శ్రేయస్సు అంటే ఏమిటి?
క్లుప్తంగా చెప్పాలంటే, శ్రేయస్సు మన అంతరాంతరాల్లో కలిగే ఉల్లాసకరమైన అనుభూతి. మీ శరీరం ఉల్లాసంగా ఉంటే దాన్ని ఆరోగ్యం అంటాం. అది ఇంకా ఉల్లాసంగా ఉంటే, దాన్ని సుఖం అంటాం. మనసు ఉల్లాసంగా ఉంటే దాన్ని ప్రశాంతత అంటాం. ఇంకా ఎక్కువ ఉల్లాసంగా ఉంటే ఆనందం అంటాం. మీ భావాలు ఉల్లాసంగా ఉంటే, దాన్ని ప్రేమ అంటాం. అవి ఇంకా ఉల్లాసంగా ఉంటే, దాన్ని కారుణ్యం అంటాం. మీ జీవ శక్తులన్నీ ఉల్లాసంగా ఉంటే దాన్ని బ్రహ్మానందం అంటాం. అవి ఇంకా ఉల్లాసంగా ఉంటే, దాన్ని ఆనంద పారవశ్యం అంటాం.
మీరు కోరుకుంటున్నది ఒక్కటే: శరీరానికి బయటా లోపలా ఒక ఆహ్లాదకరమైన స్థితి. మీలో ఆహ్లాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు దానిని శాంతి అనీ, ఆనందమనీ, సంతోషమనీ అంటున్నాము. మీ చుట్టుపక్కల అంతా ఆహ్లాదకరంగా ఉంటే దాన్ని విజయం అంటున్నాం. వీటిలో మీకు ఏవీ ఇష్టం లేకపోతే, మీకు స్వర్గమే కావలసి వస్తే, మీరు ఏమిటి కోరుకుంటున్నట్టు? మరణానంతర లోకాల్లో విజయం! కనుక, మానవ జీవితానుభవం అంతా కూడా, వివిధ స్థాయిల్లో ఆహ్లాదకరంగా ఉండడం లేదా ఉండలేకపోవడం గురించిన ప్రశ్న.
మీ జీవితంలో ఎన్ని రోజులు, రోజు మొత్తం మీద ఒక్క క్షణం కూడా ఏ రకమైన ఆందోళనా, గాభరా, చిరాకు, ఒత్తిడి లేకుండా ఆనందంగా గడపగలిగారు? మీరు రోజంతా, అంటే ఇరవై నాలుగు గంటలూ నిరవధికమైన పరమానందంలో గడిపిన రోజులెన్ని? ఈ మధ్యకాలంలో అలా గడిపిన రోజు ఏది? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ భూమి మీద ప్రతి వ్యక్తికీ, ఏ ఒక్క రోజూ అతను ఎలా జరగాలని కోరుకుంటాడో అలా జరిగిన రోజు ఒక్కటీ ఉండదు. అలాగే, సంతోషం, ప్రశాంతత, బ్రహ్మానందం, అనుభవించని వ్యక్తి, అవి ఎంత క్షణికమైనప్పటికీ, అనుభూతి చెందని వ్యక్తికూడా ఉండడు. వాళ్ళు కోరుకున్న స్థితి చేరుకుంటారు గాని, అక్కడ ఎక్కువ సేపు ఉండలేక, ఆ స్థితి కొద్ది సేపట్లోనే కూలిపోవడం మొదలవుతుంది. అలా జరగడానికి భూకంపం తెప్పించే విషయం ఏదీ జరగనక్కరలేదు. అతి చిన్న విషయాలు కూడా మనుషులు తమ సంయమనాన్ని కోల్పోయేట్టుగా, తమ నిలకడ తప్పేలా చెయ్యగలవు.
ఉదాహరణకి అది ఇలా జరగవచ్చు: మీరు బయటికి ఎక్కడికో వెళ్తారు. ఎవరో మిమ్మల్ని చూసి ప్రపంచంలోనే మీరు అత్యంత సుందరమైన వ్యక్తి అని పొగుడుతారు. మీరు ఆనందంలో తేలిపోతుంటారు. ఇంటికి వచ్చేసరికి, ఇంట్లో వాళ్ళు మీరు ఎలా ఉంటారో ఉన్నదున్నట్టు చెబతారు. మీ ఆకాశ హర్మ్యం కూలిపోతుంది.
ఏదో పరిచయం ఉన్న విషయంలా కనిపిస్తోందా?
మీరు అంతరంగంలో ఆనందంగా ఎందుకు ఉండాలి? దీనికి సమాధానం ప్రత్యక్షంగా తెలిసినదే. మీరు అంతరంగంలో ఆనందంగా ఉండగలిగితే, మీరు సహజంగా అందరితోనూ, మీ పరిసరాలతోనూ ఆనందంగా ఉంటారు. మీకు ఏ తత్త్వచింతనా, ధార్మిక గ్రంధాలూ అందరితోనూ మంచిగా ఉండమని బోధించనక్కరలేదు. మీరు అంతరంగంలో ఆనందంగా ఉన్నప్పుడు ఇది మీలో సహజంగానే జరుగుతుంది. లోపలి ఆనందస్థితి అనేది శాంతితో నిండిన సమాజాన్నీ, ఆనందంగా ఉండగలిగే ప్రపంచాన్నీ నిర్మించడానికి తిరుగులేని సాధనం.
అంతేగాక, మౌలికంగా, మీ శరీరమూ, మనసూ రెండింటి సామర్థ్యాలనీ ఎంత చక్కగా సద్వినియోగం చేసుకోగలరన్నదానిమీద ప్రపంచంలో మీ సఫలత ఆధారపడి ఉంటుంది. కనుక విజయం సాధించాలంటే, మీరు అంతరంగంలో ఆనందంగా ఉండగలగడం మీ ముఖ్య లక్షణమై ఉండాలి. అన్నిటినీ మించి, మీరు మానసికానందాన్ని పొందే స్థితిలో ఉన్నప్పుడు మీ శరీరమూ, బుద్ధి వాటి అత్యున్నత స్థాయిలో పనిచెయ్యగలుగుతాయని తగినన్ని వైద్య, వైజ్ఞానిక దాఖలాలున్నాయి. అవి, మీరు 24 గంటలు గనక ఆనందస్థితిలో ఉండగలిగితే, మీ మేధోశక్తి రెండురెట్లు అవుతుందని చెబుతున్నాయి. కనుక లోపలి కల్మషాన్ని పక్కకు పెట్టి , మీ స్పష్టతను పైకి తీసుకురావడం ద్వారా మీరు ఇది సాధించవచ్చు.
"మీరు" అని మీరు సూచించుకునే జీవశక్తి, కొన్నిసార్లు చాలా ఆనందంగా, కొన్ని సార్లు దైన్యంగా, కొన్ని సార్లు ప్రశాంతంగా, మరికొన్ని సార్లు ఆందోళనలోనూ ఉంటుంది. ఆ ఒక్క జీవ శక్తే ఇన్ని అవస్థలకూ లోనుకాగలగిన సమర్థత కలిగి ఉంది. మీకు గనుక మీ జీవశక్తిని ఎలా కోరుకుంటే అలా ప్రకటించగల అవకాశం ఇస్తే, మీరు ఏది కోరుకుంటారు? ఉల్లాసాన్నా, దుఖాన్నా? ఆనందాన్నా లేక విచారాన్నా?
దీనికి సమాధానం మనకి స్పష్టమైనదే. వ్యక్తికీ, వ్యక్తికీ మార్గాల్లో తేడా ఉండవచ్చు. అది, మీరు డబ్బు సంపాదించాలని ప్రయత్నించడమయినా, మందుకి బానిసలవుతున్నా, స్వర్గానికి పోవాలనుకున్నా, కోరుకుంటున్న లక్ష్యం అనందమే. మీకు ఈ భౌతిక సుఖాలమీద కోరిక లేదనీ, కేవలం స్వర్గం కావాలని కోరుకుంటున్నారనీ అనుకుంటే, అప్పుడు కూడా మీరు వెతుకుతున్నది ఆనందమే. అదే మీకు చిన్నప్పటి నుండి దేవుడు స్వర్గంలో ఉంటాడనీ, కానీ స్వర్గం మహా దుర్భరమైన ప్రదేశమని చెబితే, మీరు స్వర్గానికి వెళ్ళాలని కోరుకునే వారా? ఖచ్చితంగా కాదు. ప్రాధమికంగా, ఆనందానికి పరమావధి స్వర్గం. బాధలకి పరమావధి నరకం. కొందరు ఈ ఆనందం మందులో ఉందంటే, మరికొందరు భగవంతునిలో ఉందంటారు తప్ప, అందరు వెతుకుతున్నదీ ఆ ఆనందమే.
మీకూ మీ శ్రేయస్సుకీ మధ్య అడ్డుగోడలా నిలబడుతున్నది ఒక్కటే: మీ ఆలోచనలు, ఆవేశాలు మీ లోపలి నుంచి కాకుండా బయట ప్రపంచం నుండి ఆదేశాలు తీసుకునేలా మీరు వదిలేసారు.