గత సంవత్సరం నవంబరులో, దాదాపు 200 మంది వ్యవస్థాపకులు, ఇంకా తమ వినూత్నమైన వ్యాపారాలనీ ఇంకా సామర్ధ్యాలనూ పెంపొందించుకోవాలనుకునేవారు, INSIGHT: The DNA of Success అనే ఒక ప్రత్యేకమైన బిజినెస్ లీడర్ షిప్ ప్రోగ్రాంకు కలిసి వచ్చారు. సద్గురుచే రూపకల్పన చేయబడి, ప్రపంచ ప్రఖ్యాత సిఇఒ కోచ్ డాక్టర్ రామ్ చరణ్ చేత నిర్వహించబడిన ఈ ప్యానెల్ లో, కెవి కామత్ ఇంకా జిఎం రావులతో సహా భారత వ్యాపార రంగంలోని అత్యంత విజయవంతమైన వారున్నారు.

ఈ ప్రోగ్రాం యొక్క రెండవ ఎడిషన్ 2013 నవంబర్ 23-26 వ తేదీలలో ఈశా యోగా కేంద్రంలో జరగనుంది. ఈ ఉత్తేజకరమైన ప్రోగ్రాం వరకూ, మేము మీకు “ది బిజినెస్ ఆఫ్ వెల్ బీయింగ్” అనే వీడియో సిరీస్‌ను అందిస్తున్నాము. INSIGHT 2012 లో ప్యానెల్ చర్చలలో భాగంగా, సద్గురు ఇంకా డాక్టర్ రామ్ చరణ్ లను ఫోర్బ్స్ ఇండియా పత్రిక మాజీ ఎడిటర్ ఇంద్రజిత్ గుప్తా ఇంటర్వ్యూ చేశారు. ఈ వీడియోలో, వారు యువతరం గురించి, సమాచార ఓవర్లోడ్ గురించి, ఇంకా విజయాన్ని పునర్నిర్వచించవలసిన అవసరం గురించి చర్చిస్తున్నారు.

ఆ వీడియో నుంచి ఒక భాగం

ఇంద్రజిత్ గుప్తా: సంస్థలు రాను రానూ చిన్న వయసు గలవి అవుతున్నాయి… శ్రామిక శక్తిలో చాలా మంది యువకులు చేరుతున్నారు, తద్వారా దాని సగటు వయస్సు తగ్గుతుంది. కాబట్టి, వ్యాపార నాయకులతో నా సంభాషణని బట్టి, నా ఉద్దేశంలో ముఖ్యమైన సవాళ్లలో ఒకటేమిటంటే, ఆ గొప్ప జీనీతో, అదే ఉద్యోగితో కనెక్ట్ అవ్వడం ఎలా? నేటి తరం ఆకాంక్షలనూ ఇంకా అంచనాలనూ అందుకోవడానికి మనం నిజంగా మన సంస్థలను తిరిగి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ఉంటే, అది ఎలా చేయాలి ?

డాక్టర్ రామ్ చరణ్: ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేటి యువ తరం చాలా నేర్పరితనం గలది. వీరికి తక్షణమే జ్ఞానం ఇంకా సమాచారం అందుబాటులో ఉంది. క్రిందటి తరానికి అది లేదు. కాబట్టి వైఖరిలో ఒక మార్పు అవసరమే. అది మొదటి విషయం. రెండవది, యువతరం రకరకాల పనులు చేయగలరు, చేస్తున్నారు కూడా. వారి పరిజ్ఞానములో మార్పు చోటు చేసుకుంటుంది, ఎందుకంటే క్షణాలలో వారికి సమాచారం అందుబాటులోకి వస్తుంది, అలాగే ఇప్పుడు వారు మిగతా వారితో అనుసంధానమై ఉండగలరు. అంతేకాకుండా, వారు అర్థవంతమైన పని చేయాలనుకుంటారు. నాకు గుర్తుంది, 30 ఏళ్ల క్రితం, దేశంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఉన్న ఒక పెద్ద పారిశ్రామిక కుటుంబం... వారికి చేతికి వచ్చిన ఒక కొడుకు ఉన్నాడు. తండ్రి అతనికి “నువ్వు వెళ్లి రెండు సంవత్సరాల పాటు ఫ్యాక్టరీలో మిషన్ల మీద పని చేయాలి” అని చెప్పాడు. నేటి తరం వారు ఇది వింటే నవ్వుతారు, ఎందుకంటే మీరు అదే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారే తప్ప, ఆలోచనా పరంగా ఏదీ కొత్తదాన్ని చేయడంలేదు. ఇప్పుడు మీరు, వారికి ఒక మేధో పరమైన సవాలును విసరాలి. వాళ్ళు కలిసి పనిచేయడానికీ, జట్లుగా అవ్వడానికీ ఇష్టపడతారు….వాళ్ళు గొప్ప గొప్ప సిద్దాంతాలతో, భావనలతో ముందుకొస్తారు. కానీ, పొరబడొద్దు: వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి అనుకుంటున్నారు, వాళ్లకి కోచింగ్ అవసరం, కానీ మీరు వాళ్ళని అవమానపరచ కూడదు. కాబట్టి వారి మేధాశక్తిని ఉపయోగించుకోండి, వారికి సాయపడండి, ప్రశ్నలు అడిగి వారిని విజయవంతులుగా చేయడానికి ప్రయత్నించండి. ఒకసారి వారు విజయవంతం అయ్యాక, వారు ముఖ్యమైన అంశాలను తెలుసుకున్నాక, మీకు ఒక ఎంతో ముఖ్యమైన మానవ మూలధనం ఉన్నట్టే. నేను దీనిని ఆ విధంగా చూస్తాను.

ఇంద్రజిత్ గుప్తా: మనం సంస్థలలో 5, లేదా 10 సంవత్సరాలు కూడా పని చేసే వాళ్ళము. నేటితరం అందుకు ఇష్టపడటం లేదు. కాబట్టి ఆధునిక వ్యవస్థ ఈ విషయంతో ఎలా వ్యవహరించాలి. అసలు ఉద్యోగి విశ్వసనీయత అనేదే అంతరించిపోయిందా ?

డాక్టర్ రామ్ చరణ్: అమెరికాలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో, మోర్గాన్ స్టాన్లీలోని గోల్డ్‌మన్ సాక్స్ లో వీళ్ళు యువకులను తీసుకుని, వారిని వారు మొదటి సంవత్సరంలో సీనియర్ వ్యక్తుల కింద పెడతారు. ఈ సీనియర్ వ్యక్తులు, తమతో పాటు యువకులను క్లైంట్ ల వద్దకు తీసుకువెళతారు, అలాగే వారికి అప్రెంటిస్ షిప్ వ్యవస్థ ఉంది, అక్కడ వారు క్లయింట్ కంపెనీల సిఇఓలను ఇంకా సిఎఫ్ఓలను కలుస్తారు. వాళ్ళు, సీనియర్ భాగస్వాములు ఎలా వ్యవహరిస్తున్నారో నేర్చుకుని, కొద్ది సమయం లోనే స్ప్రెడ్‌షీట్‌ల నుండి వ్యాపారం ఇంకా ఫైనాన్స్‌లో మంచి ప్రశ్నలు వేసే స్థాయికి ఎదుగుతారు. మూడు సంవత్సరాలలో, వారు అద్భుతమైన అసైన్మెంట్లను పొందడం ప్రారంభిస్తారు. మనం ఈ విషయమై పరిష్కారాన్ని కనుగొనాలి. మంచి మానవ మూలధనాన్ని మనం కోల్పోలేము.

ఇంద్రజిత్ గుప్తా: సద్గురు, మనం మరింత కూలంకషంగా చర్చించగలిగే అవకాశాన్ని సృష్టించడం ప్రారంభించాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే, అలా చేయకపోతే గొప్ప గొప్ప ఆలోచనలు రావు… మనం కూలంకషంగా ఆలోచించి జాగ్రత్తగా పరిష్కారాలను కనుగొనే సామర్థ్యాన్ని కోల్పోతున్నామా?

సద్గురు: నా ఉద్దేశంలో, కూలంకషంగా ఆలోచించే విషయంలో, మనం చాలా కుంటుపడ్డాం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్ ఉంది. ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఎంతో సమాచారం అందుబాటులో ఉంది. ఎవ్వరినైనా అడగండి, హబుల్ టెలీస్కోప్ ఏం చుపిస్తుందో వారికి తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, అన్నీ తెలుసు. మితి మీరిన సమాచారం. యువతరంలో తగినంత కూలంకష ఆలోచన ఉందని నేను అనుకోవడం లేదు. అంతటి సమాచారం వారికి అందుబాటులో ఉండడం వల్ల, అవసరమైనంతగా దాన్ని జీర్ణించుకోవడం ఇంకా లోతుగా ఆలోచించడం అనేవి లేవు. దీనివల్ల మీకు జరిగే ఒక విషయం ఏమిటంటే, మీరు ఏకాగ్రతతో దృష్టి సారించగల సమయం తగ్గిపోతుంది. ఎక్కువ సేపు ద్రుష్టి పెట్టలేక పోవడం అనేది ఇప్పుడు ఒక అర్హతగా చూడబడుతూ ఉంది. ఇది మనం చేస్తున్న చాలా పెద్ద తప్పు. ఎందుకంటే, బహుశా మీరు గాడ్జెట్‌లను వాడగలరు, పనులు చేయగలరు, కానీ విజ్ఞాన శాస్త్రంలో గొప్ప అభివృద్ధి, ఇంకా నిజంగా వినూత్నమైన ఆవిష్కరణలూ, కధని మార్చేసే విషయాలూ జరిగేది మనం దేనిపైనైనా నిరంతర ఏకాగ్రత చూపగలిగినప్పుడు మాత్రమే.

అంతటి సమాచారం వారికి అందుబాటులో ఉండడం వల్ల, అవసరమైనంతగా దాన్ని జీర్ణించుకోవడం ఇంకా లోతుగా ఆలోచించడం అనేవి లేవు. మీకు జరిగే ఒక విషయం ఏమిటంటే, మీరు ఏకాగ్రతతో దృష్టి సారించగల సమయం తగ్గిపోతుంది

మీరు చుట్టూ ఎంతో విజయాన్ని చూస్తున్నారు...ఇది టెక్నాలజీ వల్ల వచ్చినది అని నేను అనుకుంటున్నాను. మునపటి తరం వారు తక్కువ తెలివిగల వారని కాదు, విషయం ఏంటంటే టెక్నాలజీ విన్నూతన మార్గాలను ఇంకా అవకాశాలను సృష్టించింది. అది మనకు ఎంతో సాధికారతను చేకూర్చింది - ఒకప్పుడు పదివేలమంది చేయగలిగిన దాన్ని, ఈ రోజున ఒక్క వ్యక్తి చేయగలడు. అంతటి అద్భుతమైన సామర్థ్యం మనకి వచ్చినప్పుడు, మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అన్నది చాలా చాలా ముఖ్యం.

నేటి వ్యాపార సంస్థలు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది: కాలంతో పాటు స్థిరంగా ఉండగల గ్రహం ఉన్నప్పుడే, కాలంతో పాటు స్థిరంగా ఉండగల అభివృద్ధి ఇంకా విజయం సాధ్యపడతాయి. ప్రపంచంలోని సాధారణ ఆకాంక్ష ఏమిటంటే, అందరూ అమెరికాలో లాగ జీవించాలని కోరుకుంటున్నారు. లివింగ్ ఎర్త్ వారి గణాంకాల ప్రకారం, ప్రపంచం మొత్తం అమెరికాలోని ఒక సగటు వ్యక్తిలా జీవించాలి అంటే, అందుకు మనకి నాలుగున్నర భూ గ్రహాలు అవసరం. కానీ మనకి ఉన్నది ఒక్కటే. మనకి ఉన్నది ఒక్కటి, మనం విజయవంతం అవ్వాలంటే మనకి నాలుగున్నర కావాలి. కాబట్టి ఒక విధంగా, మనం విఫలమవ్వాలని కోరుకోవాల్సుంటుంది - అలా చేయటం మంచి విషయం కాదు! కాబట్టి మనం వ్యాపార సంస్థ అంటే ఏమిటి అన్నదానికి ఒక కొత్త నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. విజయానికి ఒక కొత్త నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అన్న దానికి కొత్త నిర్వచనం ఇవ్వ వలసిన అవసరం ఉంది. తిరోగమనాన్ని మనం అభివృద్ధి అనుకుంటే, మనం కష్టాలని కొని తెచ్చుకున్నట్టే. అందరూ విజయవంతం కావాలనే మనం కోరుకుంటున్నాము. కానీ ఇది కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే మనం మునుపెన్నడూ లేని విధంగా ఎంతో సాధికారతను పొందాము - నేడు మనం కలిగియున్న సాధికారతను, మరి ఏ ఇతర తరం కూడా ఇంతవరకూ కలిగి లేదు - మనం విజయానికి ఒక కొత్త నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా చేయకుండా, మనం విజయవంతం అయినట్లైతే, మనం ఎంతో పెద్ద మూల్యం చెల్లిస్తాము.

Editor’s Note: INSIGHT: The DNA of Success - A Leadership program with N.R. Narayana Murthy (Founder, Infosys), Ronnie Screwvala (Founder UTV Group (Now Walt Disney India)), and Sadhguru is going to conducted from Nov 26 - 29, 2015 at the Isha Yoga Center, Coimbatore.

Visit the website www.ishainsight.org, or contact +91 83000 84888, leadership@ishainsight.org for more details.