విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు
@ఈ వ్యాసంలో సద్గురు మనకు విజయం సాధించడానికి కావలసిన చిట్కాని చెబుతున్నారు. అలాగే ఈ సమయం కృషి చేయవలసిన సమయం, ఒక మూలాన విశ్రాంతి తీసుకునే సమయం కాదని మనల్ని జాగృతం చేస్తున్నారు. సద్గురు "విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు, మీకు విలువైనదిగా అనిపించే దానికోసం సంతోషంగా మీరు చేసే నిరంతర కృషి." అని అంటున్నారు.
నేను రష్యాలో జరిగిన FIFA వరల్డ్ కప్ నుండి ఇప్పుడే తిరిగి వచ్చాను. అక్కడి వాతావరణం, ఆనందోత్సాహాలు, సెమీఫైనల్స్ ఇంకా ఫైనల్స్ ఎంతో అద్భుతంగా జరిగాయి. టోర్నమెంట్లో, Messi వంటి ప్రఖ్యాతిగాంచిన వారు స్కోర్ చేయలేకపోయారు. కొత్తగా వచ్చిన Mbappe వంటివారు రాణించారు. ఎంతో పేరుగాంచిన టీంలు పడిపోయాయి, వేరే దేశాలు పైకి లేచాయి. ఈ ఆట ఆడేందుకు ట్రైనింగ్ తీసుకోవడానికి సరైన వయసులో ఉన్న కోట్లాది యువత గల భారతదేశానికి, భవిష్యత్తులో జరగబోయే Football World Cup లో పాలుపంచుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. మరి, విజయం సాధించాలంటే ఏం కావాలి..? ఒక అంశం నైపుణ్యం అయితే, మరొక అంశం కృషి.
ఏ రంగంలో అయినా సరే - ఓ గొప్ప ఫుట్బాల్ ప్లేయర్, కళాకారులు, నటులు, సంగీతకారులు లేదా ఎవరైనా సరే - వారి విజయం వెనుక ఉన్నది 80% కృషి ఇంకా 20 శాతం నైపుణ్యం. అసమానమైన నైపుణ్యం కలిగిన వారు ఏదో కొద్దిమంది ఉంటారు. మిగతా వారందరూ గంటల తరబడి సాధన చేయవలసిందే. ఒక ఫుట్బాల్ ప్లేయర్, ప్రపంచస్థాయి ఆటగాడిగా ఎదగాలంటే, కొన్ని వేల గంటల శిక్షణ అవసరమే. ప్రపంచ కప్పు కోసం ఆడేటప్పుడు ఒక గోల్ కొట్టడానికి, సంవత్సరాల తరబడివారు ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు.
అలానే గొప్ప నటుల విషయానికి వస్తే, వారు స్టేజి మీద రెండు గంటలు ప్రదర్శన ఇచ్చేందుకు, ప్రతిరోజు 12 నుంచి 15 గంటలపాటు సాధన చేసి ఉండి ఉండవచ్చు. అది వారికి ఫలితాన్ని అందిస్తుంది. ఏది చేయాలన్నా సరే, దానికి అసమానమైన నైపుణ్యం అవసరం లేదు. మీరు పూర్తి సుముఖతతో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లైతే, మీరు ఏమి కాదలచుకుంటే అది అవ్వచ్చు. ఒకసారి, నేను స్కూల్లో ఉండే రోజుల్లో, “మనం ఏమి చేయవచ్చు.. ఏమి చేయలేము..” అన్న ప్రశ్న వచ్చింది. నాకు చేయడానికి ఎన్నో పనులు ఉండేవి. వీళ్ళందరూ ఏమీ చేయకుండా, ఊరికే ఇలా మాట్లాడడం నాకు విసుగు కలిగించింది. అందుకని, నేను “నాకు తగినంత సమయం, డబ్బు ఇస్తే, నేను చంద్రమండలం మీదకు మెట్లు కడతాను” అని చెప్పాను. ఇది పొగరు అనుకున్నారు. కానీ నేను, “ఇది ఇంతకు మునుపు ఎవరు చేయలేదేమో. కానీ తగినంత డబ్బు సమయం ఉంటే చేయవచ్చు” అన్నాను. చేసేందుకు అవకాశం వస్తుందా రాదా అన్నదే ప్రశ్న. లేకపోతే, మానవుడు చేయలేనిది ఏముంది?
ఒక అవకాశం వస్తుందా లేదా అన్న విషయం ప్రపంచంలోని ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక అవకాశం తలుపుతట్టినప్పుడు, మీరు అందుకు సిద్ధంగా ఉన్నారా? విజయానికి, అపజయానికి మధ్య ఉన్న తేడా ఇదే. మీరు విజయం సాధించాలంటే, మీకు కావలసింది - దానిపట్ల ఉత్సాహం, అందుకై కృషి చేసేందుకు సుముఖత. జీవితం పట్ల ఉత్సాహం ఉన్నవారికి, అసలు ఖాళీ సమయం ఎక్కడ ఉంటుంది. చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది, అది పనే అవ్వాలని ఏం లేదు. మీకు నచ్చినవి చేస్తుంటే, అసలది పనిలానే అనిపించదు. అసలు ఎప్పుడూ భారంగా అనిపించదు. మీరు చేసే పనిని ఆస్వాదిస్తున్నట్లైయితే, మీరు అది చేయడానికి 24 గంటలు సిద్ధంగా ఉంటారు. మరేదో చేయాలనుకుంటే - పాడండి, ఆడండి, ఏదైనా కొత్తది తయారు చేయండి, లేడా కొత్త విషయాన్ని శోధించండి - అది పర్వాలేదు. కానీ అలా ఊరికే ఉండకండి. మీ శరీరం, మనస్సు వాటి పూర్తి సామర్థ్యంతో పనిచేసే లాగా వాటిని ఉంచండి.
మీకు చేయడానికి ఏదీ లేదంటే, మీ జీవితంలో ఎదుగు బొదుగు లేదని అర్థం. మీకు అలాంటి స్థితి ఎప్పుడూ రాకూడదని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు పారే నదిలా ఉంటే, చేయడానికి ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. మీకు తెలిసేలోపే జీవితం అయిపోతుంది. మీరు నూరేళ్లు జీవించి, మీ పూర్తి సమయాన్ని వెచ్చించినప్పటికీ, మానవ మేధస్సు ఇంకా మానవ చైతన్యం యొక్క పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు సమయం సరిపోదు. ఈ సమయం జీవించవలసిన సమయం, విశ్రాంతి తీసుకోనే సమయం కాదు. మిమ్మల్ని పాతి పెట్టినప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు, మీకు విలువైనదిగా అనిపించే దానికోసం సంతోషంగా మీరు చేసే నిరంతర కృషి.