ఆనందంతో నిండిన, ఒత్తిడి లేని, ఒక సరికొత్త జీవితం కోసం సాధనపాదలో పాల్గొనడానికి 32 దేశాల నుండి 800 మందికి పైగా పార్టిసిపెంట్స్ కోయంబత్తూరులోని ఈశ యోగా కేంద్రంలో 7 నెలలు గడపడానికి వచ్చారు. సాధనపాదలో పాల్గొనే వారు క్రమశిక్షణతో, తీవ్రమైన సాధన ప్రక్రియను అనుసరిస్తూ, తమ నైపుణ్యాలతో ఈశా కార్యకలాపాలలో సహాయం చేస్తూ, ఆశ్రమంలోని వివిధ కార్యక్రమాలలో, వేడుకలలో పాలుపంచుకుంటున్నారు.

ఈ బ్లాగ్ లలో వారి ప్రయాణంలోని ఒడుదొడుకులను, తెర వెనుక నుంచి మీకు తెలియజేస్తున్నాము.

ఈ రెండు నెలలు కాలం ఎలా పరిగెట్టిందో సాధనపాదలో పాల్గొంటున్నవారికి తెలియదు. ప్రతి రోజూ సూర్యోదయానికి ముందరే లేచి శరీరానికి బాగా శ్రమయిస్తూ పొద్దున్న చేయవలసిన సాధనలను పూర్తి చేసుకుని, తీర్థ కుండంలో స్నానం చేసి తాజాగా తయారై, రోజూ చేసే సేవకి వారు సిద్ధం అవుతారు. చెయ్యాల్సిన పని, ఒకే రకంగా విసుగు పుట్టించకుండా, వైవిధ్యంగా వారి నైపుణ్యాన్ని సవాలు చేస్తూ, చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. వాళ్ళ మనసులో ఈ సేవ వల్ల కలిగే అనుభూతులతో, వాళ్ళు ఏ పనైనా, ఎప్పుడైనా చెయ్యటానికి తయారుగా ఉంటారు.

కావేరి కాలింగ్ ఉద్యమంతో, ఈ నెల వాలంటీరింగ్ ఇంకొక ప్రత్యేక మార్గంలోకి వెళ్ళింది. కావేరి కాలింగ్ ప్రపంచంలో ఇప్పటి దాకా కనీవినీ ఎరుగని బ్రహ్మాండమైన చారిత్రాత్మక ఉద్యమం, మరి అది వాళ్ళ కళ్ళ ముందరే వికసిస్తోంది! కావేరి నదీ పరీవాహక ప్రాంతంలో, 242 కోట్ల చెట్లను నాటడానికి విరాళాల సేకరణకు, సద్గురు స్వయంగా తన మోటార్ సైకిల్ మీద కర్ణాటక, తమిళ్ నాడు రాష్ట్రాలలో పర్యటించారు. జీవితంలో ఒకే సారి వచ్చే ఇలాంటి మహదవకాశం కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది స్వచ్ఛంద సేవకులు సద్గురు పిలుపుకి వెంటనే స్పందించారు. తమ సేవ ద్వారా ఈ బ్రహ్మాండమైన లక్ష్యం విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ముందుకి వచ్చారు.

ఒక హైర్ కట్ ధరకు రెండు చెట్లు

తిరూర్, కేరళ నించి వచ్చిన 31 ఏళ్ల రాజేష్, జుట్టు అలంకరణలో ప్రావీణ్యం గల దిట్ట. సాధన పాదం కోసం వస్తూ తనతో పాటు జుట్టు అలంకరణకి కావలసిన పరికరాలను కూడా తెచ్చుకున్నాడు. అతని నైపుణ్యం అతి త్వరలో అందరికీ తెలిసి పోయింది. అందరూ అతని వెనక పడ్డారు. రాజేష్ దగ్గరకి కేశాలంకరణం కోసం వచ్చే వాళ్ళను విరాళాలు అడగమని రాజేష్ రూమ్ మేట్ సలహా ఇస్తే, ఆ సలహా రాజేష్ కి బాగా నచ్చింది. అతనితో పాటు ఉన్న సాధన స్వచ్ఛంద సేవకులు, చెట్ల కోసం డబ్బులివ్వటం చాలా సంతోషం. ఒక్కొక్క మనిషికి, ఒక కేశ అలంకరణకి రెండు చెట్ల వెల చొప్పున 1000 చెట్లకి డబ్బులు పోగు చేద్దామనుకుంటున్నాడు. అతను అనుకున్నది సాధించాలని మేము హృదయ పూర్వకంగా ఆశిస్తున్నాము.

ఇలా ప్రతి సాధన భాగస్వామి తనకి తోచిన కొత్త మార్గంలో చెట్ల కోసం డబ్బులు పోగు చేస్తున్నాడు. అందరూ కలిసి ఇప్పటిదాకా 50,000 చెట్లకి డబ్బులు పోగు చేశారు.

కావేరి పిలుపు కోసం సాధన పాద వాలంటీర్ల్ ఏమి చేశారు?

కావేరి చెట్ల కోసం విరాళాలు కావాలంటే, ముందర అందరికీ దీన్ని గురించి తెలియాలి. దానికి కంపూటర్ల ద్వారాను, ముఖా-ముఖి భేటీల ద్వారాను ప్రచారం చెయ్యాలి. సాధన పాద కార్యక్రమంలో పాల్గొన్నవారు చేస్తున్న కొన్ని కార్య క్రమాలు ఈ క్రింద వివరిస్తున్నాము.

1. కావేరి పిలుపు కోసం కంపూటర్ ఆటలు తయారు చెయ్యటం

2. ప్రకటన పత్రాలు, టీ-షర్టులూ డిజైన్ చెయ్యటం

3. బ్లాగులు రాయటం

4. సమాచార రేఖా చిత్రాలు (infographics) తయారు చెయ్యటం

5. ప్రజానీకానికి దీనిని గురించి తెలియబరచడం కోసం దృశ్యచిత్రాలు తయారు చెయ్యటం

6. నీటి ఎద్దడి వల్ల వచ్చే విషమ పరిస్థితుల గురించి, అటవీ వ్యవసాయం గురించి పరిశోధన చెయ్యటం

సద్గురుతో ప్రయాణం

సాధన పాద పాల్గొనేవారు ఆశ్రమంలో 7 నెలలు ఉండటానికి వచ్చినా, కావేరి పిలిస్తే స్పందించక తప్పదు. మోటార్ సైకిల్ మీద సద్గురు బృందంతో ప్రయాణించిన ఒక సాధకుడు, తను వీడియోలు తీసే బృందంలోకి ఎలా లాగ బడ్డాడో తన అనుభాలు వివరిస్తున్నాడు.

‘‘తళ-తళ మెరిసే హోటల్ బ్యాంకెట్ హాలుల నుంచి, కారు తలుపుని పట్టుకు వేలాడుతూ కూడా అద్భుతమైన వీడియోలు తియ్యాలి! ’’

రెండు వారాల పాటు కావేరి పిలుపు బృందంతో ఆశ్రమం నించి వెళుతున్న వీడియో బృందంతో పాటు వెళ్ళమని ఒక రోజు ముందరగా నాకు చెప్పారు. సద్గురు కార్యక్రమాలు ప్రత్యక్షంగా చూడటమే కాకుండా, నేను ఫోటోలు, వీడియోలు కూడా తియ్యాలి. అప్పట్నించి ఊపిరి తీసుకోటానికి కూడా టైము లేకుండా, ఎంతో సంతృప్తినిచ్చే కార్యక్రమంలో పాలుపంచున్నాను. అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలోనూ, బురదతో నిండిన మురికి గుంటలలోనూ, తళ-తళ హోటల్ బ్యాంకెట్ హాలుల లోనూ, కారు తలుపుని పట్టుకు వేలాడుతూ కూడా కొన్ని అద్భుతమైన వీడియోలు తీశాను. అలా జరిగిన నా ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. చిన్న పిల్లలు, బిచ్చ గాళ్ళు, ముఖ్య మంత్రులు – అన్ని రకాల వాళ్ళు కావేరి పిలుపుని సమర్ధిస్తున్నారు. అది నాకెంతో కనువిప్పు కలిగించింది! ఈ ప్రయాణంలో సాధన ఒక కొత్త అర్థాన్ని సంతరించుకుంది. నాలో విస్మయంతో కూడిన నమ్రత కలిగింది. – ఆరుష్, 45, ముంబాయి

ఆశ్రమంలో ఉంటూ...

ఎండని, వానని, తుఫానుని లెక్కచెయ్యకుండా తన మోటార్ సైకిల్ మీద పట్టు వదలని విక్రమార్కుడిలా సాగిపోతున్న సద్గురు, చూసే ప్రేక్షకులనే కాక, తెర వెనకనుంచి ప్రతి చిన్న విషయాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న ఆశ్రమ వాలంటీర్లను కూడా ఉత్సాహ పరిచారు. సరిగ్గా నిద్ర పోవటానికి కానీ, తిండి తినటానికి కానీ టైం లేక పోయినా స్వచ్చంద సేవకులు ఏ ఫిర్యాదులూ లేకుండా రాత్రింబవళ్ళు పని చెయ్యటానికి తమను తాము పూర్తిగా సమర్పించుకున్నారు.

వీరు చేసే కొన్ని పనులు:

ఆర్ధిక విభాగం రోజూ వేల కొద్దీ విరాళ రసీదులని తయారు చేయాలి.

సోషల్ మీడియా బృందం 24 గంటలూ తాజా పర్యటన విశేషాలను ప్రచురించాలి.

డిజిటల్ మీడియా బృందం సోషల్ మీడియాకి, వార్తా పత్రికలకి వ్యాసాలు రాయాలి.

ఇది అంతా నా గురించే!

 

నేను కావేరి కాలింగ్ ఉద్యమంలో పూర్తిగా మునుగిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, నేను ఈ పని సద్గురు కోసం కానీ, రైతులకి సాయం కోసం కానీ, నదులను పునరుద్ధరించటం కోసం కానీ, వాతావరణం కోసం కానీ చెయ్యటం లేదు – ఇది పూర్తిగా నా కోసమే! నాకు తినటానికి అన్నం, తాగటానికి నీళ్ళూ బతికున్నన్నాళ్ళూ కావాలంటే, దీన్ని నేను శాయ శక్తులా విజయవంతం చెయ్యాలి. భవిష్యత్తులో నాకు తినటానికి అన్నం, తాగటానికి నీళ్ళూ ఉండక పోవచ్చన్న ఆలోచన విపరీతమైన భయాన్ని కలిగిస్తుంది. – అశ్విని, 27 ఏళ్ళు, సిన్సినాటీ, అమెరికా

నదులలాగా ప్రవహించటం నేర్చుకో!

కొంతమందికి ఈ కావేరీ కాలింగ్ లాంటి ఉద్యమంలో ప్రవాహంతో పాలు పోవాలంటే ఇంతకు ముందు ఎన్నడూ చెయ్యని అనేక పనులు చెయ్యాలి. “నేను కావేరి కాలింగ్ ’’ మీద ప్రాశ్చాత్య శైలిలో ఒక పాట కూడా రాశాను.”

ఒక వ్యక్తిగా నేను చేసే పని చాలా తక్కువ (ఉడతా సహాయం మాదిరి). కానీ సద్గురు నాకూ ఈ అమూల్యమైన అవకాశాన్ని కావేరి పిలుపు వేదికలో ఇచ్చారు. ఈ కావేరి పిలుపు ద్వారా ప్రపంచ వాతావరణంలోనే చెరగని ముద్ర వేసే అవకాశం నాకు కలిగింది. నిగూఢమైన ఒక ఆనందం, రోజల్లా శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. దానివల్ల నాలో ఉన్న, నాకే తెలియని సృజనాత్మక శక్తి పరిమళించింది. నా పనిలో దాని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాకు పాశ్చ్యాత్య సంగీతం అంటే ఏమిటో తెలియదు – అలాంటి నేనే పాశ్చ్యాత్య శైలిలో కావేరి పిలుపు మీద ఒక పాట కూడా రాశాను. – బరన్, 35 ఏళ్ళు, మెల్బార్న్, ఆస్ట్రేలియా.

పాత సహ విద్యార్ధులను కలవడం

ఇంతకు ముందు సాధన పాదంలో స్వచ్చంద సేవకుడిగా పని చేసిన ఒక పాత స్నేహితుడు ఈ మాటు కావేరి పిలుపులో వీడియో బృందంలో నాతో పాటు కలిసి మొత్తం కర్ణాటక, తమిళ రాష్ట్రాలను పర్యటించాడు. మా పని కావేరి పిలుపు ఉద్యమానికి కొన్ని వారాలకి ముందే మొదలయింది. మేము కావేరి పరీవాహక ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సద్గురు పర్యటనలో కావలసిన ప్రదేశాలని నిర్ధారించాము.

భూ-పరిశీలనా కార్యక్రమంలో రైతుల కష్టాలు వినడం

కావేరి పిలుపు ఉద్యమంలో పాల్గొనటం ఎంతో ఉత్సాహంగాను, ఉల్లాసంగాను ఉంది. మేము సద్గురు పర్యటనలో ఏ ఏ ప్రదేశాలలో సద్గురు ఆగాలో పరిశీలన చేసేందుకు వెళ్ళినప్పుడు, ప్రత్యక్షంగా నదీ పరీవాహక ప్రాంతంలో చెట్లు లేక పోవడమూ, దానివల్ల చెట్లు పెరగటానికి అవసరమైన పై మన్ను లేకపోవడం, ఆ కారణంగా నది ఏండి పోవటమూ చూస్తే, మా కడుపు తరుక్కు పోయింది. ప్రతి చోటా అన్ని వృత్తులవారూ అధిక సంఖ్యలో ప్రతిస్పందించారు. రైతుల సంఘాలు హుంసూరు కు మైసూరు కు వచ్చేయి. ఈ కావేరి కాలింగ్ వల్ల వారికి జరగబోయే లాభాలు తెలియచేసినందుకు వారి చూపిన కృతజ్ఞత మా హృదయాన్ని కదిలించింది. మేము చేస్తున్న పని ఎంత అవసరమో మాకు పూర్తిగా అర్థమైంది. - వరుణ్, 29 ఏళ్ళు, బెంగళూరు.

కావేరి కాలింగ్ ఉద్యమం పరిసమాప్తి కార్యక్రమం

సద్గురు కోయంబత్తూరులో కావేరి పిలుపు ఉద్యమం ముగించటానికి ఒక రోజు ముందర, సాధన పాదం వాలంటీర్లకు ఒక అనుకోని శుభ వార్త వచ్చింది – వాళ్ళందరూ కూడా ఆ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారని! అత్యంత ఉత్సాహంతో వాళ్ళందరూ మరుసటి రోజు పొద్దున్న సద్గురుని కలవటానికి, లైనుగా నుంచున్న బస్సులలో ఎక్కారు. ఆ గంట ప్రయాణం ఎంతో సంతోషంగా ఆటలతో, పాటలతో ఎలా గడిచి పోయిందో తెలియలేదు. ఒకసారి కార్యక్రమ స్థలానికి చేరగానే, అందరూ కిందకి దూకేసి, ఏమి పనులు చెయ్యాలో ఆ పనులలో నిమగ్నమయి పోయారు. కొంత మంది వేదిక తయారు చెయ్యటంలో, కొంత మంది వస్తున్న వారికి భోజనం వడ్డించటంలో, కొంత మంది సద్గురుని ఆహ్వానించటానికి రోడ్డు మీద లైన్లలో నుంచోటానికి వెళ్ళిపోయారు.

“నేను 2,000 చెట్లకి వాగ్దానం చేశాను, ఇప్పటికే 600 చెట్లకి విరాళం వసూలు చేశాను”

“సెప్టెంబర్ 17న అందరినీ ఉత్సాహ పరచటానికి, సద్గురు బృందాన్ని ఆహ్వానించటానికి గంటలకొద్దీ నిలబడ్డాను. ఈ ఉద్యమం గురించి అందరికీ తెలియచెయ్యటానికి, 62 ఏళ్ల వయసులో, 3080 కిలోమీటర్లు, 14 రోజుల పాటు ప్రయాణం చేసి ఇన్ని కార్యక్రమాలలో పాల్గొనటానికి సద్గురుకి ఎక్కడ నుంచి ఇంత శక్తి వచ్చిందో అని ఆశ్చర్యం పడ్డాను! దేశ, రాష్ట్ర, కుల, మత భేదం లేకుండా అన్ని రాజకీయ పార్టీల నించి మనుషులని సద్గురు ఎలా ఉత్సాహ పరిచారో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది! ప్రజలను ఎంత ప్రభావితం చేస్తోందో! అదే నాలో సమర్పణ భావం, లక్ష్యం మీద ఏకాగ్రత కలిగింఛి, నా ధృక్పదాన్నే పూర్తిగా మార్చేసింది. మొదటి మెట్టుగా 2,000 చెట్లకి వాగ్దానం చేసి ఇప్పటికే 600 చెట్లకి విరాళం వసూలు చేశాను. – సుష్రీ, 24 ఏళ్ళు, ఓడిషా

నా పక్కన నుంచున్న ఒక విదేశీయుడు “కావేరిని రక్షించాలి” అని నినాదాలు చేశాడు.

మేము జెండాలతో, కావేరి కాలింగ్ ప్లెకార్డులతో రోడ్డు మీద నుంచుని ఈశా వారి “నది స్తుతి” గానం చేస్తున్నాము. దారిన పోయే ప్రతి వాళ్లతో “కావేరి, కావేరి” అని అరుస్తునాము. అకస్మాత్తుగా నా పక్కన నించున్న ఒక విదేశీయుడు “కావేరిని రక్షించాలి” అని నినాదాలు చేశాడు. ఏమైందో నాకే తెలియదు – నా కళ్ళల్లో నాకే తెలియకుండా కన్నీళ్లు వచ్చాయి! మన దేశస్థుడు కాకపోయినా కావేరి మీద ఇంత అభిమానం చూపిస్తుంటే నా మనసు కదిలి పోయింది! ఇది చూసిన తర్వాత నా శాయ శక్తులా నా చాతనైందల్లా చేసి ఈ ఉద్యమంలో వీలైనంత ఎక్కువ మంది పాల్గొనేలా చేసి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించాలన్ని నిశ్చయించుకున్నాను. - కృతి, 20 ఏళ్ళు, ఝార్ ఖండ్

సాధన అంటే కళ్ళు మూసుకునే చెయ్యాలా?

ధ్యాన స్థితిలోకి పోవటానికి కళ్ళు మూసుకుని ఏదో చెయ్యాల్సిన అవసరం లేదని ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ అనుభవపూర్వకంగా తెలిసింది. తీవ్రమైన ఉత్సాహంతో, సాధనపాదం సేవలో పూర్తిగా మునిగి పొతే, ధ్యానం తనంతట తానే ఔతుంది.

“యోగా అంటే నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకోవటమే. ఇక్కడే ఊరికే కళ్ళు మూసుకుని కూర్చుని నిన్ను నువ్వు ప్రపంచానికి అర్పించుకోవచ్చు. కానీ చాలా మందికి అంత ఎరుక కలగ లేదు. ఏదైనా పని చేస్తేనే వాళ్ళను వాళ్ళు సమర్పించుకోగలరు. కాబట్టి స్వచ్చంద సేవ నిన్ను నువ్వు సమర్పించుకోవటానికి ఒక అద్భుతమైన సాధనం” అని సద్గురు చెబుతారు.

‘‘సామాన్యంగా మనం ఏదైనా చిన్న పని చెయ్యాల్సి వచ్చినా, వెంటనే లెక్కలు కడతాము. నేను ఎంత పని చెయ్యాలి? నేనే ఎందుకు చెయ్యాలి? ఇది చేస్తే నాకేమొస్తుంది?” ఈ లెక్కలు వెయ్యటంలో, అసలు పనిలో కలిగే ఆనందం మాయమై పోతుంది! జీవన ప్రక్రియే వికృతంగా మారుతుంది! మనం రోజూ చేసే ప్రతి సామాన్యమైన పని కోసం ఈ లెక్కల బేరీజులో ఎంత మునిగి పోవడానికి కారణం, ఏమీ ఇవ్వడానికి తయారుగా ఉండము కాబట్టి. అది మీ పనే కానివ్వండి, మీ వైవాహిక జీవితమే కానివ్వండి, మీ కుటుంబమే కానివ్వండి, ఏదైనా సరే, వాళ్ళు మీ జీవితంలో రావాలని మనః పూర్వకంగా మీరే మొదలు పెట్టారు. కానీ ఒక సారి మొదలు పెట్టిన తర్వాత` మీరు దాన్ని ఎందుకు మొదలు పెట్టారో మరిచిపోయారు. ఇప్పుడు ఇవ్వాలనిపించదు – ఇవ్వాలంటే చాలా బాధాకరంగా ఉంటుంది.’’

‘‘స్వచ్చంద సేవ అంటే మనం ఎప్పుడూ ఇచ్చేవారిగానే మారటం అన్న మాట. స్వచ్చంద సేవకుడు అంటే ఎవరైతే సంతోషంగా, ఇష్ట పూర్వకంగా ఏ పనైనా చెయ్యటానికి తయారుగా ఉండేవాడు అన్న మాట. తనకు తానే ‘సమ్మతి’గా మారిపోయాడన్న మాట!’’

వచ్చే వ్యాసంలో...వేడుకలు!

ప్రతిరోజూ ఆశ్రమంలో ఉండే ఆనందం అనుభవించడమే కాకుండా, గత రెండు నెలలుగా ఆశ్రమంలో అనేక వేడుకలు, కార్యక్రమాలు జరిగాయి. ఈ శీర్షికలో తదుపరి భాగంలో, జీవితాన్ని ఒక పండుగలా, స్వేచ్ఛగా ఎలా గడుపుకోవాలో చూద్దాం. ఆధ్యాత్మిక జీవనం సంతోషంగా ఉండదని ఎవ్వరన్నారు?