మీరు జీవితంలో విజయం సాధించాలంటే అన్నింటికన్నా ముఖ్య పాత్ర దేనిది-విధి, దేవుడు, కృషి లేదా అదృష్టం?

సద్గురు: అవన్నీ ఉండాలేమో, కానీ ఏది ఎంత మోతాదులో? మీరు ‘విధి’ కారణం అంటే. కచ్చితంగా అది మీ చేతుల్లో లేదు. పోనీ ‘అదృష్టమా’ అది కూడా మీ చేతుల్లో లేదు. ‘దేవుడు’ ఇది కూడా మీ చేతుల్లో లేదు. మీ చేతుల్లో ఉన్నది ఒకే ఒక్కటి, ప్రయత్నం మాత్రమే. మీరు 100 శాతం ప్రయత్నించండి. ఏది జరిగితే అది జరుగుతుంది. మీకు ఉన్న శక్తి సామర్థ్యాలను ‘అదృష్టం, దేవుడు, విధి’ వంటి వాటిపై వదిలివేయవద్దు. మీరు చేయవలసింది అది కాదు. ఒక వేళ అలాంటిది ఏదైనా ఉంటే, దానిపని అది చేస్తుంది. ప్రయత్నించడం ఒక్కటే మీ పని. మీ ప్రయత్నం చాలా ఏకాగ్రతతో, అన్నివిషయాలను పరిగణనలోకి తీసుకుని చేయాలి. ప్రయత్నం నిశితంగా, ప్రామాణికంగా ఉండాలి. ఎదో ఊరికే ప్రయత్నించడం మూర్ఖుల లక్షణం. కేవలం శ్రమ ఒక్కటే మిమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్ళదు. సరైన ‘చర్య, సమయం, ప్రదేశం’ అన్నీ ముఖ్యమైనవే..

ఇవన్నీ జరగాలంటే ప్రజ్ఞ, అవగాహన ఆవశ్యము. మీరు మీ ప్రజ్ఞ, అవగాహనలు విస్తృతపరుచుకునే మార్గాల కోసం నిశితంగా దృష్టి నిలపాలి. మిగతాదంతా ఎలాగోల జరుగుతుంది. దురదృష్టవశాత్తూ, మానవాళి ఇది మాత్రం చేయడం లేదు.

ఉదాహరణకు, 25 సంవత్సరాల క్రితం, ప్రతి ఒక్కరూ వైద్యులు కావాలనుకునేవారు. చదవాలనుకుంటే ‘వైద్య విద్యే’ మొదటి ఎంపిక. మీరు ఒక వైద్యుడు అయ్యారనుకుందాం. అందరూ యోగ కార్యక్రమాలకు హాజరవ్వడం వల్ల, వైద్యులను సంప్రదించడం మానివేశారు. అప్పుడు వ్యాపారం కూడా తగ్గుముఖం పడుతుంది. అప్పుడు వైద్యం, వృత్తి పరంగా అంతగా లాభసాటిగా ఉండదు. ఏది ఏమైనా అతి కొద్ది మంది మాత్రమే నిజంగా వైద్యులు కావాలని చదువుతారు. యదార్థంగా, వైద్యులు కావాలని చదివేవారు చాలా తక్కువ మంది ఉండేవారు, వారు మాత్రమే మానవ వ్యవస్థను అర్థం చేసుకుని పనిచేసేవారు. కానీ మిగిలిన వారందరూ, లాభసాటి వ్యాపారం కోసం వైద్యులు అవుతున్నారు. ఇతరుల అనారోగ్యం, మనకు లాభసాటి వ్యాపారం అనుకోవడం నాకు ఎంతగానో బాధ కలిగించింది. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని మీరు ఆశించడం లేదు.

విజయం సాధించడానికి ప్రత్యేక విధానమేమి లేదు.

మీ విజయానికి మీరు పాటించిన ‘ఓ ప్రత్యేక విధానం’ కారణం అని చెప్పే ప్రయత్నం చేయకండి. మీలో ఉన్న సామర్థ్యాన్ని, మీ కోసం పూర్తిగా వినియోగించుకున్నప్పుడే అసలైన విజయం సిద్ధిస్తుంది. మీరు వైద్యులు అవుతారా, రాజకీయ నాయకులౌతారా, యోగి అవుతారా లేదా ఇంకేదైనా అవుతారన్నది ముఖ్యం కాదు. విజయం అంటే మీరు మీ పూర్తి క్షమత మేరకు జీవించడం. అలా జరగాలంటే, మీకు అవగాహన, క్రియాశీలమైన ప్రజ్ఞ అవసరం. "నా తెలివితేటలను ఎలా వృద్ధి చేసుకోవాలి?" అని ఆలోచించకండి. మీ అవగాహన స్థాయిని పెంచుకోవడమే ముఖ్యం. మీరు జీవితాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగితే, మీ జీవితాన్ని నిర్వహించుకోవడానికి కావాల్సిన తెలివి లభిస్తుంది. జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోతే, మీ తెలివి మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. సాధారణంగా ఈ భూగోళం మీద ఉన్న తెలివైన వారందరూ భాధలతోనే ఉన్నారు. ఎందుకంటే వారికి ఎంతో విజ్ఞానం ఉందిగానీ, జీవితం పట్ల అవగాహన లేదు.

ఈ రోజు ప్రజలు తమ తెలివిని విస్తృతపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని వల్ల వారు సామజికంగా విజయం సాధిస్తున్నారు, కానీ వారు నిజమైన విజయం సాధించడం లేదు. మీరు నిజమైన విజయం సాధించాలంటే, ఎలాంటి వక్రీకరణలు లేకుండా జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి. అప్పుడు జీవితం ఒక అద్భుతమైన క్రీడగా, ఆటగా మారుతుంది. మీరు ఆ ఆటను సంతోషంగా అడగలరు. మీరు కచ్చితంగా, బాగా అడగలరు. మీరు బాగా అడగలిగితే, జనులందరూ మీరు విజయం సాధించారని అంటారు.

మీరు విజయం కోరుకోవాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని ఒక రీతిలో నిర్మించుకోవాలను కోవడం బాధకరమైన విషయం. అలా చేయడం వల్ల మీ బాధకు, వేదనకు మీరే కారణం అవుతున్నారు. కారణం మీ దృష్టిలో విజయం అంటే, మీరు అందరి కంటే పైన ఉండాలి, అందరూ మీ క్రింద ఉండాలి.

ఇది విజయం కాదు. ఇది ఒక జబ్బు. "నేను గెలవాలి" అని ఎప్పుడూ ఆలోచించకండి. మిమ్మల్ని మీరు సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడంపై దృష్టి నిలపండి, విజయం అదే వ్యక్తమౌతుంది. అది సరిగ్గా వ్యక్తమైతే, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ‘మీరు విజయం సాధించారని’ అంటారు. కానీ ఎలా విజయం సాధించాలని మీరు ఆలోచించకూడదు. జీవించడానికి అది సరైన మార్గం కాదు.

సంపూర్ణoగా జీవించడం

ఒకసారి మీరు మానవులుగా పుట్టాక, మానవుడిగా ఉండటం అంటే ఏమిటి? దాని పూర్తి సంభావ్యత ఏమిటి? మీరు ఎవరు? అన్నది అన్ని రకాల కోణాల్లో ఖచ్చితంగా అనుభవం పొందాలి. అప్పుడు మాత్రమే మీరు విజయులు అయ్యారని నేను అంటాను. మీకు మీరుగా భయం, బాధ లేని స్థితికి చేరుకున్నప్పుడే, మిమ్మల్ని మీరు అన్వేషణ చేయడానికి కావలసిన సామర్థ్యం, ధైర్యం సిద్ధిస్తాయి. జీవితం యొక్క స్థితి ఏమైనా, మీ జీవితానుభావం దానికదే మారదు.

ఇప్పుడు ‘ఈశా ఫౌండేషన్’ రెండు డజన్లకు పైగా సామజిక కార్యక్రమాల్లో నిమగ్నమై పని చేస్తున్నది. వాటిలో కొన్ని చాలా పెద్ద కార్యక్రమాలు. అవి తమిళనాడులోనే కాక ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. నా కార్యక్రమాల సఫలత్వం గురించి నాకు ఏ మాత్రం ఆందోళన లేదు. ఆ కార్యక్రమాలు బాగా జరిగితే, చాలా మంది ప్రజలకు ఉపయోగపడతాయి. అవన్నీ విఫలం అయినా కూడా నేను సంతోషంగానే ఉంటాను. నేను నా పూర్తి శక్తి మేరకు పని చేస్తాను. దానిలో సందేహమే లేదు. ఎందుకంటే పొందడానికి గానీ, కోల్పోవడానికి గానీ నా వద్ద ఏమీ లేదు. కానీ కార్యక్రమాల సఫలత్వం అనేది రకరకాల పరిస్థితులపై, లక్షలాది మంది ప్రజల సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా, ప్రపంచం దృష్టిలో ఈ కార్యక్రమాలు ఏమౌతాయి, ఎలా విజయవంతమౌతాయనే విషయాలు నా జీవితానుభవాన్ని నిర్ణయించలేవు.

మీరు సఫలీకృతులు కావాలన్నా, ఏదైనా చేయడంలో ఉన్న సంతోషాన్ని పొందాలన్నా గానీ, మీరు మీ పూర్తి స్థాయిలో పని చేసినప్పుడే సాధ్యపడుతుంది. నూటికి నూరు శాతం జరుగుతుంది. మీరు చేసేది ప్రతిదీ ఖచ్చితంగా నూటికి నూరు శాతం చేస్తున్నప్పుడు, మీ పని ఒక అతిశయాన్ని పొందుతుందనే విషయాన్ని మీరు గుర్తిస్తారు. నా దినచర్య రోజులో 18 నుండి 20 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు కొనసాగుతుంది. కొంత మంది దృష్టిలో ఇది బానిసత్వంలాగా అనిపిస్తుంది. కానీ నాకు అలా అనిపించదు. ఎందుకంటే నేను నా సమయాన్ని అంతా పారవశ్యoతో గడుపుతాను. నా చుట్టూ ఉన్న చాలా మందికి కూడా అంతే. ఇది విజయం. దానికి మీరు అలా నామకరణం చేస్తే, నేను ఏమంటానంటే ఇదే జీవితం.

Editor’s Note: This article is excerpted from the ebook “Ambition to Vision”, available at Isha Downloads.