సద్గురు: మనం అనుభవించే ప్రతి మనోభావం వెనుక ఒక రసాయనికత ఉంటుంది. మనం ఆనందంగా లేక విచారంగా, ఉద్రిక్తంగా లేక ప్రశాంతంగా మారినప్పుడు మనలోని రసాయనికత కూడా అదే విధంగా మారుతూ ఉంటుంది. ఇది రెండు విధాలా పనిచేస్తుంది - మనోభావం రసాయనికతను మార్చగలదు ...అదే విధంగా రసాయనికతను మారిస్తే మనోభావం కూడా మారుతుంది. మనం అనుభవించే వివిధ స్థితుల వల్ల మన రసాయనికతలో సహజంగా కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. అలాగే మన రసాయనికతలో మార్పుల వల్ల మనం వివిధ స్థాయిల అనుభవాలను పొందుతాము. ఉదాహరణకు, మీరు ఉద్రేక పడితే, మీ శరీరంలో రక్తం వేగంగా కదులుతుంది. మీ గుండె వేగంగా రక్త ప్రసరణ చేస్తుంది. మీ గుండె వేగంగా రక్త ప్రసరణ చేస్తే కూడా, కారణం లేకుండా మీరు ఉద్రేకంగా ఉంటారు. రెండూ వాస్తవమే.

దీనినే ప్రాతిపదికగా తీసుకుని, మతిభ్రమను కలిగించే మందులు ఉత్పత్తి చేయబడ్డాయి. మానసిక చికిత్స కూడా ఈ విధంగానే పనిచేస్తుంది. ఎవరైనా చాలా ఆందోళనలో ఉంటే వారికి ఒక మందు ఇస్తారు - ఒక మత్తు మందు లాంటిది - వెంటనే ప్రశాంతంగా మారిపోతారు. రసాయనిక పరంగా, ఇవి ఎలాగో ఆందోళనను తగ్గిస్తాయి. ఏదైనా మందు వాడడం అంటే రసాయనిక స్థాయిలో మార్పులు చేయడమే. మీ అనుభూతి ఎలాంటిదైనా దానికి సంబంధించిన రసాయనికత ఉంటుంది. అలాగే ఏ రసాయనికత అయినా దానికి తగిన అనుభూతి ఉంటుంది.

మనం రసాయనికంగా ప్రేమను పుట్టించగలమా?

మనం రసాయనికంగా ప్రేమను పుట్టించగలమా? నేను నా రసాయనికతని మార్చుకుంటే, ప్రేమగా మారగలనా? అవును మారగలరు, యోగ సాధనలో మనం చేసేది అదే. భక్తి యోగా, తక్కిన ఇతర రకాల యోగాకు- ముఖ్యంగా హఠయోగా మరియు క్రియా యోగాలకు గల వ్యత్యాసం ఇదే: క్రియాయోగా, హఠ యోగాలతో మీరు మీ అంతర్గత శక్తిని పరివర్తనం చేయడం ద్వారా మీ రసాయనికతని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా మీ అంతర్గత స్థితి లేదా మీ అనుభూతి మారుతుంది. భక్తి యోగంతో, మీరు ప్రేమించడం ద్వారా అంతర్గతాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా ఏదో ఒక రోజు మీ రసాయనికత ప్రేమగా మారుతుంది.

భక్తి యోగంతో, మీరు ప్రేమించడం ద్వారా అంతర్గతాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా ఏదో ఒక రోజు మీ రసాయనికత ప్రేమగా మారుతుంది.

సరైన రసాయనికత లేకుండా, ఏదో కావాలని మీరు ఎంత ప్రయత్నించినా మీరెక్కడకి కదలలేరు. “నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను” అని మీరు ఎంత అనుకున్నా, మీ రసాయనికత ఆందోళనగా ఉంటే, మీరు ఎంత ప్రయత్నించినా, మీరు శాంతితో ఉండలేరు. అది అసాధ్యం. ప్రాణాయామం, ఆసనాలు ఇంకా ధ్యానంతో మనం రసాయనికతని మారుస్తున్నాము. ధ్యానంతో మనం శాంతియుతంగా మారడానికి ప్రయత్నించడం లేదని అర్థం చేసుకోవాలి. ధ్యానంతో మన రసాయనికతని సహజంగా శాంతంగా ఉండే రసాయనికతకు మారుస్తున్నాము, అందువల్ల శాంతి లభిస్తుంది.

దీని అర్థం ఏమిటంటే, సరైన సాధనతో మీరు మీ రసాయనికతని శాంతిగా మార్చుకుంటే – ఆనందాన్ని కలిగించే రసాయనికతగా మలచుకుంటే - అప్పుడు మీ సహజ స్థితి అలాంటిదే అవుతుంది. దీన్ని చేయటానికి మరొక మార్గం ఏమిటంటే, ఒక ప్రేమ స్వరూపాన్ని సృష్టించడం ద్వారా, అంటే దేవుడు, గురువు లేదా మీకు అద్భుతమైన అనుభూతిని పంచే ఏదైనా ఇతర వస్తువును సృష్టించి, దాని పట్ల మీరు విపరీతమైన ప్రేమను సృష్టిస్తే, మీ రసాయనికత కూడా మారుతుంది. రెండు మార్గాలు యదార్థమే.

ప్రేమ: కేవలం పునరుత్పత్తికి ఓ సాధనం కాదు

జీవశాస్త్రజ్ఞులు ప్రేమ, రసాయనికతల గురించి మాట్లాడినప్పుడు, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీరు ప్రకృతిలోని కార్యకలాపాలన్నింటినీ పరిశీలిస్తే, ప్రతిదీ పునరుత్పత్తినే లక్ష్యంగా చేసుకుని ఉంటుంది – వేరే ఇంకేదీ లేదు. పువ్వులు మీపై ప్రేమతో వికసించవు. మీరు అలా అనుకోవచ్చు, కవులు అలా అనవచ్చు, కానీ పరాగసంపర్కం జరిగే విధంగా అవి వికసించాయి, అప్పుడే ఒక విత్తనం వస్తుంది, మరో మొక్క పెరుగుతుంది. అదొక్కటే వాటి ఆసక్తి. మీ బయాలజీ మరీ చురుకైతే, మీకింకా ప్రేమ స్ఫురించలేదని.

ఒక జీవశాస్త్రజ్ఞుడు ప్రేమ గురించి మాట్లాడినప్పుడు, అతను మాట్లాడేది పునరుత్పత్తి గురించే. నిరంతరం కొనసాగడానికి ప్రకృతి వేసే పథకం అది. ప్రకృతి తనను తాను శాశ్వతం చేసుకోవాలనుకుంటుంది. దానినే మాయ అంటారు. శాశ్వతంగా కొనసాగటానికి, అది అంతర్నిర్మితమైన వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. దీనికి సృష్టికర్త జోక్యం కూడా అవసరం లేదు; అదే సృష్టి అందం. సృష్టికర్త కూడా అవసరం లేదు; ప్రతిదీ స్వయం చలితమే. అది మాయ స్వభావం.

“ప్రేమ” అనే పదాన్ని ఉపయోగించినప్పుడు, మనం సూచిస్తున్నది ఏమిటంటే, మీరు మీలో ప్రేమను నిజంగా అనుభవించిన తర్వాత, మీ శరీరం ప్రాముఖ్యత చాలా తక్కువగా ఉంటుంది. మీ బయాలజీ మరీ చురుకైతే, మీకింకా ప్రేమ స్ఫురించలేదని. భక్తితో ఉన్నప్పుడు వ్యక్తికి, అతని శరీరం అంత ముఖ్యం కాదు. అతను దానిని విసిరి వేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఇటువంటి ప్రేమ మిమ్మల్ని మాయ ప్రక్రియలో బంధించేది కాదు, దాని నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు