మీరు పడే మానసిక వ్యధకు అసలు కారణం మీరే..!!
ప్రశ్న: నా కుటుంబంతో, నా పిల్లలతో నేను నా పేగుబంధాన్ని తెంచుకోలేకపోతున్నాను సద్గురు. వారికి ఏమి జరిగినా, నేను చేస్తున్న దానిమీద ధ్యాసను కోల్పోతాను. దయచేసి నాకో పరిష్కార మార్గం చూపించండి?
సద్గురు: నేను ఎప్పుడు కూడా, మీరు మీ పేగు బంధాన్ని తెంచుకోవాలని చెప్పలేదు. దురదృష్టవశాత్తు, ఇప్పుడు మీ మాతృత్వపు పేగు ఎంతో పరిమితంగా ఉంది. దీన్ని మరి కొంచెం పెంచుకోండి. కేవలం ఒక్క చిన్న గుంపుతో మాత్రమే కాకుండా, ప్రతి ప్రాణి మీద, ప్రతి ప్రాణి తోను, ప్రతి జీవంతోను ఈ విధమైన సంబంధం ఏర్పరుచుకొండి. మీరసలు మీ పేగుబంధాన్ని ఎందుకు తెంచుకోవాలి? మీరు పేగుబంధాన్ని తెంచుకోవాల్సిన అవసరమే లేదు. మీరు ఒక విషయంతో నిమగ్నమై ఉండడంలో, లేదా దానితో చిక్కుకుపోయి ఉండడంలో ఒక తేడా ఉంది. మీరు దేనితోనైనా నిమగ్నమైనప్పుడే, మీకు జీవితం తెలుస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మికత గురించే కాదు, మీకు జీవితంలో ఏది తెలియాలన్నా సరే మీరు నిమగ్నులై ఉండాలి. ఇక్కడ ప్రజల్లో లోపిస్తున్నది 'నిమగ్నత'. మీరు నిమగ్నతని “దీని పట్ల చూపిస్తాను, దాని పట్ల చూపించను” అనుకున్నప్పుడు, అది మీకొక రకమైన బంధనంగా మారుతుంది.
మీ నిమగ్నతకి పరిధులు తీసేయండి. మీరు నడిచే భూమి తోనూ, మీరు తినే ఆహరంతోను, మీరు తాగే నీటితోను, మీరు పీల్చే గాలి తోను, మీరు ఉండే ఈ శూన్యంతో పూర్తిగా నిమగ్నులవ్వడమే మీరు చేయవలసింది. మీరు ఎలాగూ నిమగ్నులయ్యే ఉన్నారు. కానీ మీకా ఎరుక లేదు. మీరు గాలితో నిమగ్నమై లేకపోతే మీరు ఊపిరి తీసుకోలేరు కదా, మీరు ఈ పాటికే చనిపోయి ఉండేవారు. కానీ దీన్ని మీరు మీ ఎరుకలోకి తెచ్చుకోవాలి. ఈ విధంగానే జీవితం సాగుతుంది. ప్రతి దానితో కూడా మీరు ఎరుకతో నిమగ్నులై ఉండాలి. ప్రతిదానితోను కూడా మీరు ఎరుకతో నిమగ్నులై ఉండాలి. మీరు ఒకవేళ ఈ ఎరుకలేకుండా, నిమగ్నమై ఉండాలి అనుకుంటే, అది ఒక పెద్ద శ్రమలాగా అనిపిస్తుంది. మీకు ఇటువంటి చైతన్యం కనక ఉండి, మీరు దానితో నిమగ్నులై ఉంటే, ఇది ఎంతో పారవశ్యంగా అనిపిస్తుంది.
ఈ రోజున ‘అధునాతన శాస్త్రం’ ఏం చెబుతోందంటే, శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా ఈ సృష్టి మొత్తంతో ఎల్లప్పుడూ సంభాషణలు జరుపుతూనే ఉంది అని. మీరు ఇంత పెద్ద విషయాన్ని విస్మరించాలని అనుకుంటున్నారు. ఇది మీ జీవితానికి, ఈ సృష్టికి మూల కారణం. మీకు బాధలు ఎందుకు కలుగుతున్నాయి? మీరు దీన్ని విస్మరించడం వల్లే..! ఆంతే కానీ, మీరు మీ కుటుంబంతో నిమగ్నమై ఉండడం వల్ల కాదు.
ఈ రోజున సూర్యుడు ఉదయించాడు, అవునా? భూమి సమయ పాలన చేస్తూ తిరుగుతోంది, పూలు పుష్పించాయి. ఎన్నో అంతులేని బ్రహ్మాండాలు, సృష్టి అంతా కూడా ఎంతో చక్కగా జరుగుతోంది. కానీ మీ మనసులో ఏదో ఒక ఆలోచన మిమ్మల్ని తొలిచేస్తోంది. ఇహ రోజంతా పాడైపోయింది, అని మీరు అనుకుంటారు.
ఇక్కడ విషయం ఏవిటంటే “మీరు ఎవరు?” అన్న అవగాహన మీకు పోయింది. మీ గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు మీ అనుభూతి అంతా కూడా మీ భౌతిక రూపంగానే ఉంది. భౌతికంగా చూస్తే, ఈ సృష్టిలో మీరు ఎవరు? మీ ఇంట్లో మీరేదో అయ్యి ఉండచ్చు. మీ వీధిలో మీరు మరేదో అయ్యి ఉండచ్చు. ఈ నగరంలో ఏమీ కాదు... సృష్టిలో? కనీసం ఒక రేణువు కూడా కాదు. మీరు మీ అవగాహనని సరిచేసుకోండి. ఈ భౌతిక సృష్టిలో మీరు నిజంగా ఏమీ కాదు. ఈ విషయాన్ని మీరు అర్ధం చేసుకుంటే, మీరు ప్రతిదాన్ని కూడా ఎంతో ఆశ్చర్యంతో , నిమగ్నతతో పరిశీలిస్తారు. అప్పుడు ఒక చిన్న ఆలోచనో, భావమో అంత ముఖ్యమైనది, మిమ్మల్ని బాధపెట్టేది అవ్వదు. అది మీరు సృష్టించుకుంటున్నదే. మీ మనస్సులో ఉన్నది మీరు సృష్టించుకుంటున్నదే .
నేను మీకొక జోక్ చెప్పనా? ఒక స్త్రీ నిద్ర పోయింది. ఆవిడ నిద్రలో ఒక కల కంటోంది. ఆ కలలో, ఆవిడ బాగా దృఢంగా ఉన్న ఒక మనిషి అక్కడ నించొని ఉండడం చూసింది. అతను మెల్లిగా ఆమె దగ్గరకు వస్తున్నాడు. ఇంకా, ఇంకా దగ్గరకి వస్తున్నాడు. ఎంత దగ్గరగా వచ్చాడంటే అతని శ్వాస కూడా ఆవిడకి తెలుస్తోంది. ఆవిడ వణికిపోయింది, భయంతో కాదు. ఆవిడ “నువ్వు ఇప్పుడు నన్నేం చేస్తావ్?” అని అడిగింది. అతను, “ఇది నీ కల” అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతోందో అదంతా మీ బుర్రలోనే జరుగుతోంది. మీ సమస్య, మీ జీవితం మీక్కావల్సిన విధంగా జరగట్లేదు అని. మీ కల మీకు కావాల్సిన విధంగా జరగడం లేదు. ఇదే మీ సమస్య. ఈ ప్రపంచమంతా మీకు కావలసిన విధంగా జరగకపోయినా పర్వాలేదు, మీ కలైనా మీరు కోరుకున్నట్టు కలిగితే మీరు ఆనందంగానే ఉంటారు కదా!