అంతర్ముఖ సాధనే మార్గం!
ArticleMay 31, 2016
మీరు వెన్నెముక నిర్మాణాన్ని గమనించినట్లయితే దానికి ఇరువైపులా రంధ్రాలుంటాయి. ఇది ఒక పైప్‌లా ఉండటం వలన, మీ శరీరంలోని నరాలన్నీ దీని గుండా వెళ్తాయి. ఇందులో ఈడ-పింగళ, ఎడమ-కుడి చానల్స్ (కాలువలు) ఉంటాయి. మనం దేన్నయితే ప్రాణమయ కోశమని అంటున్నామో, అందులో 72,000 నాడులున్నాయి. ఇవి శరీర వ్యవస్థలో దారుల్లాగా పనిచేస్తాయి. ఈ నాడులన్నీ ఈడ, పింగళ, సుషుమ్న అని పిలిచే మూడు ముఖ్యమైన నాడుల నుంచి ఉద్భవించాయి.
జీవిత కోణాల్లోని స్త్రీతత్వం పురుషత్వానికి ప్రతీకలు ఈ ఈడా-పింగళ. దీన్ని మనం స్త్రీ లింగమనో, పురుషలింగమనో అర్థం చేసుకోకూడదు. సృష్టిలోని కొన్ని లక్షణాల ప్రతిరూపాలివి. మీరు పురుషుడే అయినా,మీలో ‘ఈడ’ ప్రస్ఫుటంగా ఉన్నట్లయితే స్త్రీతత్వం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు మహిళే అయినా ‘పింగళ’ ప్రస్ఫుటంగా ఉంటే పురుషత్వం ఎక్కువగా ఉంటుంది. మానసిక స్థాయిలో పింగళ తార్కిక కోణాన్ని సూచిస్తే.. ఈడ అంతర్‌దృష్టి లేదా సహజ దృష్టిని సూచిస్తుంది.
అంతేకాదు ఈ రెండు పార్శ్వాలనీ సూర్యచంద్రులకు ప్రతీకలుగా చూడవచ్చు. ఆవేశభరితంగా, బహిర్ముఖంగా, ముందుకు చొచ్చుకునిపోయే పింగళని సూర్యునిగా, అంతర్ముఖంగా, దేన్నయినా స్వీకరించే ఔదార్యమున్న స్త్రీతత్వానికి ప్రతిరూపమైన ఈడ చంద్రుడికి ప్రతీకగా గుర్తిస్తారు. ఈ రెండు కూడా జీవితంలో రెండు సగభాగాలు. ఒకటి లేకపోతే, మరొకటి పనిచేయదు. సమస్త శక్తీ ఇలాగే పనిచేస్తుంది. ధనత్మక, రుణాత్మక ఆవేశాలు ఉంటేనే విద్యుత ప్రవహిస్తుంది. రెండింటిలో ఏది ముఖ్యమో చెప్పలేం. ఒకటి లేకపోతే మరొకదానికి ఉనికే లేదు. ఈ రెండు జీవిత పార్శ్వాలనీ ఈడ-పింగళగా సూచిస్తాం. భారతీయ సంస్కృతిలో సూర్యచంద్రుల ఆధారంగా రెండు పరంపరలు ఉద్భవించాయి. కొందరిని సూర్య వంశీయులని, కొందరిని చంద్ర వంశీయులని అంటాం. ఈ రెండు పార్శ్వాల ఆధారంగానే ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రక్రియలు ఉదయించి వర్ధిల్లాయి. ఇవి ఈనాటికీ ఉన్నాయి. కాకపోతే మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం.
మానసిక స్థాయిలో పింగళ తార్కిక కోణాన్ని సూచిస్తే.. ఈడ అంతర్‌దృష్టి లేదా సహజ దృష్టిని సూచిస్తుంది.
బాహ్య వాస్తవాలకి వచ్చేటప్పటికి ఒక్కొక్కరి సామర్థ్యం ఒక్కో విధంగా ఉంటుంది. కానీ అంతర్వాస్తవాల విషయానికి వస్తే మనందరి సామర్థ్యాలు సమానంగా ఉంటాయి. ఇలా జరగకపోవడానికి కారణమేదైనా ఉంటే అది కేవలం మనం ఆ దిశలో వెళ్లకపోవడమే. తన జీవితసారం, ఔన్నత్యం నిర్ణయించే శక్తి తనలోనే ఉందిగానీ, తన చుట్టూ ఉన్న వాటిల్లో లేదన్న సత్యాన్ని గ్రహించడానికి మనిషికి కొంతకాలం పడుతుంది. దీనికై అవగాహన ఎంతో అవసరం. ఈ విషయాన్ని పూర్తిగా అపార్థం చేసుకుని తప్పుగా చెబుతున్నారు. ఏమి చెబుతున్నారంటే.. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే అన్నీ వదిలేయాలని. అసలు విషయం మీరేం వదిలేశారు, ఏం వదలట్లేదు అనేది కాదు. మీరు ఆధ్యాత్మికులైనా, కాకపోయినా శ్వాస పీల్చుకుంటారు. నీరు, ఆహారం కూడా తీసుకుంటారు. కాకపోతే ఎటువంటి ఆహారం తీసుకోవాలన్న విషయంలో మాత్రమే మీరు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అంతేకాని, పూర్తిగా ఆహారాన్ని త్యజించలేరు. మీ దృష్టిని ఆంతర్యం వైపు తిప్పగలిగి, దాన్ని సరిగ్గా నిర్వహించకుంటే తప్ప మీ జీవితం సరిగ్గా సాగదన్న అవగాహన ఉండాలి.
మీరు వేసుకున్న దుస్తులపైనో, మీరు నడుపుతున్న కారును బట్టో.. మీరుంటున్న ఇంటి మీదో.. మీ జీవిత నాణ్యత ఆధారపడదు. మీలో మీరు ఎంత ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నారన్నదే మీ జీవిత సౌఖ్యాన్ని నిర్ణయిస్తుంది. మీరు చేసేదేదైనా ఈ నాణ్యత కోసమే. అదే లేనప్పుడు ఇంకేం చేసినా, ఏమున్నా లేకపోయినా దండగే.