస్తే అది వేరేలా కనపడుతుంది. కాబట్టి మీరు ప్రతి సారీ వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళాను అనుకుంటారు. కానీ కాదు, అది కేవలం సమయము, కాలము, ఇంకా తక్కువ జ్ఞాపక శక్తి వల్లే.

మీ వెర్రితనాన్ని ఒప్పుకోవడం

మీ వద్ద ఉన్నది అలైన్మెంట్ సరిగ్గా లేని వాహనం, లేదా గుండ్రంగా వెళ్ళేలా చేయబడ్డ వాహనం. మీరు పన్నెండేళ్ల చక్రంలో తిరుగుతున్నా, లేక మూడు నెలల చక్రంలో తిరుగుతున్నా, ఇక్కడ తేడా కేవలం మీ వెర్రితనంలోని మోతాదు మాత్రమే. మీరు మూడు నెలల చక్రంలో తిరుగుతూ, ఉంటే అందరూ మీరు వేర్రివారని చూడగలుగుతారు. మీరు 12 ఏళ్ల చక్రంలో తిరుగుతుంటే, ప్రజల అది గమించరు, కానీ మీరు త్రికరణ శద్ధిగా ఉంటే, మీకే తెలుస్తుంది, మీకు వెర్రి ఉందని. కాబోతే, ఉన్న విషయం ఏంటంటే, మీరు బాగానే ఉన్నారని, మీరు ప్రపంచాన్ని మభ్య పెట్టగలుగుతారు.

మిమ్మల్ని మీరు త్రికరణశుద్ధిగా పరిశీలించుకోవాలి - సామాజిక ప్రభావం గురించి కంగారు పడకండి, మీ పిచ్చిని మీరు ఎవరి దగ్గరా ఒప్పుకోవాల్సిన పనిలేదు - కానీ మీలో మీరు పరిశీలుంచుకుంటే మీలో కావాల్సినంత వెర్రి లేదా? మీరు దీన్ని త్రికరణశుద్ధిగా చూడాలి. మీరు మీకు నిష్కాపణ్యం, నిజాయితీగా ఉంటే, మీకే తెలుస్తుంది మీరు చాలా దారి తప్పారు అని.

మీరు మొత్తం సంఘంలోని మనిషిగానే అయిపోతే, ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అన్నదే మీకు ముఖ్యం అయితే, మీరు అంతర్గతంగా ఎలా ఉన్నారు అన్నది మీకు ముఖ్యం కాకపోతే, అప్పుడు మీరు కొన్ని జన్మల పాటు అలానే కొనసాగుతూ ఉండొచ్చు. మీరు ఎలా ఉన్నారు అన్నది మీకు ముఖ్యం అయితే, మీ గురించి ఇతరులు ఏమనుకుంటారో అన్నది కాకుండా - ‘మీరు ఏమిటి’ అన్నది మీకు చాలా ముఖ్యమైనది అయితే, మీ జీవితాన్ని మలిచేది ఇతర వ్యక్తుల అభిప్రాయం కాదుగానీ మీ జీవితాన్ని మలిచేది మీ స్వభావం అయితే, అప్పుడు మీరు సహజంగానే దైవ మార్గంలో ఉంటారు.

Editor's Note:  Click here to read the riveting life stories of many Isha Brahmacharis as they share their own experience of walking this path with Sadhguru’s grace and guidance.