సద్గురు అంటే అర్థం ఏమిటి?
సద్గురు అన్న పదానికి అర్థం ఏమిటీ? సద్గురు అన్న పదం ఒక సంబోధన(టైటిల్) కాదని, అది ఒక విశ్లేషణ అని సద్గురు మనకి చెప్తున్నారు.
సద్గురు అంటే విద్య లేని గురువు అని. ఎవరైనా తమ పాండిత్యం వల్ల ఏదైనా చెప్పగలిగినప్పుడు, మనం వారిని ఎన్నో విధాలా సంబోధిస్తాం. కానీ, ఎవరైతే తమ అంతర్ముఖ అనుభవంవల్ల చెప్పగలుగుతారో వారిని మనం సద్గురు అని అంటాం. సద్గురు అనేది ఒక సంబోధన కాదు. ఇది ఒక విశ్లేషణ. సద్గురు అంటే విద్య లేని గురువు. నేను దాదాపుగా నూటికి నూరు శాతం ఆధ్యాత్మిక పరంగా ఎటువంటి విద్యనూ పొందలేదు. నాకు ఎటువంటి గ్రంథాలూ తెలియవు. నేను వేదాలను చదువలేదు. భగవద్గీతను కూడా చదవాలని ప్రయత్నం చెయ్యలేదు.
మీకు కనుక ఈ జీవం పూర్తిగా తెలిసినట్లయితే; మీకు ఈ సృష్టిలో ఏదైతే తెలియవలసి ఉందో అదంతా తెలుస్తుంది. ఎందుకంటే ఈ జీవం ఏవిధంగా జరిగిందో, అదే విధంగా ఈ సృష్టి అంతా జరిగింది. అందుకని మీరు, ఈ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రపంచాన్నంతా వెతుకుతూ వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు అంతర్ముఖులైతే, ఈ జీవాన్ని అ నుంచి అః వరకు తెలుసుకోగలరు. ఏవిధంగా అయితే జీవితాన్ని తెలుసుకోవచ్చో, తెలుసుకునే అవకాశం ఉందో ఆవిధంగా మీకు తెలుస్తుంది. నేను జీవితం గురించి మాట్లాడతాను, స్వర్గాన్ని గురించి కాదు. ఇది, ఎంతోమందికి నచ్చకపోవచ్చు. కానీ, గురువు అవ్వడంలో ఉన్న ప్రయాస అంతా, సాధకుడి ప్రశ్నను మరింత లోతుగా తీసుకువెళ్ళడమే! అంతేకానీ, అతనికి సమాధానాలను ఇవ్వడం కాదు.