1) ప్రస్తుతం యువత యాప్ లు గాడ్జెట్లు / పరికరాలకు ఆకర్షితులై ఉన్నారు. వారి దినచర్య ఒక పోస్ట్ తో మొదలై ఒక ట్వీట్ తో ముగుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వారి జీవితాలను వారు ఎలా నియంత్రించుకోగలరు?

సద్గురు - ఎవరైతే తమను తాము ఆధీనంలో ఉంచుకోలేరో వారు ఎప్పుడూ ఏదో ఒక కారణంవల్ల తమ దిశను కోల్పోతారు. కాబట్టి ఇక్కడ సమస్య పరికరాలు కాదు వాటి వల్ల కలిగే నిర్బంధం. మన యువత, పిల్లలు, పెద్దవారు జీవితం నిర్బంధంగా కొనసాగించకూడదని తెలుసుకోవాలి. మనం తినడం, కూర్చోవడం, నిల్చోవడం, పనిచేయడం అన్నీ ఎరుకతో చేయాలి. మనం జీవితం స్పృహతో సాగిస్తే అది గాడ్జెట్ల వాడకంలో కూడా కనిపిస్తుంది.

2) యువతపై సమాచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వారి దైనందిన జీవితాన్ని వారు ఎలా నిర్వహించుకోగలరు?

సద్గురు -  సమాచారం గురించి మనం ఫిర్యాదు చేయకూడదు, వంద సంవత్సరాల క్రితం కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఒక విధ్వంసం జరిగినా ఒక అద్భుతం జరిగినా మనకు ఆ విషయం తెలియడానికి ఒక నెల రోజులు పట్టేది. ఇప్పుడు ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో వెంటనే తెలిసిపోతుంది. సాంకేతికత అనేది మంచిదీ కాదు చెడ్డది కాదు దానికి ఏ గుణం లేదు. అది మన వాడకంపై ఆధారపడి ఉంటుంది.

మీరు ఎలాంటి టెక్నాలజీ వాడినా ఫోన్, కంప్యూటర్, సోషల్ మీడియా అవి మానవ వ్యవస్థ అంత అధునాతనమైనవి కావు.  భూమిపై అత్యాధునాతనమైన గాడ్జెట్ మనిషి, ముందు దీన్ని గమనించండి - మిగిలినవన్నీ సహజంగానే నిర్వహించబడతాయి. లేదంటే అద్భుతమైన సాంకేతిక బహుమతి ఒత్తిడికి గురిచేస్తుంది.

3) కుటుంబంతో, స్నేహితులతో వున్న సత్సంబంధాలను కోల్పోతున్న యువత భావోద్వేగ సూచిని ఎలా పెంపొందించుకోగలదు.

సద్గురు - చాలా మంది మనుషులలో భావోద్వేగం అతిపెద్ద పరిమాణం, కాబట్టి భావోద్వేగ భద్రత చాలా ముఖ్యమైనది. మనిషి నిజంగా ఎరుకతో నిండి ఉంటే భావోద్వేగం అంత ముఖ్యం కాదు, ఆలా కాకపోతే భావోద్వేగం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.

కాబట్టి బాల్యం నుండే పిల్లలకు భావోద్వేగ భద్రత ఉండాలి. అంటే వారి చుట్టూ ఎప్పుడూ ప్రేమ పూరిత వాతావరణం ఉండాలి. కేవలం ఇంట్లోనే కాదు, స్కూల్ లో, వీధిలో వారు ఎక్కడికెళ్తే అక్కడ వారు అన్నిచోట్లా ప్రేమ ఆప్యాయతలను అనుభూతి చెందాలి. మన ముందు తరాల సంక్షేమం కోసం ఇది మనం జాగ్రత్తగా చూసుకోవలసిన ముఖ్యమైన అంశం.

4) జంతువులు, పెంపుడు జంతువుల నుంచి యువత ఏం నేర్చుకోవచ్చు?

 

సద్గురు: ఈ మధ్య చాలా మంది మనుషులకన్నా కుక్కలను తోడుగా ఎంచుకుంటున్నారు, ఎందుకంటే కుక్కతో అయితే ఇది ఖచ్చితమైన 12 సంవత్సరాల ప్రేమ వ్యవహారం. దేవుడంటే ప్రేమో కాదో మనకు తెలియదు కానీ కుక్క మాత్రం ప్రేమతో నిండింది. మీరు ఉదయాన మీ కుక్కతో ఎలా వ్యవహరించినా మీరు సాయంత్రం ఇంటికి చేరుకున్నప్పుడు అది మిమ్మల్ని ఆహ్వానించినట్టు మీ భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ చేయరు.

అందుకేనేమో చాలా మంది వారి కుటుంబ సభ్యులకన్నా ఎక్కువగా కుక్కల్ని ప్రేమిస్తారు.  కానీ మీరు మీ కుక్కను ఎంత ప్రేమగా చూడగలరో అంతే ప్రేమగా మనిషినీ చూడగలరు, ఎందుకంటే ప్రేమ అనేది మీలోని భావన, అది మీ కుక్కకి, కుటుంబానికి, స్నేహితులకు సంబంధించినది కాదు.

ప్రేమ మీలో పుట్టే అనుభూతి. మీలో ప్రేమ పరిమళిస్తే మీ అస్థిత్వమే ఆహ్లాదకరంగా మారుతుంది. మీరు ఆహ్లాదకరంగా ఉన్నప్పుడే మీరు మీలోని అన్ని పార్శ్వాలను అన్వేషించగలరు. లేదంటే మీలో చెడు ఆలోచనలు, భావాలు, మీ శరీరం, మిమ్మల్ని ఎప్పుడూ తీరికలేకుండా ఉంచుతాయి. మీరు మీ ఆలోచనలు, భావాలు, శరీరం ఆహ్లాదకరంగా, ప్రేమమయం చేసుకుంటే మీలో ఎలాంటి భయం బాధ వుండవు. ఎప్పుడైతే మీలో బాధ తాలూకు భయం ఉండదో అప్పుడే మీరు జీవితంలో హుందాగా ముందుకెళ్ళగలరు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు