ఒక ఢంకా నాదం, టపాసులు పేలడం, ఒక పొలికేక, చప్పట్లు, ఆకుల గలగల, ఇంకా అటువంటి కోటానుకోట్ల శబ్దాలు అన్నీ కలిసే, ఈ మానవ అనుభూతిని కలిగిస్తున్నాయి. ప్రాధమికంగా చూస్తే, శబ్దం అంటే ఒక ప్రకంపనం; మీరు చూసేది, తాకేది కూడా అదే. మీరు సృష్టిగా అనుభూతి చెందుతున్నదంతా ఒక రకమైన ప్రకంపనే.  శబ్దానికీ, నిశ్శబ్దానికి మధ్యా, ప్రకంపనకు, నిశ్చలత్వానికి మధ్యనున్నవాటన్నిటిని, అనేక పేర్లతో పిలిచారు, వాటిని అనేక విధాలుగా విభజించి గుర్తించారు. సాంప్రదాయకంగా, మనం దానిని ‘‘శివుడు - శక్తి’’ అంటాము. ఇతర సంస్కృతులలో వాటిని ‘యిన్ - యాంగ్’ అని అలాగే ‘పురుషుడు - స్త్రీ’ అని, ‘తర్కం - సహజ స్ఫూర్తి’ అని ‘ఇది - అది’ అంటూ ఎన్నో పేర్లు ఉన్నాయి. ‘ఇది - అది’ లో తప్పేమీ లేదు కానీ ‘ఇది - అది’ అనేది కేవలం పైపైన విషయమే.

ధ్యానలింగం అనేది ఈ ‘ఇది - అది’ అనేదానికి పరమాద్భుతమైన వ్యక్తీకరణ , కానీ దాని వేళ్ళు ‘ఇది’ లోనే ఉన్నాయి. నేను కూడా అలాగే ఉన్నాను, మీరు కూడా అలాగే ఉన్నారు, ప్రతిదీ అంతే. మిమ్మల్ని మీరు ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు అన్న గుర్తింపు ఏర్పరచుకొని ఉండవచ్చు, కానీ నిజానికి మీరు ఆ రెండూ కూడానూ, ఎందుకంటే ఒకటి లేకుండా మరొకటి ఉండదు. ఒకటి లేకుండా, రెండవ దానికి ఉనికి లేదు. ఎందుకంటే ఆ రెండింటికీ కూడా మూలం ఒకటే. ఇది పుష్పం, ఫలం లాగా, భూమి, చెట్టూ లాగా, ఒక్కటిగా ఉన్నప్పటికీ, భిన్నమైనవి. మీరు ఇలా భిన్న ధ్రువాలను ఒక్కటిగా కలిపినప్పుడు, అవి నిచ్చెనకు ఉన్న రెండు వాసాల లాంటివి. ఒకరు పైకి చేరటానికి రెండూ అవసరమే, కానీ అదే సమయంలో మీరు అవి ఒకటి కాదు ‘రెండు’ అనుకుంటే, మీరు ఇంక పైకి వెళ్ళలేరు. అది అంతా ఒక్క నిచ్చనే.

ధ్యానలింగం అలాంటి ఒక నిచ్చెన లాంటిదే. ధ్యానలింగానికి ఏడు రింగులు ఉన్నాయి కానీ నిజానికి అవి నిచ్చినలోని మెట్ల లాంటివి. మానవ శరీరానికి కూడా అలాగే ఏడు అంచెలు ఉన్నాయి. ప్రతిదీ అలాగే చేయబడింది. ఉన్న ప్రశ్నల్లా మీరు ఎక్కుతారా, ఎక్కరా? అన్నదే. అలా నిచ్చన ను పూర్తిగా పైకి ఎక్కిన వారికి ప్రతీకే ధ్యానలింగం, ఇప్పటివరకు ఎవరికైతే ఇంకా ఎక్కే ఉద్దేశ్యంలేదో, అది అలాంటి వారిని ఉత్తేజ పరచటానికి. కానీ అన్నింటికీ మూలం ఒక్కటే..ఇది ఇదే..! దానిని ఒకటే అనటం తప్పు. ‘ఇది - అది’ అనేది ఒకటి, రెండు అయితే, అప్పుడు ‘ఇది, ఇది’ ఒక పెద్ద సున్న అవుతుంది.

మొత్తం సంఖ్యా శాస్త్రానికి మూలం సున్నానే. మీకు పది వేళ్ళు ఉన్నాయి కాదా అని, ఒక సున్నా ఉంది అనుకోవద్దు. మనం ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది ఆ తర్వాత ఏమి చేయాలో తెలియదు కాబట్టి ‘సున్నా’ కనిపెట్టాము అనుకోవద్దు. అక్కడ ఏమి పెట్టినా సరిపోయేది. మనం ఏదో ‘సున్నా’ ని కనిపెట్టాం కాబట్టి, ‘సున్నా’ ను పెట్టలేదు అక్కడ. అసలు సంఖ్యలకు మూలం ‘సున్నా’ నే. అసలు సృష్టి మొత్తానికీ మూలం ‘సున్నా’ లేదా శూన్యమే. శూన్యం యొక్క అపారతను ముందు మరే సంఖ్యా సరితూగలేదు, ఎందుకంటే ఏదైతే లేదో,(శూన్యం) అది అపారమైనది. ఒక సంఖ్య అన్నపుడు,అది పరిమితమైనది. దానిని మీరు ‘అర్బుదం(లక్ష కోట్లు)’ అన్నా కూడా అది కూడా పరిమితమైనదే. ఒకప్పుడు పదిరూపాయలతో ఇప్పుడు లక్ష రూపాయలు పెడితే కొనగలిగినవి కొనగలిగే వాళ్ళం. డాక్టరు అయిన మా నాన్నగారు, తన మనవడికి ఐటి ఉద్యోగిగా ముప్ఫైవేల రూపాయల జీతంతో ఉద్యోగం వస్తే, ఆయన ఆశ్చర్యపోవడం నాకు తెలుసు. ఎందుకంటే డాక్టరుగా ఆయన వంద రూపాయల జీతంతో మొదలు పెట్టారు. ఆయన ‘నేను డాక్టరుగా మొదలు పెట్టినప్పుడు వంద రూపాయల జీతమే వచ్చింది, ‘దేనికీ పనికిరాని వీడికి’ ముప్పైవేల రూపాయల జీతమా?’ అని ఆశ్చర్య పోయారు. కాని ఇప్పుడు ముప్పైవేల రూపాయలతో, అప్పుడు వంద రూపాయలతో కొనగలిగినవి కూడా కొనలేము. అందుకే నంబర్లకు సందర్భపరంగానే విలువ ఉంటుంది. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. బాగా ముస్తాబైన ఒక యువకుడు రోడ్డుమీద నడుస్తున్నాడు. చింకి బట్టలతోవున్న, మనిషి ఒకడు అతని దగ్గరకు వచ్చి, ‘కాఫీకి ఓ రెండు డాలర్లు ఇస్తావా?’ అంటూ వచ్చాడు. ముక్కులు ఎగ పీలుస్తూ, ఆ యువకుడు‘ రెండు డాలర్లు అడగడానికి నీకెంత ధైర్యం? కాఫీ ఓ డాలరు లోపే వస్తుంది అన్నాడు. దానికి ఇతను నవ్వుతూ ‘నువ్వుకూడా నాతో కలస్తావనుకుంటున్నాను’ అన్నాడు.

సున్నా ప్రాముఖ్యత

మీరు భిన్న ధృవాలు అనుకునేవాన్నీ సృష్టి ప్రక్రియలో ఒక్కటిగా కలప బడ్డాయి. మీరు ‘ఈ భిన్నత్వంతో కావలసినంత ఆడుకోవచ్చు, కాని మీరెప్పుడైతే సృష్టిలోని ఏకత్వాన్ని గమనించకుండా ద్వైతంలో మునిగా పోతారో, అప్పుడే మీ నాటకం ప్రారంభమౌతుంది. మీ నాటకం మొదలవుతుంది, కానీ దానికి దర్శకులు మీరు కాదు, మీరు కేవలం ఒక నటుడిగానే ఉంటారు, అప్పుడు అది ఒక ట్రాజిడీ అవ్వవచ్చు. మీరో, హీరోనో, హీరోయినో కావచ్చు, అయినా అది ఒక ట్రాజిడీ కావచ్చునేమో ఎవరికి తెలుసు? సామాన్యంగా చాలా గొప్ప నాటకాలు ట్రాజిడీలే (దు:ఖాంతం) . కాని మీరు ఏకత్వాన్ని గ్రహించగలిగితే, మీరు సృష్టిలో శూన్యాన్ని అవగాహన చేసుకుంటే, అది మీకు అనుభవంలోకి వస్తే, మీరే ఆ నాటకానికి దర్శకులు కావచ్చు. అది దు:ఖాంతమా, సుఖాంతమా అన్నది మీకు ఇంక పట్టదు, దానికి ఇప్పుడు మీరే దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీరు ద్వైతంతో గుర్తింపు ఏర్పరచుకుంటే మీరే నాటకం అవుతారు, అప్పుడు నాటకం ఏ విధంగానైనా నడవవచ్చు, ఎందుకంటే అక్కడ దర్శకులే లేరు కాబట్టి, అది దు:ఖాంతం కూడా కావచ్చు. చాలా వరకు, దర్శకులు లేకపోతే ఏ పరిస్థితి అయినా ట్రాజెడీనే, ఎప్పుడో ఒకసారి అది సక్రమంగా జరుగుతుంది.

అందువల్ల, ధ్యానలింగం సానిధ్యంలో ఉండడం అంటే అదే, ఏడు చక్రాలూ వ్యక్తమై ఉన్నాయి, అంటే పూర్తి శ్రేణి అంతా, అంటే జీవితంలోని అతిశయమంతా లభిస్తున్నది, కాని అదే సమయంలో అది మిమ్మల్ని శూన్యంగానే మిగిలిస్తుంది. మీకె ప్పుడు, డాన్స్ చేయాలో, ఎప్పుడు అడుగు వెయ్యాలో ‘‘ఒకటీ , రెండూ, ఛ- ఛ- ఛా...?’’ కదలికలూ, సంఖ్యలూ ఒకటే. నిశ్చలత, శూన్యమూ ఒకటే. మీరు శూన్యాన్ని విస్మరిస్తే, సంఖ్యలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతాయంటే, మీరు దేనిలోకి ప్రవేశించారో, మీకు తెలియదు. మీరు ఎప్పుడూ శూన్యాన్ని దృష్టిలోనే పెట్టుకుని, సంఖ్యలతో ఆడుకుంటే, అప్పుడు సంఖ్యలు అందంగా ఉంటాయి. సున్నా లేకుండా సంఖ్యా విధానం ఎలా ఉంటుందో ఊహించుకోండి. చిన్న చిన్న వాటికి కూడా మీకు వెర్రి ఎత్తి పోతుంది. ఇది చాలా మందికి జరుగుతోంది. ఒకటి, రెండు లెక్కించడానికే వాళ్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకా ఇద్దరే, మిగతా ఇద్దరూ ఇంకా రావాలి, అయినా వారికి అప్పుడే పిచ్చి ఎక్కిపోయింది. ఒకటీ, రెండే ఎంతో జటిలమై పోయింది, ఎందుకంటే మీకు సున్నా మీద ధ్యాస పోయింది.

ధ్యానలింగం మితమైనది, అమితమైనది కూడా.

ధ్యానలింగం ఎలాంటి సంభావ్యత అంటే ఏకకాలంలోనే సంఖ్యల వల్ల ఉత్తేజాన్ని ప్రతిధ్వనిస్తునే గాఢమైన శూన్యత ఉపస్థితి కలిగి ఉంటుంది. ధ్యానలింగం సానిధ్యంలో జీవం యొక్క మరో కోణం తెలుసుకోవడం సులువౌతుంది. ఇది అంతర్లీనంగా ఉన్న కోణం, ఇదే సృష్టి కున్న అతి పెద్ద కోణం,అంతేకాదు, జరుగుతున్న ఈ కేళి అంతా కేవలం పంచ భూతాలతోనే. జీవరాశుల్లో ఉన్న వైవిధ్యం చూడండి, ఈ బ్రహ్మాండానికి ఉన్న పరిమాణం చూడండి. ఇదంతా కేవలం ఐదు మూలకాలతోనే జరుగుతోంది. మరి ఈ సృష్టి ఓ గొప్ప కళాఖండం కాదూ? కేవలం అయిదే అయిదు పదార్ధాలతో, మీరు ఎన్నెన్ని చేయగలరన్నది నమ్మశక్యం కానిది.

నిజానికి సంఖ్యాపరంగా అయితే, మనం రెండు చేతులకు బదులు, ఒక చేతితోనే లెక్కించవచ్చు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, లేక దానిని ‘ఒకటి, రెండు, మూడు, నాలుగు, పది అనవచ్చు. మనం సున్నాని ఇక్కడే తగిలించవచ్చు. అలా చేసినా, అది పని చేసేదే. ఎందుకంటే మనం, మనకు కావాల్సిన విధంగా దానిని పని చేయించవచ్చు. సంఖ్యా శాస్త్రంతో కానీ, మీ జీవితంతో కానీ  జరిగేది అదే. మీరు జీవితంలో ఈ హద్దులు లేని సున్నాతో స్పర్శలో ఉన్నంత సేపూ, దానిని మీకు కావాల్సిన విధంగా పని చేయించుకోవచ్చు. కానీ మీ మనసుతో మీకున్న సమస్య ఏమిటంటే మీరు ఆ సున్నాని, మీ దృష్టి నుండి దూరం చేసుకున్నారు. అందుకే మీకు ఈ రోజు ఏమిటో, రేపు ఏమిటో, నిన్న ఏమిటో, తెలియడం లేదు. ఇంత చిన్న విషయమే, కానీ గజ బిజి అయిపోయింది. నిన్నటి విషయాలు మీలో జీవిస్తూనే ఉన్నాయి. నిన్నేం ఖర్మ, క్రిందటి జీవితంలోని అనర్థం కూడా, మీలో ఇంకా నిలిచే ఉన్నది. రేపు జరగవలసిన విషయాలు మిమ్మల్ని ఇప్పటికే బాధ పెడుతున్నాయి. పదేళ్ల క్రితం జరిగింది ఇంకా మిమ్మల్ని బాధిస్తూనే ఉంది. ఎల్లుండి జరగవలసింది కూడా మిమ్మల్ని ఇప్పటికే బాధ పెడుతోంది.

ఒకసారి సున్నా ఇలా మీ దృష్టి నుంచి చెదరి పోతే, ఇక మీకు ఈ రోజు ఏమిటో, రేపు ఏమిటో, నిన్న ఏమిటో తెలియదు. అన్నీ కలగలసి పోతాయి. ఒకసారి శంకరన్ పిళ్ళై ఒక మానసిక వైద్యుని దగ్గరకు వెళ్లి గంటలకొద్దీ ఎన్నో చెప్పుకున్నాడు. అన్నీ విన్నాక ఆ మానసిక వైద్యుడు ‘చూడండి, నిజానికి మీరు చెప్పిన విషయాలు ఏవి అసలు జరగనేలేదు?’ అన్నాడు. దానికి శంకరన్ పిళ్ళై వెంటనే, ‘‘వద్దు, వద్దు మీరు అలా అనవద్దు. ఆ విషయం నేను గ్రహిస్తే అలా ఎందుకు జరగలేదు అని నేను బాధపడడం మొదలెడతాను’’ అన్నాడు. చూడండి, ఇలా మనుషులు తమ ఊహలనే ఆస్వాదిస్తారు. అదే పెద్ద సమస్య. మీకు గనక సున్నా దృష్టిలో ఉంటే సంఖ్యలు అనేవి ఒక ఆట మాత్రమే, లేకపోతే అవి అలా కోకొల్లలుగా రెట్టింపు అవుతాయి. అది మిమ్మల్ని పిచ్చి వారిని చేస్తుంది.

ధ్యానలింగం అనే అద్భుతం

కేవలం శూన్యం నుంచి కోటాను కోట్ల నక్షత్ర మండలాలు పట్టుకొచ్చాయి, మళ్ళీ అలాగే ఏదో సమయంలో అవి ఆ శూన్యంలోనే లీనమైపోతాయి. మీకు ఇంతకన్నా మరేమి అద్భుతాలు కావాలి? మీరు ఓ కీరా ముక్క తింటే, అది మనిషి శరీరం అయిపోతోంది, మీకు ఇంకా ఏమి అద్భుతం కావాలి? ఇంత ధృడమైన జీవం, కాని ఒక నిశ్వాస తరువాత , మళ్ళీ ఉచ్వాస తీసుకోపోతే, అది అలా ఆవిరైపోతుంది. ఇంతకంటే మీకు మరేమి అద్భుతాలు కావాలి?

ధ్యానలింగం ఎటువంటి సాధనం అంటే, మీరు పంచభూతాలతో ఆడుతున్నా సరే, అదంతా ఒక పెద్ద శూన్యమే. శూన్యం నించే అన్నీ వస్తున్నాయి. అన్నీ శూన్యం లోకే ఐక్యం/లయం అవుతున్నాయి. ధ్యాన లింగం ఓ మేల్కొలుపు, జీవిత పారవశ్యానికి అభివ్యక్తీకరణ, , అదే సమయంలో, శూన్యం వంటి పరిపూర్ణ నిశ్చలత. శూన్యం యొక్క నిశ్చలత, అన్నింటి యొక్ అతిశయం అన్నీ ఒక్క దానిలోనే ప్రతిష్టింపబడ్డాయి, అదే ధ్యానలింగం యొక్క అద్భుతం. నేను అద్భుతం అనగానే, నేను ఈ పాత్రలోనుంచి ఏనుగు పిల్లను తీస్తే, అందరూ అదే అద్భుతం అనుకుంటారు. అద్భుతం అది కాదు. ఏనుగు పిల్లను పుట్టించడం ఏనుగులకే వదిలేద్దాం. మనం వాటినేమీ రాగి పాత్రల్లోనుంచి సృష్టించనక్కరలేదు.

పరమ శూన్యం నుంచి అన్నీ పుట్టుకురావడమే గొప్ప అద్భుతంగా చూడలేని సున్నితత్వం లోపించినవారే, ఇలాంటి మోటు అద్భుతాలకై ఎదురు చూస్తారు. వారి దృష్టిలో అద్భుతం అంటే ‘నాకో బంగారు గొలుసు తీసి పెడతారా?’. మొద్దు ముఖాలే ఇటువంటి అద్భుతాలకై ఎదురు చూస్తాయి, ఎందుకంటే అస్థిత్వము లోని అతి పెద్ద అద్భుతాన్ని చూడలేక పోతున్నారు. కేవలం శూన్యం నుంచి కోటాను కోట్ల నక్షత్ర మండలాలు పుట్టుకొచ్చాయి, మళ్ళీ అలాగే ఏదో సమయంలో అవి ఆ శూన్యంలోనే లీనమైపోతాయి. మీకు ఇంతకన్నా మరేమి అద్భుతాలు కావాలి? మీరు ఓ కీరా ముక్క తింటే, అది మనిషి శరీరం అయిపోతోంది, మీకు ఇంకా ఏమి అద్భుతం కావాలి? ఇంత ధృడమైన జీవం, కాని ఒక నిశ్వాస తరువాత , మళ్ళీ ఉచ్వాస తీసుకోపోతే, అది అలా ఆవిరైపోతుంది. ఇంతకంటే మీకు మరేమి అద్భుతాలు కావాలి? ఇవి అన్నీ ఎంతో గొప్ప అద్భుతాలే. మీరు అది చుడలేనప్పుడే, బంగారం గొలుసులు కావాలంటారు. ఇప్పటికే మీరేవో గొలుసుల్లో చిక్కుకు పోనట్టు. నామాట నమ్మండి, మీరు ఇప్పటికే పూర్తిగా గొలుసుల్లో చిక్కుకు పోయే ఉన్నారు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు