ప్రశ్న: ముక్తిని చేరుకోవడం ఎలా...అక్కడికి వెళ్ళడం ఎలా..?

సద్గురు: అక్కడికి ఎలా వెళ్లాలో తెలుసుకోవాలంటే,  మనం సాంకేతికత(Technology) గురించి మాట్లాడుకోవాలి. మీరు, లౌకికమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. నేను చెప్పేది అంతర్ముఖ సాంకేతికతకు సంబంధించింది. ఇది, మీ గురించినది. ఇక్కడ, మీరే సాఫ్ట్ వేర్. ప్రధానంగా మిమ్మల్ని మీరు చూస్తే, మీరు మీ సాఫ్ట్-వేర్ కి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నారు. మీరు ఎటువంటి కుటుంబంలో పుట్టారు..? మీ తల్లిదండ్రులు ఎటువంటివారు..? మీరు ఎటువంటి స్కూల్ కి వెళ్లారు..? మీ స్నేహితులు ఎలాంటివారు..? మీరు పెరిగిన వాతావరణం ఎలాంటిది..? మీ మతం, మీ సమాజం.. వాటన్నిటిని బట్టీ, ఇప్పుడు మీరు ఎలాంటి మనిషి అన్నది నిర్ణయింపబడింది, ఔనా..? ఈ సాఫ్ట్-వేర్ మీలో ఎరుక లేకుండా వ్రాయబడింది..అందరివల్లా.. ప్రతివారివల్లా..! మీరు, ట్రైన్ చేయబడ్డ ప్రొఫెషనల్ కాదు. వారు ఏదో ఒకటి మీ బుర్రకి ఎక్కించేసి వెళ్ళిపోయారు.

మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రతీవారూ మీ బుర్రలో ఏదో వేస్తారు. మీకు, ఏది పుచ్చుకోవాలి, ఏది వద్దు అన్న ఎంపిక లేదు. మీరు, “నాకు ఈ మనిషి నచ్చడు, ఈ మనిషి నుంచి నేను ఏమీ తీసుకోవద్దు అనుకుంటున్నాను” అంటే - మీరు అందరికంటే ఎక్కువగా, అతని నుంచి మరింతగా పోగు చేసుకుంటారు..! ఈ శరీరం అలాంటిది. అందుకని, మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తోందో.. మీరు ఎలా ఆలోచిస్తున్నారో.. మీకు ఏ విధంగా అర్థం అవుతోందో.. మీ జీవితంలో ప్రతీ చర్యా కూడా ఎలా చేస్తున్నారో.. మీ సాఫ్ట్ వేర్ ద్వారా నిర్ణయించబడింది. అవునా..?? మీరు, మీ శరీరాన్ని ఎలా కదుపుతున్నారో, మీ సాఫ్ట్-వేర్ అలా ఉంది. ఈ విషయం అర్థం చేసుకోండి. ఇది ఎంతగానో నియంత్రించబడి ఉంది. మీకు బాగా తెలిసినవారు ఎవరైనా, ఒక మైలు దూరంలో నడుస్తున్నారనుకోండి.. మీరు ఏదీ గుర్తు పట్టలేరు. కానీ, ఆ మనిషి కదులుతున్న విధానం బట్టి ఎవరు వస్తున్నారో తెలిసిపోతుంది..కదూ..? అతని శరీరం ఎలా కదులుతుంది.. కేవలం అతని కదలికలు.. అతని సాఫ్ట్-వేర్ ఎలా ఉందో - ఆ విధంగానే జరుగుతాయి.

ఈ సాఫ్ట్-వేర్ ఎరుక లేకుండా జరుగుతోంది. ఇది, కొంత స్వేచ్చతో జరగాలి అని మనం అనుకుంటే, కొంత పరివర్తన అన్నది జరగాలి. అందుకోసం - మీకు, మీ సాఫ్ట్-వేర్ కి మధ్య కొంత దూరం తీసుకురావాలి. మీరు, దానితో మరీ ఎక్కువగా తాదాత్మ్యత చెందితే అందులో మునిగిపోతారు. అప్పుడు, మీరు అదే అయిపోతారు. మీకూ దానికీ మధ్య కొంచం దూరం ఏర్పరచుకోండి. మీరు “ బుద్ధా “ అన్న పదం విన్నారా..? నేను బుద్ధా అనగానే మీరు గౌతమ బుద్ధుడు అని అనుకుంటారు. గౌతముడు మాత్రమే బుద్ధా కాదు. అది ఆయన పేరులో లేదు. ఆయన ఒక బుద్ధుడుగా మారారు. ఎన్నో వేలకొలదీ బుద్ధులు ఉన్నారు. ఈ రోజుకీ ఉన్నారు.  బుద్ధా అంటే ఏమిటి.. “ బు “ అంటే బుద్ధి, “ ధ “ అంటే ఎవరైతే దానిని అధిగమించారో వారు. ఎవరైతే, తన బుద్ధిని అధిగమించారో.. వారు బుద్ధా..! ఒకసారి మీరు మీ బుద్ధి అనే ప్రక్రియని అధిగమిస్తే, మీ జీవితంలో మీ బాధలన్నీ తీరిపోయినట్లే..! ఎందుకంటే, ఈ బాధలన్నీ కూడా మీ తార్కికమైన బుద్ధిలోనే తయారు చెయ్యబడుతున్నాయి కాబట్టి..!

ప్రజలు, దేనినుండి అయినా సరే, బాధని సృష్టించుకోగల సమర్ధులు. ఇది, బుద్ధి యొక్క తత్వం.

మీ బుద్ధిలో మీరు చిక్కుకుపోయినప్పుడు నిరంతరం బాధలలోనే ఉంటారు. మిమ్మల్ని ఎక్కడ పెట్టినా సరే, మీరు బాధపడుతూనే ఉంటారు. మీ భయాలూ, మీ ఆందోళనలూ, మీ వత్తిడులూ... ప్రజలు దేనికైనా సరే బాధ పడగల సామర్ధ్యం కలవారు. అవునా..? కాదా..? ఒకవేళ మీరు చదువుకోలేదనుకోండి.. మీరు దాని గురించి బాధ పడతారు. మీరు చదువుకుంటే దాని గురించి కూడా బాధపడతారు. మీకు సరైన ఉద్యోగం లేకపోతే.. బాధ. మీకు ఉద్యోగం దొరికిందనుకోండి.. అందులో కూడా మీరు బాధ పడతారు. మీకు పెళ్లి అయితే.. దానికీ బాధ పడతారు. మీకు పెళ్లి కాకపోతే.. దానికి కూడా బాధ పడతారు. పిల్లలు లేకపోతే.. దానికి కూడా బాధ. ఒకవేళ పిల్లలు ఉంటే.. దానికి కూడా బాధ పడతారు. అవునా..? కాదా..?

ప్రజలు, దేనినుండి అయినా సరే, బాధని సృష్టించుకోగల సమర్ధులు. ఇది, బుద్ధి యొక్క తత్వం. ఒకసారి మీరు ఈ బుద్ధిలో చిక్కుకుపోతే, మీ జీవితం ఇలానే ఉంటుంది. మీరు గనుక ఈ బుద్ధి కంటే కొంచెం తక్కువలో ఉంటే, మీకు అంత బాధ కలగదు. జంతువులు అంతగా బాధపడవు చూడండి. వాటి భౌతికమైన అంశాలు కనక మనం చూసుకుంటే, అవి హాయిగానే ఉంటాయి. మానవులు ఏ విధంగా అయితే బాధ పడుతున్నారో ఆ విధంగా అవి బాధ పడవు. మీరు బుద్ధికంటే కొంచెం తక్కువలో ఉన్నారనుకోండి, మీరూ అంతగా బాధపడరు. మీరు ఒకవేళ దీనికంటే ఎక్కువగా ఉంటే, మీరు బుద్ధిని అధిగమిస్తే, అప్పుడు మీరే  “ బుద్ధా “. ఒకవేళ మీరు బుద్ధికి తక్కువ స్థాయిలో ఉంటే మిమ్మల్ని "బుద్ధూ" అనవచ్చు.

మీరు ఒకవేళ ఈ బుద్ధిలో గనుక చిక్కుకుపోతే, ఇంక మీ బాధలకు అంతేలేదు. అందుకని, ఈ బాధల్ని అరికట్టడానికి ప్రజలు ఎన్నో విధానాలని కనిపెడుతూ ఉన్నారు. అతిగా తినేయడం, మద్యం త్రాగడం, భౌతిక సుఖాల్లో అతిగా పాలు పంచుకోవడం వంటివి. ఇవన్నీ కూడా మీరు చేస్తున్నది, మీ బుద్ధి పెట్టే బాధ నుంచి కాసేపు తప్పించుకోవడానికే...! మీరు తాగారనుకోండి, కాసేపు మీకు గొప్పగా అనిపిస్తుంది. కొన్ని గంటలు. ఆ తరువాత మళ్ళీ జీవితం మామూలే, అప్పుడు మరింతగా మిమ్మల్ని బాధ పెడుతుంది. అది మిమ్మల్ని ఎక్కడికీ పోనివ్వదు. ఒకవేళ బుద్ధి కంటే మీరు తక్కువ స్థాయిలో ఉంటే పర్వాలేదు,  కానీ  మీరు బుద్ధిని పరిణామం చెందించుకున్నారు. ఇప్పుడు  మీకున్న ఏకైక మార్గం, ఈ బుద్ధిని దాటి ముందుకి వెళ్లడమే..!

యోగ - సాంకేతికత          

యోగా మూలం ఇంకా ఈ సాంకేతికత అంతా కూడా మీరు దీనిని దాటి వెళ్లడానికే. ఇప్పుడు, నేను ఇది ఎలా చెయ్యాలి..? నిమగ్నత లేని పరిస్థితులలో మీరు అంతర్ముఖ సాంకేతికతని పరిశోధించలేరు.  మీకు ఎంతగానో చిత్తశుద్ధి కలిగి, ఏకదృష్ఠి ఉన్న వాతావరణం కావాలి. లేకపోతే, దీనిని మీరు గ్రహించలేరు. ఇది ఒక బోధన కాదు. ఇది ఒక విధానం. ఒక విధానాన్ని మనం ఆచరించాలంటే మనం ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఉండాలి. దీనికి, కొంత నిబద్ధత కావాలి. తగిన గ్రాహ్యత ఉండాలి. లేకపోతే, అది పని చేయదు.

ఇప్పుడు చూడండి.. మీరొక కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉన్నారనుకోండి. మీరొక రసాయనం తీసుకొని ఇంకొక రసాయనం అందులో కలిపితే ఏదో జరుగుతుంది. కానీ మీరు అలా చేయకుండా ఊరికే ఇక్కడ కూర్చొని చూస్తూ ఆలోచిస్తూ, “ ఇది జరుగుతుందేమో, అది జరుగుతుందేమో” అనుకుంటే, మీరు తప్పు నిర్ధారణలకే వస్తారు. మీరు కనుక దానిని అక్కడ వేసి చూడనంతవరకూ అది ఏమిటో మీకు తెలియదు..! బహుశా, అది మీ ముఖం మీద పేలవచ్చు. కానీ, మీరు అలా చేసినప్పుడు మాత్రమే అది ఏమిటో మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ, మీరే ఆ రసాయనికత,  మీరే శాస్త్రవేత్త,  మీరే ఆ ప్రయోగ ప్రక్రియ కూడానూ.. అన్నీ మీరే. అందుకని ఇక్కడ మరో విధమైన ప్రయోగశాల అవసరం.లేకపోతే ఇది పనిచేయదు.

ఒకవేళ ఇది భౌతికమైనదే అయితే, మేము మీకు ఒక పుస్తకం వ్రాసి ఇచ్చేసే వాళ్లం. కానీ ఇది అంతర్ముఖ్మమైనది. దీనిలో, మీరు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే, ఇది పూర్తిగా మరొక కోణం.. మరొక అవగాహన.. మరొక అనుభవం. నాకు ఇది సాధ్యమేనా అంటే..? ప్రతీ మానవుడికీ ఇది సాధ్యమే.  అంతర్ముఖంగా, మనందరికీ కూడా ఒకే రకమైన సామర్థ్యం ఉంది. బాహ్యంగా మనం ఒకే విధంగా ఉండి ఉండకపోవచ్చు.  కానీ మనందరం కూడా ఆనందాన్ని అనుభూతి చెందగలం.. ఔనా..? మీరు ఒక్క క్షణం ఆనందం పొందగలిగినా, మీరు ఆనందాన్ని అనుభూతి చెందగల సామర్థ్యం ఉన్నవారే. ఔనా? కాదా? కాకపోతే, మీరు ఆ అనుభవంలో ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నారు. విషయమంతా కూడా అదే..! ఈ భూమి మీద ఆనందమంటే తెలియని ఒక్క మనిషి కూడా లేడు. ప్రతీ మనిషీ ఏదో ఒక సమయంలో, ఆనందంగానే ఉన్నాడు. అంటే, ఆనందాన్ని అనుభూతి చెందగల సామర్థ్యం అతనికి ఉంది. కాకపోతే, అతను ఆ స్థాయిలో నిలబడలేకపోతున్నాడు. అందుకని తనలో అటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి, అతనికి ఒక సాంకేతికత కావాలి. అది సాధ్యమే..!

ప్రేమాశీస్సులతో,
సద్గురు