మీ జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మీరు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ‘‘మీకొక సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు, దాన్నలా వదిలేయండి’’ అని కొందరు మీకు చెప్తుంటారు. మీరు సమస్యను వదిలేయవచ్చునేమో కాని, సమస్య మిమ్మల్ని వదలాలి కదా! ప్రజలు బ్యాంకులో అప్పు తీసుకుంటారు, కాని దాన్ని తిరిగి చెల్లించలేరు. వాళ్లు ఈ అప్పు వదిలేయదలచుకుంటారు కాని, బ్యాంకు వదిలిపెడుతుందా? జీవితం కూడా ఇటువంటిదే. మీరొక పరిస్థితిలోకి వెళ్లారంటే అది అప్పులాంటిదే. మీరు దాన్ని చెల్లించాల్సిందే - డబ్బుతో కాదు, జీవితంతో. మీరు తెలివైన వాళ్లయితే ఒక రకంగా చెల్లిస్తారు, లేకపోతే మరోరకంగా.! కానీ, చెల్లించడం మాత్రం తప్పదు.

ఏ పరిస్థినైనా మీరు దాన్ని సమస్యగా చూస్తేనే సమస్యే. జీవితంలో సమస్యలుండవు - కేవలం పరిస్థితులు మాత్రమే ఉంటాయి. మీరు దాన్ని ‘సమస్య’ అంటే అది సమస్య అవుతుంది. మీరు దాన్ని ‘అద్భుతం’ అంటే అది అద్భుతమవుతుంది. ఉదాహరణకు, సరిగ్గా ఈ సమయంలో ఎక్కడో ఎవరో పెళ్లి చేసుకుంటుంటారు, కాని వాళ్లకది ఇష్టం ఉండదు. అప్పుడు వాళ్లు దాన్నొక పెద్ద సమస్య అనుకుంటారు. ఇదెంత  బాధ కలిగిస్తుందో మీకు తెలుసా? ఒకవేళ మరొకరు ఎవరికో పెళ్లి చేసుకోవడం ఇష్టం అనుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారనుకోండి, వాళ్లకారోజు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా?

అది సమస్య అవుతుందా, మరొకటవుతుందా అన్నది మీరు దాన్నెలా చూస్తున్నారన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది.

ఉన్నది కేవలం ఒక పరిస్థితి, ఒక సందర్భం మాత్రమే. అది సమస్య అవుతుందా, మరొకటవుతుందా అన్నది మీరు దాన్నెలా చూస్తున్నారన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఏ పరిస్థితీ పూర్తిగా మూసుకుపోయి ఉన్నది కాదు. ఎందుకంటే ప్రతి పరిస్థితీ పరిణమిస్తూ ఉంటుంది. మీరొక పరిస్థితిలో చిక్కుకొని ఉండదలచుకోకపోతే, మీరు మరోచోట ఉండదలచుకుంటే, పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించండి. దాని నుండి బయటికి రావడానికి తలుపు లెక్కడున్నాయో తెలుస్తుంది. కొంచెం తాజా గాలి పీల్చుకోవాలనుకుంటే ఒక కిటికీ తెరిచి గాలి పీల్చుకొని ఊరట చెందండి. బయటికే వెళ్లదలచుకుంటే తలుపు తెరచుకొని వెళ్లిపొండి, మీ ఇష్టం. మీరక్కడే ఉంటే ఒక పర్యవసానం ఉంటుంది, బయటికి వెళితే మరో పర్యవసానం ఉంటుంది. పర్యవసానాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

చాలా మందితో సమస్య ఏమిటంటే వాళ్లకు పరిస్థితి కావాలి, కాని దానికి మూల్యం చేల్లిచడం ఇష్టం ఉండదు. మీరు బట్టలు కొనాలనుకుంటారు కాని వాటి ధర మీకు నచ్చదు, మరెలా? దొంగతనమొక్కటే దిక్కు. మీరు దొంగైతే మీరన్నీ ఉచితంగా పొందవచ్చు, అయితే ఎప్పుడూ భయంతో జీవించవలసి ఉంటుంది. ఎప్పుడోకప్పుడు ‘అత్తగారింటికి’ వెళ్లక తప్పదు. మీకేదైనా కావాలంటే దానికి మూల్యం చెల్లించకతప్పదు. అయితే ఆ మూల్యం తగినదేనా, కాదా అన్నది మీ జీవితంలో మీరే అంచనా వేసుకోవాలి.

ఒక వస్తువు ధర పది రూపాయలైతే మీరు కొనదలచుకోవచ్చు, అదే పదకొండు రూపాయలైతే మీరు కొనకపోవచ్చు - అది మీ నిర్ణయం. ప్రతి సందర్భము ఇటువంటిదే - డబ్బు విషయమే కాదు ప్రతి పరిస్థితీ ఇంతే, దానికో ధర ఉంటుంది. దాని విలువ సముచితమేనా అన్నది మీరు అంచనా వేసుకోవాలి. అది మీరు మాత్రమే చేయగలరు. నేను దాన్ని మరో కోణం నుండి చూడవచ్చు, నాకీ పరిస్థితి అర్థరహితంగా అనిపించవచ్చు, కాని మీకది విలువైంది కావచ్చు. ఈ విషయంలో మరొకరి అంచనా సరైనది కాదు. ఆ పరిస్థితి విలువను మీరు అంచనా వేసుకోవాలి, అది మీకు నచ్చిందో లేదో అంచనా వేసుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాత సంతోషంగా మూల్యం చెల్లిస్తారు.

మీరొకసారి నిర్ణయం తీసుకొన్న తర్వాత ఇక అందులో తప్పు, ఒప్పు లేదు. ‘మంచి జీవితం’ అన్నదేదీ లేదు. కాని మీరు హృదయ పూర్వకంగా పనిచేసినట్లయితే అదే గొప్ప జీవితం. మీరు మనఃపూర్వకంగా పూర్తిగా ఒక పనిలో నిమగ్నమైతే అది ఎంత మామూలు పని అయినా, మీ అనుభవంలో చాలా గొప్పదవుతుంది. ఎదుటి మనిషి మీ జీవితంలోకి చూసి వ్యర్థమనుకోవచ్చు, అది అతని సమస్య. మీ అనుభవంలో మీ జీవితం గొప్పగా ఉంటుంది, అదే కదా అసలు విషయం..!

మీరు ఏ మూల్యం చెల్లిస్తారో మీరు నిర్ణయించుకోవాలి. సరైన నిర్ణయమంటూ ఉండదు, అది మీ జీవితంలో చేయదగిందేనా అన్నది ప్రశ్న.

అంటే మనం సమస్యల్ని వాటి దారిన వాటిని వదిలిపెట్టడం కాదు కావలసింది, వాటిలో నిమగ్నం కావడం. మీరొక పరిస్థితిలో పూర్తిగా మగ్నమైతే, దాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకుంటారు, సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మీరు చక్కగా తెలుసుకొని నిర్ణయం తీసికున్నప్పుడే అది విలువైన నిర్ణయమవుతుంది. మీరు సరిగ్గా తెలుసుకోకుండానే నిర్ణయం తీసికొన్నట్లయితే అది వ్యర్థ నిర్ణయమే అవుతుంది. అందువల్ల ఏ పరిస్థితినైనా వదిలేయడానికి, దాని నుండి దూరం జరగడానికి, పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించకండి. సంపూర్ణంగా దానిలో నిమగ్నం కండి. మీకు పరిస్థితి అవగాహనయితే, ఆ పరిస్థితి మీ జీవితం నుండి ఎంత మూల్యాన్ని కోరుతుందో మీకర్థమవుతుంది. మీరక్కడ ఉంటే దానికొక మూల్యం ఉంటుంది, మీరు వదిలేసినా దానికొక మూల్యం ఉంటుంది. మీరు ఏ మూల్యం చెల్లిస్తారో మీరు నిర్ణయించుకోవాలి. సరైన నిర్ణయమంటూ ఉండదు, అది మీ జీవితంలో చేయదగిందేనా అన్నది ప్రశ్న.

జీవితం అన్నది నిరంతరం పరిస్థితుల సమాహారం. మీరు పెరిగే దిశలో ఉంటే నిరంతరం మీరెలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితులెదురవుతూనే ఉంటాయి. ఈ పరిస్థితులు మీకు సవాళ్లుగా పరిణమించవచ్చుకాని, అవి సమస్యలు కావు. నిజమైన సమస్య ఏమిటంటే జీవితంలో కొత్త పరిస్థితులు ఎదురు కాకుండా ఉండడం, అంటే జీవితం స్తబ్ధ స్థితిలో ఉందన్నమాట. మీరు నిరంతరం అభివృద్ధిని కోరుకున్నట్లయితే మీరెల్లప్పుడూ కొత్త పరిస్థితులను ఎదుర్కుంటూనే ఉంటారు, ఈ  పరిస్థితులనెలా ఎదుర్కోవాలో మీకు తెలిసి ఉండవలసిన అవసరం లేదు, తెలిసి ఉండకపోవచ్చు. సమస్యలు అనుకునే ఇటువంటి పరిస్థితులను మీరు ఎంత ఎక్కువగా ఎదుర్కుంటూ ఉంటే మీరు అంత గొప్ప సంభావ్యాలున్న జీవితాన్ని జీవిస్తున్నట్లే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు