Sadhguru“ఆధ్యాత్మికత” అనేది ఒక మానసిక ప్రక్రియ కాదు. మీ జ్ఞాపకశక్తితో మీరు దీన్ని చేయలేరు. ఇది ఒక జీవన ప్రక్రియ. ఉనికికి సంబంధించిన ప్రక్రియ. ఇది ఎప్పుడు జరుగుతుందంటే - మీరు ఇక్కడ కేవలం ఒక జీవంగా ఉండగలిగినప్పుడు, నిజానికి మీరు ఒక జీవం మాత్రమే. ఇది(ఆధ్యాత్మికత) చేయాలంటే ఇక్కడ మేము ఎన్నో పనులను చేస్తాం. ఇక్కడ (ఆశ్రమంలో), మీరు కొంత మందిని కాషాయం రంగు సైలెన్స్ టాగ్స్ వేసుకుని వెళ్తూ ఉండడం చూసి ఉండచ్చు. ఇది వీళ్ళను మౌనంలో ఉండమని సూచిస్తోంది. మాట్లాడకుండా ఉండడం అనేది ఈ సాధనలో సగభాగం మాత్రమే. మీ గురించి మీరు మరీ ఎక్కువగా ఆలోచించనప్పుడే మీరు మౌనంగా ఉండడం సాధ్యం అవుతుంది.

“నేను చాలా తెలివిగలవాడ్ని” అనుకుంటే మీరు ఎలా మౌనంగా ఉండగలరు...?

“నేను చాలా తెలివిగలవాడ్ని” అని అనుకుంటే మీరు ఎలా మౌనంగా ఉండగలరు..? మీరు 'నేను చాలా తెలివిగలవాడ్ని' అని అనుకున్నప్పుడు మీరు మౌనంగా ఉండగలరా చెప్పండి? నిజానికి, మీరు “నేను మూర్ఖుడిని” అని గ్రహించగలిగినప్పుడు, మీకు ఈ సృష్టి గురించి ఏమీ తెలీదు అని తెలుసుకున్నప్పుడు, ఈ సృష్టిలో ప్రతిదాన్ని ఆశ్చర్యంతో చూడగలుగుతారు. మీ మనసులో ఒక ఆలోచన కూడా రాదు. అన్నీ మీకు తెలుసు అనుకుంటే, మీకు కేవలం వాటి గురించిన గణితాలు, వివరాలు ఇంకా ఎన్నో మీ మనసులో జరుగుతూ ఉంటాయి.

ఆలోచనలకు ప్రాముఖ్యతనివ్వకండి

మీరు దేన్నైనా చూడగానే వెయ్య ఆలోచనలు వస్తాయి కదూ! ఈ సత్సంగంలో కూడా మీరు పూర్తి మౌనంగా కూర్చోలేదు. నేను చెప్పేవాటికి అంగీకరిస్తున్నారు, నిరాకరిస్తున్నారు, మనస్సులో వీటి గురించి ఏవో ఆలోచించుకుంటున్నారు, మీరు మీ పక్కనున్న వారి దుస్తుల గురించి ఆలోచిస్తున్నారు, వాటిని మెచ్చుకుంటున్నారు, అవి బాలేదనుకుంటున్నారు - అన్నీ జరుగుతున్నాయి అవునా? నేను తప్పుగా చెబుతున్నానా? ఎందుకంటే, మీరు ఎప్పుడైతే మీ ఆలోచనకి ఒక విలువుంది అని అనుకుంటారో అప్పుడు మీరు దాన్ని ఆపే అవకాశం లేదు. ఆలోచనలు అలా జరుగుతూనే ఉంటాయి. మీరు ఎప్పుడైతే, “జీవితానికి సంబంధించినంత వరకూ ఈ ఆలోచనకి ఎటువంటి విలువ లేదు”, ఆలోచనలు అనేవి "పాత విషయాలే మళ్ళీ పునరావృతం అవ్వడం" అని తెలుసుకుంటారో, అప్పుడు ఆలోచనలు రావు.

కానీ మీరు ఎప్పుడైతే ఆలోచనలు పునరావృతం అవ్వడం గొప్పగా ఉంది అని అనుకున్నారో అప్పుడు మీరు వాటిని ఆపలేరు. ఇలా అనుకోవడం ఎంత మూర్ఖమైనదో మీరు చూడగలిగితే అప్పుడు మెల్లిగా మీరు దానినుంచి కొంత దూరం ఏర్పరచుకుంటారు. అప్పుడు అవన్నీ వాటంతట అవే కుప్పకూలిపోతాయి. మీరు వాటిపట్ల ధ్యాస పెట్టకపోతే అవి వాటి మనుగడను సాగించలేవు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు