మనం గణేష చతుర్థిని ఎందుకు జరుపుకుంటాము?

సద్గురు: గణేషుడు ఏనుగు ముఖంతో ఉండే దేవుడు. ఆయన ఏనుగు ముఖంతో కాక, ఒక గణ మఖంతో ఉండవలసిన వాడు. ఆయన పేరు గణపతి, అంటే గణాలకు అధిపతి. కాని దురదృష్ట వశాత్తూ, ఎన్నో యుగాల కాల చక్రంలో, ఏ చిత్రకారుడో చేసిన తప్పిదం వల్ల అది ఏనుగు ముఖం అయింది.

భారత దేశంలో, అగష్టు - సెప్టెంబరు నెలల్లో మనం గణేష చతుర్థి పండుగ జరుపుకుంటాము. మనం బంక మట్టితో విగ్రహాన్ని తయారు చేసి పూజిస్తాము. ఎంతో పెద్ద ఉత్సవం జరుపు కుంటాము. కొన్ని విగ్రహాలు ఎంత పెద్దగా అంటే, 100 అడుగుల ఎత్తు వరకూ ఉంటాయి. కాని వారం నుంచి పదిహేను రోజుల తరువాత ఆ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తాము, ఆ విగ్రహం కరిగిపోతుంది.

దేవుని బొమ్మను తయారు చేసి, ఆయన చుట్టూ ఎంతో ఉత్సవం జరిపి ఆ విగ్రహమే తమ సర్వస్వంగా ప్రజలు పూజిస్తారు. ఆ ఒకటి రెండు వారాలూ, వారికి గణేషుడు తప్ప మరేమీ ఉండదు. ఆయనకు ఇష్టమైనదే తింటాము, ఆయనకు ఇష్టమైనదే మనమూ ఇష్టపడతాము, ఇక అంతా ఆయన గురించే. కానీ ఒకరోజు ఆయనను నీటిలో కలిపేస్తాము. అలా ఆయనను కరిగించేశాక ఇక అంతా ముగిసినట్లే. దేముడు అంటే, అది మనం తయారు చేసుకునేదే, అన్న ఎరుక గల సంస్కృతి ఇదే.

గణేషుడు తెలివి తేటలకు ప్రతీక. మహాభారతాన్ని వ్రాసింది ఆయనే. తనకు మహాభారతాన్ని వినిపించిన వ్యాస భగవానునికి ఆయన ఇచ్చిన సవాలు ఏమిటంటే, ఆయన చెప్పడం మధ్యలో ఆపకూడదని. ఆ మహర్షి నిజంగా తనలోంచి పెల్లుబికేది మాట్లాడుతున్నారా? లేక ఏదో పాండిత్య ప్రదర్శన చేస్తున్నాడా? అని వ్యాసునికి అది ఓ సవాలు. అందుకే గణేషుడు ‘‘మీరు ఆపకుండా చెబితేనే నేను వ్రాస్తాను. మధ్యలో మీరు ఎక్కడన్నా ఆపితే నేను ఇక కలం ప్రక్కనబెట్టేస్తాను, మళ్ళీ ముట్టుకోను’’ అని చెప్పాడు.

అందుకే ఇక వ్యాసుడు ఆపకుండా చెప్పాడు. అది నెలల పర్యంతం నడిచింది. గణేషుడు కూడా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా వ్రాశాడు. ఆయన అతి గొప్ప స్టెనోగ్రాఫర్.

ఆయన మనిషి తెలివితేటలకు ప్రతీక. మీ తెలివితేటల స్వభావం అదే కాబట్టి అది సబబైనదే. మీరు మీ తెలివితేటలను ఎరుకతో ఊహించడానికి ఉపయోగించుకోవచ్చు. మీరు మీ తెలివితేటలను సరిగ్గా ఉపయోగిస్తే, మీరు ఈ ప్రపంచాన్ని కూడా కరిగించి వేయవచ్చు, ఆయనను కరిగించివేయడం దానికి ప్రతీక. మీరొకసారి మీ ఊహతో ప్రపంచాన్ని కరిగించివేస్తే, మీ మెదడు కార్యకలాపాలను ఆపివేయడం (కరిగించడం), ఊహలను నిలిపి వేయడం పెద్ద సమస్య కాదు.

మీరు మీ ఊహలతో ఈ విశ్వాన్ని లేకుండా తుడిచి వేయవచ్చు. శక్తిమంతమైన ఊహతో, మీరు ఈ విశ్వాన్ని మీ అనుభూతిలో లేకుండా చేయవచ్చు. మీరు ఊహలను ఎరుకతో పెంపొందిస్తే, వాటిని ఆపివేయడం కూడా సులువే. ప్రస్తుతం మీ ఊహలు ఎరుకలేకుండా చిన్న చిన్న తునకలుగా జరుగుతున్నాయి, అందువల్ల వాటిని ఆపడం అసంభవం అనిపిస్తున్నది. అసలు గణేష చరుర్థి అంతా దీనికే ప్రతీక.

అసలు ఈ పండుగ ఎలా జరుగుతుందో మీరు చూడాలి. ఆయనను బహిరంగ ప్రదేశాలలో ఉంచుతారు. ఈ పదిహేను రోజులూ అనేక రోడ్లు మూసి వేస్తారు. ట్రాఫిక్ కూడా ఆగిపోతుంది, ఆయన రోడ్డు మధ్యలో కూర్చుని ఉంటాడు. ఈ కాలంలో ఆయన చుట్టూ పెద్ద పండుగు జరుగుతుంది, కాని సమయం వచ్చినప్పుడు వారు ఆయనను నిమజ్జనం చేసేస్తారు.

మీరు మీ బుద్ధిని, మీ ఊహలను ఇలాగే చేయగలగాలి. మీ బుర్ర ఏదో ఒక వస్తువు కాదు, అదొకరకమైన కార్యకలాపం. అసలు అక్కడ ఆలోచన లేకపోతే ఇక బుర్ర అనేది ఉండదు, ఎందుకంటే అదొకరకమైన కార్యకలాపం. చైతన్యానికి ఎటువంటి కార్యకలాపం లేకుండా ఇక్కడ ఉండే సామర్థ్యం ఉంది. కార్యకలాపాలు ఎరుకను (తయారు)చేయవు, ఎరుకే కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది.

నేను చేతిని కదుపుతాను, అంతేకాని చెయ్యి నన్ను కదపదు. నేనే చేతిని కదుపుతాను. అంతే కాని అది నన్ను కదపదు. కాని దానికి వ్యతిరేకంగా జరుగుతున్నది. మీ ఆలోచనా విధానమే (మానసిక స్వభావమే) మీరు అవుతున్నారు. మీ మనసులో వచ్చే విచిత్ర ఆలోచనలే మీరు అవుతున్నారు. ఈ విధానాన్ని తారుమారు చేయడం ముఖ్యం, ఎందుకంటే మీ స్వభావాన్ని మీ మనస్సు రూపుదిద్దితే అది ఘోరమైన సంఘటన అవుతుంది. మీరే మీ మనస్సు స్వభావాన్ని నిర్ణయిస్తే, ఎంతో అద్భుతమైనదేదో జరుగుతుంది.

గణేష్ చతుర్థి పూర్వాపరాలు

ఈ వ్యాసంలో సద్గురు, శివుడు గణపతి తలను ఖండించడం గురించి ఇంకా అందరూ అనుకునేట్టుగా ఏనుగు తలను పెట్టడం గురించిన అపోహను తొలగిస్తున్నారు. అది ఏనుగు తల కాదని, అది శివునికి ఇతర లోకాల స్నేహితులైన ప్రమధ గణాల తల అని చెబుతున్నారు.

గణేష్ చతుర్థి స్పెషల్ : సద్గురు సాంప్రదాయ మిఠాయిని తయారు చేస్తారు, ఆస్వాదిస్తారు.

సద్గురు: మా చిన్నతనంలో, పండుగ నాడు ఇంట్లో మగవాళ్ళందరూ కలసి కుడుములు తయారు చేసేవాళ్ళు. దీనినే కన్నడలో కుడుబు అనీ, తమిళంలో మోతగం అనీ అంటారు. మానాన్నగారు ఈ పిండితో గణేషుని వాహనంగా చక్కని ఎలుకను తయారు చేసేవారు. అసలు ఎలుక వాహనంగా ఎలా ఉండగలదు అని అడగవద్దు, గణపతి దానినే వాహనంగా వాడుకున్నారు. అసలు ఈ కుడుములు రుచిగా ఉండడమే ముఖ్యం, అది ఎలుక ఆకారంలో ఉన్నా ఫరవాలేదు, మేము రుచిగా ఉండడంవల్ల వాటిని తినేసేవాళ్ళం. మేము వాటిని తీపి మిఠాయిగానూ, కారంగా ఉండేరకంగా కూడా తయారు చేసేవాళ్ళం.

 

గణేషుని ప్రాముఖ్యత ఏమిటంటే, ఆయన విఘ్నాలను తొలగిస్తాడని ప్రతీతి. అంటే ఆయనేదో వచ్చేసి మీకున్న అడ్డంకులన్నీ తొలగిస్తాడని కాదు. గణేషునికి పెద్ద తలకాయ ఉంటుంది. ఆయనకున్న మామూలు తల తొలగించి ఇది అమర్చారు. ఆయన ఎంతో తెలివైన వాడనీ, ఎంతో సమతుల్యత కలవాడనీ ప్రతీతి. గణేషుడు ఈ గుణాలకే ప్రతీక. మీకు చురుకైన, సమతుల్యత గలిగిన తెలివి ఉంటే మీ జీవితంలో మీకు అడ్డంకులు ఉండవు.

పర్యావరణ అనుకూలమైన గణేష్ ప్రతిమల ప్రాముఖ్యత

గణేషుని ప్రతిమలు సహజమైన ప్రాకృతికమైన పదార్ధాలతో తయారు చేయాలి. మట్టితో, కొన్నిరకాల పిండితో, పసుపుతో ఇలా రకరకాలుగా తయారు చేయవచ్చు. మీరు ఆయన్ని ప్లాస్టిక్ పదార్ధాలతో చేయకూడదు, ఎందుకంటే ఆయన నీటిలో కరగడు. మీరు విగ్రహాన్ని కాల్చి కుండగా కూడా చేయకూడదు. అలాగే దానికి ప్లాస్టిక్ కోటింగ్ లాంటి రంగులు కూడా వేయకూడదు, ఎందుకంటే అదికూడా కరుగదు. అలాచేస్తే అది నీటిని కలుషితం చేసి మీకూ, మీ చుట్టువున్న వారందరికీ హాని చేస్తుంది.

ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు దేవుడిని తయారు చేసి ఆయనను కరిగించి వేసే వెసులుబాటు మీకు కలిగించారు, అది ముఖ్యం. మరే ఇతర సంప్రదాయం ఇవ్వని గొప్ప విశేషాధికారం, మీకు ఇవ్వబడింది. మీరు దానిని సద్వినియోగం చేసుకోండి. మీరు కేవలం మట్టి, పిండిపదార్ధాలూ. పసుపులాంటి కరిగిపోయే పదార్ధాలే వాడండి. ఇవి ఎప్పుడూ వాడే పదార్ధాలే, వాటితో చేస్తే విగ్రహం కూడా అందంగా ఉంటుంది. మీకేమైనా రంగులు వాడాలని ఉంటే, దయచేసి విజిటబుల్ రంగులే వాడండి, అవి గణేషుడినిన ఎంతో అందంగా, వాతావరణానికి ప్రయోజనకారిగా చేస్తాయి.

Editor's Note:  Watch this video where Sadhguru talks about the significance of Ganesh Chaturthi in detail.