ఆదిశంకరాచార్యుల ప్రసిద్ధ రచన ‘భజగోవిందం’ లో ‘నిశ్చలతత్త్వే జీవన్ముక్తి’ అన్న దాని ప్రాధాన్యాతని సద్గురు వివరిస్తున్నారు.

Sadhguruఆధ్యాత్మిక ప్రక్రియ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, మీలోని ఉన్న పాశవికతను మూలాల నుంచి భస్మం చేసి మీలో దివ్యత్వం అనేపుష్పాన్ని వికసింపజేయడానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తుంది. ఆ బీజం మొలకెత్తి ఫలితాన్నివ్వడానికి కొంత సమయం పడుతుంది. ఇది  తక్షణమే కనిపించదు. ఒక కలుపు మొక్క కొద్దిరోజుల్లో పుష్పిస్తుంది, కాని ఒక కొబ్బరి విత్తనం మొలిచి పెద్దదై పుష్పించడానికి ఆరేళ్లు పడుతుంది. ఓ నాలుగేళ్లు ఎదురుచూసి అదింకా కాయలు కాయడం లేదని పీకిపారవేసేవాడు సహనంలేని మూర్ఖుడు మాత్రమే...! మీరేదైనా విలువైనది ఉత్పత్తి చేయాలనుకుంటే అది కొంత సమయం తీసికుంటుంది. కాని విత్తనం సరైనదయితే మనం దాన్ని సరిగా విత్తి, మొక్కను జాగ్రత్తగా పోషిస్తే అది తప్పకుండా పుష్పించి, ఫలిస్తుంది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.

శరీరం, బుద్ధి, భావోద్వేగం, ప్రాణ శక్తి అన్నీ కలిపి ‘నేను’ అని పేర్కొనే వస్తువు భౌతికమైంది. ఈ సమీకృత యంత్రాంగం, తక్కిన సృష్టి అంతా ఒకే పదార్థం. దాని సమీకరణం, దాని నిర్మాణం కారణంగా అది ప్రస్తుతం సంపూర్ణంగా వ్యక్తిగతమైనదిగా కనిపిస్తుంది – అవి ఎంత సమగ్రంగా వ్యక్తిగతమంటే మీరు ఈ శరీరం, ఈ సృష్టి రెండూ ఒకటేనని నమ్మలేనంత. ఈ సృష్టి సర్వస్వం  - నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో నిర్మితమైంది. ఈ పంచభూతాల అద్భుత కలయికే మానవ రూపం కూడా. ఈ పంచభూతాల క్రీడ ఇది. ఈ క్రీడ ఎంత చక్కగా నిర్మింపబడిందంటే, ఇంక వేరే దేనినుండీ అది మరేమీ స్వీకరించవలసిన ఆవశ్యకత లేదు. అది ఎంత సంపూర్ణమంటే మనం సృష్టికర్త అస్థిత్వాన్నే ప్రశ్నించడం ప్రారంభించాం. అంటే అది నిజంగానే సమగ్రమన్నమాట. పొద్దునా, సాయంత్రమూ ప్రార్థన చేయకపోతే అది పనిచేయకపోయినట్లయితే అది సమగ్ర సృజన కాదు. ఇదెంత సమగ్రమంటే మీరు సృష్టికర్తను మరచిపోవచ్చు. ఇదెంత అద్భుతమైన సృష్టియో చెప్పడానికి ఇదొక మంచి ప్రశంసగా పనికివస్తుంది.

మీరొక వ్యక్తితో ‘మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’ అంటారు, అయితే మరుక్షణంలోనే “ఈ వ్యక్తి సరైన వ్యక్తియేనా?” అని ఆలోచిస్తారు.

మీరు గాలిలోకి బుడగలు ఊదితే బుడగలోనూ, వెలుపలా కూడా గాలే ఉంటుంది. అయినా బుడగకి ప్రత్యేకమైన అస్తిత్వం ఉంటుంది కదా. ఈ వ్యక్తిగత లక్షణం అనేది కూడా ఇంతే. లోపలా బయటా ఉండేది ఒకటే. అయినా వాటి మధ్య ఒక నిపుణమైన నిరోధం ఉంటుంది. ఈ పరిధులు ఎక్కడుందో మీరు చూడలేరు. మీరు ఏవైపు నుండి చూసినా తెర ఉన్నట్లు కనిపించదు. కాని వ్యక్తికీ తక్కిన సృష్టికీ మధ్య ఒక నిర్దిష్టమైన తెర ఉంటుంది. మీరెంత కష్టపడి ప్రయత్నించినా అదక్కడ ఉండనే ఉంటుంది – మీరొక వ్యక్తితో ‘మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’ అంటారు, అయితే మరుక్షణంలోనే “ఈ వ్యక్తి సరైన వ్యక్తియేనా?” అని ఆలోచిస్తారు. ఆ వ్యక్తి కూడా అదే పదార్థం. నీళ్లలో నీళ్లు, గాలిలో గాలి, మట్టిలో మట్టి, కాని భేదం ఎంత అద్భుతంగా ఏర్పరచడం జరిగిందంటే, ఆ హద్దులు ఎలా అమర్చబడ్డాయో మీరు గ్రహించలేరు.

మానవ యంత్రాంగంలోని సూక్ష్మాలను తెలుసుకోవాలనుకుంటే దానికొక మార్గం ఉంది. మనం కేవలం ఈ హద్దులను అధిగమించాలనుకుంటే మరొకమార్గం ఉంది. కాని ఎవరైతే ఈ పరిధుల్ని అధిగమించరో వారు ఈ సూక్ష్మాలను తెలుసుకోలేరు. ముందు ఈ అడ్డు తెరను భగ్నం చేయాలి, తరువాతే తెలుసుకోగలగడం. తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాని ఈ సరిహద్దును దాటే స్వేచ్ఛను, ఆనందాన్ని మీరు అనుభవించాలంటే అది తెలుసుకోవడం కంటే తేలిక. తెలిసికోవడానికి చాలా సమయం పడుతుంది. అడ్డుతెరను భగ్నం చేయడానికి ఏదైనా ఒకదానివైపు తీవ్రమైన శ్రద్ధ ఉంటే చాలు. ఇప్పుడు ‘మల్టీ టాస్కింగ్’ అనుకునే జనం ఉన్నారే, వాళ్లకిది సాధ్యంకాదు. నేటికాలంలో ఈ పదం సాధారణమైపోయింది.

మల్టీ టాస్కింగ్ చేసే మనుషులు ఒకేసారి ఐదు భిన్న దిశలలో ప్రయాణిస్తారు. అయిదు భిన్న దిశలలో ప్రయాణించే వ్యక్తి ఎక్కడికీ చేరుకోలేడు. ఒక సామాజిక సందర్భంలో అతనెన్నో పనులు చేయవచ్చు, జనం అతన్ని చూసి చప్పట్లు కొట్టవచ్చు, కానీ అతను మాత్రం తన లోపల అంగుళం కూడా ఎదగలేడు. కార్పొరేట్లు మాట్లాడే మల్టిటాస్కింగు గురించి కాదు నేను మాట్లాడుతున్నది. నిమిష నిమిషానికీ తమ లక్ష్యాన్ని మార్చుకునే వాళ్ల గురించి. వాళ్లు నిరంతరం చుట్టూ గడ్డి మేస్తుంటారు. గడ్డి మేసే జంతువులు ఎక్కడికీ పోవు. కడుపు నిండుతుంది, కాని మీరెక్కడికీ పోరు. గడ్డిమేయడం లక్షణం అది.

మీరు ప్రతిసారీ ఒక ఎంపిక చేసి, దాన్ని వదిలి మరో కొత్త ఎంపిక చేసినప్పుడల్లా మీ గమ్యం దెబ్బతింటుంది.

ఎవరైనా ఎక్కడికయినా చేరుకోవాలనుకుంటే వారు ఆ నిర్ణయనికే కట్టుబడాలి. సత్యానికి గాని, దివ్యత్వానికి కాని మీ సహాయం ఏమి అవసరం లేదు. మీకు మీరేదాన్ని నిరాకరించుకుంటారు. జనం తమను ఘోరశిక్షకు, బాధకు, కష్టాలకు తమంతట తామే గురిచేసుకుంటారు. దానికి వాళ్లు గడిపే జేవితంలో ఎదో చెడు ఉందని కాదు. వాళ్ల జీవితం ఆధ్యాత్మిక సంక్షేమానికి కట్టుబడి ఉండవచ్చు. కాని వాళ్లు ప్రతిరోజూ కొత్త ఎంపికలు చేస్తూ ఉంటారు. నిరంతరం ఒకసారి అటూ, ఒకసారి ఇటూ అడుగులేస్తూ తమను తాము అస్థిరం చేసుకుంటారు. జీవితం రూపుదిద్దు కోవడాన్ని మనం అనుమతించకపోయినట్లయితే, ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటాం – ఆకారం తీసికుంటున్న దాన్ని మాటిమాటికీ కదిలిస్తే ఏం జరుగుతుంది? మీరు ప్రతిసారీ ఒక ఎంపిక చేసి, దాన్ని వదిలి మరో కొత్త ఎంపిక చేసినప్పుడల్లా మీ గమ్యం దెబ్బతింటుంది. మీ అనుభవమొకటి బాగుండనందువల్ల మీరొక ఎంపికను వదులుకోవచ్చు, కాని మీరు దాన్ని కొన్ని గంటల పాటే సడలించుకున్నప్పటికీ మీరు మీ నిర్మాణాన్ని, గమ్యాన్ని భగ్నం చేసుకొన్నట్లే.

నిశ్చల బుద్ధితో చేసిన శాశ్వతమైన ఎంపికే, మీ భవిష్యత్తు మీరు ఎంపిక చేసుకున్న మార్గంలో పరిగెత్తేటట్లు చేస్తుంది. మీరేదైనా ఒకటి చేయదగింది అని నిర్ణయించుకున్నాక మళ్లీ వెనక్కు తిరిగి చూడవద్దు. అది విలువైందే అయితే ఆ అంశం మారకూడదు. తోవలో ఎన్నో వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, కాని ఎవరైనా వీటిని విజయవంతంగా అధిగమించాలంటే నిశ్చలమైన గమ్యం ఉండాలి.

తన ఉద్దేశంలో నిశ్చలంగా ఉన్న వ్యక్తికి, ముక్తినెవరూ ఆపలేరు.

“నిశ్చలతత్త్వే జీవన్ముక్తి” అని  ఆదిశంకరులు  మనకు చెప్పింది ఇదే. తన ఉద్దేశంలో నిశ్చలంగా ఉన్న వ్యక్తికి, ముక్తినెవరూ ఆపలేరు. నిశ్చలతత్త్వం లేకపోతే ముక్తి లేదు. ఈ నిశ్చలతత్వమే లేకపోతే  మీరు మీ పరిమితులను, మార్గమధ్యంలో వచ్చిన అవాంతరాలను అధిగమించలేరు – ప్రతి అవాంతరమూ మీరు దాట సాధ్యంకాని మహా పర్వతంలా గోచరిస్తుంది.

ఒకసారి గమ్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత అది తప్ప మరో గమ్యం లేదని నిశ్చయించుకున్న తర్వాత ఏదీ మీకు అసాధ్యమనిపించదు. సాధ్యం వైపే నిరంతర ప్రయాణం చేస్తారు. ఆధ్యాత్మిక సాధకుడు చేయవలసిన పని ఇదే. మీరు చేయవలసిన ప్రథమ, అతి ప్రధాన కర్తవ్యం అదే – కచ్చితమైన గమ్యాన్ని నిర్దేశించుకోండి, అది మారదని నిశ్చయించుకోండి. ఈ విషయంలో మీరు మీ నిశ్చయాన్ని స్థిరంగా ఉంచుకుంటే తక్కిన మీ జీవితం మీ వెనుకే వ్యవస్థితంగా ఉంటుంది. అది మీ ముందు ఒక అడ్డంకిగా ఉండదు. జీవితం మీ వెనుకే వ్యవస్థీకరిస్తూ మిమ్మల్ని ఎల్లప్పుడూ సమర్థిస్తుంది, మీకు తోడ్పడుతుంది. మీ సర్వాంగాలూ, మీ శక్తి, యావత్ర్పపంచం మీ వెనుక వ్యవస్థీకృతమై ఉంటుంది. కారణం, మీలో నిశ్చలతత్త్వం ఉంది కాబట్టి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు