సద్గురు ఇంకా జూహిచావ్లా ప్రేమ ఇంకా ప్రేమ వ్యవహారాన్ని విజయవంతం చేసుకోవటం అనే అంశంపై చర్చిస్తున్నారు.

జూహి చావ్లా:  సద్గురు ఈ రోజు అంశం “ప్రేమ మరియు జీవితం. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే కొంతమంది ఆధ్యాత్మిక ఉపాధ్యాయులు, గురువులు “నువ్వు ప్రేమిస్తూనే వైరాగిగా ఉండాలి” అంటూ ఉంటారు.

సద్గురు: నువ్వు వాళ్ళని ఎప్పటికీ అనుసరిస్తూ ఉండేలా చెయ్యాలంటే సులభమార్గం నీకు అర్థం కాని ఒక విషయం చెప్పడం. “నువ్వు ప్రేమించు. కాని నువ్వు  వైరాగిగా ఉండాలి” అని చెబితే నువ్వు అనునిత్యం సంప్రదించడానికి రావాలి, నిరంతరంగా.

నేను ఏమంటాను అంటే మిమ్మల్ని మీరు ఒక ప్రేమ వ్యవహారంలో పడేసుకోమని. ఆ ప్రక్రియలో చనిపోడానికి కూడా సిద్ధపడితే ఒక ఉపయోగకర విషయం జరుగుతుంది. అది మీ ప్రేమ, మీ జీవితం, మీ పని లేక ఏదైనా సరే అన్ని విషయాలికి వర్తిస్తుంది. మిమ్మల్ని మీరు పూర్తిగా నిమగ్నం చేసుకోకపోతే మీకు ఇది ఎప్పటికి తెలియదు. అదే “ప్రేమించు కాని వైరాగిగా ఉండు” అనే విషయం. మరి మీరు ఎందుకు ప్రేమించడం? ఎందుకంటే మీరు ఎవరో ఒకరిని మీలో అంతర్భాగం చేసుకోవాలనే కదా. ఒకవేళ మీరు ప్రేమిస్తూ అదే సమయంలో వైరాగిగా ఉండాలనుకుంటే మీరు ప్రతి రోజూ గురువుని సంప్రదించాలి. అది ఒక మానసిక వైద్యుని పనిలా ఉంటుంది. ప్రతి రోజు మీరు వచ్చి వాలు కుర్చీలో కూర్చోవాలి. మీకు వైద్యం అవసరమై, ఖర్చు కూడా అవుతుంది.

జూహి చావ్లా: అంటే మనం ప్రేమిస్తూ వైరాగిలా ఉండవచ్చు అంటారా?

సద్గురు: నేను అలా అని అనలేదే. మనం మానవుడికి  ప్రేమించాల్సిన అవసరం ఎక్కడ నుంచి పుడుతుందో చూద్దాం. మానవులు నిరంతరం వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కన్నా మెరుగైన పరిస్థితికి చేరుకోవాలని ప్రయత్నిస్తారు. అది ఒక సాధారణ భౌతికమైన భావన అయితే దానిని మనం లైంగికత అంటాం. లైంగికత అంటే, భౌతికంగా మీరు కానిదేదో చేసే ఒక ప్రక్రియ అన్నమాట. మీరు కొంత సేపు విజయవంతం కావచ్చు. అదే ప్రయత్నం మీరు మానసికంగా చేస్తే దానిని దురాశ, ఆక్రమణ లేదా వ్యాపార దృష్టి అంటారు. కొంతమంది ఆక్రమణకి కత్తులతో, తుపాకులతో వెడతారు. కొంత మంది చెక్కు పుస్తకాలు, డబ్బు ఇంకా క్రెడిట్ కార్డులతో వెళతారు!

మీరు ఆస్తి గాని మరేదైనా గాని కావాలనుకుంటే, మీ పూర్తి ప్రయత్నమంతా మీకు చెందే వాటి కోసమే కాని, మీలో అంతర్భాగమయ్యేది కాదు. ఆ ప్రయత్నం భావోద్వేగానిది అయితే దానిని ప్రేమ అంటారు. మీరు వేరొకరిని భావోద్వేగంతో మీలో అంతర్భాగంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు ఎరుకతో దానిని చేస్తే దానిని యోగ అంటాం. యోగ అంటే సంగమం (కలయిక). వేరొకరిని గాని, వేరొక దానిని మీలో అంతర్భాగంగా చేసుకోవటానికి ఉపయోగించే మిగతా అన్ని పద్ధతులు ఎంతో కొంత ఆకర్షణీయంగా ఉన్నా వాటి పరిమితులు వాటికి ఉంటాయి. అయితే ఏది సరి అయినది అని కానీ, తప్పు అని కానీ అనలేం. అయితే అది కొంత సమయం వరకు పని చేస్తుంది, ఎల్ల వేళలా పని చేయదు. మీకు ఇది అర్థమయితే, మీరు ఎరుకతో దానిని మీలో అంతర్భాగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పుడైతే ఎరుకతో సంఘటితమవుతారో, ఇక్కడ కూర్చొని, అన్నింటిని మీలో అంతర్భాగంగా అనుభవించగలిగితే అప్పుడు మీరు ఒక యోగి. ఇది ఒక విజయవంతమైన ప్రేమ వ్యవహారం.

ప్రేమాశిస్సులతో,
సద్గురు