ప్రశ్న: మేము ఈశాలో చేస్తున్నపనికి, మా సాధనకి - మానవ చైతన్యాన్ని పెంపొందించటానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుపుతారా?

సద్గురు: చైతన్యం అనేపదాన్ని బాగా దుర్వినియోగం చేశారు, ఎన్నో రకాలుగా ఈ పదాన్ని వాడారు. ముందుగా మన ఉద్దేశంలో చైతన్యం అంటే ఏమిటో నిర్వచిస్తాను. మీరు ఎన్నో విషయాల సమ్మేళనం. ఒక జీవంగా, ఒక శరీరంగా ఉన్న మీరు కొంచెం మట్టి, కొంచెం గాలి, కొంచెం అగ్ని, కొంచెం జలం, కొంచెం ఆకాశం అన్నమాట. ప్రాథమికమైన వివేకం ఏదో, ఒకటి వీటన్నింటిని కలిపి ఒక విధమైన అమరికలో జీవాన్ని అందులో నివసించే ఏర్పాటు చేసింది. ఇవే పదార్థాలు అక్కడ మట్టిలా పడి ఉంటే, ఇక్కడ జీవిగా కూర్చున్నాయి. ఎంత అద్భుతమైన రూపాంతరీకరణ. మనకు అంతుబట్టని స్థాయిలోని గొప్ప వివేకం గాలి వంటి మామూలు పదార్థాన్ని ప్రాణంగా మార్చింది. గాలి ఆగితే ప్రాణం పోవడమే.

చెట్టైనా, పుట్టైనా, ఏనుగైనా, పిట్టైనా, పురుగైనా, చివరికి మనిషైనా సృష్టిలో ప్రతిదీ ఒకే రకమైన మామూలు పదార్థంతోనే తయారయ్యాయి. ఇలా జీవాన్ని తయారు చేసే తెలివినే “చైతన్యం” అంటాం. మీరు చైతన్యవంతంగా ఉన్నారు కాబట్టే సజీవత్వాన్ని, జీవితాన్ని అనుభవిస్తున్నారు. మీలో చైతన్యం లేకపోతే మీరు బ్రతికి ఉన్నారో లేదో కూడా మీకు తెలియదు. మీరు గాఢనిద్రలో ఉన్నప్పుడు, మీరు జీవించే ఉన్నాకానీ ఆవిషయం మీకు తెలియదు. మీరు చైతన్యాన్ని పెంచలేరు, ఉన్నదాన్ని తగ్గించనూలేరు. మనం “చైతన్యాన్ని పెంచటం” అనే విషయాన్ని ఈ భూమికలో చెప్పుకుంటున్నాము - ‘మీరు మీ భౌతిక శరీరంతో గాఢంగా గుర్తింపులో ఉన్నప్పుడు, “మీరు, మీరు కానిది” ఈ రెంటికి మధ్య ఉన్న సరిహద్దులు చాలా స్పష్టంగా ఉంటాయి. ఈ స్థితిలో మిమ్మల్ని మీరు ప్రత్యేక ఉనికిగా అనుభవం చెందుతారు. అంటే మీరు సృష్టిలోని ప్రతీజీవి లాగే మనుగడే ప్రధానంగా జీవిస్తున్నారని అర్థం. మిమ్మల్ని మీరు శరీరంతో గుర్తింపు ఏర్పరచుకుంటే మీరు ఎవరనే మీ సరిహద్దులను మీరు నూరుశాతం నిశ్చయించుకున్నట్టే.

భౌతిక ప్రపంచంలో కూడా పదార్ధం ఎంత సూక్ష్మం అయితే, దాని పరిధులు అంతగా అదృశ్యమౌతాయి. మనం శ్వాసించే గాలిలో తేమ కూడా ఉంటుంది. మనం శ్వాసించేటపుడు, గాలి ఇంకా నీరు స్థిరంగా మార్పిడి చెందుతాయి. ఈ మర్పిడితో మనకు ఎటువంటి పేచీ లేదు, ఎందుకంటే మనం వాటితో గుర్తింపు ఏర్పరచుకోలేదు కాబట్టి. కాని మనం శరీరంతో గుర్తింపు ఏర్పరచుకోవటం వలన, వాటినే మనంగా భావిస్తాం. అందుచేత ఎవరైనా మన శరీర పరిధిని అతిక్రమిస్తే ఊరుకోము.

మనం ‘చైతన్యం’ అని అంటున్నది మీకు సంబంధించిన సూక్ష్మమైన పార్శ్వం. ఈ చైతన్యాన్ని అందరూ పంచుకుంటున్నారు. ఆ గొప్ప వివేకమే ఆహారాన్ని మాంసంగా, మీలోనూ, నాలోనూ, అందరిలోనూ మార్చుతోంది. ప్రజలను వారి భౌతిక శరీర పరిధుల గుర్తింపులనుంచి తమలోనే ఉన్న మరొక లోతైన పార్శ్వం దిశగా మళ్ళించగలిగితే, నేను-నువ్వు అనే భేదభావం తగ్గి, ఇద్దరూ ఒక్కటే అన్న భావన కలుగుతుంది. అంటే చైతన్యం సామాజిక స్థాయికి ఎదిగిందన్నమాట. నిజానికి మనం చైతన్యాన్ని పెంచము. మీ అనుభవాన్ని పెంచుతాము. అప్పుడు మీరు మరింత చైతన్యవంతులౌతారు. మనందరం ఎంతో కొంత చైతన్యవంతులమే! మీరు ఏ స్థాయిలో చైతన్యవంతులు అన్నదే ప్రశ్న. మీరు చైతన్యాన్ని పెంచనవసరంలేదు. చైతన్యాన్ని ఒడిసి పట్టుకునే విధంగా మీరు ఎదుగుతూ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. చైతన్యం నిరంతరం అందుబాటులోనే ఉంటుంది. అదే కనక లేకపోతే మీరు శ్వాసించే గాలి, మీరు తినే అన్నం జీవంగా మారటం సాధ్యం కాదు. మీరు జీవించి ఉన్నారంటే చైతన్య వంతులుగా ఉన్నట్లే! కానీ ఇప్పటిదాకా మీరు దానిని పరిమితంగానే ఒడిసి పట్టుకున్నారు. మీరు దానిని మరింత అందుబాటులోనికి తెచ్చుకొనే కొద్దీ మీకు మీ పరిధి పట్ల ఉన్న స్పృహ (భావన) విస్తరిస్తుంది. ఒకసారి చైతన్యంతో మీరు గుర్తింపు ఏర్పరచుకుంటే మిమల్ని మీరు ఎలా అనుభూతి చెందుతారో అలానే ప్రతి ఒక్కరిని అనుభూతి చెందుతారు. (మమేకమవుతారు). యోగం అంటే ఇదే!

యోగ అనే పదానికి అర్థం ఐక్యం (కలయిక) అని. మానవులు ఈ భావనను అనుభవించటానికి ఎన్నో మార్గాలను అనుసరిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో ఆ వ్యక్తీకరణను ‘లైంగికత (సెక్సుయాలిటి)’ అంటారు. దానికి ఉద్వేగం జతకూడితే ‘ప్రేమ’ అంటాం. మానసికమైన వ్యక్తీకరణ అయితే దాన్ని దురాశ, ఆశయం, విజయం లేదంటే కేవలం షాపింగ్ అంటారు. దాన్నే చైతన్యపూరితంగా చేస్తే యోగం అంటాం. కానీ వీటన్నింటి వెనక మౌలికంగా ఉన్న కోరిక, ప్రక్రియ ఒకటే! అంటే, మీరు కానిదానిని దేన్నో మీలో ఒకటిగా కలుపుకోవాలనే (చేసుకోవాలనే) కోరిక. మీకు మరొక దానికి మధ్య ఉన్న పరిధులను చెరిపి వేయాలనుకుంటారు.

అది లైంగికత అయినా, ప్రేమ వ్యవహారమైనా, ఆశయం అయినా, విజయమైనా, మీరు చేసే ప్రయత్నం అంతా మీరు కానిదానిని దేన్నో మీలోని భాగంగా చేసుకోవాలనుకోవటమే. యోగాలో కూడా అంతే. యోగా అంటే ప్రతీదానితో ఒక్కటవటం, మరొకలా చెప్పాలంటే మీరు మీ పరిధులను చెరిపి వేయటం. దీన్ని గురించి మాట్లాడటం, ఒక బౌద్ధిక వ్యవహారంగా (మేధోసంపత్తిగా) చెయ్యటం కంటే మీ అనుభవ స్థాయిని పెంచి, తద్వారా మిమ్మల్ని మీ భౌతికస్థాయి నుంచి భౌతికానికి అతీతమైన పార్శ్వానికి నడపాలని ప్రయత్నిస్తున్నాం.

శాంభవి అదే చేస్తుంది. అది మిమ్మల్ని సంధ్యా క్షేత్రానికి తీసుకువెళుతుంది. ఇప్పటికీ, మీరు శరీరంలోనే ఉన్నాకానీ దానికి అతీతమైన పార్శ్వాన్ని స్పృశిస్తారు. అప్పుడు మీ అనుభవం కేవలం శరీరానికే పరిమితం కాకుండా, ఇంకా విస్తృతమవుతుంది. ఇదే చైతన్యాన్ని పెంచటమంటే. అంటే మీ చుట్టూ ఉన్నవారందరూ మీలో భాగంగా మీ అనుభవంలోకి వస్తారు.

మీ చేతి ఐదు వేళ్ళను తయారు చేసిన పదార్ధం ఒకప్పుడు భూమిలో ఉంది, ఇప్పుడది మీ చేతి ఐదు వేళ్ళుగా మారింది. నిన్న మీ పళ్ళెంలో ఆహారంగా ఉన్నది మీలోని భాగం కాదు, మీరు దాన్ని తిన్నాక, ఇవాళ దాన్ని మీలో భాగంగా అనుభవం చెందుతున్నారు. మీరు గనుక దేన్నైనా మీ పరిధిలోనికి తీసుకొని రాగలిగితే ‘దాన్ని’ మీరుగానే భావించగలరు. ఈ విశ్వాన్నంతా మీరు తినలేరు కానీ మీ పరిధులను మీరు వివిధ రకాలుగా విస్తరించుకోవాలి. మీరిక్కడ కూర్చుంటే, విశ్వాంతరాళమంతా మీలో భాగం అయ్యేటట్టుగా మీ ఇంద్రియ పరిధులను విస్తరించుకుంటే - అదే యోగం, ఇదే చైతన్యాన్ని వృద్ది చెయ్యటం. మేము దాన్ని తాత్త్వికంగానో, ఆదర్శవంతంగానో చెయ్యటంలేదు. కానీ అనుభవపూర్వకంగా, అందరూ అనుసరించ గలిగిన సాంకేతిక ప్రక్రియ విధానంలో చేస్తున్నాము. సాంకేతికత ఎందుకంటే – నేర్చుకొని ఉపయోగించుకోవాలనుకునే వారందరికీ ఒకే విధంగా పనిచేయడమే దీని స్వభావం. మీరు దాన్ని నమ్మవలసిన అవసరం లేదు, పూజించనక్కరలేదు. దాన్ని తలమీద పెట్టుకుని ఊరేగనక్కరలేదు. మీరు దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి, అంతే!

ప్రేమాశీస్సులతో,

సద్గురు