సద్గురు: మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, దాన్ని మీరు ఒక వరం లాగా మలుచుకోవచ్చు లేదా శాపంలా మార్చుకోవచ్చు. పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నా వాటి నుండి మనిషి తనను తాను మలుచుకోగలడు. మీరు హుందాగా ఆ పరిస్థితులను ఎదుర్కోవచ్చు. కొందరైతే ఉరికంబానికి కూడా హుందాగా వెళ్లారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒక సంఘటన జరిగింది. 1939లో ఆస్ట్రియాలో హిట్లర్ యూదులను నిర్బంధ శిబిరాలకు పంపుతున్న కాలంలో ఒక 13ఏళ్ల అమ్మాయికి ఎదురైనా సంఘటన ఇది. ఒక రోజు ఉదయం, సైనికులు వారి ఇంట్లోకి చొరబడ్డారు. అది ఒక సంపన్నమైన కుటుంబం, 17 మంది కలిసి ఒక పెద్ద ఇంట్లో ఉండేవారు. సైనికులు ఇంటిని ఆక్రమించి, పిల్లలను, పెద్దలను వేరువేరుగా తీసుకెళ్లిపోయారు.

ఆ 13 ఏళ్ల బాలికను, ఇంకా ఎనిమిదేళ్ల ఆమె తమ్ముడిని ఒక రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు. అది చలికాలం ప్రారంభ దశ. ఆస్ట్రియాలో ఎంతో చల్లగా ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన ఆ పిల్లలు, మూడు రోజులుగా రైల్వే ప్లాట్ ఫారం పైనే ఉన్నారు, తల్లిదండ్రుల జాడ లేదు, పైగా, ఈ సైనికులు తుపాకుల్ని వారి వైపు ఎక్కుపెడుతున్నారు. అది ఎంతో దయనీయమైన పరిస్థితి.

కానీ, పిల్లలకు బాధ అనేది కొంత సమయం వరకే. తర్వాత, వారు దేన్నో ఓ దాన్ని వెతుక్కొని సరదాగా ఉంటారు. అలా ఆ అబ్బాయి ఫుట్బాల్ ఆడటం మొదలెట్టాడు. మూడు రోజుల తర్వాత ఒక గూడ్సు రైలు వచ్చింది, ప్రయాణికుల రైలు కాదు అది. అందర్నీ ఆ రైలు పెట్టెల్లోకి ఎక్కిస్తుండగా ఆ అమ్మాయి తన తమ్ముడు అతని బూట్లను ప్లాట్ఫారం పైన మర్చిపోయిన విషయం గమనించింది. దానితో ఆమెకు చిర్రెత్తుకొచ్చి అతని చెవులను మెలి పెట్టి, తలపైన కొట్టింది, ఎందుకంటే ఆ చలిలో బూట్లు లేకుంటే పరిస్థితులు మరింత కఠినంగా మారవచ్చు. ఆ తరువాతి స్టేషన్లో అమ్మాయిల్ని, అబ్బాయిల్ని వేరు చేసి తీసుకెళ్లిపోయారు. ఐదున్నరేళ్ళ తర్వాత, 1945లో, ఆ అమ్మాయి నిర్బంద శిబిరం నుండి బయటకు వస్తే - తన తమ్ముడితో సహా తన కుటుంబ సభ్యులందరూ చనిపోయారని తెలిసింది. ఆ సమయంలో, ఆమెకు తన తమ్ముడితో గడిపిన చివరి క్షణాలు మాత్రమే గుర్తొచ్చాయి, తమ్ముడితో ఎంత అసహ్యంగా ప్రవర్తించిందో గుర్తుకొచ్చింది. తన బూట్లను పోగుట్టుకున్నాడని అతని చెవులు మెలి పెట్టి, మొహం పైన గుద్ది అసహ్యంగా మాట్లాడింది. ఇప్పుడు ఆమె ఒక సంకల్పం చేసుకుంది - "ఈ రోజు నుంచి, ఎవరిని కలిసినా సరే, ప్రతి ఒక్కరితోనూ, ఒకవేళ వారితో మాట్లాడటం ఇదే చివరిసారి అయినా, నేను దాని గురించి పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేనివిధంగా నడుచుకుంటాను." అని.

ఒకవేళ మీరు ఎరుకతో ఉంటే, ప్రతి మనిషి అంతరంగంతో గనుక స్పర్శలో ఉన్నారంటే, మీరు నరకంలో ఉన్నా మీ జీవితాన్ని మలుచుకోగలరు. లేదంటే, మీరు స్వర్గంలో ఉన్నా దాన్ని నాశనం చేయగలరు.

మీరిప్పుడు స్వర్గంలోనే ఉన్నారేమో? ఎవరు కాదన్నారు? మీరు స్వర్గంలో లేరనటానికి మీ దగ్గర ఏదైనా రుజువు ఉందా? లేదు. మరి ఇంతకంటే మంచి ప్రదేశం ఇంకోటి ఉందని ఎందుకు అనుకుంటున్నారు?

తమ జీవితాన్నినరకంలా మార్చుకున్నవారే, ఇంతకంటే మంచి ప్రదేశం ఉందనే ఘోరమైన ఆలోచన చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ఒక స్వర్గంలా మార్చుకుంటే, ఆనందంగా ఉంటే, మీరు మరో చోటికి ఎందుకు వెళ్లాలనుకుంటారు? తమను తాము స్వర్గంలా ఎలా మలుచుకోవాలో చూడాలి. లేదంటే, మీరు స్వర్గంలో ఉన్నా, బాధపడుతూనే ఉంటారు.

ఒకవేళ ఇదే స్వర్గం అయివుండి ఇంకా మీరు దీన్ని అసలు గుర్తించకపోతే - అది ఎంత దారుణంగా బ్రతకడం అవుతుంది. అంతేకాదు, నేను మీకు చెబుతున్నాను, ఇది స్వర్గమే. ఎందుకంటే మీ అనుభూతికి మూలం మీలోనే ఉంది. దాన్ని కనుక మీ ఆధీనంలోకి తీసుకుంటే, మీరు ఇప్పుడే జీవితాన్ని స్వర్గంలా మార్చుకోవచ్చు. నిజానికి ఇది ఒక స్వర్గం, కానీ మీ పొరుగింటి సూర్యకాంతాలు, పక్కింటి పోకిరి పిల్లలు, గయ్యాళి అత్తయ్య, వీరందరూ కొంచెం మసాలా కొరకు మీ జీవితంలో జోడింపబడ్డారు - ఉత్సుకత కొరకు మాత్రమే - కానీ నిజానికి ఇది ఒక స్వర్గమే.