ప్రశ్నించే హక్కు ఇంకా ప్రతిఘటించే హక్కు: ఎంత ఉంటే ఎక్కువ? ఎంత ఉంటే తక్కువ?
సద్గురు, ఒక ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకీ బాధ్యతకీ మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ, మన స్వేచ్ఛ యొక్క ప్రభావం మన చుట్టూ ఉన్న వాటన్నిటి మీదా ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

The Gift of Modern Democracy

Sadhguru: సద్గురు: నేను ప్రస్తుతం ఉన్న రాజకీయ అధికారం పై విమర్శ లేని నమ్మకాన్ని కలిగి ఉన్నానా? అని మొన్న నన్ను ఒకరు అడిగారు. ఈ ప్రశ్న నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఒక గురువుగా నేను అందరికీ శోధించండి, కానీ నమ్మకండి అని చెబుతానని మాత్రమే కాదు, నా గురించి తెలిసినవారు ఎవరికైనా నేను నిరంతరం స్వార్థ ప్రయోజనాలను ప్రశ్నించే సామర్ధ్యం గలవాదడినని తెలిసీ ఈ ప్రశ్న అడిగారని.
ఏదేమైనా, ప్రశ్నించటానికి ఎన్నో దారులు ఉన్నాయి. ప్రశ్నించటం అనేది నిర్మాణాత్మకంగా జరగచ్చు లేదా విధ్వంసకరంగా జరగచ్చు. ప్రజాస్వామ్యం, ప్రస్తుతం ఉన్న హోదాలనీ, పరపతులని విచ్చిన్నం చేయడానికి, సవాలు విసిరే అధికార సమీకరణాలనీ, గుత్తాధిపత్యాలనీ దునుమాడే శక్తివంతమైన మార్గం.
ఆధునిక ప్రజాస్వామ్యం మనకిచ్చిన బహుమతే, ఈ ఓట్ల పెట్టె ద్వారా అధికార మార్పు. ఏ మాత్రం రక్తపాతం లేకుండా, అహింసా మార్గంలో అధికారం చేతులు మారగలగటం అనేది మనం సాధించిన ఘనత.
వాక్ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవటం
ఒకసారి మనం బ్యాలెట్ బాక్స్ ని గౌరవించాలని నిర్ణయించుకున్నామంటే దాని అర్ధం మన వ్యక్తిగత ఇష్టాలను పక్కన పెట్టి సాముహిక ఇష్టాన్ని ఒప్పుకున్నట్టే. దాని అర్ధం మనకి ప్రతిఘటించే స్వేచ్ఛ పోయిందనా? కానే కాదు. మన వ్యక్తిగత వాక్కు స్వాతంత్ర్యాన్నీ, భావ ప్రకటన స్వేచ్ఛనీ, ఒప్పుకోవటాన్నీ విభేదించటాన్నీ, మాటనీ, స్పర్ధనీ మన దగ్గరే ఉంచుకోవటం కూడా మనకి ఎంతో ముఖ్యం. వ్యక్తిగత స్వాతంత్ర్యాలను గర్వంగా పొందుపరిచి పటిష్టంగా కాపాడినప్పుడే ఒక ప్రజాస్వామ్యం ముందుకి సాగుతుంది.
వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవించటంలో అరివీరభయంకరులలాగా తయారయ్యేముందు, మనం వ్యక్తులుగా ఎదగాలి. ఒక వ్యక్తికి లేదా సమూహానికి ఓటు వేసేటప్పుడు కుల, మత, ప్రాంత,లింగ, భావజాల ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొమ్మని ఎగదోసే ఒక వ్యవస్థ ఏ నాటికీ నిజమైన ప్రజాస్వామ్యం కాదు - అది ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న భూస్వామ్య విధానం.
ఆజ్ఞలు పాటించే సంస్కృతి కాదు

ఒక వృద్ధి చెందే ప్రజాస్వామ్యం, సిసలైన ఆధ్యాత్మిక ప్రక్రియలాగ వ్యక్తిగత స్వతంత్రంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు జనాకర్షణ కలిగిన రాజకీయ, మత సంబంధ ప్రచారానికి అతీతంగా తయారైనప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం కానీ ఆధ్యాత్మికత కానీ మనుగడ సాగిస్తుంది. ఈ రెండు విషయాలలోనూ ఒక వ్యక్తి స్నేహితుల వొత్తిడి నించీ, అతి స్నేహపు మాయనించీ, కుత్సితమైన గుంపుల నించీ, అధికార పక్షపాతం నించీ పైకి ఎదగవలసిన అవసరం ఉంది.
నిజమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఎప్పటికీ నియంతృత్వంతో ఉండదు. అది అంతులేని ప్రవాహం. అది విశాలం-చర్చలకు అనుకూలం. ఈ ఉపఖండంలో ఎప్పటినించో ఉన్న ఆధ్యాత్మిక దృష్టి ఇదే. ఇక్కడ మనం “పవిత్రం” అని అంటున్న దాని గురించి చర్చ సాధ్యం, దేన్నీ తప్పక పాటించక్కరలేదు. ఈ భూమి మీద శివుడి నించీ కృష్ణుడి వరకూ ఉద్భవించిన దైవ స్వరూపాలు అన్నిటినీ కూడా మనం ఊరికే అంగీకరించలేదు. వారిని ప్రశ్నించాము, వారితో చర్చించాం. అలాగే భారత రాజ్యాంగం కూడా ఒక ఆజ్ఞల పట్టిక కాదు. అలా అయ్యి ఉంటే దాన్ని ఎప్పుడో మత నియంతృత్వం అనేవాళ్ళం మనం.
నిర్మాణాత్మక స్వేఛ్చా లేక విధ్వంసకర స్వేఛ్చా?
మీరు ఒక వ్యక్తిగా పరిణితి చెందినప్పుడు, మీ స్వేచ్ఛ యొక్క ప్రభావం మీ చుట్టుపక్కలవారిపై ఉంటుందని గ్రహించాలి. మనం ఒక ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం అంటే దాని అర్ధం, అందరికీ వారి వారి వ్యక్తిగత స్వేచ్ఛ కలిగి ఉండే హక్కు ఉందని మనం ఒప్పుకున్నట్టే. ఒక విధానాన్నో లేక ఒక చిత్రాన్నో మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు దానిలో భాగంగా మీరు ఒక ఊరినో ఒక రాష్ట్రాన్నో అతలాకుతలం చేస్తే అది ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే. ఇది వ్యక్తిగత ఇష్టాఇష్టాలు స్వేచ్ఛ అనే ముసుగు వేసుకున్నట్టే. బాధ్యతారాహిత్యానికి వ్యక్తిగత చొరవ అనే ముద్ర వేసినట్టే.
ఒక దేశంగా మనకిగా మనం వేసుకోవలసిన ప్రశ్న ఏంటంటే: మనం మన వ్యక్తిగత స్వేచ్ఛని నిర్మాణాత్మకంగా వినియోగిస్తున్నామా? లేక విధ్వంసకరంగానా? అని. మన స్వేచ్ఛ నిజంగా మనకి శక్తిని ఇస్తోందా లేక ఇతరుల శ్రేయస్సుని కాలరాస్తోందా? అని. వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మాట్లాడేముందు మనని మనం నిజాయతీగా ప్రశ్నించుకోవాలి: మనం నిజంగా బాధ్యతగల వ్యక్తులుగా ఎదిగామా లేదా? అని.