ఆలయాలు – శక్తిని స్వీకరించవలసిన ప్రదేశాలేగాని, కోరుకునే నెలవులు కావు.

కంగనా రనౌత్: సద్గురు, కాశీ విశ్వనాథుని ఆలయంలో మీరు కూర్చున్న విధానం గమనిస్తే మీరు ధ్యానం చేస్తున్నారో, అక్కడ చుట్టూ గమనిస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇక్కడేదో గంభీరమైన శాస్త్రం ఉన్నదని నాకు తెలుసు, అది వాస్తు కావచ్చు లేదంటే గర్భస్థానం కావచ్చు. నేనొక ఆలయాన్ని నిర్మించేందుకు తోడ్పడ్డాను. అందువల్ల, ఆ ఆలయనిర్మాణం సంపూర్ణంగా శాస్త్రబద్ధమైనదని నాకు తెలుసు. ఒక సామాన్యుడు అక్కడకు వెళితే అతను తన సమయాన్ని ఎంతబాగా ఉపయోగించుకోవచ్చు, ఆ శక్తి స్వరూపాల నుంచి మనం ఎంత బాగా లాభపడ వచ్చునంటారు?

సద్గురు: భారతీయ దేవాలయాలలోకి వెళ్ళేందుకు కొన్ని మౌలిక మార్గదర్శకాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో అవి ఇంకా సజీవంగా ఉన్నాయి. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రార్థనకాని, అభ్యర్ధన కాని ముఖ్యం కాదని జనానికి ఇప్పటికీ తెలుసు. అక్కడ వారు కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి. ఎందుకంటే అది బ్యాటరి చార్జి చేసే స్థలం లాంటిది. మనం ఒక్కొక్క ఆలయాన్ని ఒక్కక్క ప్రయోజనం కోసం నిర్మించుకున్నాం. కాని దురదృష్టవశాత్తూ ఆలయాలను ప్రార్థనా స్థలాలుగా ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు.ఆలయాలు ప్రార్థనా స్థలాలు కావు. అక్కడ మీరు కేవలం దర్శనం చేసుకోవాలి. దర్శనం అంటే చూడటం, మనసులో నిలుపుకోవడం. ఎందుకంటే అక్కడ ఒకమూర్తిని కొన్ని ప్రయోజనాల కోసం ఒకవిధమైన పరిపూర్ణతతో, ప్రత్యేకమైన జ్యామితితో రూపొందించటం జరిగింది.

మీరు అక్కడ కూర్చోని దర్శించుకోవటమే పరమార్థం. మీరు అక్కడ కూర్చుని ఆ మూర్తి ప్రతిబింబాన్ని మీలో ముద్రించుకుంటారు. అది ఒక శక్తిమంతమైన మూర్తి. దాని నిర్మాణం వెనుక శక్తికోణ పరమైన నిర్దిష్ట శాస్త్రం ఉంది. మీరు ఆ రూపాన్ని మీలోకి తీసుకున్నప్పుడు, అది మీలో జీవించి వృద్ధి చెందుతుంది. ఆలయానికి వెళ్ళటంలోని పరమార్థం అదే. ఆలయానికి వెళ్లి అక్కడ కూర్చొని ఆ శక్తిని గ్రహించటం. కాని ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆలయానికి వెళ్లి అక్కడ తాము అర్జీ పెట్టుకుందాం అనుకుంటున్నారు.

ఆలయంలో ఎలా ఉండాలి?

కంగనా రనౌత్: ‘శ్రీ రాముడు’ అనగానే నా జీవితం ప్రకాశామంతమౌతుందని, ఆయన నెలకొల్పిన జీవన ప్రమాణాలు, నీతులు, విలువల వ్యవస్థలను నాలో ఇముడ్చుకోవడం అనుకుంటూ నేను పెరగలేదు.

సద్గురు: మనం మిగతా ప్రపంచం నుండి ఈ విషయాలను గ్రహించటం వల్ల అలా జరిగింది. భగవంతునితో సంభాషించటం భారతీయత కాదు. ఎందుకంటే మన భగవంతుని మనమే ఏర్పరచుకోగలమనే అవగాహన మనకు కలిగింది. ఈ ఒక్క సంస్కృతిలోనే భగవంతుడు ‘మన సృష్టి’ అనే అవగాహన ఉన్నది.

అందుకే మనకు ముక్కోటి దేవుళ్ళు-దేవతలు ఉన్నారు. మిగతా వారంతా భగవంతుడు తమను సృష్టించాడని అనుకొంటారు. మన శ్రేయస్సు కోసమే మనం దేవుణ్ణి సృష్టించుకొన్నామని ఇక్కడ మనకు తెలుసు. అంతే కాదు మన శ్రేయస్సులో కేవలం మన ధనం, జీవనం, ఆహారాలే కాక ముక్తి కూడా చేరి ఉంది. అది ఈ సంస్కృతి ప్రత్యేకత.

ఒక ఆలయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి ఎలా సిద్ధపడాలి? మీరు యోగా కేంద్రానికి వచ్చినట్లయితే, సందర్శకులు, సూర్యకుండంలో కాని, చంద్ర కుండంలో కాని మునిగి తరువాత తమ శరీరాలు కొద్దిగా తడిగా ఉండగానే ఆలయంలోకి ప్రవేశిస్తారు. పూర్వం కూడా ఇవి అన్నీ ఉన్నాయి. అందుకే ప్రతి ఆలయంలోనూ తీర్థకుండాలు ఉన్నాయి. మీరు కుండంలో మునిగి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే శరీరం కాస్త చెమ్మగా ఉన్నప్పుడు అక్కడి శక్తిని మీ శరీరం చక్కగా గ్రహిస్తుంది. అంతే కాదు, భగవంతునికి ఆదేశాలు ఇవ్వటానికి వెళ్ళటం లేదు అని మీ మనసులో,మీరు గ్రహించాలి.

భగవంతుడు ఏమి చెయ్యాలో చెప్పటానికి మీరు ఆలయానికి వెళ్ళటం లేదు. మీ అంతట మీరు సృజించుకోలేని ఒకానొక శక్తిని అక్కడ పొందటానికి వెళుతున్నారు. అందుకనే ఈ సంస్కృతిలో, గృహస్థాశ్రమంలోని వారు, ప్రతి ఉదయం తమ నిత్యజీవన ఆరంభానికి ముందుగా ఆలయదర్శనం చేసుకొని వెళ్ళాలి అని అంటారు. ఆధ్యాత్మిక మార్గంలోవుండే వారికి అది అవసరం లేదు, ఎందుకంటే తమశక్తిని పెంపొందించుకొనే పద్ధతులు వారికి తెలుసు. అందువల్ల వారు అందరూ వెళ్ళే బహిరంగ ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరం లేదు. పల్లెల్లో ప్రజలు, వీధి కుళాయి దగ్గర నీళ్ళు తెచ్చుకోవటాన్ని చూస్తాం. ఎందుకంటే వాళ్లకు ఇంట్లో కుళాయి నీటి సదుపాయంలేదు. ఇంట్లో ఆ సదుపాయం ఉన్నవారు వీధి కుళాయి వద్దకు వెళ్ళరు. ఇది అలాంటిదే!

మీలో మీరైనా పెంపొందించుకోవాలి, లేదంటే అది ఉన్నచోటుకు మీరు వెళ్లి తెచ్చుకోవాలి. అక్కడకి “నేను ఎలా వెళ్ళాలి” అంటే, మీరు ఒక సూక్ష్మమైన ఆలయంగా రూపొందాలి. సూక్ష్మమైన ఆలయం అంటే, మీ శరీరంలో కూడా సృష్టికి కారణమైంది ఏదో ఉందని, అది దివ్యత్వమని మీకు తెలుసు. సృష్టికి మూలమైనదానినే మీరు దైవం అంటున్నారు! అది మీలో తప్పకుండా ఉంది. మీకు అది అనుభవంలో లేక పోయినా సరే మీరు ఆలయానికి వెళ్ళేటప్పుడు “నాలో ఉన్న దివ్యత్వం జాగృతం కావాలి” అనే ఆలోచనతో స్పృహతో వెళ్ళండి. అయితే ఆ దివ్యత్వం ప్రస్తుతం మీ అనుభవంలో లేదు. అది మీ అనుభవంలోకి రావలసి ఉంది.

కంగనా రనౌత్ : కొందరు ఇతరులకంటే ఎక్కువ పరిణతి పొందారు అని నేను అర్థం చేసుకున్నాను. ఆలయానికి వెళ్ళే ప్రతి ఒక్కరు అలా ప్రయత్నిస్తే ఆత్మజ్ఞానాన్ని పొందగలరా? లేక కొందరికి అది తేలికై, మరికొందరికి కష్టమౌతుందా?

సద్గురు: నేను మిమ్మల్ని ఒక చెట్టును ఎక్కమని అంటే - మీరు మీ శరీరాన్ని ఎలా ఉంచుకున్నారో అన్న దానిని బట్టి, నేను ఎక్కడానికి మీరు ఎక్కటానికి తేడా ఉంటుంది, కదా? జీవితంలో అన్ని కోణాలకు అదే వర్తిస్తుంది. మీరొక పుస్తకాన్ని చదివారు అనుకుందాం. దాన్ని ఒక వ్యక్తి ఎలా అర్థం చేసుకుంటాడు అన్నది అతడు తన గ్రహణ శక్తిని ఎంత పదునుగా ఉంచుకున్నాడన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే మీ జీవశక్తి కూడా – అది మీ శరీర పటుత్వం పైన, చురుకుతనం పైన ఆధారపడి ఉంటుంది.

కంగనా రనౌత్ : కాని సద్గురు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. మన ముందు తరాలు ఆలయాలపై ఎంతో ధనాన్ని వెచ్చించారు. ఒకతరం తరువాత మరొక తరం ఎన్నో నిధులను, వనరులను, మానసికమైన, భావోద్వేగపరమైన శక్తులన్నింటిని ఆలయాల్లో వెచ్చించారు. చూడబోతే సమస్తాన్ని ఆలయాలకు అంకితం చెయ్యటం మన సంప్రదాయం లాగా ఉంది. కానీ మీరు అదేమంత ముఖ్యం కాదని అంటున్నారు.

సద్గురు: అయినా, దీన్నంతా గృహస్థాశ్రమం లోని వారి కొరకే ఏర్పరచారు. కానీ యోగులు మాత్రం, వెళ్లి గుహలలోనే నివసించారు. వారెప్పుడూ ఆలయాల్లో నివసించలేదు. వాళ్ళు కొండల్లోనో, నదీ తీరాల్లోనో నివసించారు. వారు దిన దినం ఆలయాలకు వెళ్ళలేదు. అవసరమైతే మీరు దాన్ని ఉపయోగించుకోవటంలో తప్పులేదు. అది అన్నివిధాలా మంచిదే.

సద్గురు ఏరకంగా భిన్నమైన యోగి

కంగనా రనౌత్: నేను ఆదియోగిని గూర్చి విన్నదానిని బట్టి ఆయన తనలో తానూ పరమానందంలో మునిగి ఉంటారు. ఆయనకు సప్తర్షులకుగాని ఇతరులకు ఎవరికైనాగాని జ్ఞానాన్ని పంచే ఆసక్తి లేదు. నిజానికి వారికి ఇచ్చిన దాన్ని ఆయన వెనక్కి కూడా తీసుకున్నారు. ఎవరికైనా జ్ఞానాన్ని పంచటంలో ఆయనకు ఏమాత్రం ఆసక్తిలేదు. కుంభమేళాకు వచ్చే ఎందరో యోగుల్ని చూస్తూ ఉంటాను. వారిలో చాలా గొప్పవారు ఉంటారు. వారేదో స్వర్గం నుండి దిగివచ్చిన వారిలా ఉంటారు.

కాని మీ సంగతి ఏమిటి? మీరు ఈ ప్రపంచంలో కర్మయోగి అని నాకనిపిస్తుంది. మీరు నదులను కాపాడాలని అనుకుంటారు, మీరు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని అనుకుంటారు. మీరు ధ్యానలింగాన్ని ప్రతిష్టించే క్రమంలో మీ ప్రాణాలనే వదలటానికి సిద్ధపడ్డారు. ప్రజలకు ఇవ్వాలనే ఆకాంక్ష మీలో బలంగా ఉంది. మరి ఈ యోగులందరూ మీకంటే ఎలా భిన్నమైనవారు?

సద్గురు: ఇక్కడ కాశీలో మీరు చూస్తున్న చాలామంది, యోగి వలే కనబడే ప్రయత్నంలో ఉన్నారు, వారి వస్త్రధారణ ఆదియోగిని తలపిస్తూ ఉంటుంది. అందుకే నేను నా వస్త్రధారణా విధానాన్ని పూర్తిగా మార్చివేసుకున్నాను. వారిలో చాలా మంది పోషకాహారం లేక చిక్కిపోయి ఉన్నారు. కానీ మీరు ఆదియోగిని చూడండి. యోగి కావడం వల్ల, ఆయన లోకమంతటికీ మంచి పటువైన శరీరంగల భగవంతుడు!

విశ్వవిద్యాలయాల్లో చదవాల్సిన కర్మ మీకు పట్టలేదు. ఒకవేళ మీరు అక్కడకు వెళ్లి ఉంటే, వాళ్ళు నేర్చుకొన్న విషయాలనే బోధించే ఆచార్యులు అక్కడ ఉంటారు. కాని వారు ఒక ఐదేళ్లపాటు పి.హెచ్.డి చేసిన సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో వారెవ్వరితో మాట్లాడరు. పూర్తి సమయం వ్రాయటంలో, చదవటంలో, ఆకళింపు చేసుకోవటంలో గడిపి ఉంటారు. మీరు ఒకవేళ వారిని ఆసమయంలో చూసి ఉంటే వారీ ప్రపంచాన్ని పరిత్యజించారేమో అనిపిస్తుంది. ఒక విధంగా అది అలానే ఉంటుంది! కాని అది పరిత్యాగం కాదు. వారి ధ్యాస అన్నింటి కంటే ముఖ్యమైన మరొక దానిపై నిలిచి ఉంది. మీరు దానిపై పనిచేస్తున్నప్పుడు ‘మీరు అన్నింటినీ వదలివేశారు’ అని ఇతరులు అనుకుంటారు. మీరు చాలా కష్టపడి ఒక విషయాన్ని అధ్యయనం చేస్తున్నారని, ‘ఇతర విషయాలకు మీకు సమయంలేదని’ వారు అర్థం చేసుకోరు. పిహెచ్ డి చేసే సమయంలో ఆ నాల్గు, ఐదేళ్ళూ మిగతా విషయాలకు మీకు సమయంలేదు.

ఒకసారి ఆచార్యులు అయ్యాక వారు బోధించటం మొదలు పెడతారు, అందరిలో కలుస్తారు. అప్పుడు అతని పరిజ్ఞానం దుర్బలంగా కాక పరిపుష్టంగా ఉంటుంది. దుర్బలం అనటంలో నా ఉద్దేశం ఏదో ఒక అనుమానంలోనో, సందేహంలోనో ఉండటం అని. ప్రారంభంలో మీ వస్త్రధారణ, ఆహారం ఇతరులకన్నా భిన్నంగా ఉంటే, అందరిలో కలిసినప్పుడు అది అందరి సమ్మతిని పొందుతుందా లేదా ఒక సందేహం ఉంటుంది. ఎందుకంటే, అది ఇంకా ప్రయోగదశలోనే ఉంటుంది. అలాగే ఒక యోగికి కూడాను. మీరు అతను పరిత్యజించాడు అనుకుంటారు. ఆయన పరిత్యజించలేదు, ఆయన ధ్యాస వేరే దానిమీద ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అటువంటి దశ ఒకటి ఉంటుంది. నా జీవితంలో కూడా అటువంటి దశ ఉంది. కానీ ఇప్పటి స్థితి వేరు. నా ఆధ్యాత్మిక ప్రక్రియ ఇప్పుడు సుకుమారంగా లేదు. నేను ఎలాగైనా ఉండగలను, ఎలా ఉన్నా ప్రస్తుతంలో ఉండగలను. నాకు పోయేదేమీ లేదు. ఇప్పుడు నేను ఏ వాతావరణంలో ఉన్నా, ఎటువంటి వ్యక్తులతో కలిసి ఉన్నా నాకు ఏ వ్యత్యాసం ఉండదు. నేను సత్సాంగత్యం కోసం ఎదురుచూడటం లేదు. చెడ్డవారి సాంగత్యం కూడా నాకు సరే! ఎందుకంటే చెడు సాంగత్యమే నా కార్యక్షేత్రం.

మేము చెరసాలల్లో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. అంటే నేను కరడు గట్టిన నేరస్తుల మధ్య ఉన్నాను. వారితో ఉన్నంత మాత్రాన నేను నేరగాడిని అవుతానా? లేదు. కానీ వారే యోగులయ్యే అవకాశం ఉంది. అంతేగాని, నేను నేరస్తుడిని కాను.