నవ్యాంధ్రప్రదేశ్: మన ముందున్న అవకాశాలు, సవాళ్ళు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి శంకుస్థాపన అక్టోబర్ 22న జరగనుంది. ఈ సందర్భంగా ఒక రాష్ట్రాన్నీ, అలాగే సరికొత్త రాజధానినీ నిర్మించటం అనేది ఎంత పెద్ద సవాలో, అలాగే అది ఎంత బ్రహ్మాండమైన అవకాశమో మనకు ఈ వ్యాసంలో సద్గురు వివరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి శంకుస్థాపన అక్టోబర్ 22న జరగనుంది. ఈ సందర్భంగా ఒక రాష్ట్రాన్నీ, అలాగే సరికొత్త రాజధానినీ నిర్మించటం అనేది ఎంత పెద్ద సవాలో, అలాగే అది ఎంత బ్రహ్మాండమైన అవకాశమో మనకు ఈ వ్యాసంలో సద్గురు వివరిస్తున్నారు.
సద్గురు: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఏర్పడిన తరువాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది, ఇది బాషలను పరిగణలోకి తీసుకుని భౌగోళిక సరిహద్దులను తిరిగి రాయటం వల్ల జరిగింది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు పరిపాలనలో లోపాల వల్ల లేక ప్రాతీయ భేదభావాల కారణంగా ఇంకా విభజన జరగటం కొనసాగుతుంది. రాష్ట్రాలను ఇంకా విభజన చేయాల్సి వస్తే దాన్ని ఆలోచనాత్మకమైన మార్గంలో చేయాల్సి ఉంటుంది, అది కూడా ముఖ్యంగా పరిపాలనా సామర్ధ్యాన్ని పరిగణలోకి తీసుకుని చేయాల్సి ఉంటుంది. అంటే మనం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం వెనుక ఉన్న ప్రాధమికమైన ఆలోచనను తిరిగి వ్రాస్తున్నామని అర్ధం.
ఆంధ్రప్రదేశ్ విభజన చాలా కాలం నుంచి ఉన్న డిమాండే అయినప్పటికీ, అది జరిగినప్పుడు హడావిడిలో ఒక విభజనగా కాక, చీలికగా జరిగింది. కాని అది జరిగిపోయింది, ఇప్పుడు వెన్నక్కి తిరిగి చూసుకోవటంలో లాభం లేదు. అభివృద్ధి బాట ఎలా పట్టాలన్నదే ఇప్పుడు మనం చూడాల్సింది.
మన ముందున్న ముఖ్యమైన సవాళ్ళు
ఇది ఉలా ఉండగా ఆంధ్రప్రదేశ్ కొంత ప్రతికూల పరిస్థితిలో ఉంది. సున్నితమైన మార్పుకు అవసరమైన విధంగా పరిపాలన మరియు వనరుల విభజన జరగలేదు. ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయం అనివార్యం అవుతుంది. ఇక్కడ పెద్ద పట్టణాలేమీ లేవు – అత్యంత పెద్ద పట్టణం విశాఖపట్నమే, ఇది ఒక పోర్ట్ ( రేవు) ఉన్న పట్టణం – మరి ఇప్పుడు సరికొత్త రాజధాని నిర్మించటం ఒక అపరిమితమైన పని. ముఖ్యమంత్రి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహలను, రాజధాని నిర్మాణానికి వివిధ రకాల భాగస్వామ్యాలను తీసుకురాగల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నా కూడా, అది ఒక భారమైన పనే. కేవలం కార్యాలయాల నిర్మాణం అవ్వగానే రాజధాని నిర్మాణం అయిపోదు. దానికి విద్యా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు, కళలు మరియు చేతి వృత్తుల ఉద్యమాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఇంకా మరెన్నో ఒక పట్టణాన్ని ప్రాణంతో ఉట్టిపడేటట్లు చేస్తాయి.
అన్నిటినీ మించి కొత్త రాష్ట్రంలో 40% భూమి రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఇది వ్యవసాయ సాగుకు అంత అనుకూలమైంది కాదు. దీనికి తోడు కోస్తా ఆంధ్రను వణికిస్తున్న తుఫాన్లు, మండిపోయే ఎండలు – ఇప్పుడు ఉన్న గ్రీష్మ తాపానికి ఎన్నో ప్రాణాలు పోవటం మనం చూస్తూనే ఉన్నాము.
కాని ఇప్పుడు ఉన్న నాయకులలో ఎంతో పట్టుదల ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర అద్భుతమైన బృందం ఉంది. ఆ ఆఫీసర్లు ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినవారు. నేను ఏ రాజకీయ పార్టీ లేక రాజకీయ నాయకుడి అభిమానిని కాదు, కాని చంద్రబాబు నాయుడు ఒక శక్తివంతమైన వ్యక్తి. ఒక ముఖ్యమంత్రి అంత నిబద్ధతతో, చురుకుదనంతో ఉండటం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. కార్పొరేట్ నాయకులు కూడా అంత త్వరగా, స్పష్టంగా ఒక నిర్ణయానికి రావటాన్ని నేను చూడలేదు. వారి నిబద్ధత, మార్గదర్శకత్వంతో కొత్త రాష్ట్ర నిర్మాణానికి అడుగులు వేయటం ఎంతో ఆనందదాయకం.
ఈ నాయకత్వం మరిచిపోకూడని ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ఎక్కువ శాతం వ్యవసాయ ఆధారిత సమాజం. వ్యవసాయ ఆధారిత సమాజం ఒక్క సారిగా వ్యాపారంలోకి మారి విజయం సాధించటం ఎప్పుడూ జరగలేదు. కనుక ఈ రాష్ట్రం వ్యవసాయాన్ని లాభదాయకం చేయటం ఎలా అనేదాని మీద దృష్టి పెట్టాలి. ఈ రంగాల్లో ఇప్పుడు అత్యుత్తమైన భాగస్వామ్యం జపాన్, ఇస్రాయిల్ తో అయితే బావుంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా సరైన మార్గంలోనే చూస్తున్నారు. అదే ఉత్తమైన నిర్ణయం.
ఒక సవాలు మరియు ఒక అవకాశం
మనం అనుకున్నవన్నీ ఆచరణలోకి తీసుకురాగలమా? ఇది భారతదేశం కనుక దీన్ని మనం అర్ధం చేసుకోవాలి. అవసరమైన ప్రాధమిక, మౌలిక సదుపాయాలు కానీ, ఆ వాతావరణం కానీ ఇక్కడ లేదు. అందరినీ ఒకే తాటిపై నడిపించి ఇది జరిగేలా చేయటం కష్టమైన పనే. ఇది చేయటానికి నాయకుల దగ్గర ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. కాని ప్రజల సహకారం లేకుండా ఇది అడుగు ముందుకు వేయలేదు. మార్గదర్శకత్వం చూపించటం, అవసరమైన ఏర్పాట్లు చేయటం వరకే ఒక నాయకుడు పని. ప్రజలు మాత్రమే దీన్ని సాకారం చేసుకోగలరు. ప్రజలు పాల్గొనేలా చేయటమే ఒక పెద్ద సవాలు.
అంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి ఈ భాగస్వామ్యాన్ని అధికారులు పొందగలిగితే ఇది ఈ దేశంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయే అభివృద్ధి అవుతుంది. ఇది ఒక సవాలే. అదే సమయంలో, ఈ దేశంలో పుట్టగొడుగుల్లాగా జరిగిన చాలా శాతం అభివృద్ధిలాగా కాకుండా, మనం ఊహించినట్లుగా ఒక కొత్త రాష్రాన్ని నిర్మించుకునే ఒక అవకాశం కూడా. ఇక్కడ ప్రణాళికాబద్ధమైన నిర్మాణాలు కట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కట్టిన నిర్మాణాలేవి అక్కడ ఎక్కువగా లేవు.
తెలుగు వారి అభివృద్ధిని, ఈ దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇది విజయవంతంగా జరగాలి. ఈశా ఫౌండేషన్ ఈ 5 కోట్ల మందిని శాంతం, సామర్ధ్యం, స్ఫూర్తి కలిగిన వారిగా చేయటంలో సహకారం అందించటానికి సుముఖంగా ఉంది. ఇది పరిపాలనా అధికారుల ముందున్న భారీ పనిని వాస్తవం చేయటానికి అత్యంత అవసరం.
ఒక కొత్త రాష్ట్ర నిర్మాణం, గొప్ప పట్టణాన్ని నిర్మించటంలో ఎన్నో కష్టనష్టాలతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా ఈ దేశం మొత్తం గర్వ పడేలా నిర్మాణం అయ్యే రాష్ట్రానికి అవసరమైన త్యాగాలను అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరి భాగస్వామ్యం – రాజకీయ, పరిపాలనా, విద్యా రంగాలలోని వారు, సామాన్య జనం – అందరూ ముఖ్యమే. ఇది రాజకీయం చేసే సమయం కాదు. ఎలక్షన్లకు మూడు నెలల ముందు వరకు మాత్రమే రాజకీయాన్ని పరిమితం చేయాలనేది మనమందరం నేర్చుకోవాలి. మిగిలిన సంవత్సరాలన్నీ మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి సహకారం అందించటమే మన పని. భాగ్యవంతమైన, ఆనందభరితమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం మనందరి పవిత్రమైన బాధ్యత. ఇది జరిగేలా చూద్దాము.