ఒక కొత్త యోగ సాధకునికి, యోగిక జీవనశైలిని అవలంబించడం అనేది ఎన్నో కొత్త నియమాలతో కూడుకుని ఉన్నదిగా అనిపించవచ్చు. అయితే, మానవ శరీర జ్యామితిని అర్థం చేసుకోవడం అనేది, మానవుడు నియమించిన నియమం కాదనీ, అది అతి తక్కువ సంఘర్షణతో జీవించేందుకు ఒక పద్ధతనీ సద్గురు వివరిస్తున్నారు.

ప్రశ్న: నేను హఠ యోగ టీచర్ ట్రైనింగ్ లో ఉన్నాను. ఇక్కడ, సరిగ్గా ఎలా కూర్చోవాలీ, ఎలా తినాలీ, ఇంకా ఏమి తినాలి, ఆఖరికి ఎలా శ్వాస తీసుకోవాలీ అన్న దానితో సహా, ప్రతి దానినీ మేము నేర్చుకుంటున్నాము. వ్యక్తి తనని ఆనందంగా మలుచుకోవడానికీ, ఈ క్రొత్త నియమ నిబంధనలను అనుసరించే ప్రయత్నంలో తనని తాను విచారంగా చేసుకోవడానికీ మధ్య అంతరం ఎక్కడ ఉంది?

సద్గురు: ముందుగా, ఇవి కొత్త నియమ నిబంధనలు కావు. అవి ఖచ్చితంగా నిబంధనలు కావు. బహుశా మనం వాటిని నియమాలు అని పిలవవచ్చు - దీన్ని చూసేందుకు అదొక మార్గం. భారతీయ సంస్కృతిలో, ఎప్పుడూ కూడా బోధనలు లేవు. అలాగే దేవుడు భారతీయులకు ఆజ్ఞలు ఇవ్వలేడు, ఎందుకంటే వారు వాదిస్తారు. వారు ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తారు. మేము కైలాస యాత్రలో ఉన్నప్పుడు, పాల్గొనే వారిలో భారాతీయులు ఒకరు, చాలా క్లిష్టమైన ప్రశ్న వేశాడు. నేను, “చూడండి, ఇది ఒక భారతీయ సమస్య. మీరు మరింత క్లిష్టమైన ప్రశ్న ఎలా వేయాలా అని ఆలోచిస్తున్నారు.” అన్నాను. అప్పుడు ఒక చైనీస్ స్త్రీ అందుకుని, “అవును! నేను ఐక్యరాజ్యసమితిలో పని చేస్తున్నాను, నేను ఎప్పుడూ భారతీయులే ప్రశ్నలు అడుగుతున్నారేంటా అని ఆశ్చర్యపోతుంటాను” అంది. మనకి ప్రతిదాన్ని ప్రశ్నించే ఒక సుదీర్ఘ సంప్రదాయం ఉంది.

దేవుడు ఇతర ప్రదేశాలకు, తన దూతనో లేక తన కొడుకునో పంపాడు, అందువల్ల తమ నియమాలు ఏవైతే ఉన్నాయో, అవి దేవుడు ఇచ్చినవని చెప్పే అవకాశం వారికి కలిగింది, ఇక ఎవ్వరూ కూడా వాటిని ప్రశ్నించే సాహసం చేయలేదు. ఇక్కడ, స్వయంగా దేవుడే వచ్చాడు, పైగా తను ఎవరితో మాట్లాడాలి అన్నది కూడా జాగ్రత్తగా ఎంచుకున్నాడు. అయినా కూడా, అంతులేని ప్రశ్నలు. అర్జునుడు, కృష్ణుడిని ఎన్ని ప్రశ్నలు అడిగాడో మీకు తెలుసు! అర్జునుడికి ఒక ఆజ్ఞను ఇవ్వడం కృష్ణుడికి సాధ్యం కాలేదు. అతను అతనిని ఒప్పించటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు, కాని అర్జునుడు అంతా ప్రశ్నల మయం.భారతీయ సంస్కృతిలో, జీవాన్ని పాలించే దాన్ని మనం ధర్మం అంటాము. గౌతమ బుద్ధుడు దానిని దమ్మ అని అన్నాడు. దురదృష్టవశాత్తూ, ఈ రోజున సాధారణంగా ప్రజలు ధర్మాన్ని, మతం అని తప్పుగా అర్థం చేసుకుంటారు, కాని ధర్మం అంటే చట్టం - బోధన కాదు, తత్వం కాదు, నమ్మక వ్యవస్థో లేదా మతమో కాదు.

ఉనికి ధర్మాలు

సమాజం ఇంకా ప్రపంచం, వీలైనంత సజావుగా సాగేందుకు, సమాజంలోనూ ఇంకా ప్రపంచంలోనూ విభిన్న అంశాలను నియంత్రించే, మానవ నిర్మిత చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు, భారతదేశంలో మీరు రోడ్డు మీద ఎడమ వైపున డ్రైవ్ చేయాలి. ఇది ఖచ్చితం కాదు గానీ, ఇది ట్రాఫిక్ సజావుగా నడవడం కోసం చేసుకున్న ఒక ఒప్పందం. మరొక విషయం ఏమిటంటే, వాహనాలు కూడా తదనుగుణంగానే నిర్మించబడ్డాయి. అదేవిధంగా, మనం ఒకరినొకరు గుద్దుకోకుండా ఉండేందుకు గానూ, సమాజాన్ని క్రమబద్దీకరించే అనేక చట్టాలూ ఇంకా ఏర్పాట్లు ఉన్నాయి. కానీ సమాజాలు ఏర్పడక ముందే, మానవ చట్టాలూ రాకముందే, జీవం సజావుగా సాగింది, అది పరిణితి చెందింది. ఇలా జరగాలంటే ఖచ్చితంగా, దాన్ని నియంత్రించే కొన్ని ప్రాథమిక చట్టాలు ఉండి ఉండాలి.

మీరు మీ శరీర జ్యామితి పైన దృష్టి పెడితే, మీరు కూర్చోవటం ఇంకా నిల్చోవడం కూడా ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో చేస్తారు. తద్వారా శరీరం తక్కువ శక్తితో, ఎక్కువ ప్రభావం చూపగలిగే విధంగా పనిచేస్తుంది.

ఉదాహరణకి, మీరు ఒక అడవిలోకి వెళితే, మీరు దాని ధర్మాలను తెలుసుకొని అర్థం చేసుకోలేక పోవచ్చు. కానీ కొన్ని లక్షల ఏళ్లుగా అడవి ఉంది. ఇంత సుదీర్ఘమైన కాలం, అది అంతం కాకుండా, లేదా అందులోని జంతువులు ఒకదానిని ఒకటి అంతమోందిచకుండా ఉన్నాయీ అంటే, దాన్ని కొన్ని ధర్మాలు పాలిస్తూ ఉండి ఉండాలి. ఈ సంస్కృతిలో ప్రజలు ఈ విశ్వాన్నీ, మన అంతర్గత స్వభావాన్నీ, ఇంకా ఈ సృష్టి ప్రక్రియనీ నియంత్రిస్తున్న ఆ ధర్మాల పైన దృష్టి పెట్టారు. ఇది ఊహ కాదు, లేదా ఒక నమ్మకం కాదు, జీవితం యొక్క అనేక పార్శ్వాలను గమనించడం ద్వారా, ప్రజలు దీనిని అర్థం చేసుకున్నారు.

ఎలా కూర్చోవాలి అనేది నేను కనిపెట్టినది కాదు. మానవ శరీరం ఒక నిర్దిష్టమైన విధానంలో చేయబడింది. ధ్యానలింగానికి ఎదురుగా, నంది కూర్చున్న విధానం, దానికి సరియైన విధానం. కానీ మీరు ఒక మానవుడిగా వచ్చారు. కాబట్టి మీ శరీర జ్యామితి భిన్నమైనది. జీవం యొక్క అన్ని భౌతిక విషయాలకూ, ఇంకా భౌతిక అంశాలకూ, వాటికి ఆధారమైన ఒక జ్యామితి ఉంటుంది. మీరు ఏదైనా భౌతికమైన దాని జ్యామితిని అర్థం చేసుకుంటే - అది మానవ శరీరం కానివ్వండి, ఒక ఎద్దు కానివ్వండి, లేదా ఆఖరికి ఒక యంత్రం కానివ్వండి - దానిని అత్యుత్తమంగా ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది.భూమి మీద ఉన్న ప్రతి ఇతర ప్రాణీ కూడా, తన శరీర జ్యామితిని, ఇంకా దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ఎలా అన్నదాన్ని తెలుసుకుంది. కేవలం మానవులు మాత్రమే ఆ పని చేయలేదు, ఎందుకంటే వారు తమపై తప్ప మిగతా అన్నింటిపై దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఈశా హఠ యోగా లోని సూచనలు, కొత్త నియమాలు కాదు. మీరు మీ శరీర జ్యామితి పైన దృష్టి పెడితే, మీరు కూర్చోవటం ఇంకా నిల్చోవడం కూడా ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో చేస్తారు. తద్వారా శరీరం అతి తక్కువ శక్తితో, ఎక్కువ ప్రభావం చూపగలిగే విధంగా పనిచేస్తుంది. భౌతిక ఉనికిలో సమర్థత అనేది, జ్యామితిపై మీకున్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. మరోలా చెప్పాలంటే, మీరు సమాజాన్ని అనుకరించడం నుండి, ఎరుకలోకి ప్రవేశిస్తున్నారు.

మనం ఈ ఫర్నిచర్ అంతా తీసేస్తే, మీరు మీ శరీర జ్యామితిని తెలుసుకుంటారు. అదే ఆహార విషయంలో కూడా వర్తిస్తుంది. మానవ వ్యవస్థ ఒక నిర్దిష్ట రకమైన ఆహారానికి తగినట్టుగా రూపొందించబడింది. కానీ మనుగడ పోరులోనో, లేదా సాంస్కృతిక ప్రభావాల వల్లనో, ప్రజలు అన్ని రకాల వాటినీ తిని ఉండవచ్చు. వాస్తవానికి, ప్రపంచంలో కొన్నిచోట్ల, ఎవరైనా ఒక మాంసపు ముక్కని తిన్నారూ అంటే, అది మనుగడ కోసం, అంతేగాని అది ఎంపికతో కాదు. బహుశా వారక్కడ ఏ పంటా పండించలేకపోయి ఉండొచ్చు, లేదా వారికి వ్యవసాయం తెలియకపోయి ఉండొచ్చు. ఆ తరువాతే, అది ఒక ఎంపికగా అయ్యింది, లేదా వారి సంస్కృతిలో ఒక భాగమయింది అనొచ్చు. అది మనుగడకి సంబంధించిన ప్రశ్న అయితే, పరవాలేదు. ఇదేమీ ఒక నైతిక సమస్య కాదు. కాకపోతే విషయం ఏంటంటే, మీరు మీ వ్యవస్థలోకి, తప్పుడు ఇంధనాన్ని పోసినప్పుడు, అది సమర్థవంతంగా పనిచేస్తుందని అనుకోలేం.

ఒక సమర్థవంతమైన జీవం

సమర్థత అనేది కేవలం ఒక పనిని బాగా చేయడం గురించి కాదు. ఒకసారి మీరు మానవునిగా వచ్చారూ అంటే, దానర్థం మీరు ఏది అవసరమైతే అది చేయగలిగే మేధస్సుతో వచ్చారు అని. అలాగే అన్నింటికీ మించి మానవునిగా ఉండటంలోని లోతుపాతులను తెలుసుకోగల మేధస్సుతో వచ్చారు అని. మానవ జీవిత సాఫల్యాన్ని పొందడానికీ, రకరకాల పనులను చేయగల సంభావ్యతను ఉపయోగించుకోవడానికీ, అన్నింటినీ మించి ఒక మానవునిగా ఉండడంలోని ప్రతి పార్శ్వాన్నీ అనుభూతి చెందేలా తగినంత సున్నితత్వాన్ని తీసుకురావడానికీ - మీ ఆహారం, భంగిమ, లేదా ఆలోచన విధానం - అడ్డు పడుతుంటే, దీన్ని నేను ఒక అసమర్థమైన జీవి అంటాను. సరిగ్గా చేయడం అనేది నైతికతకు సంబంధించినది కాదు, స్వర్గానికి వెళ్లడం గురించినది కాదు, లేదా సామాజిక సమ్మతిని పొందడాన్ని గురించినది కాదు. వ్యక్తులు దాన్ని వేరు వేరు విధానాలలో చేస్తారు. కానీ మొత్తం మీద, ఈ జీవం ఏ ధర్మాలచే పాలించబడుతున్నదో మీరు కనుగొనలేకపోతే, కాగలిగినంత సమర్థవంతంగా మీరు కాలేరు.

మీరు దృష్టి పెట్టి, ఈ మానవ వ్యవస్థ తనను తాను ఎలా రూపొందించుకుందీ, అలా ఎందుకు రూపొందించుకుందీ అన్నది అర్థం చేసుకుంటే, ఈ ధర్మాలను అనుసరించి వాటితో సమన్వయంలో ఉంటే, మీ వ్యవస్థ అతి తక్కువ ఘర్షణతో పనిచేస్తుంది.

మొదట్లో, తప్పుడు విషయాలు కూడా ఫలితాలను ఇస్తున్నట్టుగా కనబడుతుంది. ఒకసారి ఇలా జరిగింది, రెండు కార్లు ఒకదానినొకటి గుద్దుకున్నాయి. ఒక దాన్ని నడుపుతున్నది డాక్టర్, మరొక దాన్ని నడుపుతున్నది లాయర్. గుద్దుకున్నాక వారు కార్లలో నుండి పాకుతూ బయటకు వచ్చారు. ఆ లాయరు తన కారులో నుండి ఒక విస్కీ బాటిల్ ను తీసి, “ఇది పండగ చేసుకోవాల్సిన విషయం. ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, కానీ మనిద్దరికీ ఎటువంటి గాయాలూ కాలేదు. దా!” అంటూ బాటిల్ ని డాక్టరు చేతికి ఇచ్చాడు. ఈ డాక్టరు, ఈ యాక్సిడెంట్ తో కొద్దిగా ఖంగుతిన్నాడు, కాబట్టి అతను ఒక పెద్ద పెగ్గు వేసి, బాటిల్ ని లాయర్ కి తిరిగి ఇచ్చాడు. లాయర్ దాన్ని తిరిగి కారులో పెట్టాడు. ఆ డాక్టరు, ”నువ్వు తాగవా?” అన్నాడు. ఆ లాయరు, “పోలీసులు వెళ్లిపోయిన తర్వాత!” అన్నాడు.

కొన్నిసార్లు, ట్రిక్కులు పని చేస్తాయి కూడా. కానీ మీరు ఇటువంటి ట్రిక్కులను రోజూ చేయడం మొదలుపెడితే, ఏం చేయాలో ఇతరులకు తెలుస్తుంది, అలాగే మీతో ఏం చేయాలో జీవానికి కూడా తెలుస్తుంది. మీరు ఈ జీవాన్ని పాలించే ధర్మాలతో సమన్వయంలో లేకపోతే, మీరు ఖచ్చితంగా జీవ ప్రక్రియ చేత చితకగొట్టబడతారు. చాలామంది విషయంలో, వారి జీవితంలో పెద్దగా ఎటువంటి విపత్తూ చోటు చేసుకోలేదు. బయట, అంతా బాగానే ఉండి ఉండవచ్చు, కానీ చివరకు, జీవం వారిని లోపలినుండి నలగ్గొడుతూ ఉంటుంది. ఇది జరిగేది, జీవాన్ని పాలించే ధర్మాలతో సమన్వయంలో ఉండకపోవడం వల్లే తప్ప, మరే ఇతర కారణం వల్లా కాదు. దానివల్ల ఘర్షణ పుడుతుంది. బాధ, దుఃఖం, ఆందోళన, టెన్షన్, ఒత్తిడి, విచారం, పిచ్చి - మీరు ఎలా కావాలంటే అలా పిలవండి - ఇవన్నీ మీలోని ఘర్షణ వల్లే కలుగుతాయి. ఎంత ఘర్షణ ఉన్నది అనేది, కాలం గడిచే కొద్దీ, మీ ముఖం ఎంత బారుగా కిందికి సాగుతుంది అన్నదాన్ని నిర్ణయిస్తుంది. ఒకవేళ ఎటువంటి ఘర్షణ లేకపోతే, మీ ముఖం చిరునవ్వుతో ఉంటుంది.

ఈ ప్రకృతిని నడిపించే ధర్మాల యొక్క ఒక నిర్దిష్టమైన విధానం వల్లనే మానవుడు ఎన్నో సంభావ్యతలను కనుగొన్నాడు. అది ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టే, మీరు ఒక మానవుడు అయ్యారు. అది మరొక విధంగా పనిచేస్తూ ఉండి ఉంటే, బహుశా మీరు ఒక ఎద్దుగానో, లేదా ఒక చెట్టుగానో అయి ఉండేవారు.

మీరు దృష్టి పెట్టి, ఈ మానవ వ్యవస్థ తనను తాను ఎలా రూపొందించుకుందీ, అలా ఎందుకు రూపొందించుకుందీ అన్నది అర్థం చేసుకుంటే, ఈ ధర్మాలను అనుసరించి వాటితో సమన్వయంలో ఉంటే, మీ వ్యవస్థ అతి తక్కువ ఘర్షణతో పనిచేస్తుంది. గర్షణ లేకుంటే, మీరు విచారంగానో, లేదా ఒత్తిడిగానో ఉండరు. మీరు నిత్యం బాధను తయారుచేసుకోరు. మీకు మీ వ్యవస్థను సమన్వయంలోకి తీసుకురావడం గనుక తెలియకపోతే, కనీసం మీరు దానికి అనుగ్రహం అనే కందెనను వేయాలి. మీ దగ్గర ఒక మంచి యంత్రం ఉన్నప్పటికీ, సరైన కందెన వేయకపోతే, అది ఘోరమైన శబ్దాలను చేస్తుంది. ఇక్కడే అనుగ్రహం అనేది అడుగు పెడుతుంది. ఇప్పటికీ మీ యంత్రం సరైన సమన్వయానికి రాలేదు. కాకపోతే అనుగ్రహం దానిలో ఘర్షణ లేకుండా చేస్తుంది.

<p><strong>ప్రేమాశీస్సులతో,</strong></p>

 

<h3><strong><em>సద్గురు</em></strong></h3>

Editor’s Note: Isha Hatha Yoga programs are an extensive exploration of classical hatha yoga, which revive various dimensions of this ancient science that are largely absent in the world today. These programs offer an unparalleled opportunity to explore Upa-yoga, Angamardana, Surya Kriya, Surya Shakti, Yogasanas and Bhuta Shuddhi, among other potent yogic practices.

Find Hatha Yoga Program Near You