ప్రశ్న: సద్గురు, ధ్యానలింగం పైకప్పు గుమ్మటం ఆకారంలో ఉండడానికి కారణమేంటి? దీని వెనుక ఏమైనా శాస్త్ర సహేతుకత ఉందా?

సద్గురు: కాంతి కానీ, ఉష్ణం కానీ, ఆ విషయానికొస్తే విరజిమ్మే గుణం ఉన్నది ఏదైనాసరే, అది ఎల్లపుడూ వలయాకారం లోనే విరజిమ్ముతుంది. అదే చతురస్త్రాకారంలో ఈ భవనం నిర్మాణం గనుక మనం చేస్తే, మీకు గ్రహణశీలత బాగా ఉంటే, అటువంటి ప్రదేశంలో మీరు అయోమయానికి గురి అవుతారు. అందువల్లనే, ధ్యానలింగం కోసం గుండ్రని ఆకారంలోనే నిర్మాణం చేయాల్సివచ్చింది.

నేను ధ్యానలింగం ఆవరణ నిర్మాణంకోసం రూపొందించిన నమూనా విషయంలో రాజీపడిన విధానం, ఇప్పటికీ నా జీవితంలో నన్ను నగుబాటుకు గురిచేస్తుంది. అక్కడకి వచ్చిన ప్రతిసారీ, అది అసలు ఉండవలసింది ఎలా?.. కానీ మా ఆర్ధికపరమైన ఇంకా కాల పరిమితుల కారణంగా మేము చేయగలిగింది ఏమిటి? అని నాకు అనిపిస్తుంది. మొదట, దాన్ని నేను భూమిలో 60 అడుగుల లోతున నిర్మించి, చుట్టూ నీటికుండం ఉండేలా ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. అసలు ఉత్తమమైన పని అదే. కానీ, అది నిర్మాణం చేస్తున్నప్పుడు, నా జీవితం ఒక నిర్దిష్ట దశలో ఉండడం వల్ల, దాన్ని ఒక నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేయాల్సివచ్చింది. ఆర్ధికపరమైన ఇంకా కాల పరిమితుల కారణంగా, మేము దాన్ని వేగవంతం చేశాము. దానికి మా దగ్గర మరో ప్లాన్-B ఉంది. అది కూడా చాలా ఖర్చులో కూడుకున్నదే. అందువల్ల నేను ప్లాన్-c అమలు చేశాను. ప్రస్తుతం, ప్లాన్-C ని మరింత సుందరంగా తీర్చిదిద్ది, దాన్ని మరింత యోగ్యంగా చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే, ధ్యానలింగం గొప్పతనానికి తగ్గ అలంకరణ అక్కడ లేదు. మాకు చేతనైంది చేసే ప్రయత్నిస్తున్నాము.

నిర్మాణ శైలి పరంగా చూస్తే, ధ్యానలింగ గోపురం ప్రత్యేకమైనది. సాధారణంగా, గోపురాలు, తాజ్మహల్ లేదా గోల్ గుమ్బాజ్ మాదిరిగా అర్ధవలయాకారంలో ఉంటాయి. కానీ మేము దీర్ఘవలయాకారంలో గోపురం నిర్మించాలని నిర్ణయించాం. స్టీలు, కాంక్రీట్ లేదా సిమెంట్ వాడకుండా, దీర్ఘవలయం లోని భాగాన్ని అది ఇప్పుడు ఉన్నట్టుగా, నిలబెట్టడం అనేదే అసలు సవాలు. ఆందుకే గోపురానికి ప్రత్యేకత ఉంది. మీరు అలా చూస్తే, అది అర్ధగోళంలా అనిపిస్తుంది. కానీ నిజానికి అది, దీర్ఘవలయంలో ఒక భాగం. అది మేము అలానే ఉండాలనుకోవడానికి కారణం, లింగం కూడా దీర్ఘవృత్తాభాసం కాబట్టి, దీర్ఘవలాయాకార గోపురం ధ్యానలింగ శక్తికి చక్కని సహాయకారిగా ఉంటుంది.

నిర్మాణానికి మేము కేవలం ఇటుకలనే వాడాం, సిమెంట్, స్టీల్, కాంక్రీటు వాడలేదు. కారణం ఏమిటంటే, చాలా మంచి రకం కాంక్రీటు వాడినా దాని జీవిత ప్రమాణం నూట ఇరవై ఐదు సంవత్సరాలే. అక్కడ నివసించబోయే ముందుతరం వారిని మేము శ్రమపెట్ట దలచుకోలేదు. ఓ వంద సంవత్పరాల తరువాత ఆ కాంక్రీటు స్తంభాలు ఎవరిమీదో పడితే, ఏమౌతుందో ఆలోచించండి. వారి గతి ఏమిటి? దీనిని చాలా కాలం ప్రజలు అనుభవించడానికి వీలుగా దీనిని కనీసం మూడు నుంచి ఐదువేల సంవత్సరాలపాటు ఉండగలిగే విధంగా నిర్మిస్తున్నాం. మీరు మెసపుటేనియా లేక ఈజిప్టు పురాతన తవ్వకాలను చూస్తే, చెడిపోకుండా బాగా ఉన్న అవశేషాలు మట్టి పాత్రలు, ఎందువల్లనంటే మట్టిని ఒకసారి కాలిస్తే వాటి జీవనకాలం ఎంతంటే, అవి దాదాపు ఎప్పటికీ ఉండిపోయేవి. ఇటుకలు కూడా మట్టి ముద్దలే బాగా కాలిస్తే, అవి కూడా ఎప్పటికీ ఉండిపోయేవే.

గోపురానికి సంబంధించి మరొక అంశం ఎంటంటే, అది ఇతర కట్టడాల మాదిరి, బిగబట్టుకుని అది అలా నిలబడడం లేదు. చాలావరకు కట్టడాలలో, పైకప్పుకి, గురుత్వాకర్షణకి మధ్య బలమైన సంఘర్షణ ఉంటుంది. గురుత్వాకర్షణ కట్టడాన్ని కిందకి ఆకర్షిస్తుంటే, పైకప్పు మాత్రం పైననే నిలబెట్టేలా చూస్తుంది. ఏదోకరోజు భూమ్యాకర్షణ శక్తి గెలుస్తుంది. కానీ ఈ గోపురం కేవలం ఇటుకలు, మట్టి ఇంకా కొద్ది మోతాదులో సున్నం, కొన్ని మూలికల సమ్మేళనాల సహాయంతో నిలిచి ఉంది. ఇందులోని మర్మం ఏమిటంటే, అన్ని ఇటుకలు ఒకేసారి కిందకు పడాలని చూస్తాయి. కాని అవి కింద పడవు. అది ఎలా అంటే, ఓ పది మంది, ఒకే ద్వారం గుండా ఒకేసారి వెళ్ళాలనుకున్నప్పుడు, వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళలో ఒకరు మర్యాదతో, వెనక్కు ఒక అడుగు వస్తే తప్ప. లేకపోతే అందరూ అక్కడే ఇరుక్కుపోతారు. కానీ, ఇటుకలకు ఆ మర్యాద తెలియదు. నన్ను నమ్మండి.

ఇటుక పూర్తిగా కాలిందని నిర్ధారించడానికి గాను, ప్రతీ ఇటుకను నీటిలో 24 గంటలపాటు నానబెట్టాము. సరిగా కాలని ఇటుకలు ఏమైనా ఉంటే, అవి నీటిలో కరిగిపోతాయి. 24 గంటలు నీటిలో ఉంచినా కరగకుండా ఉన్న ఇటుకలు పూర్తిగా కాలినవి. ఇక అవి ఎప్పటికీ మనగలుగుతాయి. మేము ప్రతీ ఇటుకనూ మిల్లీమీటర్లతో సహా కొలవడం జరిగింది. ఎందుకంటే, అవి వేరువేరు సైజుల్లో ఉంటే, అవి కిందకి పడిపోతాయి. గోపురం, గుండ్రని వలయాలలో ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ నిర్మించబడింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకసారి ఒక వలయంలో ఇటుకలను పేర్చడం మొదలుపెడితే, మీరు దాన్ని అదే రోజు పూర్తిచేసి తీరాలి. మీరు అలా చేయకపోతే, అది ఆ రాత్రే పడిపోతుంది. కాని వలయం పూర్తయితే, అది కింద పడేందుకు అవకాశం లేదు.

ఈశా యోగా కేంద్రం భూకంపాలకు అవకాశం ఉన్న ప్రదేశం కనుక, మేము గోపురాన్ని ఇసుక పునాదుల మీద నిర్మించాము. మేము 20 అడుగుల లోతు తవ్వి, దాన్నిఇసుకతో నింపాము. కాబట్టి, అది ఒక కుషన్ లాగా పనిచేసి, ఎలాంటి ప్రకంపనలనైనా తట్టుకోగలుగుతుంది.

మరికొంత సాహసం చేసి, వేడిగాలి బయటకు వెళ్లేందుకు వీలుగా, మేము గోపురానికి పైన తొమ్మిది అడుగుల రంధ్రాన్ని ఉంచాం. సాధారణంగా, ప్రజలలో ఉన్న నమ్మకం ఏంటంటే, గోపురంలో రంధ్రం ఉంచడం నిర్మాణపరంగా అసాధ్యం అని. వాళ్ళు “గోపురాన్ని పూర్తిగా మూసి ఉంచాలి, లేకపోతే అది పడిపోతుంది” అంటారు. నేను “మరేం ఫరవాలేదు. అది అలాగే నిలబడుతుంది” అన్నాను. గోపురం, భూమ్యాకర్షణ శక్తులతో చక్కటి సామరస్యంతో ఉంది - కట్టడంలో ఘర్షణ లేదు కనుక, అది ధ్యానం చేస్తుంది అనవచ్చు. అందుకే “భవంతులు ధ్యానం చేస్తున్నప్పుడు, మీ పని సులువౌతుంది!” అంటాను నేను.

గోపురం కోసం వాలంటీర్లు లక్షా ఎనభైవేల ఇటుకలను కొలవడం, పేర్చడం చేశారు. నేను వారితో చెప్పింది ఏమిటంటే, “చూడండి, నేను మీ చేతుల్లో అప్పగిస్తున్న బాధ్యత ఎలాంటిదంటే, మీలో ఒక్కరైనా, ఇటుక ఉండాల్సిన దానికంటే, 2 మిల్లీమీటర్ల తేడాగా కొలిచినా, మొత్తం అంతా కుప్పకూలిపోవచ్చు” అన్నాను. స్త్రీలు, పురుషులు, పిల్లలు కూర్చుని రేయింబవళ్ళూ కొలిచారు. ఈ నిర్మాణం ప్రజల యొక్క ప్రేమతో జరగాలి కానీ ఇంక దేనితోనూ కాకూడదు అనేదే నా కోరిక.