ఎవరో రాసిన పుస్తకాలను చదివి సత్యాన్ని తెలుసుకోవడం కన్నా సృష్టి కర్త స్వయంగా రాసిన 'మీరు' అనే ఈ పుస్తకాన్ని చదవడం సరైనది అని సద్గురు చెబుతున్నారు.

సాధకుడు: నేను ఎన్నో పుస్తకాలను చదివాను. గీతలో ఎన్నో అధ్యాయాలు చదివాను. టివీలో ఎందరో గురువులు ఇచ్చే బోధలను వింటాను. కాని చివరికి అన్నీ మర్చిపోతాను. ఒకరకమైన గందరగోళంగా ఉంటుంది. నాకు ఏదైనా ఒక సూత్రం చెప్పండి. దానితో మేము జీవితంలోనూ, ఆధ్యాత్మికంగానూ కూడా విజయవంతం కావాలి. ఏదైనా ఒక్క సూత్రం మాకు కావాలి.

సద్గురు: ఎంతోమంది గురువులు వచ్చారు, వారు మీకు ఎన్నో బోధనలను ఇచ్చారు కానీ మీరు అవన్నీ మరచిపోయారు. మీరు దేనినైనా మరిచిపోగలిగితే, అది ఎలాగూ గుర్తు పెట్టుకోదగ్గది కాదూ అని అర్థం. ఏదైనా మిమ్మల్ని లోతుగా స్పృశిస్తే, ఏదైనా మీ అంతరంగంలోకి వెళ్లి ఉంటే – అది మిమ్మల్ని, మీ జీవితాన్ని పరిణామం చెందించగలుగుతుంది. అది, మీలో ఒక భాగమైపోతుంది. దానిని మరచిపోవడమూ లేదా గుర్తు పెట్టుకోవడమూ - అన్న ప్రశ్నే ఉండదు.

ఇప్పుడు మీరు గీత కూడా చదివారు. ఈ బోధన ఎవరైతే పూర్తిగా విఫలం చెందారో వారికే ఇవ్వబడింది. అర్జునుడు రాజ్యం పోగొట్టుకున్నాడు. అతని భార్యని, అతని సంపదనీ, అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఇది అతని వైఫల్యమే కదా..? ఒక విషయం ఏమిటంటే; చివరిలో ఒక యుద్ధం గెలిచాడు. లేకపోతే, అతని జీవితమంతా వైఫల్యాలే..! ఏవైతే ఒక మనిషికి జరగకూడదో, అవన్నీ అతనికి జరిగాయి. సరే! మీరు గీత చదువుతారు. గీత లోని ఏ అంశం అయినా సరే, మీలోనికి చేరి ఉంటే కనుక, మీరు కృష్ణుడిగానే మారిపోయి ఉండాలి. లేకపోతే, మీకు అది తెలియలేదు అని అర్ధం. మీరు కేవలం గీతని చదివి, దాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అది ఒక పెద్ద గోలగా ఉంటుంది. ఇలానే అన్ని చోట్ల జరుగుతోంది.

సత్యాన్ని మీరు విశ్లేషించలేరు. మీరు కేవలం సత్యాన్ని అనుభూతి చెందగలరు. మీరు, సత్యాన్ని అర్థం చేసుకోలేరు. మీరు, అందులో లయం అవ్వగలరు. అది, మీరు గ్రహించేది కాదు. మీరు నన్ను ఒక నినాదం అడుగుతున్నారు. ఇక్కడ మీకు కావలసింది ఒక విధానం, నినాదం కాదు. ఈ జీవితం ఎంతో ఉత్తేజితమై, ఎన్నో అంశాలు కలిగినది. దీనిని ఏ విధమైన బోధనలలో గానీ, నినాదంలో గానీ ఇమడ్చలేరు. కానీ, మీరు ఒక విధానాన్ని, ఒక పద్ధతిని అవలంభించి అక్కడికి చేరుకోగలరు. అందుకని, మీకు కావలసినది ఒక విధానం. మీకు నినాదమో, మరో బోధనో అవసరం లేదు.

ఈశా యోగా(Inner Engineering) అనేది బోధన కాదు. అది కేవలం ఒక విధానం. ఇది కనుక మీరు అవలంభిస్తే, అది మిమ్మల్ని మరొక చోటికి చేరుస్తుంది. దీనిని కనుక మీరు ఒక బోధన లాగా గ్రహిస్తే అది మీ మనసులో మరింత చెత్తను చేరుస్తుంది. నా దగ్గర ఎటువంటి బోధనా లేదు. మీరు కనుక సుముఖంగా ఉంటే, నేను మిమ్మల్ని మీరు ఊహించలేని, మీకసలు సాధ్యం కాదని అనుకున్న చోటికి చేర్చగలను. నా దగ్గర ఎటువంటి బోధనా లేదు. ఎందుకంటే, నేను చదువు లేని గురువుని. నాకు గ్రంధాలు తెలియవు, ఉపనిషత్తులు తెలియవు, వేదాలూ తెలియవు, ఏమీ తెలియదు. నాకు తెలిసినదల్లా నేనే..! అది ఎటువంటి గ్రంధం అయినా సరే.. దానికంటే ఎంతో ఎక్కువ ఎందుకంటే ఇదే సృష్టి కాబట్టి.

మీకు ఈ సృష్టి గురించి గానీ, ఈ సృష్టికర్త గురించి గానీ తెలియాలీ అంటే, మీరు చూడవలసిన ఒకే ఒక స్థలం మీలోనికే.

మీకు ఈ సృష్టి గురించి గానీ, ఈ సృష్టికర్త గురించి గానీ తెలియాలీ అంటే, మీరు చూడవలసిన ఒకే ఒక స్థలం మీలోనికే. ఎందుకంటే మీరే సృష్టి. నిజానికి గీత కృష్ణుడు వ్రాయలేదు. అతను, యుద్ధభూమిలో మాట్లాడాడు. అర్జునుడి దగ్గర టేప్ రికార్డర్ లేదు. అయితే, మరి దానిని ఎవరు వ్రాసినట్టు..? మరెవరో వ్రాశారు. ఈశా యోగా కార్యక్రమంలో నోట్స్ రాయొద్దు అని చెప్తాము. మిమ్మల్ని ఒకవేళ ఈ ప్రోగ్రాంలో గురించి నోట్స్ వ్రాసుకున్నారనుకోండి, వంద మంది వంద రకాలుగా రాస్తారు. ఇదే ఇలా ఉన్నట్లైతే, ఐదువేల సంవత్సరాలక్రితం జరిగింది. అది ఎన్ని రకాలుగా వక్రీకరించబడిందో మీరు ఊహించగలరా..? మానవులు వక్రీకరించగల సామర్థ్యం ఉన్నవారు.

ఇవాళ మీరు మీ కళ్ళతో చూసింది, మీ పక్కింటివారికి చెప్పారనుకోండి, అతను వెళ్ళి మరొకరితో చెప్తారు. ఇలా ఇది, ఒక పాతికమంది దాకా పాకి, ఇరవైనాలుగు గంటలలో మీకే తిరిగి వస్తుంది. అప్పుడు మీరు కనీసం ఆ కథ మీరు చెప్పిందేనని గుర్తించలేరు కూడాను. మానవులు వక్రీకరించే సామర్థ్యం ఉన్నవాళ్ళు. కదూ..? మీ పాఠ్య పుస్తకాలనే తీసుకోండి, ఎలక్షన్లు వచ్చిన ప్రతీసారీ మార్చేస్తూ ఉంటారు. ఈ పుస్తకాలన్నీ కూడా, ఎవరికైతే వక్రీకరించగల సామర్థ్యం బాగా ఉందో వాళ్ళు వ్రాశారు.

కానీ మన దేహం అనే ఈ పుస్తకాన్ని సృష్టికర్త తానుగా వ్రాశాడు. అందుకని, ఇది తప్పుగా ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు మేము మీకు నేర్పిస్తున్నదల్లా - ఒక విధానం. ఈ పుస్తకాన్ని చదవగలిగే ఒక విధానం. ఇందులో, ఎటువంటి పొరపాటూ ఉండదు. ఇందులో, ఎటువంటి వక్రీకరణా ఉండదు. ఎందుకంటే, దీనిని సృష్టికర్త - తానే వ్రాశాడు కాబట్టి..! మీరుదీన్ని ఎలా చదవాలన్నది నేర్చుకోవాలి. అందుకని, ఎటువంటి నినాదాల కోసమూ చూడకండి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pixabay.com