యోగా గురించి తెలుసుకోండి – యోగాలో తరచూ అడిగే ప్రశ్నలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకునే సందర్భంలో కొన్నేళ్ళుగా యోగా ఇంకా ధ్యానం మీద సంకలనం చేసిన ప్రశ్నలు, జవాబులు యోగాని అర్ధం చేసుకోటానికి పనికి వస్తాయన్న ఉద్దేశ్యంతో ఈ కింద ఇస్తున్నాము.
Kenne dein Yoga – Fragen und Antworten
 

ప్రశ్న: యోగాకీ, ధ్యానానికీ తేడా ఏమిటి?

సద్గురు: ఆంగ్లంలో ఉపయోగించే “meditation” అన్న మాటకు అసలు అర్ధమే లేదు! ఎందుకంటే మీరు కళ్ళు మూసుకుని కూచుంటే అది “meditation” అనుకుంటారు. కాని కళ్ళు మూసుకుని మీరు ఎన్నో పనులు చెయ్యవచ్చు – జపం, తపం, ధారణ, ధ్యానం, సమాధి, శూన్య (ఈషాలో నేర్పించే ఒక ప్రక్రియ) మొదలయినవి. లేకపోతే మీరు కూర్చుని నిద్ర పోవటంలో దిట్ట అయి ఉండచ్చు. “meditation” అంటే ధ్యానం అనుకుంటే, అది యోగాలో ఒక భాగం.

ధ్యానం మీరు చెయ్యాల్సిన ప్రక్రియ కాదు. కానీ మీరు ధ్యానావస్థలోకి వెళ్ళగలరు. ధ్యానం ఒక స్వభావంలేక స్థితి – అది ప్రక్రియ కాదు.

ముందర మీరు ధ్యానం అంటేఅర్ధం చేసుకోండి. ప్రస్తుతం మీరు మీ మనసుకి బానిసగా ఉన్నారు. మీరు మెల్లి మెల్లిగా ధ్యానావస్థలోకి వెళుతూ ఉంటే, క్రమేణా మీరు అధికారి, మనసు బానిసగా అవుతుంది. అసలు ఎప్పుడూ ఇలానే ఉండాలి. మీరు మనసుకి అధికారం ఇస్తే అది అతి క్రూరమైన అధికారిగా ప్రవర్తిస్తుంది. మిమ్మల్ని అంతులేని వివిధ రకాలైన బాధలకి గురి చేస్తుంది. కానీ ఒక బానిసగా అయితే మాత్రం, అది అధ్బుతంగా పని చేస్తుంది.

ధ్యానం చేయాలని ప్రయత్నించిన చాలా మంది అది అసంభవం అన్న నిర్ణయానికి ఎందుకు వచ్చారంటే, వాళ్ళు ధ్యానం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు! ధ్యానం మీరు చెయ్య గలిగే ప్రక్రియ కాదు – కానీ మీరు ధ్యానావస్థలోకి వెళ్ళగలరు. ధ్యానం ఒక స్థితి – ప్రక్రియ కాదు. మీరు మీ శరీరాన్ని, మనసుని, శక్తిని ఇంకా భావాలని ఒక పరిపక్వ స్థాయికి తెస్తే ధ్యానం దానంతట అదే జరుగుతుంది. మీరు భూమిని సారవంతంగా చేసి, తగిన ఎరువు వేసి, నీళ్ళు పోసి, మంచి విత్తనం నాటితే అది పెరిగి మీకు పువ్వులను, పళ్ళను ఇస్తుంది.

మీరు కావాలనుకోవటం వల్ల చెట్టు పూలూ, పళ్ళూ మీకివ్వటం లేదు – మీరు సరైన వాతావరణాన్ని సృష్టించారు కనుక అవి వచ్చాయి. అలాగే మీరు మీలో కావాల్సిన వాతావరణాన్ని నాలుగు ప్రమాణాలలోనూ నిర్మించుకోగలిగితే మీరు ధ్యానావస్థలోకి సహజంగానే వెళ్తారు. అది మీలో మీరు ఆనందించగలిగే ఒక పరిమళం.

ప్రశ్న: నేను మాంసాహారం, మద్యం వదిలి పెట్టకుండా కూడా యోగా చెయ్యవచ్చా?

సద్గురు: యోగా మీ మీద ఎలాంటి అంక్షలూ పెట్టదు – అది మీ జీవ శక్తిని అర్ధం చేసుకోటానికి పనికి వచ్చే సాధనం. మీరు బయటి రసాయనాలతో పని లేకుండా మీలో మీరే బ్రహ్మానందంగా ఉండగలిగితే మీకు మద్యం అవసరం లేదు, పొగ కూడా తాగక్కరలేదు. నేను నా జీవితంలో ఎప్పుడూ ఏ మత్తు పదార్ధాలనీ తీసుకోలేదు – కానీ నా కళ్ళు ఎప్పుడూ మత్తులో ఉంటాయి. యోగులకు మత్తు పదార్ధాలు, తాగుడు లాంటివి చిన్న పిల్లలు ఆట లాంటివి! మేము ఈ బయటి పదార్ధాలతో వచ్చే మత్తుకంటే అందుకు వెయ్యి రెట్ల మత్తు మాలో ఉన్న సజీవ ఉత్సాహం వాళ్ళ కలుగుతుంది. అందులో ఎప్పుడూ మునిగి ఉంటాం. మీకు ఈ సురా పానం ఏం ఖర్మ అమృత పానంలోనే ముణిగి తేలచ్చు!

ప్రశ్న: మన సంపూర్ణ ఎదుగుదలకి యోగా ఏ విధంగా సహాయ పడుతుంది?

సద్గురు: యోగా ఎదుగుదల గురించినది కాదు – తనలో తాను లయమవటం గురించినది! యోగా ఒక వ్యక్తిగత జీవన శక్తిని విశ్వంతో అనుసంధానం చేయడానికి ఉపయోగపడే సాధనం. మీ జీవిత అనుభవం పరిమితులని దాటి విశ్వంతో ఒకటైనప్పుడు, అది యోగా అంటారు. మనలో ఏకత్వం, పూర్ణత్వం అనుభూతి చెందినప్పుడు దాన్ని యోగా అంటారు. అప్పుడు మీరు జీవితంతో మీ ఇష్టమొచ్చినట్లు ఆడుకోవచ్చు – జీవితం మీ మీద ఎటువంటి గీటు వీయలేదు.

ప్రశ్న: సంస్కృతంలో యోగా అంటే సంగమం లేక ఏకత్వం. ఏకత్వం వైపు వెళ్లటానికి ఏదైనా సులభమైన ప్రక్రియ ఉందా?

సద్గురు: ఏకత్వం వైపు వెళ్లటానికి అతి సరళమైన యోగాభ్యాసం నమస్కారం. మీలో జరిగే పోరాటంలో మొదటి మెట్టు ఈడా ఇంకా పింగళా మధ్య, కుడి ఇంకా ఎడమ మెదడుల మధ్య, మీలోని సూర్యుడు ఇంకా చంద్రుడి మధ్య, ఇన్ ఇంకా యాంగ్ ల మధ్య. ఈ రెండు ధ్రువాల మధ్యా జరిగే ఘర్షణ మీ జీవితంలో లక్షల విధాలుగా బయట పడుతుంది. మీరు రెండు చేతులూ కలిపి నమస్కారం చేస్తే, మీలో ఉన్న ద్వైత భావాలను సామరస్యంతో నిర్వహించడమే కాక ప్రపంచాన్నే ఏకం చెయ్యగలరు.

సద్గురు: మీరు ఒక దూరపు పట్టణానికి వెళుతున్నారనుకోండి. మీరు ఒక్కరే ఉండి, సరైన దిశా నిర్దేశాలు లేవనుకోండి, అప్పుడు మీకు తప్పకుండా వెళ్ళవలసిన చోటికి సంబంధించి మ్యాప్ కావాలి. అది లేకుండా కూడా వెళ్ళవచ్చు – కానీ మీకు అసలు ఏమీ తెలియని చోటులో వెళ్ళటానికి ఎన్నేళ్ళు పడుతుందో అసలు వెళ్ళగలరో లేదో కూడా తెలియదు! మీ దగ్గర మ్యాప్ ఉంటే తేలికగా వెళ్ళగలరు. మీరు ఒక అనుభవజ్ఞుడైన బస్ డ్రైవర్ తో వెళితే ఇంకా తొందరగా ఇంకా తేలికగా వెళ్ళగలరు. అదీ తేడా! మీరు ఏమీ తెలియని చోటుకి వెళుతున్నప్పుడు ఆ చోటుని గురించి తెలిసిన వ్యక్తితో వెళ్ళటం తెలివైన పని!

ప్రశ్న: గురువుగా ఉండటం ఒక మంచి జీవనోపాధి మార్గం కాగలదా?

సద్గురు: ఈ మధ్యనే నన్నెవరో అడిగారు, “సద్గురు మీరు మాకు గురువు అన్న అనుభూతి మాకు చాలా అద్భుతమైనది . మేము మీకు శిష్యులుగా ఉండటం మీకు ఎలా ఉంది?”. అందుకు నేను , “ యోగిగా ఉండడం అద్భుతమైన భావన. కానీ గురువుగా ఉండడమనేది ఏంతో చికాకు కలిగిస్తుంది..” అని చెప్పాను. అతి సరళమైన ఒకే విషయాన్ని లక్ష రకాలుగా నా జీవితమంతా విశదీకరించినా ప్రజలకు ఇంకా అర్ధం కావటం లేదు. ఇది ఎంత నిరాశాజనకంగా ఉంటుందో మీరు ఊహించలేరు. గురుత్వం జీవనోపాధి మార్గం కానే కాదు. మీరు దాన్ని జీవనోపాధిగా తీసుకుంటే మీరు మీ శిష్యులకు కొన్ని ప్రమాణాలలో మార్గదర్శకులు కాలేరు. మీ మార్గదర్శనం జీవితం కంటే అధికంగా మీరు తీసుకోకపోతే మీరు మార్గదర్శనం చెయ్యలేరు.

ప్రశ్న: ఆధ్యాత్మికత వల్ల యువతకు కలిగే లాభాలేమిటి?

సద్గురు: యువత అంటే బోలెడు శక్తి. కానీ ఆ శక్తిని అదుపులో పెట్టకుండా, నిలకడ లేకుండా సరైన దిశలో మళ్ళించకపోతే అది ఎప్పుడూ వినాశకారిగా మారి ప్రమాదానికి దారి తీస్తుంది. నిలకడ, స్థిరత్వం ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళకున్న ప్రజ్ఞ, పాటవాలని పూర్తిగా ఉపయోగించుకోగలరు. కాబట్టి యువతకి ముఖ్యంగా కావలసినది వారు ధ్యాననిమగ్నులు కావటం. యువతే కనక స్థిరంగా ఉంటే, వాళ్ళు వాళ్ళకే కాకుండా అందరి శ్రేయస్సుకూ కారణమౌతారు. దేశాన్ని, ప్రపంచాన్ని ఇంకా వాణిజ్యాన్ని నిర్వహించటానికి ముందు వాళ్ళు తమను తాము నిర్వహించుకోవటం చాలా ముఖ్యం. యువత బయట పరిస్థితులతో సంబంధం లేకుండా, తమలో తాము బ్రహ్మానందంగా, అతి ఉల్లాసంగా, అతి ఉత్సాహంగా ఉండటాన్ని పెంపొందిచుకోవాలి.

ప్రశ్న: ఎరుకను పెంపొందిచుకోవటానికి మొదటి మెట్టు ఏమిటి?

సద్గురు: ప్రతి గంటా “అబ్బో! నేను ఇంకా బ్రతికే ఉన్నాను” అని మీకు మీరే గుర్తు చేసుకోండి. ఇది మీకు పిచ్చిలాగా అనిపించచ్చు. కానీ రేపు ఉదయాన ఒక లక్ష మంది ప్రజలు నిద్ర లేవరు. కాబట్టి మీరు రేపు పొద్దున్న ఇంకా బతికే ఉన్నారంటే ఒక మాటు సంతోషంతో చిన్నగా నవ్వుకోండి – ఎందుకంటే రోజూ లక్ష మంది చనిపోతున్నా మీరు ఇంకా బతికే ఉన్నారు – ఇది అంత చిన్న విషయం కాదు! తరవాత మీకు కావలసిన వాళ్ళు బతికే ఉన్నారో లేదో తెలుసుకోండి – ఎందుకంటే రోజూ కనీసం పది లక్షల మందికి వాళ్లకి కావాల్సిన వారు ఎవరో చచ్చిపోతున్నారు. కానీ మీకు కావాల్సిన వారందరూ ఇంకా బతికే ఉన్నారంటే అది అద్భుతమైన విషయం కాదా?

మీకు ఈ శరీరం యొక్క మర్త్యత్వం (mortality) స్పృహలో ఉంటే జీవితం యొక్క అర్ధం తెలుసుకోవటానికి తీవ్రమైన కోరిక ఉంటుంది. అలాంటప్పుడు ఆ విషయానికి సంబంధించిన విషయాలు తప్ప మిగతావన్నీ పనికిరావనిపిస్తాయి. అప్పుడు జీవానికి కావలసిన విషయాలు మాత్రమే చేస్తారు. ఈ ఎరుక మీలో మేల్కొన్నప్పుడు మీ జీవం వికసిసిస్తుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు