సద్గురు: కావేరి నదికి సరిగా మధ్యలో అద్భుతమైన నటద్రీశ్వర ఆలయం ఉంది. తలకావేరిలో పుట్టి సముద్రంలో కలిసే కావేరినది ప్రవాహానికి సరిగా మధ్య ప్రదేశంలోని ఒకద్వీపంలో ఉంది. అందువల్ల దాన్ని కావేరి నాభిగా చెప్పవచ్చు.

ఈ ఆలయంలోని లింగాన్ని 6000 సంవత్సరాల క్రితం అగస్త్యముని ప్రతిష్టించారు అని చెపుతారు. అగస్త్యముని అసాధారణమైన జీవనాన్ని గడిపారు.అలాగే ఆయన జీవిత కాలం కూడా అసాధారణమైనది. ఆయన నాలుగు వేల సంవత్సరాలు జీవించారని పురాణాలు చెపుతున్నాయి. అది నాలుగు వందలా, నాలుగు వేలా అనేది అంత ముఖ్యం కాదు, ఎందుకంటే ఈ సున్నాల విషయంలో మన భారతీయులకు అంత పట్టింపు లేదు. ఎందుకంటే సున్నాను మనం కదా కనిపెట్టాము.

ఆయన సరిగా ఎన్ని సంవత్సరాలు జీవించారో మనకు తెలియకపోయినా ఆయన కాలినడకన తిరిగిన ప్రదేశాల విస్తీర్ణాన్ని చూస్తే నిజంగా ఆయన అసాధారణ సుదీర్ఘ జీవితాన్ని గడిపారని అర్థమౌతుంది. వింధ్యాచలానికి దక్షిణ భాగంలోని ఏ గ్రామానికి వెళ్ళినా మీకు అగస్త్యుడు ధ్యానం చేసిన చోటు, ఆయన నివసించిన గుహ, ఆయన నాటిన చెట్టు కనిపిస్తాయి. ఇలాటి లెక్కలేనన్ని కథలు వినిపించటానికి ప్రధాన కారణం ఏమంటే, అగస్త్యుల వారు ఈ ప్రాతంలో ఉన్న ప్రతి మానవ నివాసాన్ని తన బోధనలతోనో, మతంతోనో, తాత్త్వికతతోనో కాక ఒకానొక ఆధ్యాత్మిక ప్రక్రియతో స్పృశించారు. కాని అది జీవన విధానంగా మారింది. మీరు ఉదయమే నిద్రలేచి ఎలా పళ్ళుతోముకోవాలో మీ అమ్మ నేర్పినట్లుగా ఆధ్యాత్మిక విధానాన్ని నేర్పడం జరిగింది. ఆ అవశేషాలు ఇప్పటికి భారతదేశపు దక్షిణాదిన మిగిలే ఉన్నాయి.

ఇక్కడ ఆయన ప్రతిష్టించిన లింగం ఇసుకను మరేదో ఆనాటి ఒకానొక సంప్రదాయక పదార్థంతో కలిపి చేసినది. ఈ ఇసుకలింగం ఇప్పటికి భౌతికంగా చెక్కుచెదరకుండా ఉంది. శక్తి విషయంలో మాత్రం అది భగ్గుమనేంత తీవ్రమైనది. 60000 సంవత్సరాల క్రితం ప్రతిష్టింపబడినది అయినా ఇప్పటికి అది నిన్ననే జరిగినట్లుగా ఉంది.

అగస్త్యముని ఆయన శక్తులను, సూక్ష్మశరీరాన్ని ఇక్కడ వదలి వెళ్ళారని అంటారు. ఆయన తన మానసిక శరీరాన్ని అనగా మనోమయ కోశాన్ని మదురై దగ్గర చతురగిరిలో వదలి, కార్తికేయుని సహకారంతో తన భౌతిక శరీరాన్ని కైలాసంలో శివుని సన్నిధికి తీసుకొని వెళ్లి అక్కడ వదలి వేశారని చెపుతారు. అలా చేయటం నిజంగా ఎంతో అద్భుతమైన విషయం.

ఏదో ఒక విధంగా ఆయన కావేరి నదిని సజీవ శరీరంగా చూసారు, నాభిస్థానాన్ని నటద్రీశ్వరంవద్ద స్థాపించారు. అందుమూలంగా ఎగువ దిగువ శక్తి ప్రవాహాలు సవ్యంగా జరిగేవిధంగా జాగ్రత్త వహించారు. ఈ నేపథ్యంలో చూచినప్పుడు మనం కావేరిని పూర్వం వేల సంవత్సరాల క్రితం ప్రవహించినట్లుగా ప్రవహింపచేయటం మరింత ముఖ్యం అని అర్థం అవుతుంది. ఇది కేవలం వ్యవసాయాన్ని పరిఢవిల్లజేయటానికి మాత్రమే కాక మరింత ప్రాముఖ్యం ఉన్న విషయం.

ఈ భారతసంస్కృతిలో మానవ మనుగడ, శ్రేయస్సు అనేవి కేవలం ఒక పరిణామం మాత్రమే, అదే జీవితాశయం కాదు. జీవితాశయం ఏమిటంటే మానవజాతి వికాసం. ఎందరో ఉత్తమ జీవులు మానవాభివృద్ధికి, వ్యక్తులుగా వారు పరిపూర్ణంగా వికసించటానికి దోహదపడేందుకు తమ శక్తులను ఆయా ప్రదేశాలలో ఆవరించి ఉండే విధంగా వదలివేశారు. అలా జరిగేందుకు వీలుగా వారు అవసరమైన శక్తివ్యవస్థలను - చివరకు ఒక నదిని కూడా - అలా మలచారు

ప్రేమాశీస్సులతో,

సద్గురు