సద్గురు: ఆంగ్ల పదమైన “occult” అనేది అంత స్పష్టమైనదీ, నిర్దిష్టమైనదీ కాదు. Occult అంటే కేవలం ఒక విధమైన సామర్థ్యం అని. కానీ కొంతమంది ఈ సామర్థ్యాన్ని బాధ్యతా రహితంగా ఇంకా ప్రతికూల మార్గాలలో ఉపయోగించారు కాబట్టి, దానికి ఒక నకారాత్మకత ఆపాదించబడింది.

వామాచార విద్య లేదా నిగూఢ విద్య అనేది ఒక సాంకేతికత. ఈ రోజున మీరు మీ సెల్ఫోన్ తీసి అమెరికాలో ఉన్న వ్యక్తితో మాట్లాడవచ్చు. నిగూఢ విద్య అంటే ఇదే - మీరు సెల్ఫోన్ లేకుండానే అమెరికాలో ఉన్న వ్యక్తితో మాట్లాడగలుగుతారు. అది ఇంకొంచెం అధునాతనమైన సాంకేతికత. ఆధునిక సాంకేతికతకు కొంత సమయం తర్వాత అది పరిణితి చెందే కొద్దీ ఇలా జరుగుతుంది. ఇప్పటికే మనకి బ్లూటూత్ మెకానిజం ఉంది, మనం వ్యక్తి పేరు చెబితే చాలు ఆ ఫోన్ డైల్ చేస్తుంది. ఇది కూడా అవసరం లేని ఒకానొక రోజు వస్తుంది. మీలో ఒక చిన్న చిప్పును అమర్చితే, అదే అంతా చేస్తుంది.  

ఏది ఏమిటి అన్న అవగాహనలో కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగితే ఆధునిక శాస్త్రం ఇంకా నిగూఢ విద్యలనేవి ఎక్కడో ఒక చోట కచ్చితంగా కలుసుకుని తీరతాయి.

తంత్రం అంటే మీరు ఒక బ్లూటూత్ లేకుండానే మాట్లాడగలగడం అనమాట. అది మరొక స్థాయిలోని ఒక సాంకేతికత మాత్రమే. కానీ అది భౌతికమైనదే. ఈ పనులు చేయడానికి మీరు మీ శరీరాన్ని, మనసుని ఇంకా శక్తులను వాడతారు. మొత్తం మీద సాంకేతికత ఏదైనా సరే, మీరు కేవలం మీ శరీరాన్ని మనసుని ఇంకా శక్తిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. సాధారణంగా, మీ సౌలభ్యం కోసం ఇతర వస్తువులను ఉపయోగిస్తారు. కానీ ఒక సెల్ ఫోన్ ని లేదా మరొక సాంకేతికత పరికరాన్ని అయినా సరే తయారు చేయడానికి మీరు వాడే ప్రాథమిక వస్తువులు, మీ శరీరం, మనస్సు ఇంకా శక్తి మాత్రమే.

మొట్టమొదట్లో, మీరు ఒక ఫోను తయారు చేయాలంటే చాలా సామాగ్రి వాడాల్సి వచ్చేది. ఇప్పుడు వారు ప్రయత్నపూర్వకంగా దాన్ని తగ్గించాలని చూస్తున్నారు. అసలు ఎటువంటి సామాగ్రీ అవసరం లేని రోజు ఒకటి వస్తుంది - అదే నిగూఢ విద్య. ఏది ఏమిటి అన్న అవగాహనలో కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగితే ఆధునిక శాస్త్రం ఇంకా నిగూఢ విద్యలనేవి ఎక్కడో ఒక చోట కచ్చితంగా కలుసుకుని తీరతాయి.

భౌతికతను ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి, మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకుంటే, ఒక రాతి పలకలతో మొదలై ఇప్పుడు ఒక చిన్న చిప్ వద్దకు చేరుకున్నాము. దేన్ని చెక్కడానికైతే ఒక పెద్ద పర్వతం అవసరమయ్యేదో, అది ఈ రోజున ఒక చిన్న చిప్పులో నిక్షిప్తం చేయబడుతుంది. భౌతికత అనేది సూక్ష్మంగా అయింది. మీరు భౌతికతకు సంబంధించిన అతి సూక్ష్మమైన పార్శ్వాలను ఉపయోగించినప్పుడు, దాన్నే మనం నిగూఢ విద్య అంటాము.

నిగూఢ విద్యకీ ఇంకా ఆధ్యాత్మికతకి మధ్య ఉన్న వ్యత్యాసం 

sadhguru-wisdom-article-what-is-occult-adiyogi-alayam-consecration

ప్రపంచంలోని ఎన్నో భాగాలలో నిగూఢ విద్య ఆధ్యాత్మికతగా చెలామణి అవుతోంది. అది మంచిది కాదు. మనం ఆధ్యాత్మికం అన్నప్పుడు, భౌతికతకు అతీతంగా వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాము, మీలో భౌతికం కాని ఒక అనుభూతిని తీసుకురావడం గురించి మాట్లాడుతున్నాము. తంత్రం అనేది భౌతికత యొక్క అతి సూక్ష్మమైన అంశాలను వాడటం గురించినది, కానీ మొత్తం మీద అది భౌతికమైనదే. 

శివుడు ఒక తాంత్రికుడు

ఆధునిక సాంకేతికత సూక్ష్మమైనదిగా అయ్యేకొద్దీ, తంత్రం యొక్క అవసరం తగ్గుతూ వస్తుంది. ఒక వెయ్యేళ్ళ క్రితం, నేను కోయంబత్తూరులో ఉండి మీరు ఢిల్లీలో ఉండి ఉంటే, నేను మీకు ఒక సూచన ఇవ్వాలి అనుకుంటే, మీరు కోయంబత్తూర్ కి నడిచి రావడమో, లేదా నేను ఢిల్లీ దాకా నడిచి రావడమో కుదిరే పని కాదు. కాబట్టి నేను నా తంత్ర శక్తులను పెంపొందించుకోవడంపై సమయం కేటాయించి, తద్వారా మీకు అది అందేలా చేయగలిగేవాడిని. కానీ ఇప్పుడు నా దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది. కాబట్టి అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా నేను అది చేయగలను - కానీ దాన్ని గ్రహించే విధంగా మిమ్మల్ని తయారు చేయాలి అంటే, దాన్ని అందుకుని దాని గురించి సందేహ పడని విధంగా మిమ్మల్ని తయారు చేయాలి అంటే, అందుకు అనవసరంగా చాలా సమయం పడుతుంది. దాని బదులు నేనొక ఫోన్ చేస్తే సరిపోతుంది. రోజు రోజుకి తంత్రశక్తులు అనేవి వాటి ప్రాముఖ్యతను కోల్పోతున్నాయి. ఎందుకంటే ఆధునిక శాస్త్రం అనేది ఎంతో గొప్ప వేగంతో అభివృద్ధి చెందుతూ ఉంది.

ఇతరుల జీవితాలను నాశనం చేయాలనీ, వారికి రోగాలు కలగ జేయాలనీ, వారిని చంపాలనీ, ప్రయత్నించిన కొంతమంది నీచమైన చేతబడి చేయాలనుకునే వారి గురించి ప్రజలు విన్నారు. కాబట్టి వాళ్ళు తంత్రం అనేది ఎప్పుడూ నకారాత్మకమైనదని అనుకుంటారు. సామాజిక పరంగా మీరు అటువంటి వారి గురించే విని ఉంటారు, కానీ తంత్రం అనేది ఎంతో ఉన్నతమైనది. శివుడు ఒక తాంత్రికుడు. తంత్రం అనేది ప్రతిసారీ నకారాత్మకమైనదే అవ్వాలనేమీ లేదు. తంత్రం అనేది ఒక సానుకూలమైన శక్తి కాగలదు. అది దాన్ని ఎవరు వాడుతున్నారు, ఇంకా ఎందుకు వాడుతున్నారు అన్న దాని పైన ఆధారపడి ఉంటుంది.

తంత్రం అనేది దురదృష్టవశాత్తునకారాత్మకంగా ఉపయోగించబడిన ఒక సాంకేతికత మాత్రమే. ఏ శాస్త్రమూ లేదా సాంకేతికతా అనేది కూడా చెడ్డది కాదు. కానీ ఒకవేళ జనాన్ని చంపటానికీ, ఇంకా హింసించడానికీ మీరు దాన్ని ఉపయోగిస్తే, కొంతకాలం తర్వాత సాంకేతికత అనేది ఒక చెడ్డ విషయంలా కనబడుతుంది. తాంత్రికత విషయంలోనూ జరిగింది అదే, ఎందుకంటే చాలామంది తమ వ్యక్తిగత అవసరాల కోసం దాన్ని చెడు విధానంలో ఉపయోగించారు. కాబట్టి, సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో తంత్రం అనేదాన్ని పూర్తిగా పక్కన పెడతారు.

నిగూఢ విద్య - మార్మికత

మార్మికత – నిగూఢ విద్య ఒకటే అని తరచూ పొరబడుతుంటారు. ప్రజలు మార్మికత అంటే, కొన్ని అద్భుతాలు ఏవో ప్రదర్శితం కావాలి అనుకుంటారు. మీరు ఈ గ్రహం మీద నడయాడిన మార్మికుడిని తీసుకుంటే, ఆ ఆదియోగే ఎప్పుడూ, ఒక్కసారి కూడా ఏ విధమైన అద్భుతమూ చేయలేదు, తనకు దగ్గరైన ఓ కొద్దిమంది విషయంలో, వారికి తెలియజేయడం కోసం తప్ప.

నిగూఢ విద్య అనేది మార్మికత యొక్క పెడదోవ పట్టిన చిన్న తమ్ముడు అని అనవచ్చు

నిగూఢ విద్య అనేది మార్మికతకు చిన్న తమ్ముడు లాంటిది, అది పనులను ఇట్టే చేసేస్తుంది. ఇదెలా అంటే మీరు ఇంకా ఒక యూనివర్సిటీలో పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉన్నప్పుడే, మీ చిన్న తమ్ముడు జేబు నిండా డబ్బులతో 18 ఏళ్ళ వయస్సులోనే గొప్ప జీవితాన్ని అనుభవిస్తునట్లు ఉంటుంది.. అలా జరగడానికి కారణం అతను పోకిరి మూకల్తో చేరడం వల్ల.

. కానీ జరుగుతున్న దేమిటంటే, మీరు వెళ్లడానికి ఇష్టపడని చోటుకి అతను వెళుతున్నాడు, అలాగే మీరు చేరుకోవడానికి ససేమిరా ఇష్టపడని చోటుకి అతను చేరుకోవచ్చు కూడా - అయితే కటకటాల వెనక్కి లేదా మృత్యువు ఒడిలోకి. నిగూఢ విద్య అనేది మార్మికత యొక్క పెడదోవ పట్టిన చిన్న తమ్ముడు అని అనవచ్చు. మీరు మార్మిక మార్గం నుండి కిందకు చూస్తే, క్షుద్రతంత్రం అనేది సరిగ్గా అక్కడ పక్కనే ఉంటుంది, కానీ మీరు దాని వెనుక పడాలనుకోరు, ఎందుకంటే మీరు మరొక దిశగా వెళ్తున్నారు కాబట్టి.

శాస్త్రం - సాంకేతికత  

ఒక సారూప్యాన్ని ఉపయోగించాలీ అంటే - తంత్రం అనేది సాంకేతికత లాంటిది, మార్మికత అనేది శాస్త్రం. శాస్త్రంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఉనికి యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం. కానీ ఈ రోజుల్లో చాలామంది అవగాహనలో శాస్త్రం అంటే సాంకేతికత. సాంకేతికత అనేది శ్రేయస్కరమైనదే అవ్వాలనేమీ లేదు. అది మిమ్మల్ని నేరుగా పతనానికి తీసుకెళ్తూ ఉండి ఉండవచ్చు. కానీ మీరు అది గ్రహించకపోవచ్చు, ఎందుకంటే మీరు హైటెక్కులో- దర్జాగా అంతా బాగానే జరుగుతుంది అనుకుంటూ ఉండి ఉండవచ్చు. శాస్త్రం అంటే మీరు ప్రతి దాన్ని అది ఉన్న విధంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు, మీరు జీవాన్ని అది ఉన్న విధంగా గ్రహించి, అవగతం చేసుకోవాలి అనుకుంటున్నారు. సాంకేతికత అనేది, అధిక శాతం కేవలం ఉనికిని దుర్వినియోగం చేయడం మాత్రమే.

“నేనూ ఇంకా విశ్వం అనేటటువంటిది ఏదీ లేదు. ఉన్నది కేవలం నేనే, లేదా ఉన్నది కేవలం విశ్వ ప్రకంపన మాత్రమే” అన్న దాన్ని తెలుసుకుని అవగతం చేసుకునేందుకు ఒక మార్గమే మార్మికత.

నేను సాంకేతికతకి వ్యతిరేకం కాదు. సాంకేతికత అనేది, భౌతికంగా మనకి ఎన్నో విధాలుగా స్వేచ్ఛని చేకూర్చింది, కానీ ప్రస్తుతం మన ఉద్దేశంలో సాంకేతికత అంటే, ఇక ప్రతిదాన్నీ - ఈ మొత్తం విశ్వాన్నీ మనకోసం వినియోగించుకోవడం అన్నట్టు తయారయ్యింది. ఒక సూక్ష్మక్రిమినీ ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలుసు, ఈ భూమిని ఆసాంతం ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలుసు - ప్రతి దాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలో మనం నేర్చుకున్నాం - కానీ మనకు బాగా ఉండటం ఎలాగో మాత్రం తెలీదు.

మార్మికత అనేది ఒక శాస్త్రం. ప్రాధమికంగా మార్మికత అనేది ఈ ఉనికి గురించీ, మీ నిజ స్వభావం గురించీ, దేనినైతే మీరు “నేను” అంటారో దానికీ, ఇంకా దేనినైతే మీరు “విశ్వం” అంటారో దానికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకోవడానికి ఒక మార్గం. “నేనూ ఇంకా విశ్వం అనేటటువంటిది ఏదీ లేదు. ఉన్నది కేవలం నేనే, లేదా ఉన్నది కేవలం విశ్వ ప్రకంపన మాత్రమే” అన్న దాన్ని తెలుసుకుని అవగతం చేసుకునేందుకు ఒక మార్గమే మార్మికత. ఈ విషయాన్ని తెలుసుకోవడమే - ఒక జ్ఞానంగా కాదు, ఒక నిర్ధారణగా కాదు, ఒక తత్వంగా కాదు, కానీ ఒక సజీవ వాస్తవంగా తెలుసుకోవటమే మార్మికత.

దాని వల్ల ప్రయోజనం ఏమిటి?

మార్మికతతో మీరేం చేయగలరు? బతుకుతెరువు పొందగలరా? పొందలేక పోవచ్చు. మరి ఈ సోదంతా చెప్పడంలో ఉద్దేశం ఏంటి? నిస్సంకోచంగా చెప్పాలంటే, అందులో ఉద్దేశం ఏమీ లేదు. అసలు విషయం ఏంటంటే, జీవానికి ఉద్దేశం లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది అదే. జీవం యొక్క ఉద్దేశం జీవమే. జీవాన్ని తెలుసుకోవడం మించి ఏమీ లేదు. దాన్ని ఎంత గాఢంగా, ఎంత లోతుగా తెలుసుకున్నారు అనేదే ఉన్న విషయమంతా. ప్రయోజనమంటూ ఏమీ లేదు.

జీవం కోరుకునేది ఏమిటంటే అన్నింటిని అనుభూతి చెందాలని - చూసిన వాటిని చూడని వాటినీ కూడా. మార్మికత అనేది ఈ కోరిక నెరవేరడం.

దురదృష్టవశాత్తూ ఆధునిక ప్రపంచం మొత్తం “ఉపయోగం ఏమిటి?” అన్న దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీరు ఇది తెలుసుకోవాలి, మీరు చనిపోయినప్పుడు తీసుకువెళ్ళేది ఏమీ ఉండదు. జీవితంలో తీసుకుపోవడం అనేది ఏమీ లేదు అని మరణం స్పష్టంగా తెలియజేస్తుంది. మార్మికత అంటే, తీసుకువెళ్ళేది ఏమీ లేదని మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పుడే వీలైనంత ఉత్తమంగా జీవించాలని నిర్ణయించుకున్నారు. వీలైనంత ఉత్తమంగా జీవించడం అంటే, మీకు అందుబాటులో ఉన్న అన్నింటినీ తినటం, తాగగలిగిన అన్నింటినీ తాగడం కాదు. జీవితాన్ని ఉన్నతమైనదిగా ఇంకా ఫలప్రదమైనదిగా చేసేది, మీరు చేసే పనులు కాదు, అలా చేసేది మీ అనుభవం యొక్క గాఢత. ఒక జీవంగా మీరు ఎంత వైభవంగా, ఇంకా ఎంతటి అవకాశంగా అయ్యారు, అన్నదే ఉన్న విషయమల్లా!

ఒక మనిషి, తాను దేన్నీ తీసేసుకోవాల్సిన అవసరం లేని స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే, మార్మికత అనేది సాధ్యపడుతుంది. అది, దాని నుంచి ఏమి పొందొచ్చు, లేదా ఇతరుల ముందు దానిని ఎలా ప్రదర్శించవచ్చు అని ఆలోచించే వాళ్ల కోసం కాదు. అది శరీరము మనస్సు ఇంకా బాహ్య ప్రభావాలు ఏమీ లేక కేవలం ఒక స్వచ్ఛమైన జీవం మాత్రమే ఉండే, ఆ జీవపు పార్శ్వాన్ని తాకిన వారి కోసం మాత్రమే. జీవం కోరుకునేది ఏమిటంటే అన్నింటిని అనుభూతి చెందాలని - చూసిన వాటిని చూడని వాటినీ కూడా. మార్మికత అనేది ఈ కోరిక నెరవేరడం.



ప్రేమాశీస్సులతో,

సద్గురు

 

Editor's Note: Want to find out more about Mysticism and Occult? Check out the ‘Tantra’ series on Sadhguru Exclusive.