నెలరోజులుగా సాగిన “నదుల రక్షణ” అనే ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం పూర్తి చేసుకొని, ఒక సమగ్ర కార్యాచరణ పథకానికి రూపకల్పన చేస్తూ “భారతీయ నదుల పునరుద్ధరీకరణ" అనే ముసాయిదాని ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది. ఈ బహుముఖ, బహువిధ ప్రతిపాదన ఏ విధంగా నదులకు దోహదపడుతుందో తెలుసుకోగోరే ఔత్సాహికుల కోసం ఇందులోని ముఖ్యాంశాలని క్రమంగా అందిస్తున్నాము.  మొదటి భాగంలో - నదుల సంరక్షణకై చేసిన ప్రతిపాదనలో ముందుమాటగా సద్గురు మన నదులని జాతీయ సంపదగా గుర్తించడానికై ఇచ్చిన పిలుపు గురించి తెలుసుకుందాం.

నది అంటే ఒక విస్తారమైన జీవం

పర్వతాలు, అడవులు, నదులతో నా అనుబంధం మామూలు సహజ వనరులవలెనే కాకుండా నాలోని అంతర్గత భాగాలుగా చిన్ననాటి నుండీ అనిపిస్తూ ఉండేది. నాలుగు రబ్బరు ట్యూబులూ, వెదురు కర్రలతో తెప్పలాంటిది చేసుకొని, 13 రోజుల పాటు కావేరీ నదిమీద ప్రయాణం చేసాను. నదుల్ని చూసినప్పుడల్లా నాకంటే ఎన్నోరెట్లు పెద్దగా ఉంటూ జీవకళతో తొణికిసలాడే నాతోటి ప్రాణిలాగానే అవి నాకు గోచరిస్తాయి. కొద్దికాలనికే భూమి మీద నూకలు చెల్లే మనుషుల్లాగా కాకుండా ఈ నదులు కొన్ని లక్షల యేళ్ళ నుంచీ ప్రవహిస్తూ, మనం ఊహించలేనంత ప్రాణికోటికి ఆధారమై నిలుస్తోంది. నా దృష్టిలో నది ఒక వనరు కాదు, దానికదే ఒక అద్భుత జీవశక్తి. మన శరీరం నాల్గింట మూడొంతులు నీటితో నిండి ఉన్నప్పుడు అది అత్యంత ముఖ్యమైన జీవపదార్థం అవుతుందే కానీ కేవలం ఒక వస్తువుగా మాత్రం పరగణించలేను. మనలోపల ప్రవహిస్తే ఒక రకంగా, బయట ప్రవహిస్తే ఇంకో రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నాము?

నదుల్లో నీటి మట్టానికీ దాని చుట్టూ ఉండే నేలకీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. 

నదుల్లో నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ రావడం గత 25 సంవత్సరాలుగా నన్ను కలవరపెడుతూనే ఉంది. ఒకసారి తగ్గడం, మరోసారి పెరగడం కాదు - ప్రతీ యేడూ నికరంగా తగ్గుతూనే వస్తున్నాయి. గత యేడాదైతే మరీనూ. ఇదే తరహాలో నదులు ఎండిపోవడం కొనసాగనిస్తే - 'మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ, భావి తరాల వారి మనుగడ గురించి కానీ మనకు ఏ మాత్రం పట్టింపు లేదు ' అన్న విషయం చెప్పకనే చిప్పినట్లు అవుతుంది.

నేను శాస్త్రజ్ఞుడనూ కాదు, ఏ రకమైన శాస్త్ర పరిజ్ఞానమూ లేదు. ఒక సామాన్యునిగా గమనించినదాన్ని బట్టి చూస్తే, రెండే రెండు కారణాలు నదుల్ని కోలుకోలేనంతగా దెబ్బతీసాయి - ఒకటి సరిపడినంత వృక్ష జాలం లేకుండా చెయ్యడం, రెండు భూగర్భజలాలని మితిమీరి వాడుకోవడం. నదుల్లో నీటి మట్టానికీ దాని చుట్టూ ఉండే నేలకీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. సారవంతమైన నేల ఉంటే నదుల్లో నీరు పుష్కలంగా ఉంటాయి. నేల సారవంతంగా ఉండాలంటే సరిపడా వృక్ష సంపదతో నిండి ఉండాలి. అందునా మన ప్రాంతమంతా ఉష్ణోధిక ప్రదేశాలు కావడంతో వృక్షాలు లేని నేల అతి త్వరగా ఇసుక నేలగా మారిపోతుంది. ఇప్పుడు మనకి ఇదే దుస్థితి ఏర్పడింది - నేలల్లో సారహీనత, నదుల్లో నీటి క్షీణత!!

రైతన్నల ఆత్మహత్యల విషయం తలుచుకుంటే సిగ్గుతో తలవంచుకోవాల్సిందే

మన దేశంలో రైతులు ఇప్పటి వరకు సాధించినది మహోన్నత విజయంగా చెప్పుకోవచ్చు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా, శాస్త్ర పరిజ్ఞానం లేకుండా, కేవలం పారంపరగా వస్తున్న పద్ధతుల ద్వారా 130 కోట్ల దేశ జనభాకి సరిపడేంత పంట పండించడం మామూలు విషయం కాదు. ఒకపక్క సారహీన భూములు, మరోపక్క చాలీచాలని నీటి వనరులు రైతన్నలను తీవ్ర సంకటంలోకి తోసేస్తున్నాయి. దీనితో దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకోడం మొదలుపెట్టారు. ఎవరైనా సరే, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వ్యవసాయం చేయ్యమంటే వారికి కూడా మరణమే శరణం అవుతుంది. తరతరాలుగా మనల్ని పోషిస్తూ వచ్చిన రైతులు సరైన ఆదాయం రాక, తనని తాను పోషించుకోలేక చచ్చిపోవడం, వారి పిల్లలు దిక్కులేనివారై ఆకలికి అలమటిస్తున్నారంటే మన సభ్య సమాజం మొత్తం సిగ్గుతో చితికిపోవాల్సిందే. అత్యధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న మన దేశంలో ఇటువంటి పరిస్థితిని సరిదిద్దుకోకపోతే అది క్షమించరాని తప్పిదమే అవుతుంది.

నదీ తీరాల వెంబడి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అవన్నీ అటవీ ప్రాంతాలుగా మార్చాలి.

8000 నుండి 12000 సంవత్సరాల చరిత్ర ఉన్న మన వ్యవసాయ రంగం అసాధారణమైన మేధోసంపత్తి కలిగి ఉంది. ఎంతో సంస్కారవంతమైన ఈ వృత్తి పట్ల మనకి ఒక రకమైన చులకనా భావం ఏర్పడింది. చాలామంది రైతులు తమ పిల్లలు కూడా వ్యవసాయాన్నే వృత్తిగా ఎంచుకోడానికి ఇష్టపడట్లేదు. ఈ మేధస్సును ఉపయోగపరచుకొనే పరిస్థితి లేనప్పుడు అది పూర్తిగా మరుగునపడి అంతరించిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండాలంటే, వారి అనుభవ జ్ఞానాన్ని ఉపయోగించుకొని భూసారాన్ని కాపాడాలి, వృక్ష సంపదని పెంచుకొని తద్వారా నీటి వనరులని వృధ్ధి చేసుకోవాలి. చివరికి ఆధునిక సాంకేతిక పద్ధతులను కూడా ప్రవేశపెట్టి పొదుపుగా నీటిని వాడుకొనే ఏర్పాట్లు చేసుకోవాలి.

ఈ పరిష్కారం వల్ల రైతు ఆదాయం పెరుగుతుంది

మేము ప్రతిపాదించిన పరిష్కార మార్గం ఏమిటంటే...నదుల పొడవునా ఇరుపక్కలా - ప్రధాన నదులైతే కనీసం 1 కి.మీ దూరం వరకు, చిన్నపాటి నదులకైతే 0.5 కి.మీ దూరం వరకు నేలని పూర్తిగా చెట్లతో నింపెయ్యాలి. చెట్ల నీడలో ఉండటం వల్ల ఈ నేలలో సేంద్రీయత పెరుగుతుంది. దాంతో ఈ నేల ఎక్కువ నీటిని నిల్వచేసుకోగలుగుతుంది - ఒక్కో బొట్టుగా ఊరుతూ అదే నీరు యేడాది పొడుగునా నదులు నిండుగా ఉండేట్లు చూస్తుంది. నదీ తీరాల వెంబడి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అవన్నీ అటవీ ప్రాంతాలుగా మార్చాలి. ఒకవేళ సాగుభూములైతే వృక్ష-ఆధారిత పండ్ల తోటలు పెంచుకోవాలి. దీనివల్ల రైతులకి కూడా 3 నుంచి 5 రెట్ల వరకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం కలుగుతుంది.

ఇప్పుడు మనం నదుల్ని చేరదీసి పోషించాల్సిన సమయం ఆసన్నమైంది.

ఈ ముసాయిదా ద్వారా మేము సూచించిన పరిష్కారం ఆధారంగా పర్యావరణానికి దోహదపడే చక్కటి ఆర్థిక విధానాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నాం. ఇది అనేక సాంకేతిక రంగాల నుంచి నిపుణులను, అనుభవజ్ఞులను సంప్రదించి అన్ని వర్గాల లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన సమగ్ర సంగ్రహ రూపం అని చెప్పవచ్చు. మొట్టమొదటి లబ్ధిదారు నదులే అవ్వగా తర్వాతది వాటిపై ఆధారపడి జీవనం సాగించే జంతు-జీవజాలం, ఆ తర్వాత రైతులు మరియు చివరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీనిని ఆచరణయోగ్యంగా, అమలు పరచే వీలుగా చట్టపరమైన విధానాన్ని తయారుచేయడం మన ముఖ్య లక్ష్యం. ఇందులోని అంశాలపై మరిన్ని వివరాల కోసం, లేదా సందేహాలు తీర్చడానికి నాతో సహా మా శాస్త్రీయ బృందం ఎప్పుడూ అందుబాటులోనే ఉండగలము.

ఎన్నో యుగాల నుంచీ, తరతరాలుగా మన నదులు మనల్ని చేరదీసి, పోషిస్తూ వచ్చాయి. ఇప్పుడు మనం నదుల్ని చేరదీసి పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. మా సూచనలకి అనుగుణంగా అవసరమైన శాసన మరియు పరిపాలనా విధానాలను త్వరలో ప్రవేశపెట్టి, దాన్ని చట్టబద్ధం చేయగలరని ఆశిస్తున్నాము.

రండి, నీటి వనరులని జాతీయ సంపదగా గుర్తించే చట్టం కోసం కలిసి పనిచేద్దాం!!

ప్రేమాశీస్సులతో,
సద్గురు