చైతన్యం ఇంకా ఎరుక అంటే ఏమిటి అర్థం ? చైతన్యం, ఎరుక – ఈ రెండూ రెండు పదాలు, అంతే. రెండిటికి ఏ అర్థమూలేదు. నేను, మిమ్మల్ని జీవితాన్ని అనుభూతి చెందండి అని చెప్పినపుడు – జీవితాన్ని ఒక సబ్జెక్ట్ లాగా చూడకండి. ఏ పదమైనా సరే, ఏ భాషలో ఐనా సరే – దానికి ఎటువంటి అర్థమూ లేదు. ఔనా కాదా ? ఔనా ? మీకు ఇంగ్లీషు భాష రాదనుకోండి, నేను అలా మాట్లాడుతూ పోయాననుకోండి, మీకది ఎలా వినిపిస్తుంది ... ? మీకు నేను ఏదో జ ..జ..జ... అని పిచ్చి భాష మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఔనా? కాదా? మీకు తెలియని భాషలో ఎవరైనా మాట్లాడారనుకోండి, మీకు ఆ పదాలన్నీ కూడా నిజంగా ఏమైనా అర్థం ఉన్నట్టనిపిస్తాయా ? అదంతా మీరు ఇస్తున్న అర్థమే.

“యోగా” పదాలలో లేదు, “యోగా” మౌనంలో వుంది.

నేను మీకు ఎం చెప్పాలనుకుంటున్నానంటే - మీరు ఏమి మాట్లాడినా సరే, జీవిత సారంలో దానికి  ఏమీ అర్థంలేదు. అయినా మనం ఎందుకు మాట్లాడుతున్నాం అన్న ప్రశ్న వస్తుంది. సరే, నేనెందుకు మాట్లాడుతున్నానో చెప్తాను.  మీరు, నన్ను గనక ఇక్కడ అలా మౌనంగా కూర్చోనిస్తే, నేను ఈ రెండు రోజులపాటు ఇక్కడ మౌనంగా కూర్చొని, దీనిని ఇంకా వంద రెట్లు శక్తివంతంగా చేయగలను. కానీ, సమస్య ఏమిటంటే నేనిక్కడ మౌనంగా కూర్చున్నాననుకోండి, మీకు పిచ్చి పట్టినట్టుంటుంది. ఔనా ? కాదా ? నేను ఈ శబ్దాలన్నీ చేస్తున్నాను కాబట్టి మీరు వాటన్నిటికీ ఏదో ఒక తార్కిక అర్థాన్ని చేసుకుంటూ, వింటూ, వింటూ-వింటూ... మీరు మౌనంగా మారిపోయారు. “యోగా” ఇక్కడే వుంది. “యోగా” పదాలలో లేదు, “యోగా” మౌనంలో వుంది. అందుకే నేను కేవలం నాతో వుండండి, దీనిగురించి - దానిగురించి పట్టించుకోకుండా, కేవలం నాతో వుండండి – అని చెప్తున్నాను. మీకు నాతో ఎలా నిమగ్నమై వుండాలో నేను మాట్లాడితే తప్పితే, మీకు తెలీదు. అందుకే నేను మాట్లాడుతున్నాను. అంతేకాని, ఈ చైతన్యమో, ఎరుకో … వీటన్నిటికీ ఏవో అర్థాలున్నాయని కాదు. వీటన్నిటికి ఏ ఆర్థమూ లేదు.

ఏదైనా సరే, మనం పరిభాషలోకి వద్దాం. అవంటే ఎంటో చూద్దాం. ఇప్పుడు చైతన్యంతో వుండడం, స్పృహతో వుండడం – ఆంటే ... ఒక డాక్టరు – మీరు స్పృహతో ఉన్నారు అన్నారనుకోండి .... ఆయన వుద్దేశ్యం ఏమిటి? మీరు స్పృహతప్పి పడిపోలేదు... మీరు స్పృహతో వున్నారు అని అర్థం. అది వైద్య పరిభాషలో. కానీ, మేము చైతన్యం, స్పృహ – అని మాట్లాడినప్పుడు, మేము ఆ విధంగా మాట్లాడటం లేదు. మీ ప్రస్తుత పరిస్థితి ఎదైతే వుందో, ఇది వైద్య ప్రకారం మీరు స్పృహతో వున్నట్టే. కానీ, మా పరిభాషలో మీరు చైతన్యంతో లేనట్లు. స్పృహతో లేనట్లు. ఎందుకంటే, మీకు వేరే కోణాలపట్ల స్పృహ లేదుకాబట్టి. మీకు వాటిపట్ల స్పృహ కలిగినప్పుడు చైతన్యంతో వున్నారు అని అంటాము. ఇది సాపేక్ష విధానం.

ఎరుక అంటే ఏంటి??

ఎరుక అంటే, ఇది మీరేదో చేయగలిగిందో, మీరేదో ప్రాక్టీసు చేసేదో, నెర్చుకోగలిగిందో కాదు. మీరు ఎంతవరకు ఎరుకతో వున్నారో అంతవరకు సజీవంగా వుంటారు. మీకు ఎదైతే ఎరుకలో లేదో, అది మీకు అనుభూతిలో వుండదు. అవునా ? కాదా ? ఎదైతే మీ ఎరుకలో వుందో, అదే మీ అనుభూతిలో వుంటుంది. మీరు ఎదైతే ఎరుకలో లేరో – అది మీ అనుభూతిలో వుండదు. అందుకని “ఎరుక” అంటే, అది – “మీరే”. మీరే “ఎరుక”. మీరిప్పుడు ఎరుకతో వున్నారు. ఉన్నారా ? మనం భాషతో ఆడుకోవడం మానేద్దాం.

మీ ఎరుకను ఎప్పుడు పెంపొందించుకోగలరంటే, మీ శక్తి ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి కదిలినప్పుడే.

ఇప్పుడు మీ ఎరుక - కొన్ని సరళమైన విధానాల ద్వారా మీరు ఇప్పుడున్న స్థితిని మెరుగు పరచుకోవచ్చు. అప్పుడు మీ అనుభూతి – మీరు ఈ ప్రపంచంలో ఎలా పని చేస్తున్నారు, మీరు ఇక్కడ ఎలా వున్నారు, మీరు జీవితాన్ని ఎలా అనుభూతి చెందుతున్నారు – ఇవన్నీ కూడా ఎంతో మార్పు చెందుతాయి. ఎందుకంటే, మీ ఎరుక మరిన్ని ఆవశ్యకతల్ని దాని పరిధిలో చేర్చుకుంది కాబట్టి. దీన్ని పోల్చి చెప్పాలనుకోండి ... మీ ఎరుక  ఒక బల్బులాంటిది అనుకోండి. ఇక్కడ ఒక బుల్బు వుందనుకోండి. దానికి కొంచం లో-వోల్టెజ్ వున్నప్పుడు, ఈ కొద్ది ప్రాంతం మాత్రమే వెలుగుతో నిండుతుంది. మీరు ఆ వోల్టేజ్ పెంచారనుకోండి... హాలంతా కూడా వెలుగుతో నిండిపోతుంది. మీకు ఇంతమేరే వెలుగుతో కనపడ్డప్పుడు – మీ అనుభూతి అంతవరకే వుంది. హాలంతా వెలుగుతో నిండినప్పుడు, హాలు మొత్తం మీ అనుభూతిలోకి వస్తుంది. ఎరుక - అన్నది ఇలాంటిదే. మీరు ఎరుకతో వుండాలి అనుకున్నంత మాత్రాన, ఎరుకతో వుండలేరు.

మీ ఎరుకను ఎప్పుడు పెంపొందించుకోగలరంటే, మీ శక్తి ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి కదిలినప్పుడే. అందుకని మనమిక్కడ అదే చేస్తాం. మీ శక్తిని ఇంకా ఉన్నత స్థాయికి పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తాం. అప్పుడు మీ ఎరుక మీ జీవితంలో మరిన్ని అంశాలను ఇముడ్చుకోగలుగుతుంది. అవి అంతకు మునుపు మీ అనుభూతిలో లేవు. ఒకసారి మీరు భూమి మీదకి  వచ్చిన తరువాత జీవితం - అన్నది ఎదైతే వుందో దానిని మొత్తం అనుభూతి చెంది వెళ్ళాలి. 'మీరు' అన్నది ఎదైతే వుందో, అది మొత్తం అనుభూతి చెంది వెళ్ళాలి - కదూ? లేదా మీ చిటికెనవేలిని మాత్రం తెలుసుకొని వెళ్తే సరిపోతుందా... ? కాదు కదా ...? 'మీరు' అన్నది మొత్తం తెలుసుకొని వెళ్ళాలి. అందుకు మీరు ఎరుకతో వుండాలి.  మీరు - మీ ఎరుకని ఇంకో ఉన్నత స్థితికి మేము తీసుకొని వెళ్తాము.

ప్రేమాశిస్సులతో,
సద్గురు

 pixabay