అరణ్యంలో  పాండవులు హాయిగా ఉండడం

సద్గురు: ఐదుగురు పాండవ సోదరులు అరణ్యంలో చక్కగా పెరుగుతున్నారు. సరైన మార్గదర్శకత్వం ఉంటే అరణ్యంలో నివసించడమే ఒక మనిషి పొందే గొప్ప విద్య. ఋషులు, జ్ఞానులు పాండవులకు చదువు నేర్పడంలో శ్రద్ధ తీసుకుంటున్నా, వాటికంటే ప్రకృతి మాత వారికి జ్ఞానాన్ని, బలాన్ని అందించింది. పాండవులు బలం, సహనం, విజ్ఞానంతో పెరిగి, ఆయుధ విద్యలో బాగా ప్రావీణ్యం సంపాదించారు. 

పాండురాజు కోరికలు అతని విధిని నిర్ణయించడం

పాండవుల తండ్రి పాండురాజు తన భార్యల దగ్గరకు కోరికతో వెళితే చనిపోతాడనే శాపం ఉండటంతో, తన భార్యలతోనే ఇతర మార్గాల ద్వారా ఆయన పిల్లలను పొందాడు. అలా పదహారు సంవత్సరాలుగా ఆయన తన భార్యలకు దూరంగా వుంటూ, నిత్యం ఋషులు, సాధువుల సేవిస్తూ, జ్ఞానాన్ని సముపార్జిస్తూ, బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తూ ఒక గొప్ప  వ్యక్తిగా మారాడు. కానీ ఒక రోజు, అడవిలోని ఏకాంతంగా వున్నా ఒక నది వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన రెండవ భార్య మద్రి అప్పుడే ఆ నదిలో స్నానం చేసి వస్తోంది. ఇన్ని సంవత్సరాల తరువాత  ఆయన ఎప్పుడైతే ఆమెను నగ్నంగా అలా చూసాడో, ఆయన తన స్వాధీనాన్ని కోల్పోయి ఆమెచే ఆకర్షింపబడ్డాడు. 

పాండురాజుకున్న శాపాన్ని తెలిసిన మద్రి, బలంగా నిరోధించినా, విధి ఆయనను ఆమె వైపు లాగింది, దీంతో పాండురాజు ఆమె బాహువుల్లోనే మరణించాడు. దీంతో ఆమె భయంతో పెద్దగా అరిచింది – ఆమె భయానికి కారణం కేవలం భర్త చనిపోవడం మాత్రమే కాదు, తనపై ఆయనకు కలిగిన  కోర్కె వల్ల భర్త చనిపోవడం కారణం. మద్రి కేకలు విన్న కుంతి వెంటనే అక్కడకు వచ్చి ఏం జరిగిందో చూచి తీవ్ర కోపానికి లోనైంది. ఇద్దరి భార్యల మధ్య ఇంత కాలంగా అణచబడివున్న ఉద్రేక భావాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. 

కొంత సమయంలో, తన పిల్లల భవిష్యత్తు కోసం కుంతి శాంతించింది. కానీ మద్రి నిరాశ, అపరాధ భావంతో తన భర్త చితిలో తానూ ఆహుతి కావాలని నిశ్చయించుకుంది – అలా తన భర్తను అనుసరిస్తానని ఆమె నమ్మకం. మద్రికి బదులుగా తానూ చితిలోకి వెళ్ళాలని కుంతి కొద్ది సేపు పైకి నటించింది, కానీ అప్పటికే  ఆమె మనసులో నిష్కర్షగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఒక రాణిగా తాను చేయవలసింది నిస్సంకోచంగా చేసింది. ఋషులు వెంటరాగా కుంతీ ఐదుగురు పాండవులతో కలసి పదహారు సంవత్సరాలు తరువాత హస్తినాపురి వైపు ప్రయాణమైంది. 

పాండవులు హస్తినాపురికి తిరిగి చేరుకోవడం

ఎప్పుడో మరచిపోయిన తన దాయాదులు తిరిగి హస్తినాపురికి వస్తున్నారనే వార్త విన్న వెంటనే కురు రాజ్యానికి రాకుమారుడైన దుర్యోధనుడు అసూయ, ద్వేషాలతో ఉడికిపోయాడు. తన తండ్రి అంధుడు కాబట్టి, తనపై అతనికి గ్రుడ్డి ప్రేమ వుండటం వల్ల, దుర్యోధనుడు రాజ్యంలోని విషయాలను తనదైన మార్గంలో చూసుకుంటూ రారాజుగా చెలామణి అవుతున్నాడు. కానీ హఠాత్తుగా, సింహాసనానికి చట్టబద్ధమైన వారసుడుగా ఒక పోటీదారుడు రావడంతో అతను సహించ లేకపోయాడు. దీంతో తనతో సమానంగా దేశాన్ని పాలించే శక్తి, యుక్తులు లేని తన సోదరులను పాండవులకు వ్యతిరేకంగా పురిగొల్పడం ప్రారంభించాడు. తన కుయుక్తులను అమలుపర్చడానికి తగిన వ్యక్తిగా తన నూర్గురు సోదరులలో రెండవ వాడైన దుశ్శాశనున్ని ఎంచుకున్నాడు. 

పాండవులు రాకమునుపే వారిపై అమిత కోపాన్ని వీరిద్దరూ పెంచుకున్నారు. పేరుకు రాజు కాకపోయినప్పటికీ, ప్రజల అవసరాలను తీర్చే రాజుగా పాండురాజు వారి ప్రేమను పొందాడు. ఆయన ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యానికి సంపదలు తీసుకురావడంతో పాటు అనేక రాజ్యాలను గెలిచి, రాజ్యపాలన అంతా తన ఆధీనంలో వుంచుకున్నాడు. పదహారు సంవత్సరాలు తాను కావాలనే రాజ్యాన్ని వదిలి వెళ్ళాడు, ఇప్పుడు చనిపోయాడు. తాము ఎప్పుడూ చూడని ఆయన కుమారులైన పాండవులు తిరిగి రావడంతో ప్రజలు ఎంతో ఉత్సాహం పొందారు.

పాండవులపై వున్న ప్రేమ, వారిని చూడాలనే ఆరాటంతో మొత్తం ప్రజలంతా వచ్చారు. ఎప్పుడైతే పాండవులు తమ తల్లితో కలిసి నగరానికి చేరుకున్నారో, వారిని చూసి ఒక్కసారిగా ప్రజలలో రోదన మొదలైంది. అడవిలో పాండవులు బలవంతులుగా పెరిగారు – ఎంతగా అంటే వారు అంతఃపురంలో పెరిగి వున్నా అంత బలం పొంది వుండలేరు. వారికి స్వాగతం చెప్పడానికి నూర్గురు కౌరవ సోదరులు, ధృతరాష్ట్రుడు, గాంధారి, భీష్ముడు, విదురుడు, ఇతర పెద్దలందరూ నగర ద్వారం వద్దకు వచ్చారు. ఎవరి మీద తన చిన్నతనం నుంచి ఆధారపడి, అతని ద్వారా ప్రపంచాన్ని చూసేవాడో, ఎవడైతే తనను ప్రేమతో, దయతో చూసేవాడో అలాంటి  పాండురాజుపై ధృతరాష్ట్రుడు అనేక భావోద్వేగాలు కలిగి వున్నాడు. తన తమ్మున్ని తానూ ఎంతో ప్రేమించానని ఆయన నమ్ముతాడు, కానీ ఇప్పుడు తనలో కలిగే భావాలను ఆయన అర్థం చేసుకోలేక పోతున్నాడు – ఎందుకంటే తన పిల్లలు కాబోయే రాజు కాలేరని ఆయనకు తెలుసు.

దుర్యోధనుడిలో ద్వేషం పెరగడం

పాండవులు, కుంతి నగరంలోకి స్వాగతించబడ్డారు. పాండురాజుకు జరగవలసిన కర్మకాండలు జరపబడ్డాయి. పాండవులు రాజభవనంలోకి ప్రవేశించిన క్షణం నుంచి, విధి తన ఆట ఆడడం ప్రారంభించింది, ముఖ్యంగా భీముడు, దుర్యోధనుడి మధ్య – ఎందుకంటే వీరిద్దరూ అందరి కంటే బలమైనవారు. భీముడు మహాకాయుడుగా పెరిగాడు, దీంతో దుర్యోధనుడు బాహు బలంలో అతనికి సరైన జోడీ. తన జీవితంలో మొదటి సారి రాజభవనంలోకి ప్రవేశించగానే భీముడు అమిత సంతోషంతో ఉన్నాడు. తెలిసీ తెలీని అల్లరి చేష్టలతో రాజ భవనం అంతా కలియ తిరుగుతూ, అందరిని ఆటపట్టిస్తూ, ఎప్పుడు అవకాశం దొరికినా దుర్యోధనుడితో సహా  కౌరవ సోదరులందరి ఆట పట్టించేవాడు.

వారు మల్ల యుద్ధంలో పోటీ పడ్డప్పుడు మొదటిసారి వారిద్దరి మధ్య గల ఘర్షణ ప్రధానంగా బయటపడింది. తనను మల్ల యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరని దుర్యోధనుడు అమిత విశ్వాసంతో వుండేవాడు. నూర్గురు సోదరులలో అతనే బలవంతుడు, అతని సరి వయస్కులు ఎవరూ అతన్ని మల్ల యుద్ధంలో ఓడించలేదు. భీముడు పోటీలో గెలిచిన ప్రతిసారి అందరినీ ఆకర్షించడాన్ని చూసి, దుర్యోధనుడు ఎలాగైనా ఇతన్ని మల్ల యుద్ధానికి ఆహ్వానించి రాజ భవనంలో అందరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఓడించి అవమానించాలని ఆలోచించాడు. ఆ పోటీ అందరికీ సరదా అయినప్పటికీ, వారిద్దరికీ మాత్రం ఒకరినొకరు అంతమొందించుకునే పోరాటం. కానీ భీముడు ఎలాంటి కష్టం లేకుండానే అతన్ని ఒక్క క్షణంలో పడగొట్టాడు. దుర్యోధనుడు తీవ్రంగా భంగపడ్డాడు. ఓటమి పరాభవంతో అతనిలోని కోపం మరింత రాచుకుంది. అతనిలోని ద్వేషాన్ని దాచి పెట్టలేకపోయాడు.

భీముని చంపేందుకు దుర్యోధనుడు పథకం వేయడం ప్రారంభించాడు. ఈ సమయంలోనే, అతని మేనమామ శకుని రాజభవనంలోకి ప్రవేశించాడు. భారత దేశంలో మోసానికి ప్రతీకగా శకునిని చూస్తారు. శకుని గాంధారికి సోదరుడు. గాంధారి, ధృతరాష్ట్రుల వివాహం జరిగిన తరువాత, గాంధారి ఇది వరకే విధవ అని ప్రజల మాటల ద్వారా భీష్ముడు తెలుసుకున్నాడు. వివాహం జరిగిన మూడు నెలల్లో భర్త చనిపోతాడనే శాపం గాంధారికి వుండటం వల్ల దానిని తప్పించడానికి, ఆమెను మొదట ఒక మేకతో వివాహం జరిపి, దానిని చంపి తరువాత ధృతరాష్ట్రునితో వివాహం చేశారు. ఇది తెలిసి భీష్ముడు కురు వంశానికి మోసం జరిగిందని గాంధారి తండ్రిని, ఆమె సోదరులను రాజ భవనంలో నిర్భందం చేశాడు. ఇది ఎంతో అమర్యాద – అతిథులు  వదిలి వెళ్ళలేరు. ఆ కాలంలో ధర్మం ఏమిటంటే పెళ్ళికూతురు కుటుంబం తాము పిల్లను ఇచ్చిన వారి నుంచి, తాము సేవ పొందుతున్నంత కాలం వారి ఇంటిని వదిలి వెళ్ళరాదు.

ప్రతీకారం కోసం శకుని జీవించడం 

కాలం గడిచేకొద్దీ, వారికి ఇచ్చే ఆహార పరిమాణం తగ్గుతూ వచ్చింది. ఒక దశలో వారు తమ శరీర బరువును కోల్పోయి, బలహీనులుగా మారారు. మీరు చూస్తుంటారు ఈనాటి విలాసవంతమైన హోటల్స్ లో పెద్ద పెద్ద పాత్రలు మీ ముందు టేబుల్స్ పై వుంటాయి, కానీ వాటిని తెరచి చూస్తె, ఆహారం కొద్ది పరిణామంలోనే అందులో చూస్తారు. ఇటువంటి మర్యాదనే వారూ పొందారు. అలా కొద్ది కాలంలో, గాంధారి తండ్రి, ఆమె సోదరులు చిక్కి శల్యమయ్యారు. పిల్లనిచ్చిన వారు తమను ఆకలితో చంపాలనుకుంటున్నారని వారికి అర్థమైంది. కానీ సాంకేతికంగా వారు ఇంకా సేవ పొందుతున్నారు, కనుక వారు వెళ్ళలేరు – అది వారి ధర్మం. 

చివరకు వారిలో ఒక్కరు తప్ప మిగిలిన వారందరూ చనిపోయే వరకూ ఉపవాసం చేయాలనే  నిర్ణయానికి వచ్చారు. వారి ఆహారం అంతా వారిలో అత్యంత తెలివైన శకునికి ఇచ్చారు, దానివల్ల అతను బ్రతికి తమను ఈ విధంగా చంపిన వారిపై పగ తీర్చుకుంటాడని వారు అనుకున్నారు. శకుని సోదరులు చనిపోతుంటే, అతని తండ్రి వారి శరీర భాగాలను తినమని ప్రోత్సహించేవాడు. అతని తండ్రి చనిపోయినపుడు, తమ దేశంలో కర్మ క్రియలు చేయాలని, ఆ ప్రదేశాన్ని విడచివెళ్ళాడు.

ఈ విధంగా శకుని తన సోదరుల శవాలను కోసి వారి కాలేయం, మూత్రపిండాలు, గుండె తిన్నాడు. ఆ సమయంలోనే ఆయన తండ్రి మరణ శయ్య నుంచి చేతి కర్ర సాయంతో లేచి వచ్చి శకుని ప్రక్కన కూర్చిని అతని కాలి చీలిమండను (ankle) ఒక దెబ్బతో విరగ్గొట్టాడు. శకుని నొప్పితో గట్టిగా అరచి ఎందుకు ఇలా చేశారని తండ్రిని అడుగగా, ఆయన ‘నేను నీ కాలి చీలి మండను విరగ్గొట్టాను, దీంతో నీవు ఎప్పుడూ కుంటుతూ నడుస్తావు, అందువల్ల నీ సోదరుల శవ భాగాలను నీవు ఎందుకు తినవలసి వచ్చిందో ఎన్నటికీ మరచిపోవు. నువ్వు వేసే ప్రతి అడుగూ, నీవు బ్రతికున్నది ప్రతీకారం తీర్చుకోవడానికే అని గుర్తు చేస్తూ వుంటుంది. ఇలా తన తండ్రి చనిపోయిన తరువాత, శకుని ఎలాగైనా సరే కురు వంశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో ఆ దేశాన్ని వదలి వెళ్ళాడు. కొద్ది కాలం గడచినా తరువాత అతను సలహాదారునిగా తిరిగి వచ్చి, దుర్యోధనుని దృష్టిలో తెలివైన వాడిగా  అనిపించుకుని, అతని  అభిమానాన్ని, స్నేహాన్ని పొందాడు.

శకుని తండ్రి తాను చనిపోవడానికి ముందు అతనితో ‘నేను చనిపోయినపుడు, నా వ్రేళ్ళను కోసి, దానితో పాచికలు తయారుచేయి. నాకున్న రహస్య శక్తులతో ఆ పాచికలు ఎప్పుడూ నీవు కోరుకున్న విధంగా పడేలా చేస్తాను. దీంతో పాచికల ఆటలో ఎవ్వరూ నిన్ను ఓడించలేరు – ఇది ఒక నాటికి నీకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని చెప్పాడు. ఈ విధంగా శకుని తన తండ్రి వ్రేళ్ళను కోసి దానితో పాచికలు తయారు చేశాడు. అతను ఒక యోధుడిలా సాధన చేయలేదు, కానీ ఈ పాచికలనే సైన్యంగా చేసి ఈ ప్రపంచాన్నే గెలవగలనని నమ్మాడు.

శకుని, దుర్యోధనుల కుట్ర

దుర్యోధనుడి వల్ల తన పని సులువు అవుతుందని శకుని కనుగొన్నాడు – ఎందుకంటే అతను ద్వేషం, అసూయ వంటివి కలిగి వున్నాడు, దీంతో శకుని వాటిని మరింత రెచ్చగొట్టడం ప్రారంభించాడు. దుర్యోధనుడు తన స్వంతంగా మోసకారి కాదు, కానీ దుడుకు/ కోపిష్టి స్వభావం కలవాడు. తన మనసులో ఏముందో అది తరచుగా – ముఖ్యంగా తన తండ్రి ముందు చెప్పేవాడు. దీన్ని శకుని చూచి అతనితో ‘దుర్యోధన, దేవుడు మనిషికి మాటలు ఇచ్చింది బయటకు చెప్పేందుకు కాదు, వాటిని మనసులోనే దాచి వుంచాలి’ అని చెడు ఆలోచనలు చెప్పేవాడు. ఈ రకమైన మనో స్వభావం కలవాడు శకుని. శకుని నెమ్మదిగా చెడు విషయాలను, ఆలోచనలను దుర్యోధనుని మనసులో, బుద్ధిలో చేర్చేవాడు, ఆ చెడు అతని శరీరంలోని ప్రతి అణువులో చేరే విధంగా చేశాడు. తరువాత శకుని దుర్యోధనుడితో ‘నీకు శత్రువు అనేవాడు వుంటే, అతన్ని గిల్లి రచ్చ పెట్టుకోవడంలో, దూషించడంలో ఎలాంటి లాభం లేదు – అందువల్ల శత్రువు మరింత బలవంతుడు అవుతాడు. అవివేకి మాత్రమే ఇలాంటి పనులు చేస్తాడు. నీ శత్రువును నీవు గుర్తించిన మరుక్షణం అతన్ని చంపేయి’ అని పురిగొల్పాడు. దీంతో దుర్యోధనుడు ‘నా దాయాది సోదరున్ని ఎలా చంపాలని’ ప్రశ్నించగా, ఇందుకు శకుని అనేక చెడు ఉపాయాలు చెప్పాడు.

తరువాయి భాగం త్వరలో..