రుద్రాక్ష ధరించడం వల్ల పొందే లాభాలను తెలుసుకోండి
రుద్రాక్షలు పర్వతాల మీద, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలలో కొంత ఎత్తులో పెరిగే ఒక వృక్షజాతి చెట్టు గింజలు. అవి ఇంకా అనేక ఇతర ప్రాంతాలలో, పశ్చిమ కనుమలలో కూడా పెరుగుతాయి. దురదృష్టవశాత్తూ చాల రుద్రాక్ష చెట్లు భారతీయ రైల్వే వారు రైలుమార్గం వేసేటప్పుడు పట్టాలక్రింద స్లీపర్లుగా వాడారు, అందుకే భారతదేశంలో ఈ చెట్లు కొన్నే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ రుద్రాక్షలు నేపాల్, బర్మా, థాయిలాండు, ఇండోనేషియాల నుంచి వస్తున్నాయి.
రుద్రాక్షలు ఒక ప్రత్యేకమైన ప్రకంపనలు కలిగి ఉంటాయి. అవి మీ శక్తినే ఒక కవచంలాగా తయారుచేసి, వేరే శక్తులు మిమ్మల్ని కలత పెట్టకుండా చేస్తాయి. అందుకే రుద్రాక్షలు ఎప్పుడూ ఒకే చోట కాకుండా తిరుగుతూ, వేరు వేరు చోట్ల తినే వారికి చాలా ఉపయోగకరం. మీరు ఇది గమనించే ఉంటారు; మీరు క్రొత్త చోటకు వెళ్ళీనప్పుడు, ఒకోచోట మీరు తేలికగా నిద్రలోకి జారిపోతారు, ఇంకొన్ని చోట్ల మీరు అలసిపోయి పడుకున్నా నిద్రరాదు. దీనికి కారణం మీచుట్టూ పరిసరాల్లో స్థితి మీ తరహా శక్తికి అనుకూలమైనది కాక పోవడం వల్ల, అందుకే అక్కడ మిమ్మల్ని విశ్రమించనీయదు. సాధువులూ, సన్యాసుల నియమాలలో ఒకేచోట రెండవ సారి పండుకోకూడదు అన్నది ఒకటి కాబట్టి; వారు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. అందువల్ల పరిస్థితులూ, పరిసరాలూ వారికి బాధకలిగించవచ్చు. అందుకే వారెప్పుడూ రుద్రాక్షలు వేసుకునే ఉంటారు. ఈ రోజుల్లో మళ్ళీ ప్రజలు వారి వృత్తి, వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో తింటున్నారు, పడుకుంటున్నారు. మనిషి ఒకే చోట పడుకుంటుంటే, తింటుంటే వారికి అక్కడ ఒక రకమైన గూడు ఏర్పడుతుంది, కాని ఎప్పుడూ తిరిగే వారికి, అనేక చోట్ల తినేవారికీ, నిద్రించే వారికీ; రుద్రాక్ష మీ శక్తి తోనే గూటిని ఏర్పరస్తుంది అందువల్ల, అది చాలా ఉపయోగకరం.
రుద్రాక్షలవల్ల మరో ఉపయోగం: అరణ్యాల్లో నివసించే సాధువులూ, సన్యాసులూ ప్రకృతిలో వివిధ రకాలుగా నీరు విషపూరితమయ్యే అవకాశమున్నది కాబట్టి అన్ని చోట్లనుంచి త్రాగలేరు, అలా త్రాగితే ఆనీరు వారిని దుర్బలం చేయవచ్చు, చంపివేయవచ్చు కూడా. ఆ నీటి మీద రుద్రాక్షమాలను పట్టుకుంటే, మాల సవ్య దిశలో తిరిగితే ఆనీరు త్రాగవచ్చు. అదే విషపూరితమైన నీరైతే రుద్రాక్షమాల అపసవ్యదిశలో తిరుగుతుంది, ఆ నీరు త్రాగటానికి హానికరము అని తెలుస్తుంది. అంతే కాక చారిత్రకంగా ఒక కాలంలో, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో, ఒక మూర్ఖపు పోటీ ఏర్పడింది. వేద కాలంలో ఒకే దేవుడు శివుడు లేక రుద్రుడు ఉండేవాడు, కాలం గడచిన కొద్దీ వైష్ణవులు వచ్చారు. ఆ కాలం పరిస్థితులలో వైష్ణవులు శైవులను, ముఖ్యంగా సన్యాసులను, తమ ఇంటికి ఆహ్వానించి వారికి విషాహారాన్ని వడ్డించేవారు. అందుకే శైవులు తమను రక్షించుకునేందుకు ఒక చిన్న ఉపాయం కనుగొన్నారు. ఇప్పటికి కూడా శైవులలో అనేక తెగల వారు దీని ఆచరిస్తారు. మీరు వారికి ఆహారం పెడితే, వాళ్ళు మీ ఇంట్లో తినరు. ఆహారం బయటకు తీసుకు వెళ్ళి రుద్రాక్షమాలను ఆహారం మీద పట్టుకుంటారు. అది సవ్య దిశలో తిరిగితే గ్రహిస్తారు, అపసవ్య దిశలో తిరిగితే గ్రహించరు. ఇప్పటికీ కొందరు దీన్ని ఆచరిస్తారు.
రుద్రాక్ష దుష్ట శక్తులనుంచి రక్షణగా ఉంటుంది. కొందరు ఇతరులకు హాని కలిగించటానికి కొన్ని దుష్ట శక్తులను ప్రయోగించవచ్చు, ఆ రకంగా ఒక పెద్ద శాస్త్రం కూడా ఉన్నది. అధర్వణవేదం అంతా శక్తులను మీకు సానుకూలంగా, ఇతరులకు ప్రతికూలంగా ఉపయోగించటం గురించే. ఈ ప్రక్రియలో నిష్ణాతులైన వారు ఆ విధంగా ఉపయోగించ దలచుకుంటే; ఇతరులకు ఎంతో బాధ కలిగించవచ్చు, ఇంకా కావాలనుకుంటే చంపనూ వచ్చు. రుద్రాక్ష ఇటువంటి వాటినుంచి కవచంగా పనిచేస్తుంది. మీరు ’నాకెవరు హాని కలిగిస్తారు?’ అని అనుకోవచ్చు. అది మీమీదే ప్రయోగించనక్కరలేదు; మీ ప్రక్కన వారి మీద ప్రయోగించినా, అతను దానిని గ్రహించకపోతే, మీరు అతనితో ఉన్నారు కాబట్టి అది మీమీదకు రావచ్చు, అది సాధ్యమే. ఉదాహరణకు, వీధిలో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటుంటే, వారు మీపై గురి పెట్టక పోయినా మీకే హాని కలగవచ్చు. అలాగే ఇదికూడా. అది మీమీద ప్రయోగింపక పోయినా మీరు అనుకోని పరిస్థితులలో అనుకోని చోట ఉంటే మీకే హాని జరగవచ్చు. వాటి గురించి అనవసరంగా భయపడనవసరం లేదు కాని, రుద్రాక్ష అటువంటి పరిస్థితులనుంచి ఒకరకమైన రక్షణ.
ఒక గురువు అనేకమంది కి అనేకరకాలుగా రుద్రాక్షను శక్తి వంతం చేస్తారు. గృహస్థులకు రుద్రాక్ష ఒక రకంగా శక్తివంతం చేస్తారు, ఒకరకంగా మీరు దానిని ఒక చిన్న ప్రతిష్ట అనవచ్చు. బ్రహ్మ చారులకూ, సన్యాసులకూ రుద్రాక్ష మరో విధంగా శక్తివంతం చేయబడుతుంది, ఈ విధంగా శక్తివంత చేయబడిన రుద్రాక్షలను గృహస్థులు వేసుకో కూడదు.
రుద్రాక్షకు ఒకటి నుంచి ఇరవైఒకటి దాకా ముఖాలు ఉండవచ్చు. అవి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. అందుకే రుద్రాక్షను దుకాణంలో కొని వేసుకో కూడదు, కాని పంచ ముఖి రుద్రాక్ష ఆడ, మగ, పిల్లలు అందరికీ మంచిదే. అది సౌఖ్యానికి, ఆరోగ్యానికి, స్వతంత్రతకూ సర్వత్రా దోహదకారి. అది రక్త పోటు తగ్గిస్తుంది; మీ నరాలకు కొంత నెమ్మదిని కలిగించి మీనాడీ వ్యవస్థకు కొంత స్వాంతన, చురుకు దనమూ కలిగిస్తుంది.
తమ జీవితంలో అది ఒక పవిత్ర కార్యంగా భావించేవారే రుద్రాక్షలతో వ్యవహరిస్తారు. పారంపర్యంగా, తరతరాలుగా వారు రుద్రాక్షతోనే తమ జీవనాన్ని కూడా గడుపుకుంటారు; అది ఒక పవిత్ర కార్యంగా ప్రజలకు నివేదిస్తారు. కాని గిరాకీ పెరిగినకొద్దీ, వ్యాపారం బయట పడుతోంది. ఇపుడు భారత దేశంలో బద్రాక్ష అనే విషపు విత్తనం ఒకట ఉన్నది. అవి బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రల్లో బాగా పెరుగుతాయి. చూట్టానికి అవి అచ్చం రుద్రాక్షల లాగానే ఉంటాయి, మీరు తేడా గుర్తించ లేరు. మీరు చేతిలోకి తీసుకుంటే, మీరు సున్నితంగా గ్రహించగలిగిన వారైతేనే (నాణ్యత తెలిస్తేనే) మీకు తేడా తెలుస్తుంది. అది విషతుల్యమైన విత్తనము, దానిని వంటి మీద ధరించరాదు, కాని అది రుద్రాక్షగా అనేక చోట్ల అమ్మబడుతోంది. అందుకే రుద్రాక్ష నమ్మకమైన వారినుంచే గ్రహించాలి.
మీరు రుద్రాక్ష ధరిస్తే అది మీ సౌరభాన్ని నిర్మల పరుస్తుంది. సౌరభం అంటే మీ చుట్టూ ఉండే శక్తి పరమైన కాంతి, అది తెల్లని తెలుపు నుంచి పూర్తి నలుపు దాకా మధ్యలో లక్షల వర్ణాలతో ఉండవచ్చు. రుద్రాక్ష ఈ సౌరభాన్ని నిర్మలం చేస్తుంది. మీరు ఈ రోజు రుద్రాక్ష వేసుకుంటే రేపు మీ సౌరభం శ్వేతమౌతుందని కాదు.
మీరు మీ జీవితాన్ని పవిత్రం చేసుకుందామనుకుంటే, రుద్రాక్ష మంచి ఉపకరణము, ఉపయోగకరరం. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తుంటే, తనను మెరగు పరచు కోవడానికి దొరికిన అన్ని అవకాశాలనూ ఉపయోగించు కోవాలనుకుంటాడు, ఆ విధంగా రుద్రాక్ష ఖచ్చితంగా ఒక మంచి ఉపయోగ కారి.
ప్రేమాశీస్సులతో,
సద్గురు