అమరత్వం కోసం వెంపర్లాడిన అలెగ్జాండర్
చావు - మన జీవితంలో అతి ప్రధానమైన ఈ అంశాన్ని మనకి గుర్తు చేయటానికి, సద్గురు అమరత్వం కోసం తపించిన అలెంగ్జాండర్ కథ చెబుతున్నారు.
సద్గురు: మృత్యుభీతి అనేది మనుషుల చేత ఎప్పుడూ వెర్రి పనులను చేయిస్తూ వచ్చింది. ఎన్నో యుగాలుగా మనుషులు సంపన్నులు అవగానే, శక్తివంతులు కాగానే, చక్రవర్తులు అవ్వగానే అమరత్వం కోసమే వెంపర్లాడారు. ఈజిప్ట్ దేశంలోని మమ్మీస్ ఇందుకు ఉదాహరణ. మనుషులు ఎప్పుడైతే సంపన్నులవుతారో, ఎప్పుడైతే వారికి అన్నీ ఉన్నా కూడా జీవితం సంపూర్ణంగా అనుభవంలోకి రాలేదు అని వారు భావిస్తారో, సహజంగా వారు అమరత్వాన్ని కోరుకుంటారు. ఈ ప్రపంచంలో ప్రతి రాజు, ప్రతి బలవంతుడు ఏదో ఒక విధంగా అమరులు కావాలనుకున్నారు. కానీ ఈ అమరత్వమే ఎవరికైనా అతి దారుణమైన శాపం. మీరు నిజంగా ఎవరినైనా శపించాలి అనుకుంటే, వారి చావు కోరకండి, వారికి చావు లేని జీవితాన్ని కోరండి.
ఒక్కసారి ఊహించండి, పదివేల సంవత్సరాల తరువాత కూడా, ఇదే ప్రపంచంలో జీవిస్తూ, ఎప్పుడూ చేసే తెలివితక్కువ పనులనే మళ్ళీ మళ్ళీ చేస్తూవుంటే ఎలా ఉంటుంది. ఎంతటి శాపం అది?
అలెగ్జాండర్- ది గ్రేట్ గురించి ఒక కథ ఉంది. అసలు అతనిని "గ్రేట్" అని ఎందుకు అన్నారో నాకు అర్ధం కాదు. ఆ వ్యక్తిలో అంత గొప్పతనం ఏం ఉంది? పదహారు సంవత్సరాల వయసు నుంచి అతను చనిపోయే ముప్పై రెండు సంవత్సరాల వయసు దాకా, పదహారు సంవత్సరాల పాటు ఎడతెగని యుద్ధం చేస్తూనే ఉన్నాడు, ముక్కు మొహం కూడా ఎరుగని కొన్ని వేల మందిని చంపాడు. ఒక కొత్త దేశానికి వెళ్ళి, అక్కడి వాళ్ళని చంపేసి, "నేను జయించాను" అని ప్రకటించేవాడు. అతను చేసినది ఏ ఒక్క ఇతర మానవుడికైనా ఏదైనా ప్రయోజనాన్ని కానీ మంచిని కానీ చేకూర్చిందా? పోనీ తనకైనా ఏదైనా ఫలితాన్ని కానీ మంచిని కానీ అందించిందా? అత్యంత మూర్ఖమైన బ్రతుకు బ్రతికి, నీచమైన మనిషిగా చనిపోయాడు. అతనిని "అలెగ్జాండర్ ది గ్రేట్" అని పిలిచారు, కానీ ఈ పేరు చివరి భాగాన్ని మర్చిపోయారు "అలెగ్జాండర్ ది గ్రేట్ ఇడియట్" అని సంబోధించాలి అతనిని.
అలెగ్జాండర్ ఒక యోగిని కలవడం
జీవితంలో ఎన్నో మూర్ఖమైన వాటిని కోరుకున్నట్టుగానే, అతను అమరత్వాన్ని కూడా ఆశించాడు, ఎందుకంటే అతను తన బలంతో ఈ మొత్తం ప్రపంచాన్నే జయించాలని ఆశపడ్డాడు. అత్యంత కిరాతకమైన పద్ధతిలో అతను అప్పటికే మనుషులకి తెలిసిన సగం ప్రపంచాన్ని జయించాడు, కానీ అతని జీవిత ధ్యేయాన్ని నెరవేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం కావాలి అని తెలియటంతో అతను చాలా నిరాశలోకి జారుకున్నాడు. కనుక అతను అమరుడు కావాలి అనుకున్నాడు. అమరత్వం కోసం వెతుకుతూ అతను సహజంగానే భారతదేశం వచ్చాడు, ఎందుకంటే అప్పటికే ఎన్నో కథలు భారతదేశం నుండి గ్రీస్‌కి చేరాయి ఇంకా అతను భారతీయ యోగుల గురించి ఎంతో విని ఉన్నాడు. ఈ యోగులలో ఎంతో మంది అమరులని అతనికి జనాలు చెప్పటంతో అటువంటి ఒక యోగిని కలవాలని అతను ఉత్సుకతతో ఉన్నాడు.
కొంతమంది సైనికుల్ని మిగిలిన అతని సైన్యం కంటే ముందుగానే పంపి "ఒక యోగిని నా దగ్గరికి తీసుకురండి" అని ఆదేశించాడు. కొంత వెతికిన తరువాత, ధ్యానం చేస్తున్న ఒక యోగిని వాళ్ళు కనుగొన్నారు. వాళ్ళు ఆ యోగితో ఇలా అన్నారు "మాతో రా. మా చక్రవర్తికి నువ్వు కావాలి." యోగి ఇలా జవాబిచ్చాడు "నేను ఎక్కడికీ రాను. కావాలంటే మీ చక్రవర్తినే ఇక్కడికి రమ్మనండి. అతనికి సాదర స్వాగతం లభిస్తుంది కానీ నేను మాత్రం ఎక్కడికీ వెళ్ళేది లేదు." ఈ సమాధానం వినటం తోనే ఆ సైనికులు కత్తులు తీసి, "నువ్వు మాతో వస్తావా లేక నీ తల నరికి మాతో తీసుకువెళ్ళమంటావా" అన్నారు. ఆ యోగి నవ్వి "సరే నా తలనే తీసుకువెళ్ళండి. మీ చక్రవర్తి నా తలని ఏం చేసుకుంటాడు? అతనినే తీసుకోమనండి. నేను ఎలాగూ నా జీవితంలో చేయవలసినవి అన్నీ చేసేసిన స్థితికి చేరిపోయాను. కేవలం వెళ్లిపోవటానికి మాత్రమే సిద్ధంగా ఉన్నాను. అందుకు సహాయపడేందుకే మీరు వచ్చిన్నట్టు ఉంది."
ఇటువంటి ఒక సందర్భాన్ని ఆ సైనికులు ఎప్పుడూ ఎదురుకొనలేదు. ఈ సైనికులు కరడుగట్టిన మనుషులు. ప్రాణాలని తీయటం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వారు కత్తి దూస్తే జనాలందరూ ప్రాణ భయంతో వణికిపోయేవారు. కానీ ఈ యోగి మాత్రం "సరే తల తీసుకోండి" అంటున్నాడు. వారికి ఏం చేయాలో అర్ధం కాలేదు. తిన్నగా అలెగ్జాండర్ దగ్గరికి వెళ్లి ఇలా చెప్పారు.
"మేము ఒక యోగిని కలిసాము."
"ఎక్కడ అతను, ఎక్కడ అతను?"
"అతను ఇక్కడికి రావటానికి సిద్ధంగా లేడు."
"మీరు అతనిని ఈడ్చుకురాకుండా ఎందుకు వచ్చారు?"
"కాదు, అతను అందరిలాంటి వాడు కాదు. అతనికి భయం కూడా లేదు. మేము అతని తల తీసేస్తాం అని బెదిరించాము. తీసుకోమన్నాడు."
"తల తీసినా తనకి పోయేదేమీ లేదు అని అన్నాడంటే, అతను కచ్చితంగా అమరుడే. నేను అతనిని కలవాలి" అని అలెగ్జాండర్ నిశ్చయించుకున్నాడు.
ఆ యోగి దగ్గరికి వెళ్లి ఇలా అడిగాడు. "ఓ యోగి, నీవు అమరుడివా?" అందుకు యోగి "అవును, నేను అమరుడిని మాత్రమే కాదు, అంతటా వ్యాపించి ఉన్నవాడిని కూడా. నేను ఈ భౌతిక పరిమితులని దాటాను. అంతా నేనే, ఏమి లేనిది (శూన్యం) కూడా నేనే." ఆ మాటలు విని అలెగ్జాండర్ ఇలా అన్నాడు "నాకు అమరత్వం (సాధించటం ఎలాగో) నేర్పుతావా? నీకు ఏది కావాలి అంటే అది నేను ఇస్తాను." అలెగ్జాండర్ తన సైనికుల్ని పురమాయించి ఇంతకాలం దోచుకున్న నగలు, ముత్యాలు, వజ్రాలు ఇంకా బంగారం గల పెద్ద పెద్ద పెట్టెలను తెప్పించాడు. వాటిని తెరచి ఇలా అన్నాడు. "ప్రపంచ సంపదంతా ఇక్కడ ఉంది." యోగి నవ్వి "నువ్వు భూమి నుంచి వస్తువులని సేకరిస్తూ వస్తున్నావు. ఈ మణులు, మాణిక్యాలు, బంగారం ఇవ్వన్నీ ఒట్టి మట్టి. ఎంచేతనో నువ్వు వీటికి ఎక్కువ విలువని ఆపాదిస్తున్నావు. నువ్వు రోజూ నడిచే, నీకు తిండిపెట్టే మట్టికి నువ్వు ఏ విలువ ఇవ్వవు. ఈ రాళ్ళు, లోహాలు ఎందుకూ పనికిరానివి. నువ్వు వీటిని తినలేవు, వీటితో ఏం చేయలేవు కూడా, కానీ సంపద అంటూ వీటిని మోస్తున్నావు. భూమి నుంచి ఈ చెత్త ఏరుకున్న నీకు అమరత్వం ఎందుకు? అది నీకు తగినది కాదు."అందుకు అలెగ్జాండర్ ఇలా అన్నాడు. "ఇప్పుడు నువ్వు నాకు అమరత్వం నేర్పిస్తావా లేదా నీ తల తీసేయమంటావా!"
ఆ యోగి అలెగ్జాండర్ వైపు ఎంతో విస్మయంతో చూస్తూ "సరే, దాని గురించి తెలుసుకోవాలని చాలా తపన పడుతున్నావు. ఇక్కడికి దగ్గరలో ఒక ప్రత్యేకమైన అడవి ఉంది." ఆ అడవికి ఎలా చేరుకోవాలో మార్గం చెప్పి అలెగ్జాండర్‌తో ఆ యోగి ఇలా అన్నాడు. "అక్కడికి వెళ్తే నీకు ఒక గుహ కనపడుతుంది. ఆ గుహలోకి ప్రవేశించు. అక్కడ ఒక చిన్న నీటిగుంట ఉంటుంది. అందులో నుంచి ఒక దోసెడు నీళ్లు తీసుకుని తాగు. నువ్వు అమరుడివి అవుతావు."
అలెగ్జాండర్ వెంటనే తన అన్వేషణ మొదలుపెట్టాడు. సాహవంతులైన కొంత మంది సైనికులతో అతను ఆ అడవిలోకి ప్రవేశించాడు. యోగి చెప్పిన కొన్ని కొన్ని గుర్తుల ద్వారా ప్రయాణిస్తూ అతను గుహని కనిపెట్టాడు. గుహలోకి ప్రవేశించి నీటి గుంటలో తన చేతులు ముంచి నీరు తాగటానికి సిద్ధపడుతున్నాడు. అంతలో ఆ కొలనుకు ఆవలి గట్టున ఉన్న ఒక కాకి "ఆగు! ఆ పని చేయకు!" అని అరిచింది. అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు. ఒక కాకి "కావ్" అని అరవకుండా గ్రీకు భాష మాట్లాడుతోంది.
ఆ కాకి ఈ విధంగా చెప్పసాగింది. "చాలా కాలం కిందట నేను ఈ నీటి గుంటలోని నీటిని తాగి తప్పు చేశాను. అప్పటి నుండి నేను ఇక్కడే లెక్కపెట్టలేనన్ని సంవత్సరాలు కూర్చుని ఉన్నాను. నా సమస్యేమిటంటే నేను మరణించను. నేను నా జీవితాన్ని అన్ని విధాలా అనుభవించేసాను కానీ నేను మరణించలేను. ఆ దుర్గతి ఎలా ఉంటుందో నువ్వు ఊహించగలవా? నేను శాశ్వతముగా ఇక్కడే, ఈ ప్రపంచంలోనే కూర్చుని ఉండాలి. నువ్వు కూడా ఇలానే చేద్దాం అనుకుంటున్నావా?" అలెగ్జాండర్ చేతులు నీటిలో ఉన్నాయి. అతను ఆ నీటిని దాదాపు తాగబోతున్నాడు. తన జీవితం అంతా అతను అమరుడు కావాలి అని కలలు కన్నాడు. ఇప్పుడు ఈ కాకి ఇలాంటి ఒక ప్రశ్న వేయటంతో తన జీవితం అకస్మాత్తుగా ఒక విభిన్న దృష్టి కోణంలో కనపడుతోంది. ప్రపంచం మొత్తాన్ని జయించటం రాబోవు యాభై సంవత్సరాల వరకు ఒక గొప్ప విషయం కావొచ్చు. కానీ ఒక యాభై లక్షల సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఇలానే జీవించటం అనేది ఎలా ఉంటుంది? అప్పటికీ తనకి చావు రాదు.
అలెగ్జాండర్ వొణికిపోతూ అక్కడే నుంచుండిపోయాడు. అతనిలో జ్ఞానం ఉదయించింది. ఆ నీటిగుంటలోని నీరు తాగకుండానే అతను మెల్లగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. లేకపోతే ఈ రోజుకీ మనం అలెగ్జాండర్ని భరించాల్సి వచ్చేది. మరణించిన వాళ్ళు అందరూ అలా మరణించే ఉండటం మనం సంతోషించదగ్గ విషయం కాదంటారా? మీరు అనుకోవొచ్చు "లేదు, నా తండ్రి చాలా అద్భుతమైన వ్యక్తి!" అని. కానీ ఆయన ఇంకొన్ని సంవత్సరాలు జీవించి ఉంటే అతను మీకు భరించలేని వ్యక్తిగా అనిపిస్తాడు. ఆయన తన సాధారణమైన జీవన ప్రయాణం సాగించి వెళ్ళిపోవాలి. అప్పుడే అది అందరికీ మంచిది.
ఒకే శ్వాసలో జీవన్మరణాలు
మరణానికి వ్యతిరేకంగా ఉండటమే మానవ బుద్ధికి ఉన్న అతి పెద్ద విపత్తు, ఎందుకంటే మీరు మరణాన్ని వ్యతిరేకించిన క్షణమే జీవితాన్ని కూడా వ్యతిరేకిస్తారు. మనం ఇక్కడ జీవిస్తున్న ప్రతి క్షణం, ఈ జీవన గమనాన్ని మనం జీవితం అని చెప్పవొచ్చు లేదా మరణం అని చెప్పవొచ్చు. మరణం అనేది మీకు జరగబోయేది కాదు. అది భవిష్యత్తులో కాదు సంభవించేది. మీరు పుట్టిన క్షణమే సగం మరణం సంభవించినట్టే. మీరు శ్వాస తీసుకోవటం జీవం, శ్వాస వొదలటం మరణం. ఒక బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ చేసే మొదటి పని ఒక ఊపిరి పీల్చుకోవటం. మీరు మీ జీవితాన్ని గమనిస్తే జీవిత చరమదశలో మీరు చేసే ఆఖరి పని ఒక శ్వాసని వొదలటం. జీవానికి చావుకి మధ్యలో- జీవితంలో ఒక రకమైన ఆందోళన అవసరం; లేకపోతే మీరు దానిని సాగించలేరు. మరణం సంపూర్ణమైన ప్రశాంతత. మీరు ఈ విషయాన్ని ఇప్పుడే పరీక్షించి చూడొచ్చు, ఒక పెద్ద శ్వాసని వొదిలి, ఒక పెద్ద ఊపిరి పీల్చుకుని చూడండి. శ్వాస వదలటం మీకు ఎక్కువ ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజానికి మీరు ఎప్పుడు ఆందోళన చెందినా, మీలో రకరకాల విషయాలు గూడు కట్టుకుపోయినా, మీ శరీరంలో జరిగే సహజ ప్రక్రియ ఏంటంటే ఒక శ్వాస విడవటం. దీనినే మనం నిట్టూర్పు అంటాం. ఇది మీకు కొంత వరకూ ప్రశాంతతని చేకూరుస్తుంది. అసలు ఈ జీవిత ప్రక్రియలోనే మీకు మరణం ఇచ్చే ప్రశాంతత అనుభవంలోకి వస్తే, ఇంక జీవితం అనేది చాలా సునాయాస గమనం అవుతుంది.
మానవుల బుద్ధులు మరణాన్ని ఒక దుష్టమైన ప్రక్రియగా వెలి వేయకపోయి ఉంటే జీవితం ఇలానే సహజంగా సాగిపోయేది. మన సంప్రదాయాలు, సంస్కృతి గనుక చావుని ఒక చెడ్డ విషయంగా, తప్పించుకోవాల్సిన విషయంగా మనకి నేర్పించకపోయి ఉంటే, మనం పూర్తిగా భిన్నమైన విధంగా ఊపిరి పీల్చుకునేవాళ్ళం. మీరు గనుక గమనిస్తే 99% మంది జనులు, వాళ్ళ మెదడు మరణాన్ని తిరస్కరించడంతో, వాళ్ళు ఊపిరి తీసుకుంటారేగాని, విడవటం మాత్రం పూర్తిగా జరగదు. ఈ కారణం చేతనే కొంత కాలంలో మీరు ఎంతటి వత్తిడిని పెంచుకుంటారంటే, మానసికంగా, శారీరకంగా అది బద్దలయ్యే స్థితికి చేరుకుంటుంది.
మీ మర్త్యత్వానికి ఒక గమనిక
ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జనానికి వారు మర్త్యులు అని అర్ధం కావాలి అంటే ఒక జీవిత కాలం పట్టేలా ఉంది. మీరు యవ్వనంలో ఉండేటప్పుడు మీరు అమర్త్యులు అనుకుంటారు. శరీరం కొంత సడలడం మొదలవ్వగానే, అప్పుడు మీకు అనిపిస్తుంది, ఈ మట్టి నన్ను పిలుస్తోంది అని. మన ఈ శరీరం ఈ ప్రపంచం నుంచి తెచ్చుకున్న అప్పు. ఏ శరీరంగా మీరు ఉన్నారో ఆ శరీరం కేవలం మీరు తిన్న ఆహరం. మీరు తిన్న ఆహారం కేవలం ఈ భూమి. కాబట్టి మీరు కేవలం భూమిలో ఒక భాగం. ఈ భూమి మిమల్ని నిరంతరం పిలుస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడైతే మీకు వృద్దాప్యం వస్తుందో అప్పుడే మీరు ఆ పిలుపును స్పష్టంగా వింటారు.
మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని మీరు పండగలా జరుపుకోవాలి, ఆనందించాలి, ఎందుకంటే దీని సమయం పరిగెడుతోంది; అది మీ కోసం ఒక్క క్షణం కూడా ఆగదు. ముఖ్యంగా మీరు మరణించేవారు కాబట్టి, మీరు దీనిని ఇంకా ఆనందభరితమైన, అద్భుతమైన ప్రక్రియగా మార్చుకోవాలి. మీరు కనుక అమరులై ఉంటే, నిరాశతో ఒక వంద సంవత్సరాలు, ఆందోళనతో ఇంకొక వంద, వెర్రితనంతో ఓ వంద, దుఃఖంతో ఇంకొక వంద సంవత్సరాలు గడిపేసి, మీ ఐదువందో సంవత్సరంలో ఆనందభరితులు కావొచ్చు. కానీ పరిస్థితి ఆలా లేదు కదా; మీకు చావు తప్పదు ఇంకా ఆ చావు కోసం సమయం పరుగులు తీస్తోంది. నిరాశకి, నిస్పృహకి, ఆందోళనకి ,కోపానికి సమయం లేదు; జీవితంలో అప్రీతికరమైన వాటికి సమయం లేదు.
మీకు ప్రతిక్షణం మీరు మరణం తప్పని వారు అని గుర్తువుంటే, ఈ మొత్తం జీవిత గమనం ప్రతి విషయాన్ని అనుభవించాలి అని కోరుకుంటుంది, అది చాలా అప్రమత్తంగా ఉంటుంది. మరు గంటలో మీరు చనిపోతారు అని మీకు తెలిస్తే, మీరు జీవితంలో ప్రతి చిన్న అంశాన్ని గుర్తిస్తారు. దేనినీ విడిచిపెట్టరు. ఎప్పుడైతే ప్రతి మనిషి తన మానసిక, శారీరక పద్దతులను జీవితంలో అతి ప్రధాన అంశమైన తన అమర్త్యత్వం చుట్టూ అల్లుకుంటాడో, నిరంతరం, ప్రతి ఒక్క క్షణం మరణాన్ని జీవిత ప్రక్రియలో ఒక భాగంగా అంగీకరిస్తాడో - అలాంటి వారి జీవిత విలువలు చాలా విభిన్నంగా ఉంటాయి. పొద్దున్నే వికసించి, సాయంత్రానికి వాడిపోయే పువ్వులాగా, మీరు, మీ జీవితం కూడా అచ్చంగా ఇలాంటి ఒక ప్రక్రియే అని మీరు తెలుసుకోగలిగితే - ఇప్పుడు మీరు వికసిస్తూ ఉండవొచ్చు, రేపు మరణించవొచ్చు - అప్పుడు మీ దారిలోని ఒక్క పువ్వుని కూడా మీరు చేజార్చుకోరు. మీరు మీ జీవితంలో పూర్తిగా నిమగ్నమవుతారు ఇంకా మీ జీవితం ఈ భౌతిక అవస్థ నుండి విడివడి ఇంతకుమించి ఉన్న ఏదో విషయాన్ని సహజంగా వెతుకుతుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ మీ ఉన్నతికి తోడ్పడే ఒక సహజ పద్ధతి అవుతుంది.
సంపాదకుడి గమనిక: తల్లి గర్భంలో ప్రవేశించిననాటి నుండి ఈ శరీరాన్ని విడిచి వెళ్లేంతవరకు, మరణానికి, మరణించడానికి వెనక ఉన్న ఎన్నో చిక్కుముడులని శోధిస్తూ సద్గురు అందించిన "Unraveling Death" అనే వీడియోని డౌన్లోడ్ చేసుకోండి.