సూర్యుడు నిజంగా ఉదయించడు, అస్తమించడు. కాని అది మనం అర్థం చేసుకొనే తీరు. ఎంత అద్భుతమైన భ్రమ! అతి చిన్న విషయాల నుండి అతిపెద్ద విషయాల వరకు మన జీవితంలో, మన అవగాహనలో ఎన్నెన్నో భ్రమలు. మీరు సినిమా హాలులో కూర్చుంటే తెరమీద జరుగుతున్న దంతా నిజమనే అనిపిస్తుంది. కాని మీరు ప్రొజెక్షన్ గదిలోకి వెళ్లి చూస్తే అక్కడొక కరెంటు బల్బు, తిరుగుతున్న రెండు చక్రాలు కనిపిస్తాయి. కాని తెరమీద ఎంత నాటకం - ప్రేమ, కొట్లాటలు, యుద్ధం, శాంతి, బహుశా జ్ఞానోదయం కూడా. కాని వాస్తవానికదొక ప్రొజెక్షన్ మాత్రమే.

అక్కడ జరుగుతున్నది కొన్ని పాత్రలు నటిస్తున్న నాటకం మాత్రమేనని మీరు అర్థం చేసుకోలేకపోతే మీరు ఆ నాటకంలో చిక్కుకొనిపోతారు.

ఒక నాటకాన్నో, సినిమానో చూసి ఆనందించలేనివాడు మూర్ఖుడు. కాని ఆ నాటకంలో, సినిమాలో మమైకమై పోయినవాడు అంతకంటే పెద్దమూర్ఖుడు. నాటకాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ, అందులో చిక్కుకోకుండా ఉండేవాడికి అది ఆ సినిమా నిర్మాణంలో పాత్రధారులైన వారి పేర్లతో మొదలై శుభం కార్డుతో అంతమవుతుందని అర్థమవుతుంది. అదొక రకంగా శ్మశాన వాటికలో సమాథులపై ఫలకాలలాంటిది. మీరిప్పుడు సినిమాలో చూసిన పాత్రలన్నీ ఇప్పుడక్కడున్నాయి. అక్కడ జరుగుతున్నది కొన్ని పాత్రలు నటిస్తున్న నాటకం మాత్రమేనని మీరు అర్థం చేసుకోలేకపోతే మీరు ఆ నాటకంలో చిక్కుకొనిపోతారు. అప్పుడు వాస్తవంకాని ఎన్నో విషయాలు మీకు వాస్తవమనిపిస్తాయి. అదే సమయంలో నిజంగా వాస్తవమైన వాటిని మీరు సంపూర్ణంగా కోల్పోతారు, చూడలేకపోతారు.

గురువు చేస్తున్న పని మిమ్మల్ని సినిమా హాలుకు తీసికొని వెళ్లడం కాదు, ప్రొజక్షన్ గదికి తీసుకొని వెళ్లడం. ప్రొజెక్షన్ గదిలోకి వెళ్లి సినిమాలో తెరమీద కనిపిస్తున్న అద్భుతమైన స్త్రీపురుషులంతా లేనేలేరని, అక్కడేమీ గొప్ప నాటకం లేదనీ - కేవలం ఒక బల్బు, రెండు చక్రాలేననీ చూసి మీ ఆనందమంతా పోగొట్టుకోవడమెందుకు? జీవితమనే సినిమా కేవలం ఇతర నటులకోసమే అయితే పరవాలేదు. మీరు హాయిగా కుర్చీలో ఆనుకొని కూర్చుని, పాప్‌కార్న్ తింటూ సినిమాను ఆనందించవచ్చు.  కాని ఇక్కడ మీరే ఒక పాత్ర పోషించాలి, పైగా మీరు దర్శకుడి చేయిపట్టుకొని కూడా  లేరు.

మీరు దర్శకుడి చేయి పట్టుకుంటే అదొక అద్భుతమైన అనుభవమవుతుంది

దర్శకుడు నటుడి చేయి పట్టుకొని ఉండకపోతే మనకు బాగా తెలిసిన గొప్ప గొప్ప తారలు కూడా అటువంటి గొప్ప నటన చేయలేరు. మీరు ఎంత అద్భుతమైన వారైనా, ఎంత సమర్థులైనా కావచ్చు - కాని మీరు సృష్టికర్త చేయిపట్టుకోనట్లయితే, మీ జీవితం పూర్తిగా గందరగోళమవుతుంది. మీరు సఫలమైతే గందరగోళం. విఫలమైతే మరో రకం గందరగోళం. అందరూ వైఫల్యం చెందితే ప్రపంచమే మురికి కాలువలోకి ప్రవహిస్తుంది. ప్రతి ఒక్కరూ సఫలమైతే మనం అంతకన్నా వేగంగా ఈ భూమండలాన్ని నాశనం చేస్తాం.

మీరు మీ పాత్రను ఎలా నిర్వహించాలో తెలిసి, ప్రొజెక్షన్ గది నడిచే పద్ధతి కూడా మీ స్పృహలో ఉంటే, అప్పుడు సినిమాను మీ ఇష్టం వచ్చిన రీతిలో నియంత్రించగలుగుతారు. మీరు దర్శకుడి చేయి పట్టుకుంటే అదొక అద్భుతమైన అనుభవమవుతుంది; అన్నిటికీమించి మీరు విశ్రాంతిగా సినిమా చూడగలుగుతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

pixabay