ఏది పాపం, ఏది పుణ్యం?

జీవితం యొక్క మూలంలోకి వెళ్ళటం ఒక్కటే పవిత్రం. పైపైన, మిడిమిడిగా జీవించటమే పాపం.
 

జీవితం యొక్క మూలంలోకి వెళ్ళటం ఒక్కటే పవిత్రం. పైపైన, మిడిమిడిగా జీవించటమే పాపం.


సద్గురు: మీరు మీ జీవితంలోనించి ఇది తప్పు, ఇది సరి అనే ఆలోచనను తీసేస్తే మీకు తెలుస్తుంది - అందరూ ఎవరి జీవితాలను వారు వారికి తెలిసిన విధంగా నిర్వహించుకుంటున్నారని. అందరూ వారి దృష్టిలో ఆయా సమయానికి ఏది వారికి సరైనదో, అదే చేస్తున్నారు. అది సరా తప్పా అనేది కాదు ప్రశ్న; కొన్ని చర్యలు మన జీవితానికి అవసరమా అనవసరమా అనేదే ప్రశ్న. మనం చూడవలసింది అదొక్కటే.

పశ్చాత్తాపం-అనుమానం; పాపం-పుణ్యం

దురదృష్టవశాత్తూ, ప్రతి సమాజంలో చిన్నప్పటినించీ నిరంతరాయంగా మీకు “ఇది తప్పు ఇది ఒప్పు, ఇది మంచి ఇది చెడు” అని చెబుతూనే పెంచారు.

ఏది తప్పు ఏది ఒప్పు అనే చిట్టా చూస్తే తెలుస్తుంది మీకు. ఈ లెక్కన మానవజాతి మొత్తం ఎప్పుడూ పాపాలు చేస్తూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సహజంగానే, జీవితంలోని చిన్న చిన్న పనులు చెయ్యటంలో కూడా మనుషులు కాస్తంత మోసపూరితంగా మారతారు.

మీరు ఇది మంచి ఇది చెడు అని ఒక చీటీ రాసి పెట్టుకుంటే, మీలో అనుమానం పెరుగుతుంది.

దీనివల్ల ఏదైనా పని చేసేవారు ఎప్పుడూ ఒక అపరాధభావంతో ఉంటారు. ఆ పనిని చూసే వారు ఎప్పుడూ అనుమానంతోనే చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఈ మానసిక స్థితిలో ఉన్నప్పుడు మీరు అనుమానించటం మానలేరు.

మీరు ఇది ఇలా ఉండాలి-అది అలా ఉండాలి అనే నిర్ణయాత్మక ధోరణులు మానేస్తే, జీవితం తనని తాను ఎంతో హాయిగా ఉల్లాసంగా నిర్వహించుకుంటుంది. మీరు ఆ జీవితం నుండి మీకు కావలసినది తీసుకుని అక్కర్లేనిది విడిచి పెట్టేయచ్చు. కానీ మీరు ఇది మంచి ఇది చెడు అని ఒక చీటీ రాసి పెట్టుకుంటే, మీలో అనుమానం పెరుగుతుంది. అలా అనుమానం పెరగటానికి అవకాశం ఎందుకు ఎక్కువంటే, మీరు తప్పు అనుకునే పనులు చేసే వాళ్ళు మీ చుట్టూ నిండి ఉంటారు. ఒక్కోసారి మిమ్మల్ని మీరే తప్పు బడతారు కూడా.

మీరే మంచి, చెడు అనే వ్యత్యాసాలని సృష్టించి ఈ అనుమానం, అపరాధ భావన ఏంటా అని ఆశ్చర్యపోతారు. ఆ రెండూ స్నేహితులు. మీరు దానికేమీ చెయ్యలేరు. ఈ ప్రపంచంలో ఈ అపరాధ భావన, అనుమానం ఉండకోడదంటే మీరు ఈ పుణ్యం-పాపం, తప్పు-ఒప్పు అనే విషయాలని మీ జీవితం నుండి తీసేసి, ఏది ఎలా ఉందో అలాగే దాన్ని చూడటం మొదలు పెట్టాలి. వీటిని ప్రాతిపదికగా పెట్టుకుని ఈ ప్రపంచం మొత్తం ఒక ఆట ఆడుతోంది. మనం మన జీవితాన్ని మనకున్న తెలివి, ఎరుకలతోనూ సరిదిదిద్దుకోవటం లేదు, మానవత్వంతోనూ సరిచేసుకోవట్లేదు. దురదృష్టవశాత్తూ మనం మన జీవితాలని నైతికతతో నిర్వహించాలనుకుంటున్నాం.

మీలో మానవత్వం గనుక వికసించి ఉంటే, మీకు ఎవరైనా వచ్చి ఇది తప్పు ఇది సరి, ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అని నేర్పాలా?.అది సహజంగా జరిగిపోతుంది కదా!.

మీరు మీ జీవితాన్ని నైతికతతో నడిపిస్తున్నారు. దాని పర్యవసానంగా అనుమానం, అపరాధభావన సహజంగానే కలుగుతున్నాయి. మీరు గనుక మీ జీవితాన్ని నాణ్యత, మానవత్వ  అతిశయాల ప్రాతిపదికననిర్వహిస్తే అనుమానం కానీ అపరాధభావన కానీ ఉండవు.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1