సద్గురు : ఈ రోజుల్లో ఎటువంటి వ్యవహారం మొదలుపెట్టాలన్నా, మనుషులు గ్రహాలను, నక్షత్రాలను పరీక్షిస్తున్నారు. ఇంటినుండి బయటకు అడుగు పెట్టాలంటే, గ్రహాలు అనుకూలంగా ఉండాలి. రాహుకాలం, మంచికాలం, ఇంకేదో కాలం చూసుకుంటూ వెళ్తున్నారు. వివాహం చేసుకోవాలంటే ఇంకెవరి దగ్గరికో వెళ్లి "నేను భార్యతో సంతోషంగా ఉండగలనా?" అని ప్రశ్నిస్తున్నారు. మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వారితో ఎందుకు సంతోషంగా జీవితం గడపలేరు? మీ ఊహకు అందని విపరీత ప్రవర్తన వారిలో మీకేదైనా కనిపిస్తే, ఎందుకు వదిలివేయరు?

నిర్జీవవమైనవి మీ జీవిత గతిని నిర్ణయించడం సమంజసమా లేక మానవ స్వభావమే నిర్జీవమైన వాటి గతిని నిర్దేశించడం సమంజసమా?

మీరు తెలివిగా వ్యవహరిస్తూ ఉంటే, ‘రేపు మీరు ఏమి చేస్తారో, మీ జీవితం ఏ విధంగా ఉంటుందో’ ఎవరూ అంచనా వేయలేరు. ఒక తెలివి గలవాడు రేపటి రోజు ఏమి చేయబోతున్నాడో మీరు అంచనా వేయగలరా? వేయలేరు, ఎందుకంటే ఇంతకు మునుపు ఎప్పుడూ ఈ భూమి మీద చేయనిది అతడు చేయవచ్చు. మీ అంచనాలన్నీ ఇంతకు మునుపు జరిగినవాటి బట్టే ఉంటాయి. మీ ఊహకు అందనిదేదో అతడు చేయవచ్చు. ఒక వ్యక్తి తన జీవితం జీవించడానికి ముందుగానే అతని జీవితం ఎలా ఉండబోతుందో నిర్ణయించేది, జాతకం అని పిలిచే భయానకం.

మిమ్మల్ని గ్రహాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరించేదే జాతకం. గ్రహాలు నిర్జీవమైనవి. నిర్జీవమైనవి మీ అదృష్టాన్ని నిర్ణయించటమా లేక మానవుడే నిర్జీవమైనవాటి అదృష్టాన్ని నిర్ణయించటమా? మానవుడే నిర్ణయించాలి. గ్రహాలు మీ జీవిత అదృష్టాన్ని నిర్ధారిస్తున్నట్లయితే మీలోని మానవ సామర్ధ్యం కనీసం నిర్జీవమైన వాటికి సమంగా కూడా పని చేయడంలేదన్నమాట. కుక్కలు, పిల్లులు గ్రహాలను తమపై ప్రభావితం చూపనివ్వవు. కావలసినట్టు అవి జీవిస్తాయి. కానీ, దురదృష్టవశాత్తు మానవ జీవితాలపై నిర్జీవమైనవి ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి.

అంటే, ఇందు(జాతకం)లో ఏమీలేదా? కొంత వరకు ఉంది కానీ, మానవులు అన్నిటిలాగా దీనిని కూడా పెద్దది చేసి చూస్తారు. ఒక వ్యక్తికి మానసిక రుగ్మత ఉంటే పౌర్ణమి రోజు, అమావాస్య రోజు అది కాస్త ఎక్కువ అవుతుంది. అమావాస్యనాడు, పౌర్ణమినాడు మనందరమూ వెర్రివాళ్ళమవుతామా? లేదు, ఆ వ్యక్తి కన్నా మీరు మానసికంగా కొంత స్థిరంగా ఉన్నారు. చంద్రుని స్థానం ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది, అందుకే అతనిలో నియంత్రణలో లేదు. కొంతవరకు ఇది అందరిపై ప్రభావితం చూపుతుంది కానీ ఆ ప్రభావం అందరిలో వెర్రితనం వరకు చేరుకోదు. ఎందుకంటే ఆ వ్యక్తికన్నా మీరు స్థిరంగా ఉండటమే కారణం.

మీరు మీ ఆంతర్యంలో నిజంగా స్థిరంగా ఉంటే ఏ గ్రహం ఎటు వెళ్లినా మీరు మాత్రం మీరు వెళ్లే దారిలోనే వెళ్తారు.

అదేవిధంగా మీలో మీరు స్థిరంగా ఉంటే, ఏ గ్రహం ఎటు వెళ్లినా మీరు మాత్రం మీరనుకున్న దారిలోనే వెళ్తారు. స్థిరంగా లేకపొతే ప్రతి చిన్నమార్పు మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. మీరు కనుక ప్రభావితం కాగల స్థితిలో ఉంటే ఇటువంటివి మీ జీవితం పైన కొంతవరకు ప్రభావం చూపగలవు. కానీ మీలో మీరు స్థిరంగా ఉండగలిగితే ఏ గ్రహాలు మీ జీవితంపై ప్రభావం చూపలేవు. మానవ సామర్ధ్యమే మీ జీవిత గమనాన్ని నిర్ణయించాలి. మీలోని సృష్టి మూలం మీ విధిని నిర్ణయించకుండా, నిర్జీవమైన గ్రహాలు నిర్ణయిస్తుంటే, అందులో ఎక్కడో లోపం ఉంది. మీలో మీరు మరికాస్త స్థిరంగా ఉంటే ఇటువంటివన్నీ మిమ్మల్ని ప్రభావితం చెయ్యలేవు. మీరు మీ నిశ్చయించుకున్న గమ్యానికే చేరుకుంటారు.

"నేను ఆధ్యాత్మిక పథంలో ఉన్నాను’’ అని ఎవరైనా అంటే, దాని అర్థం "గ్రహాలు ఎక్కడున్నా ఫర్వాలేదు, నా కర్మ ఏ విధంగా ఉన్నా ఫర్వాలేదు, నేను కోరుకున్న చోటుకి నేను వెళ్తున్నాను, నేను నా ముక్తి దిశగా పయనిస్తున్నాను''అని. ఆధ్యాత్మికత అంటే - మీ జీవితం మీ చేతిలోకి తీసుకోవడం. మిమ్మల్ని మీరు సమర్థవంతులుగా చేసుకుని మీ జీవిత గమ్యాన్ని మీరే నిర్ణయించుకోవచ్చు లేదా గ్రహాలూ ఇంకా లక్షల కొలది వాటికి మీ విధిని వదిలివేయవచ్చు. దురదృష్టవశాత్తు మనుషులు వేరే గ్రహాల వైపుకు ఎక్కువగా చూస్తున్నారు. మన భూమండలం వైపు దృష్టి మళ్లించి అవసరమైన శ్రద్ధతో తగినది చేస్తారని ఆశిస్తున్నాను. అందుకు తగిన సమయం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అవసరమైనది కూడా ఇదే.

ప్రేమాశీస్సులతో,

సద్గురు