ప్రశ్న: నమస్తే సద్గురు. ఎవరైనా స్పృహతో తమ కెరీర్ లేదా వ్యాపారం లేదా జీవనంలో పునర్జన్మ కావాలనుకుంటే ఏం ఆచరించాలి. వారి ఆలోచనలు, దృష్టి ఏ వైపుగా పెట్టాలి?

సద్గురు: ఇది అలబామాలోని ఒక సండే స్కూలులో జరిగింది. ఒక ఉత్సాహవంతురాలైన టీచర్ పిల్లల్ని ఇలా అడిగింది, “మీరు స్వర్గానికి వెళ్లడానికి ఏం చేయాలి?”అని. “ప్రతి ఆదివారం నేను చర్చి మెట్లు శుభ్రం చేసినట్లయితే స్వర్గానికి వెళతాను.” అని ఒకళ్లు చెప్పారు. మరొకరన్నారు, “నా స్నేహితుడికి పరీక్షల్లో నేను సహాయం చేసినట్లయితే నేను స్వర్గానికి వెళతాను” అని. అట్లా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెప్పారు. కాని చివరి బెంచీ మీద ఒక చిన్నపిల్లవాడు మాట్లాడకుండా కూర్చున్నాడు. టీచర్ ఆ పిల్లవాణ్ణి అడిగింది, “ఏయ్ టామీ. స్వర్గానికి వెళ్లాలంటే నువ్వేం చేయవలసి ఉంటుందనుకుంటున్నావు.” దానికి ఆ పిల్లవాడు, “ముందు చచ్చిపోవలసి ఉంటుంది.” అని జవాబిచ్చాడు. చాలా అంశాలేమీ ఉండవు. సిద్ధంగా ఉన్న అంశాల కోసం చూడకండి, వాస్తవ పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. మీరు వ్యాపారంలో పునర్జన్మను కోరుకుంటున్నట్లయితే, ఒకవేళ అందులో అంతకుముందు విఫలమైతే, దాన్ని వదిలిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఒక దాంట్లో విజయం సాధించిన తరువాత దాన్ని వదిలిపెట్టి మరొకదాన్ని పునస్సృష్టి చేయడానికి అంతర్దృష్టి, సాహసం, ఒకస్థాయి ఉన్మాదం మీలో ఉండాలి. అదే జీవితం విషయంలోనైతే పూర్తిగా భిన్నమైన దృష్టిని అవలంబించవలసి ఉంటుంది. ఇతరులు చూడలేనిదేదో మీరు చూసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరిది చేయగలుగుతారు. మీరు అలా చూడగలగాలంటే మీ సామర్థ్యానికి పదునుపెట్టాలి. నాయకత్వమనేది చెట్టుకొమ్మ వంటిది. మీరా కొమ్మపై కూర్చుంటే కింద ఉన్న ఇతరుల కన్నా మెర్గుగా చూడగలాగాలి. అలా చెయ్యలేకపోతే మీరు నవ్వులపాలవుతారు.

మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా?

రు చూడవలసిందేమిటంటే మీరు సరిగ్గా ఇప్పుడున్న స్థితిలో – వ్యక్తిగాకాని, వ్యవస్థగా కాని – చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా అన్నది. పూర్తిగా మరణించి పునర్జన్మ పొందాలనుకుంటున్నారా లేదా పాక్షికంగా మరణించి పునర్జన్మ ఎత్తాలనుకుంటున్నారా అన్న నిర్ణయం మీరిప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకొని మీరు తీసికోవలసిన నిర్ణయమే.

దూకేముందు ఆలోచించండి

ఒకసారి మనం పునర్జన్మను కావాలని నిర్ణయించుకున్న తర్వాత – ఒకదాన్ని నశింపజేసుకొని మరొకదాన్ని తాజాగా సృజించుకోవడానికి – అనేక సంభావ్యతలు తెరచుకుంటాయి. అనేక సంభావ్యతలంటే ఒక సమస్యే. వీటిల్లో మీరు దేన్ని ఎంచుకోవాలన్నది మళ్లీ ఒక ప్రయత్నమే. సమస్య ఏమిటంటే ప్రజలు ముందు దేనిలోకో దూకేస్తారు, తర్వాత తమ బుర్ర ఉపయోగిస్తారు – అలా లాభం లేదు. మీరు దేనిలోకైనా దూకేముందే జాగ్రత్తగా, శ్రద్ధగా ఆలోచించుకోవాలి, ఎందుకంటే ఒకసారి మీరు దూకిన తర్వాత మళ్లీ వెనక్కి తిరగలేరు. మీరు ఎప్పుడూ వెనక ఉన్న అద్దంలోకి చూస్తూ ఉంటే ముందుకు వెళ్లలేరు.

అత్యుత్తమమైనదే చేయాలని ఆందోళన చెందకండి

ముందుగా మీరొకటి అర్థం చేసుకోవాలి. మీరు ఏ మార్గం ఎంచుకున్నా అది అత్యుత్తమమైనదేమీ కాదు. మీరు ప్రపంచంలో అత్యుత్తమమైనది చేయలేరు. మీరు దేనిలోకి దూకినా అందులో మీరు పరిపూర్ణంగా నిమగ్నులైతే అది నిజంగానే గొప్పదవుతుంది. అత్యుత్తమమైనదే చేయాలని ఎన్నడూ ప్రయత్నించకండి, మరొకరి కంటే మెరుగ్గా ఉండాలనే ప్రయత్నంలో మీ జీవితాన్నంతా వృథా చేసుకుంటారు. అది మంచి పనికాదు. మీరు పోల్చుకొనే వ్యక్తి కుంటివారు కావచ్చు, అప్పుడు మీరు కాస్త వేగంగా పరిగెత్తి మీరే ఛాంపియన్ అనుకోవచ్చు. మీరొకరికంటే మెరుగానై, తక్కువైనా దాన్ని గురించిన ఆలోచన మీ మనస్సులో ఉండకూడదు. మీరెవరన్నదే, దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవడమన్నదే ప్రధానమైన విషయం. యోగా అంటే అర్థమిదే. మీ శారీరిక, మానసిక వాస్తవికతలు, అంతర్గత శక్తులు – వీటిని మీరు కోరుకున్న విధంగా మలచుకోగలుగుతున్నారా?

యూజర్స్ మాన్యువల్ చదవండి

చాలమంది విషయంలో వారి ఆలోచనలు, భావోద్వేగాలే వారికి అతి పెద్ద సమస్య. మీకు మీరే సమస్య అయినప్పుడు ఇతర సమస్యలనెలా పరిష్కరించగలుగుతారు? మీ మానసిక నాటకం మీ మీద భారీగా ఉంటున్నది. ప్రజలు పదేళ్ల కిందట జరిగినదానికి కూడా బాధపడగలరు. రేపో, ఎల్లుండో జరగబోయే దానికి కూడా ఇప్పుడే బాధ పడగల సామర్థ్యం ఉంటుంది వాళ్లకు. వాళ్లు తమ గతానికి, భవిష్యత్తుకు కూడా బాధ పడుతున్నామనకుంటారు. కాని కేవలం మానవులకు మాత్రమే పరిమితమైన రెండు శక్తుల వలన వాళ్లు బాధపడుతున్నారు – జ్ఞాపకం, ఊహ. చాలామందికి తమ స్మృతుల్నీ, ఊహల్నీ ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. నిన్ననో, పదేళ్ల కిందటో జరిగింది మిమ్మల్నిప్పుడెలా బాధ పెడుతుంది? పెట్టలేదు.

భవిష్యత్తులో జరగబోయేది ఇప్పుడిక్కడ ఉందా? లేదు. అందువల్ల మరోవిధంగా చెప్పాలంటే లేనిదాని గురించి మీరు బాధపడుతున్నారు. దీన్ని పిచ్చి అంటారు. అయితే ప్రజలు, ‘ఇది మానవ స్వభావం” అంటారు. కాని ఇది మానవ స్వభావం కాదు. మానవ స్వభావాన్ని స్వాధీనం చేసుకోలేని మనుషుల స్వభావమిది. ఈ భూమి మీద మానవ యంత్రాంగం అత్యంత సంక్లిష్టమైన యంత్రాంగం. ఇదొక ‘సూపర్ సూపర్ కంప్యూటర్’. కాని మీరు యూజర్స్ మాన్యువల్ చదివారా? ఇప్పుడు మాత్రం మీరెలాగో ఉపయోగిస్తున్నారు. మీరు పనుల్ని ‘ఎలాగో’ చేస్తున్నప్పుడు జీవితం కూడా యాదృచ్ఛికంగానే జరుగుతుంది.

ప్రతిదాన్నీ తాజా కోణంలో చూడండి

మీరు ‘పునర్జన్మ’ అన్నారు. మీరు తాజాగా పుట్టి ఉంటే, అంటే దేన్ని గురించి మీరు పూర్వనిశ్చితాభిప్రాయాలు లేకుండా ఉంటారు. మీరిప్పుడే పుట్టిన శిశువులాగా సర్వాన్నీ తాజాగా, కొత్తగా చూడగలుగుతారు. మీరిలా చేసినట్లయితే జీవితం మీమీద మచ్చను వేయలేదు. చిన్న పిల్లవాడు కూడా ఆలోచించడం మొదలుపెడితే కొద్దిరోజుల్లోనే తనకు ఎదో తెలుసు అనుకుంటాడు. ఒకసారి మీకు తెలుసనుకున్న తర్వాత ఇక మీరు తడబడడం మొదలుపెడతారు. మీరు మీ జీవితపు ప్రతిక్షణంలోనూ అప్పుడే పుట్టిన శిశువులా ప్రతి వస్తువునూ చూడగలిగితే మీకు అంతా స్ఫటికంలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు విషయాలను స్పష్టంగా చూసినప్పుడు మీరు వివిధ పరిస్థితుల గుండా సునాయాసంగా నడిచి వెళ్లగలుగుతారు. నాయకత్వం అంటే మీరు చేసే ప్రతి ఆలోచన లేదా ప్రతి భావోద్వేగం, మీ ప్రతి చర్య లక్షలాది మంది ప్రజలపై ప్రభావం చూపుతుంది. మీకటువంటి నాయకత్వం ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని కేవలం శారీరికంగానే కాక, అన్ని విధాలుగానూ సరైన పరిస్థితిలో ఉంచుకోవాలి. మీరు వ్యాపారం చేస్తున్నా లేకపోతే అనేక మంది ప్రజల జీవితాలు, సంక్షేమం, భవిష్యత్తు మీమీద ఆధారపడి ఉన్నప్పుడు, మిమల్ని మీరు మెరుగు పరచుకోవలసిన అవసరం ఉంది. మీరు చేస్తున్న పని ఎంతో ముఖ్యమైనదని మీరు అర్థం చేసుకుంటే, మీరెవరన్నదానిపై మీరు నిరంతరం పనిచేయాలి – కేవలం మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడమో, ఏదో విశ్వవిద్యాలయంలో చదువుకోవడమో చాలదు. కాని ‘నేను’ అన్న ఈ జీవిని సంభావ్యమైన అత్యున్నతస్థితికి తీసికొని వెళ్లాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pixabay