అంతర్గత శ్రేయస్సుకై సమయం కేటాయించండి..!!
మీ జీవితాన్ని మెరుగుపరచని పనులు చేయడంవల్ల మీకాలం, శక్తి ఎంత వృధా అవుతోంది. వాటి గురించి మీరు తప్పని సరిగా ప్రతిరోజూ లెక్క చూసుకోవాలి. అది చాలాముఖ్యమైన విషయం, లేదంటే మీరు ఓ 25 సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకున్నట్టయితే అంతా గందరగోళంగా ఉంటుంది. గందరగోళమైన స్థితి అంటే ఏదో తప్పుదారి పట్టినట్టు కాదు. ఒకవేళ అలా కనుక జరిగితే, మీరు మేల్కొంటారు. కాని ఏ గందరగోళం లేకుండా అంతా సవ్యంగా జరగడం, నిజంగా కావలసినవి సరిగా జరగకపోవడం అన్నది, అసలైన దారితప్పడం అవుతుంది. అటువంటిది మీరు మీకు జరగకుండా చూసుకోండి. ఇది బాంబ్ పేలినట్టుగా పెద్దశబ్దం చేస్తూ జరగదు. అది నిశ్శబ్దంగా జరిగిపోతుంది. మీరు బిజీగా ఉన్నా లేక బోరుతో ఉన్నా, రెండు రకాలుగానూ మీ జీవితం మిమల్ని దాటి సాగిపోతునట్టే.
ఒక బస్సు వచ్చి మిమ్మల్ని ఢీకొనడం ఒక విషాద ఘటన కాదు. అది కేవలం అకస్మాత్తుగా జరిగినది. మీ ఎముకలు కొన్ని విరిగి ఉండవచ్చు కానీ మీరు ఎంతో స్పృహతో వ్యవహరిస్తారు. “అసలు ఈ జీవితం దేని గురించి?”అని మీరు ఆలోచించడం ఆరంభిస్తారు. కానీ మీరు అలా చూస్తూ కూర్చుండగానే జీవితం చేజారిపొతే మాత్రం, అది చాలా విషాదమైన స్థితి. ప్రస్తుత సమాజంలో ఆర్ధిక శక్తులు ప్రజల జీవన ప్రమాణాల్ని నిర్ణయిస్తున్నాయి. సముద్ర విహార యాత్ర టిక్కెట్లు అమ్మేవారు “మీరు తప్పకుండా విహరించాలి, ఈ సంవత్సరం 50% తగ్గింపు ఇస్తున్నాం” అంటుంటారు. బట్టలు దుకాణం వారు “మీరు తప్పకుండా ఈ దుస్తుల్ని ధరించాలి, 90% తగ్గింపు” అంటుంటారు. 90% తగ్గింపు అంటున్నప్పుడైనా అది మోసమని మీరు అర్థం చేసుకోవాలి. మీరు మీ డబ్బుని ఎలా పెట్టుబడి పెడతారో అది మీ ఇష్టం. కానీ మీ జీవితాన్ని ఎలా వినియోగిస్తారో అది మాత్రం ఆర్ధిక రంగం నిర్ణయించకూడదు. అవునా? కాదా?. ఎందుకంటే జీవితానికి కొలమానం కాలమే, అది గడిచిపోతుంది. ఈ క్షణాన్ని మీరు ఎంత బాగా మీ శ్రేయస్సు కోసం సద్వినియోగిస్తారో, అదే ముఖ్యం. డబ్బు, ఇతర విషయాలు వస్తూంటాయి, పోతుంటాయి. సమయం ఒక్కటే - పోతే మళ్లీ తిరిగిరాదు. అదొక్కటి మాత్రమే ఎప్పుడూ చేజారిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక దానిని సద్వినియోగం చేసుకోకపోతే, మీరు తెలుసుకునే లోపే అది చేజారిపోతుంది.
కాబట్టి మీరు మీ అంతః శ్రేయస్సు కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. సంపూర్ణ జీవిగా మీరు కాగలిగితే, అది శ్రేయస్సే. మీరేం చేస్తారు, చేయరు అన్నది తరవాతి విషయం. మనం బాగునప్పుడు మాత్రమే అత్యున్నతమైన దాని కోసం ప్రయత్నం చేస్తాం. మనం అలా లేనప్పుడు తక్కువ విలువ ఉన్నదాని కోసం, తక్కువ శ్రమతో చిన్న చిన్న వాటికై ప్రయత్నం చేస్తాం. కాబట్టి, మీ జీవితంలో చేయాల్సిన మొట్టమొదటి పని మీరు నిజంగా బాగా ఉన్నారా? అన్నదే కదా? బాగా ఉండటం అంటే కేవలం ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు. బాగా అంటే మీకు మీరు ఒక సమస్య కాకూడదు. ఈ ప్రపంచంలో సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని మన ప్రయత్నం మేరకు శక్తి వంచన లేకుండా ఎదుర్కొంటాం. కానీ మీరే ఒక సమస్య కాకూడదు. అలా జరగకూడదని అనుకుంటే, అందుకోసం కాస్త పెట్టుబడి అవసరం. మీరు తప్పనిసరిగా దానికోసం కాస్త సమయం కేటాయించాలి. ఒకవేళ మీ ఇంటిలో సాధ్యమైతే అక్కడే చేయండి లేదా ఆశ్రమంలో చేయండి. అక్కడ అందుకు కావలసినవి లభిస్తాయి కాబట్టి కాస్త సమయాన్ని కేటాయించండి. మీకు మీరుగా కావలసిన విధంగా ఏర్పాటు చేసుకుంటే సరే, ఒకవేళ అందులో కూడా మీకు సాయం అవసరమైతే, అదీ అందుబాటులోనే ఉంది. కానీ మీరు తప్పనిసరిగా మీ అంతః శ్రేయస్సు కోసం సమయాన్నికేటాయించాలి, సమయాన్ని మళ్లీ తిరిగిపొందలేరు. పెట్టుబడి పెట్టనిదే లాభం రాదు, కదా!