ప్రశ్న: సద్గురూ, ప్రతి ఒక్కరికీ తమ సొంత జీవితం, స్వేచ్ఛ, ధర్మము ఇతరుల ధర్మంతో ఘర్షణ లేకుండా నిర్వహించుకోవచ్చని మీరు అన్నారు. కానీ ఈ కాలంలో అది వ్యతిరేకంగా, అటు నుంచి ఇటు పని చేస్తుంది అనుకుంటాను. మనం మన వ్యక్తిత్వాన్ని బట్టి మన ధర్మాన్ని తయారు చేసుకుని, మరొకరి ధర్మంలోకి చొరబడుతున్నాము కదా?

సద్గురు: అందుకనే నేను అది ఎంతో సునిశితమైన విషయం అంటాను. మనకున్న కొన్ని చిన్న చిన్న అవసరాలను బట్టి మనం మన ధర్మాన్ని నిర్మించుకుంటున్నాము, అటువంటప్పుడు మనం ఎదుట వారి ధర్మంతో ఢీ కొట్టవలసి వస్తుంది. అందుకనే మనుషులు తమ వ్యక్తిగత ధర్మాన్ని సర్వోత్తమమైన ఆకాంక్ష నెరవేరడానికీ, అది మరెవరి ధర్మంతోనూ ఢీ కొట్టకుండా ఉండేలానూ నిర్మించుకుంటారు, కానీ రోడ్డుమీద నడవాలంటే, ఇంట్లో, మార్కెట్లో అన్ని చోట్ల ఆచరించటానికి అక్కడ ఒక సామాన్య ధర్మం ఉంటుంది. దానిని అందరూ ఆచరించవలసి ఉంటుంది. ఉదాహరణకి రోడ్డుమీద ప్రయాణం చేయడం గురించి ఆలోచిస్తే, అందరూ ఒక పక్క నుంచే వెళ్లాలని నిర్ణయింపబడింది. ఇది సాధారణ ధర్మం. మీకు ఏదో వేరే రకమైన వ్యక్తిగతమైన ధర్మం ఉంది కాబట్టి, దీనిని మీరు అతిక్రమించలేరు.

ధర్మం అనేది అనేక అంచెలుగా ఉంటుంది

మీ వ్యక్తిగత ధర్మం అనేది మీరు మీ సర్వోన్నత స్థితికి చేరడం గురించి. ముఖ్యంగా అది అంతర్గత ప్రక్రియ. అందువల్ల అది మరొకరి ధర్మంతో పోటీ పడకుండా ఉంటుంది. అలా కాకుండా, నియమాలు, సూచనలు అనేవి సాధారణ ధర్మం. వాటిని అందరూ పాటించాలి. మనం దానిని ప్రశ్నించినప్పుడు అక్కడ ఘర్షణ ఉంటుంది. అందుకే ధర్మం అనేక స్థాయిల్లో ఉంటుంది. కుటుంబంలో జీవించడానికి ఒక రకమైన ధర్మం ఉంటుంది. ఒక సన్యాసిగా ఉండడానికి మరొక రకమైన ధర్మం ఉంటుంది. రాజుగా ఉండడానికి మరొక రకమైన ధర్మం ఉంటుంది. వ్యాపారం చేయడానికి మరొక రకమైన ధర్మం ఉంటుంది. ఇలా అనేక ధర్మాలు. కానీ ఒక జీవంగా, మీకు ఎటువంటి ధర్మం కావాలి అని ఎంచుకునే స్వేచ్ఛ మీకు ఉంది. దానికి మీరు అంటిపెట్టుకుని ఉండాలి. పరమోత్తమ ముక్తి అనేది మీరు ఏదో చేయడం వల్లరాదు. కానీ ఏదో ఒక ధర్మానికి అంటిపెట్టుకుని ఉండటంలో, ఎటువంటి పరిస్థితుల్లోనూ దానిని తప్పకుండా ఉండడంవల్లనే జరుగుతుంది. ‘నిశ్చలతత్వం, జీవన్ముక్తి’ అంటే మీరు ఒకే దిశలో నిశ్చలంగా ఉండాలి, మీరు మీ దిశను ప్రతిరోజూ మార్చుకుంటుంటే పోతే, మీరు గుండ్రంగా తిరుగుతూ ఉండిపోతారు, అంతేకాని ఎక్కడికీ చేరలేరు.

ప్రశ్న: సద్గురూ, మీరు అత్యున్నత ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, ధర్మం అంటే కొన్ని న్యాయ సూత్రాలు. అలా కొన్ని న్యాయ సూత్రాలు, నిమయాలు పెట్టుకోవడం అని. అలా నిర్ణయించుకోవటం కన్నా, జీవితంలో జరిగే పరిస్థితులను బట్టి, మన జీవితాన్ని ఎందుకు మార్చుకోకూడదు?

సద్గురు: జీవితం అనేది వచ్చేది కాదు, జీవితం అనేది ఎప్పుడూ సృష్టింపబడుతుంది. అది మీరు నిన్న తయారు చేసుకున్నారో, లేక మీరు దానిని ఈ రోజే తయారు చేసుకుంటున్నారో, అంతేగాని ఏదీ తనంత తానుగా రాదు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి - ధర్మము, కర్మము. మీరు సరైన కర్మం తయారుచేసుకోవాలంటే మీకు ధర్మం ఉండాలి, లేకపోతే ప్రతి రోజూ, ప్రతి క్షణం, మీరు చేసే పనులు అనేక అస్తవ్యస్తాలకు దారితీయవచ్చు. మీరు చేసే కర్మనుబట్టి ధర్మం తయారు చేయబడుతుంది, ఎందుకంటే మీ జీవితాన్ని మీరు ఏ దిశలో పోవాలనుకుంటున్నారో, దానిని బట్టి తయారు చేసుకోవచ్చు. మీ జీవితాన్ని మీరు తయారు చేసుకోవడం అంటే మీరు మీ కారును, ఇంటిని, లేక పెళ్లి చేసుకోబోయే వారిని ఎన్నుకోవడం లాంటిది కాదు. ఇవన్నీ అంత ముఖ్యమైన విషయాలు కాదు. అసలు విషయం, మీరు ఏ రకమైన జీవిగా తయారవుతారు అన్నది. ఇదే - మీరు ఏమిటి, మీ జీవితం ఎలా ఉంటుంది, మీరు ఎంత బాగా జీవిస్తారు, ఇక్కడ, ఆ తర్వాత అనే విషయాలను నిర్ణయిస్తుంది. మీరు ఎవరితో ఉన్నారు? మీ చుట్టూ ఎవరు ఉన్నారు? మీరు ఒక రాజభవనంలో నివసిస్తున్నారా, లేదా? మీరు తినేది భోజనమా, బంగారమా? అనేవి ఏ విధమైన తేడానూ తీసుకురావు. ఒకే ఒక్క తేడా ఏమిటంటే, మీరు బంగారం తింటే త్వరగా పోతారు. అంటే మీకు జీవం అసలు ఎక్కడున్నదో తెలియదు. మీరు అది లేనిచోట తలుపు తడుతున్నారు. ఈ ధర్మాన్ని అనుసరించడం అంటే, మీ కర్మ ప్రాథమిక జీవన ప్రక్రియ నుంచి తప్పుదోవ పట్టకుండా ఉండటానికి. అది మీ ధర్మం ఫలానా విధంగా ఉండాలని మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది.

ధర్మ స్థాపన

ఇది ధర్మాల గురించి ఎందుకంటే మీరు చేసేదంతా అంటే మీ గుండె కొట్టుకోవడం, మీరు శ్వాసతీసుకునే విధానం మీ శారీరక వ్యవస్థ పనిచేసే విధానం, ఇవన్నీ విశ్వానికి ఎంతో గాఢంగా అనుసంధానమై ఉన్నాయి. మీరు ఎరుకతో ఈ ధర్మాలను అవలంబిస్తే, మీరు ఎంతో అద్భుతమైన స్థాయిలో పనిచేయగలుగుతారు. మీరు ఇప్పుడు బాగా లేరు అనుకోండి, దానికి కారణం మీకు తెలియకుండా, మీ శరీరం, మనస్సులు ఈ ధర్మాలను అతిక్రమించి ఉంటాయి. ఈ అతిక్రమణ, ఎరుకతో జరిగినా, ఎరుక లేకుండా జరిగినా, ఫలితం మాత్రం అదే ఉంటుంది. ఉనికి అలానే పనిచేస్తుంది. మీరు కావాలని మేడమీద నంచి దూకినా, లేక కాలు జారిపడ్డా దెబ్బ ఖచ్చితంగా తగులుతుంది. కాకపోతే మీరు స్పృహతో దూకితే మీరు కాళ్ల మీద నుంచోడానికి ప్రయత్నిస్తారు, లేకుండా పడితే ముందు మీ తల పడవచ్చు, అంతే తప్ప, నొప్పి ఇంకా దాని మూలంగా వచ్చే బాధ భిన్నంగా ఉండదు.

మీరు తెలియకుండా మార్గం విడిచినా మీరు ధర్మం తప్పినట్టే. ధర్మం తనకు తెలుసు అనుకున్నంత మాత్రాన పనిచేయదు, దాన్ని అమలు చేస్తేనే అది అతనికి పనిచేస్తుంది. అతను అదే అవుతాడు.

మొదట ధర్మం ఆ తర్వాత కర్మ

భీష్ముడు ‘‘నా ధర్మం కఠినమైనదే, కాని అది నేను తీసుకున్నాను, నేను అదే అయిపోయాను. ఏది ఏమైనా సరే, నా జీవితం పోయినా సరే, ధర్మాన్ని వీడలేను. అది నేనే అయిపోయాను’’ అంటాడు. మీరు అలా ఉంటే, మీ ధర్మాన్ని స్థాపించుకోవడం, తద్వారా మీరు ఎలా ఉంటారో అనేది, మీరు నిర్ణయించుకుంటారు. ‘యోగస్థ కురు కర్మాణి’ అంటే ముందు మీ జీవిని కుదుట పరుచుకుని, అప్పుడు చేయవలసినది చేయండి. ముందు మీ ధర్మం, ఆ తర్వాతే మీ కర్మ. మీరు ధర్మం తెలియక, మీరు ఎక్కువ కర్మ చేస్తున్నారు, ఇదే సమస్య.

మీ ధర్మాన్ని స్థిరపరచుకోపోతే, మీ మార్గం నుంచి మిమ్మల్ని కర్మ తప్పిస్తుంది. ఎందుకంటే చాలావరకు మీరు చేసే కర్మ స్పృహ లేకుండా చేసేదే.

కర్మ కేవలం మీరు చేసే పనులలోనే లేదు. మీరు చేసే అనవసరమైన ఆలోచనలలో కూడా ఉంది. అది కూడా కర్మే. కర్మ అంటే ఒక చర్య. కర్మ నాలుగు స్థాయిలలో జరుగుతుంది, భౌతికమైన కర్మ, మానసిక కర్మ, భావపరమైన కర్మ, శక్తి కర్మ. మీ జీవితంలో ప్రతి క్షణం మీరు చేస్తున్నారు. మీరు తింటున్నా కర్మ చేస్తున్నారు, మీరు నడుస్తున్నా కర్మ చేస్తున్నారు. మీ జీవితంలోని ప్రతి క్షణం, మెలకువగా, నిద్రపోతూ కూడా, మీరు ప్రతి క్షణం కర్మ చేస్తూనే ఉన్నారు. ఈ కర్మ మీ శ్రేయస్సుకు విరుద్ధంగా ఉండకూడదంటే, మీరు మీ ధర్మాన్ని స్థాపించుకోవాలి. మీరు ధర్మం తప్పకుండా, అంటే మీ కర్మ మిమ్మల్ని మీ మార్గం నుంచి తప్పించకుండా ఉండాలంటే, మీరు మీ ధర్మాన్ని స్థిరపరచుకోవాలి. మీ ధర్మాన్ని స్థిరపరచుకోపోతే, మీ మార్గం నుంచి మిమ్మల్ని కర్మ తప్పిస్తుంది. ఎందుకంటే చాలావరకు మీరు చేసే కర్మ స్పృహ లేకుండా చేసేదే. కానీ మీ ధర్మాన్ని మీరు స్థిరపరచుకుంటే, అప్పుడు మీ కర్మ గాడిన పడుతంది. మీ కర్మకు ఒక విధమైన పద్ధతి, లక్ష్యం, తృప్తి ఉంటాయి. మీరు మీ ధర్మాన్ని స్థిరపరచుకోపోతే, మీ కర్మ అన్ని దిక్కులా పరిగెడుతూ ఉంటుంది. మీరు ఏమి చూసినా, మీ మనస్సు, మీ శరీరం, దాని వెనకే పడతాయి. ఆ విధంగా మీరు తికమక పడతారు.

మీ జీవి, మీ శరీరాన్ని వదిలినప్పుడు, దానికి ఎక్కడికి పోవాలో కూడా తెలియదు. దానికి కారణం అది గందరగోళంలో ఉన్నది. ఈ జీవి తికమకలో ఉన్నది, ఎందుకంటే అక్కడ ధర్మం లేదు. మీ జీవి ఈ శరీరాన్ని వదలినప్పుడు, దానికి ఎటు పోవాలో తెలియదు. అదే అతిఘోరమైన పరిస్థితి. మానవునికి జరగగల అతి ఘోరమైనది అదే. దురదృష్టవశాత్తు అదే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే మనుషులు తమ కోసం ఇటువంటి ధర్మాన్ని స్థిరపరచుకోలేదు. అదే స్వేచ్ఛ అనుకుంటున్నారు.

వంశపారంపర్య ఎత్తుగడలను విడిచివేయడం

స్వేచ్ఛ పేరున, నేను రోడ్డు నియమాలను తీసేసాను అనుకోండి. అంటే ఎవరైనా రోడ్డుమీద ఎలాగైనా డ్రైవ్ చేయవచ్చు. కాని దాని మూలంగా జనులు స్వేచ్ఛ పొందరు, నిజానికి వారు చిక్కుకు పోతారు. స్వేచ్ఛ అంటే రూల్స్ ను అతిక్రమించడం కాదు. స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుందంటే, అక్కడ సరైన మార్గం ఉన్నప్పుడే. అందువల్ల జీవితంలో మీకు ఎదురయ్యే వాటికి, మీరు కావాల్సిన విధంగా, స్వేచ్ఛగా, తక్షణం నిర్ణయం తీసుకోగలను అనుకోవద్దు. స్వేచ్ఛగా చేయడం అంటే అది కాదు, అది ఒక విధమైన నిర్బంధత. తక్షణ చర్యలకు కూడా మీకు ఆధారం ఉండాలి. ఆధారం లేకపోతే, కేవలం నిర్బంధతలే ఉంటాయి, అంతేకాని స్వేచ్ఛ కాదు, ఎందుకంటే మీ శరీరం ఏర్పరుచుకున్న విధానం మీచే నిర్ణయించబడింది కాదు. కృష్ణుడు జీవించిన ద్వాపర యుగంలోని మన పూర్వీకుల శరీరం మాదిరిగానే మన శరీరం ఉంది. మధ్యలో వేరువేరు మనుషులు కలిసినా జన్యు సంబంధమైన పద్ధతి అదే, మన పూర్వీకుల జన్యు సంబంధమైన లక్షణాలు మనలో ఇంకా ఆటలు ఆడుతూనే ఉన్నాయి.

మీ ధర్మాన్ని మీరు స్థాపించుకోవడం అంటే, చనిపోయిన వారిని చనిపోయిన వారికే వదిలేసి మీ మార్గాన్ని మీరు ఏర్పరచుకోవడం. అదే స్వేచ్ఛ!

ఒక లక్ష సంవత్సరాలకు పూర్వం జీవించిన వారి జన్యుపరమైన విధానాలు ఇప్పటికీ మీతో ఆటలు ఆడుతూనే ఉన్నాయి. వాటికి అతీతంగా పోయి మీ ధర్మాన్ని స్థిర పరుచుకోవడం అంత తేలికైన విషయం కాదు. ‘ఇది నా ధర్మం’ అని మీరు అంటున్నారంటే, మీరు మీ తాత ముత్తాతలు అందరికీ అతీతంగా నడుస్తున్నారని. మీరు జన్యుపరమైన సంబంధాలను వదిలి వేస్తున్నారని. భీష్ముడు తన తండ్రి కొన్ని విధాలుగా ప్రవర్తిస్తున్నాడని చూశాడు, మాటిమాటికీ ప్రేమలో పడటం అతని నిర్బంధత. ప్రేమలో పడటం భీష్ముని ధర్మమూ కాదు, కర్మమూ కాదు. ‘నేను నా ధర్మం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ దారి తప్పను. నా జీవితం ఈ దేశానికి అంకితమైంది. అదే నేను ఆయ్యాను’ అన్నాడు. జన్యుపరమైన విధానాల నుంచి బయటపడి, అతడు తన విధానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆధ్యాత్మిక సాధన అంటే అదే. మీ గతం మీ జీవితాన్ని నిర్దేశించకుండా, మీ మీద ప్రభావం చూపకుండా, మీ సొంత ధర్మాన్ని మీరు స్థాపించుకుంటున్నారు. అదెలాగంటే, మీరు వినే ఉంటారు. ఎవరో జీసస్ దగ్గరకు వచ్చి, ‘వెళ్లి తండ్రిని పూడ్చిపెట్టి వస్తాను’ అంటే, జీసస్ ‘చచ్చిన వాడిని చచ్చిపోయిన వారికే వదిలేయ్’ అంటారు. ఇది మనకు ఎంతో అమానుషంగా అనిపిస్తుంది. ఎవరి తండ్రో చనిపోతే, అలా మాట్లాడటం దయావిహీనమవుతుంది. కానీ, జీసస్ చెప్పింది అదే. ఆయన తన తండ్రినే కాదు, మీలో వ్యవహరిస్తున్న మీ పూర్వీకుల జాడలను కూడా వదిలేయ్ అన్నాడు. మీరు చచ్చిన వారిని, చచ్చిన వారికే వదిలివేయక పోతే, మీకు మీ సొంత ధర్మమే కాదు, మీ సొంత జీవితం కూడా మీకు ఉండదు. మీ ద్వారా మరొకరు బతికే ప్రయత్నం చేస్తున్నారు. మీ ధర్మాన్ని మీరు స్థాపించుకోవడం అంటే, చనిపోయిన వారిని చనిపోయిన వారికే వదిలేసి మీ మార్గాన్ని మీరు ఏర్పరచుకోవడం. అదే స్వేచ్ఛ!