కథ: ఒక రోజు, జెన్ సన్యాసి టాంజాన్ ఇంకా మరో చిన్నవాడైన సన్యాసి ప్రయాణిస్తూ, బాగా ప్రవహిస్తున్న ఒక నది వద్దకు వచ్చారు. నది దాటబోతూ, అక్కడ ఒక యువతి నది దాటడానికి ఇబ్బంది పడుతుండడాన్ని చూశారు.

టాంజాన్, “రండి, నేను మిమ్మల్ని దాటిస్తాను” అని ఆమెని మెల్లగా ఎత్తుకొని దాటించి ఒడ్డున దించారు.

ఆమె, “సహాయం చేసినందుకు కృతజ్ఞతలు,” అని చెప్పి వెళ్ళిపోయింది. వారిద్దరూ ఆ తరవాత ఒక పూటకు పైగా ప్రయాణం కొనసాగించారు. 

చిన్నవాడైన సన్యాసి ఇక ఏ మాత్రం ఉండపట్టలేక, చివరికి, “మనం సన్యాసులం కదా, మనం ఆడవారిని ముట్టుకోకూడదనుకున్నాను. మీరు ఎందుకు అలా చేసారు?” అని అడిగాడు.

ఆయన, “ ఓహ్, నువ్వు అడుగుతున్నది ఇందాకటి స్త్రీ గురించేనా ? నేను ఆమెని ఎప్పుడో దించేశాను. నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావా?” అన్నారు

సద్గురు: ప్రజలు తమ జీవితాలలో ఇబ్బందులు పడడానికి గల ముఖ్య కారణం, వారు తమ మనసు స్వభావాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడమే. మనసు గురించి ఒక ప్రాధమిక అంశం ఏంటంటే, మీరు ‘ఇది నాకు వద్దు’ అన్నారంటే, మీ మనసు దాని గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. మీరు, “ఇప్పటి నుండి నేను కోతుల గురించే అలోచించను” అనుకున్నారంటే, ఇక రోజంతా కోతుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. అలా అనుకోకపోతే, మీరు బహుశా వాటిని చూసినప్పుడు తప్ప, ఇంకెప్పుడూ వాటి గురించి ఆలోచించక పోవచ్చు.  

ఒక సన్యాసిగా, బ్రహ్మచారిగా ఉండడం అంటే, “నేను స్త్రీని ముట్టుకోను” అని కఠినంగా తీర్మానించుకోవడం కాదు.

మీరు, “నాకు అది వద్దు” అన్నారంటే, ఇక అదే జరుగుతుంది, ఎందుకంటే మనసుకి తీసివేయడం తెలీదు, భాగించడం తెలీదు. మనసుకు కూడిక ఇంకా గుణకారం మాత్రమే తెలుసు. బలవంతంగా మీరు ఒక ఆలోచనని మీ మనసులో నుండి తీసివేయలేరు. విషయం ఏంటంటే, మీ ఆశయం వీటికంటే పెద్దది అయినప్పుడు, ఇవన్ని అవిరైపోయే అవకాశం ఉంటుంది. ఒక సన్యాసిగా, బ్రహ్మచారిగా ఉండడం అంటే మీరు, “నేను స్త్రీని ముట్టుకోను” అని కఠినంగా తీర్మానించుకున్నారని కాదు. మీరు మీ జీవితంలో ఉత్తమ స్థాయికి ఎదగాలని తీర్మానించుకున్నారు అని; ప్రాపంచిక విషయాలన్నీ అసలు అర్ధం లేనివిగా అనిపించే, మరొక కోణాన్ని చేరుకోవాలని తీర్మానించుకున్నారు అని. 

మీ దృష్టి అంతా పర్వత శిఖరానికి చేరుకోవడంపై ఉన్నప్పుడు, పర్వత పాదాల దగ్గర ఉన్నవాటిని మీరు పట్టించుకోరు. అలాకాక, పర్వత పాదాలకు దూరంగా  ఉండాలని చుస్తే, ఇక అప్పుడు శిఖరానికి ఎలా చేరుకుంటారు? పర్వత శిఖరంపై దృష్టి పెడితే, పర్వత పాదాలను దాటేస్తారు; పర్వత పాదాలను అసలు గమనించరు కూడా.

ఆమెకు సహాయం అవసరం కాబట్టి ఆ పెద్దవాడైన సన్యాసి అవసరమైన సహాయం చేసి ముందుకు కొనసాగాడు. మగవారా, ఆడవారా అన్న విషయం కూడా ఆయన పట్టించుకోలేదు. ఆడవారిని ముట్టుకోకూడదు అనుకున్న చిన్న సన్యాసి మాత్రం ఆమెను దించలేకపోయాడు ఇంకా తన మనసులో అదే నడుస్తుంది.