'మకర సంక్రాంతి' పండుగ  అందమైన ముగ్గులకు, గొబ్బెమ్మలకు, హరిదాసు పాటలకు, బసవన్నల ఆటలకు, నువ్వుల మిఠాయిలకు, గాలిపటాలు ఎగురవేయటానికి, మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను 'పంటల' పండుగ అని, మార్పు తెచ్చే పండుగ అనీ కూడా అంటారు. దీనికి కారణం ఏమిటో, ఈ పండుగ  ప్రాముఖ్యత ఏమిటో సద్గురు మాటల్లో తెలుసుకోండి!


మకర సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత

earth-moon-sun

మకర సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ రోజు ‘గ్రహ రాశి'లో, అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్యలో ఒక ముఖ్యమైన కదలిక, అంటే మార్పు ఉంటుంది. ఈ మార్పు మనం ఈ గ్రహాన్ని అనుభూతి చెందే విధానంలో ఒక కొత్త మార్పుని తీసుకువస్తుంది. ఒక సంవత్సరంలో ఎన్నో సంక్రాంతులు ఉంటాయి; వీటిలోని రెండు ముఖ్యమైనవి. వాటిలో ఒకటి మకర సంక్రాంతి, రెండవది దీనికి సరిగ్గా ఆరు నెలల కాలంలో, వేసవి కాలపు ఆయనం తర్వాత వచ్చే కర్క సంక్రాంతి. ఈ రెంటి మధ్యా చాలా సంక్రాంతులు ఉన్నాయి – రాశి మారిన ప్రతిసారి దాన్ని సంక్రాంతి అనే అంటారు. ఎందుకంటే అది గ్రహగమనంలో మార్పుని సూచిస్తుంది. ఈ మార్పు కారణంగానే మన జీవితాల పాలన, పోషణలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలని సంక్రాంతి తెలియజేస్తుంది. ఈ కదలిక లేదా మార్పు ఆగిపోతే ‘మనం’ అనేది కూడా ఆగిపోతుంది. 22డిసెంబరు రోజున శీతకాలపు ఆయనం వచ్చింది, అంటే సూర్యుని పరంగా చూస్తే ఈ గ్రహం యొక్క వంపు గరిష్టస్థాయికి చేరింది. ఈ రోజు నుంచి ఉత్తర గమనం చాలా బలంగా ఉంటుంది. భూమి మీద అన్నీ మారటం మొదలు పెడతాయి. మకర సంక్రాంతి నుంచి శీతాకాలం కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడుతుంది.

పంటల పండుగ సంక్రాంతి!      

women-planting-rice                                                       

మకర సంక్రాంతి 'పంటకోతల లేదా పంట  నూర్పిడుల' పండుగగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే ఈ సమయానికల్లా పంట నూర్పిడులు అయిపోయి, ప్రజలు పెద్ద ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ రోజున, పంటలలో వారికి సహాయపడిన వారికి కృతజ్ఞత తెలుపుతారు. పంటలలో పశువులు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అందువల్ల పండుగ తరువాతి రోజు వాటి కోసమే, అదే 'కనుమ' పండుగ అని పిలువబడుతుంది. మొదటి రోజు భూమికి, రెండొవ రోజు మనకు, మూడవ రోజు పాడి పశువులకు. అవి మనకంటే ఉన్నత స్థాయిలో ఉంచబడ్డాయి. ఎందుకంటే వాటివల్లే మనం జీవిస్తూ ఉన్నాము, మన వల్ల అవి జీవిస్తూ లేవు. మనము ఇక్కడ లేకపోతే అవన్నీ స్వతంత్రంగా, సంతోషంగా ఉంటాయి. కానీ అవి లేకపోతే మనము జీవించలేము.

ఈ పండుగలనేవి మన వర్తమాన, భవిష్యత్తులను స్పృహతో మలచుకోవాలి అనే దాన్ని గుర్తుచేస్తాయి. ఇప్పుడు మనం గత సంవత్సరపు పంటను కోసుకున్నాము. తరువాత పంటను సృష్టించడానికి కావలిసిన ప్రణాళికను స్పృహతో, జంతువులను కూడా పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేయాలి. అందువల్ల ఈ మకర సంక్రాంతి పండుగ 'పంటల పండుగ' అయ్యింది. కానీ దీనికి ఖగోళ పరమైన, ఆధ్యాత్మిక పరమైన అర్ధాలు కూడా ఉన్నాయి. ఒక నిర్దిష్ట యోగ ప్రక్రియ నుంచి ఈ పండగ ఆవిర్భవించింది, కానీ సాధారణ ప్రజలు వారికి అనువైన పద్ధతుల్లో దీనిని జరుపుకుంటున్నారు. యోగులు కొత్తగా, నూతనోత్తేజంతో తమ ఆధ్యాత్మిక ప్రక్రియను కొనసాగించడానికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. అలాగే సంసారిక జీవనంలో ఉన్నవారు కూడా తాము అనుకున్నవి సాధించడానికి ఒక సరికొత్త ప్రయత్నం చేస్తారు. భూమి సూర్యుని చుట్టూ 27 నక్షత్రాల లేదా 108పాదాల పరిభ్రమణ పూర్తిచేసి, కొత్త ఆవృతాన్ని మొదలు పెట్టటాన్ని ఈ సంక్రాంతి తెలియజేస్తుంది.

'మనం' అనేదంతా ఈ గ్రహన్నుంచి తీసుకున్నదేనని మనం గుర్తుచేసుకునే రోజు ఇది. ప్రపంచంలో అందరూ ఇవ్వటం గురించి మాట్లాడడం నేను చూస్తున్నాను. వారు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారో నాకు తెలియదు. మీరు కేవలం తీసుకోగలరు – సౌమ్యంగా లేక దౌర్జన్యంగా తీసుకుంటారు. మీరు మీ సొంత ఆస్తిపాస్తులతో ఎక్కడి నుంచైనా వచ్చారా? ఇవ్వటానికి మీ దగ్గర ఏముంది? మీరు కేవలం తీసుకోగలరు. అన్నీ మీకు అందించబడ్డాయి. విజ్ఞతతో తీసుకోండి, మీరు చేయాల్సింది అదే. ఈ సంక్రాంతి రోజున ఈ విషయాన్ని మనం గుర్తుచేసుకోవాలి.

మార్పుతెచ్చే పండుగ సంక్రాంతి!

man-meditating-being-still

మకర సంక్రాంతి అనేది భారతదేశంలో చాలా ముఖ్యమైన పండుగ. సంక్రాంతికి మూలపదమైన 'శంకర' అనే పదం యొక్క అర్థం “కదలిక”. ప్రాణం అంటే కదలికే. గ్రహం కదులుతుంది కనుకే ఇది ప్రాణాన్ని పుట్టిస్తుంది. గ్రహచలనం లేకుండా ఉంటే దానికి ప్రాణాన్ని ఇచ్చే సామర్ధ్యం ఉండదు. అందువల్ల ఈ కదలికలో అన్ని జీవులకూ పాత్ర ఉంది. మరి ఈ కదలిక అనేది ఒకటి ఉంటే, అది ఏదో ఒక నిశ్చలత్వం ఒడిలోనే జరుగగలదు. తమ జీవితంలోని నిశ్చలత్వాన్ని తాకలేని వారు- అంటే బాహ్యంగా, అంతర్గతంగా నిశ్చలత్వం తెలియని, చవిచూడని వారు - ఈ కదలికలో ఎక్కడో పడిపోతారు.

ఈ కదలికను గుర్తుచేసుకుంటూ, కదలికే ఉత్సవం, కదలికే జీవితం, కదలికే జీవన ప్రక్రియ, కదలికే జీవితపు ఆద్యంతం అని తెలుసుకునే పండుగే మకర సంక్రాంతి. అదే సమయంలో, ‘శంకర’ అనే పదం వెనుక ఉన్నవాడు, శివుడు. ఆయన నిశ్చలుడు. నిశ్చలతత్వమే ఈ కదలికకు మూలం. అన్ని గ్రహాలు తిరుగుతున్నా, వాటి పరంగా చూస్తే అతి ముఖ్యుడైన సూర్యడు తిరగటం లేదు. సూర్యుడు కూడా అలా కదిలితే మనము ఇబ్బందుల్లో పడతాము. అతడు అక్కడే కదలకుండా ఉంటాడు. అందువల్లనే మిగిలిన వాటి గమనం జరుగుతుంది. కానీ అతని నిశ్చలతత్వం కూడా సాపేక్షమైనది. ఎందుకంటే ఈ మొత్తం సౌరమండలం కదులుతూ ఉంది, మొత్తం పాలపుంత కదులుతూ ఉంది. కాని వీట్టనిటినీ పట్టి ఉంచే ఆకాశము సంపూర్ణ నిశ్చలమైనది.

ఒక మనిషి తనలోని ఈ నిశ్చలత్వాన్ని తాకటానికి తగినంత ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే, ఈ కదలిక యొక్క ఆనందాన్ని తెలుసుకోగలడు. లేకపోతే అందరూ ఈ జీవితంలోని కదలికను చూసి భయపడేవారే. వారి జీవితంలో వచ్చే ప్రతి చిన్న మార్పుకు, అంటే కదలికకు వారు బాధపడతారు. ఈ రోజుల్లో, మన అనుకునే ఈ ఆధునిక జీవితంలో పరిస్థితి ఇలానే ఉంది – ఏ మార్పు వచ్చినా, మనం బాధపడడమే జరుగుతుంది. బాల్యమంతా ఆందోళన, యవ్వనమంతా పెద్ద అవస్థ, నడివయస్సు భరించలేనిది, వృద్ధాప్యం అంటే భయం, మరి మరణమంటే ఒక పండుగా?– కానే కాదు! అదొక భీతి. జీవితంలోని ప్రతీ దశ ఒక ఇబ్బందే. ఈ జీవితపు స్వభావమే కదలికని అర్ధం చేసుకోలేని వారికే కదలికతో, అంటే మార్పుతో ఇబ్బంది. మీరు ఈ కదలికని ఆనందించగలిగేది మీరు నిశ్చలంగా ఉన్నప్పుడే. మీకు నిశ్చలత్వం అంటే ఏమిటో తెలిస్తే, అప్పుడు కదలిక అనేది ఆహ్లదభరితం అవుతుంది. మీకు నిశ్చలత్వం అంటే ఏమిటో తెలియకపోతే, కదలిక అనేది నిశ్చేఫ్టతకు కారణమవుతుంది

మార్పును, అంటే కదలికను పండుగగా జరుపుకోవటం మీరు మీ నిశ్చలతత్వాన్ని చవిచూసినప్పుడు మాత్రమే వీలవుతుంది అని గుర్తుచేసుకోవటమే ఈ మకర సంక్రాతి యొక్క ప్రాముఖ్యత.

ప్రేమాశీస్సులతో,
సద్గురు