ప్రశ్న: ఎన్నో సంవత్సరాల సాధన తర్వాత కూడా నేను ఎక్కడికీ చేరుకోలేదని అనిపిస్తోంది. నేను ఏం చేయాలి?

సద్గురు: మీరు ఎన్ని సంవత్సరాలు సాధన చేసినప్పటికీ, మీరు ఎక్కడికీ వెళ్ళలేరు. ‘వెళ్ళలేక పోవచ్చు’ కాదు, ‘వెళ్ళలేరు’. ఎందుకంటే సాధన చేయాలనుకోవడం ఎక్కడికో వెళ్లడం కోసం కాదు. సాధన చేయడం వెనక ఉన్న ఉద్దేశమేమిటంటే, మీరు ఇక్కడే ఉండగలిగే స్థితికి రావడమే - ఇక్కడ ఉన్నది ప్రతిచోటా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అని అర్థం చేసుకోవడం ఇంకా తెలుసుకోవడం. ఎక్కడికో వెళ్ళాలనే అవసరాన్ని దాటి వెళ్ళడమే సాధన, ఎందుకంటే నిజానికి, వెళ్లేందుకు మరో చోటంటూ ఏదీ లేదు. న్నదల్లా ఇక్కడే, ఈ క్షణం మాత్రమే, మిగతాదంతా కేవలం మీ బుర్రలోనే ఉంది. సాధన ఉద్దేశమేమిటంటే, ప్రతి రోజూ కనీసం కొంత సమయం పాటు, కేవలం కూర్చోవడం మాత్రమే చాలు అనుకునే స్థితికి మిమ్మల్ని  తీసుకురావడం. జీవించినా, ఇక్కడ, ఈ క్షణంలోనే ఉంటారు. మరణించినా, ఇక్కడ, ఈ క్షణంలోనే  ఉంటారు. మీరెక్కడికీ వెళ్ళలేరు, వెళ్లేందుకు మరో చోటుంటూ లేదు.

సాధన ఒక ఉపకరణం

సాధన అనేది ఒక ఉపకరణం- ఇది మీలో ఎంతో కొంత పరిపక్వత తీసుకొచ్చి, మరెక్కడికో వెళ్ళాల్సిన అవసరాన్ని పోగొట్టేలా చేసే ఒక పద్ధతి. అందుకనే సాధనలో బాగా నిమగ్నమైన వాళ్ళు ఎక్కడికీ వెళ్ళరు.మీరు ప్రపంచమంతటా తిరిగినప్పటికీ, అది గోళాకారంగా ఉందా, బల్లబరుపుగా ఉందా తెలుసుకోలేరు- ఇక జీవితంలోని సూక్ష్మమైన అంశాల గురించి తెలుసుకోవడం మరిచిపోండి. అయితే మీరు నిజంగా ఇక్కడ ఉన్నట్లైతే, తెలుసుకోవాల్సిన ప్రతీది ఇక్కడే ఉంది. ఎందుకంటే బయట నుంచి దేన్నీ మీరు గ్రహించలేరు. మీరు ఇక్కడ కూర్చుంటారా,  హిమాలయాల్లో కూర్చుంటారా, ఆఫ్రికా, అమెరికా లేదా దక్షిణ ధృవం, ఉత్తర ధృవంలో కూర్చుంటారా అనేది ముఖ్యం కాదు. బహుశా కొన్ని ప్రదేశాలు అనుకూలంగా ఉండొచ్చు, మరికొన్ని అనుకూలంగా ఉండకపోవచ్చు- అది వేరే విషయం. అయితే ప్రధానంగా, మీలో జరిగే దాన్ని మాత్రమే మీరు అనుభూతి చెందుతారు.

సాధన అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. దాని ద్వారా వెళ్లేందుకు మరో చోటుంటూ లేదనే వాస్తవాన్ని తెలుసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలనే అవసరం పోయినప్పుడే, మీ సాధన సఫలీకృతం అయినట్లు. అప్పుడు మీరు కేవలం కూర్చుంటే చాలు.

కాబట్టి, మీరు ఎక్కడికి వెళ్లినా, ఉన్నది ఇది మాత్రమే. మీకు తెలుసా, ఇక్కడ ఉన్న ఈ పర్వతాలను వెల్లింగిరి అంటారు. అంటే "తెల్లటి పర్వతాలు" అని అర్థం. మీరు వాటిని హిమాలయాలుగా మలచుకోవచ్చు, దానర్థం అదే. మేము వాటిని "దక్షిణ కైలాసం” అని కూడా పిలుస్తాము. మీరు గనుక తగినంత సమయం ఇక్కడ కూర్చుంటే లేదా తగినంత శ్రద్ధ పెడితే, ఇదే కైలాసంగా మారుతుంది. మీరేమి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీలో జరిగే దాన్ని మాత్రమే మీరు అనుభూతి చెందగలరు. పర్వతాల్లో జరిగే దానిని మీరు అనుభూతి చెందలేరు, ఆకాశంలో జరిగే దానిని మీరు అనుభూతి చెందలేరు, మరెక్కడో జరిగే దానిని మీరు అనుభూతి చెందలేరు.

మీరు ఇక్కడే కూర్చొని, ఎవరో ఒకరిని చూసి, ప్రేమానుభూతి పొందొచ్చు. లేదా కళ్ళు మూసుకొని, ఎవరో ఒకరిని తలచుకొని ప్రేమానుభూతి పొందొచ్చు, అవునా?  మీరు దాన్ని బయట నుంచైనా ప్రేరేపించుకోవచ్చు లేదా లోపలే తయారుచేసుకోవచ్చు, రెండూ సాధ్యమే. మీరు "పుష్-స్టార్ట్" లోనైనా ఉంటారు  లేదా "సెల్ఫ్-స్టార్ట్" లోనైనా ఉంటారు. ప్రశ్నల్లా,  మీరు ఆధునిక యంత్రమా లేదా గతించిన యంత్రమా అనేదే! చంద్రుని వంక చూసినా, నేల వైపు చూసినా, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా- ఏం చేసినా సరే, కేవలం మీలో ఏం జరుగుతున్నదో అది మాత్రమే మీరు అనుభూతి చెందగలరు. ఎక్కువ కాదు, తక్కువ కాదు. 

సాధన అంటే ఉన్నది ఉన్నట్టుగా చూసే పరిపక్వ స్థాయికి రావడమే, ఏం చేసినా సరే; శిఖరాన్ని అధిరోహిస్తున్నా సరే లేదా లోయలో కూర్చున్నా సరే;  ప్రపంచంలో గెలిచినా సరే, ఓడిపోయినా సరే; బాగా పేరొందినా సరే, పొందకపోయినా సరే; మీరు కలలుగన్నవన్నీ తింటున్నారా సరే, తినకపోయినా సరే; మీరు దాన్ని ఎలా  అనుభూతి చెందుతున్నారనేదే అసలు విషయం. ఇది ఒక ఉచ్చు కాదు, అదే జీవన సౌందర్యం. నిజంగా, వెళ్లేందుకు మరో చోటుంటూ లేదు. మీరు ఇక్కడే కూర్చొని ఆనందంగా, పారవశ్యంతో ఉప్పొంగిపోవచ్చు లేదా దుఃఖంలో మునిగిపోవచ్చు. ఎన్నో రకాల ఎంపికలు ఉన్నాయి. ఇక్కడ కూర్చొని, నా జీవితంలో అత్యంత మధురమైన క్షణం ఇదే అని అనుకోవచ్చు లేదా అత్యంత బాధాకరమైన క్షణం ఇదే అనుకోవచ్చు. జీవితం మీ మీద ఎలాంటి బంధనాలు ఏర్పరచలేదు. బంధనాలన్నీ మీ సృష్టే. సృష్టి మీకు పరిపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చింది, ఇక్కడ కూర్చోగలుగుతున్నారు, ఇంకేం కావాలి. వేరే ఏమీ జరగాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ మీ అంతరంగంలో అనుభూతి చెందుతున్న దాని వల్ల , జీవితాన్ని అత్యంత అద్భుతంగా ఆస్వాదిస్తూ గడపొచ్చు లేదా ప్రపంచమంతా తిరుగుతూ, రకరకాల పనులు చేసినప్పటికీ, దుఃఖమయ జీవితం గడుపుతూ ఉండొచ్చు. రెండూ మీ సృష్టే.

దురదని వదిలించుకోవడం

సాధన అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. దాని ద్వారా వెళ్లేందుకు మరో చోటుంటూ లేదనే వాస్తవాన్ని తెలుసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలనే అవసరం పోయినప్పుడే, మీ సాధన సఫలీకృతం అయినట్లు. అప్పుడు మీరు కేవలం కూర్చుంటే చాలు. కూర్చోవడమంటే, భౌతికంగా ఒకే చోట కూర్చోవడం అనే అర్థం కానక్కర్లేదు- అక్కడికి  వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనే దురద పోయిందని అర్థం. మీరు కూర్చున్నా- బాగుంటారు; పరిగెత్తినా- బాగుంటారు; పైకి ఎగిరినా- బాగుంటారు; నడిచినా- బాగుంటారు; ఎక్కడున్నా సరే- మీరు బాగుంటారు. ఒక్కసారి దురద పోయిందంటే, ఇక మీరు హాయిగా ఉంటారు. హాయిగా ఉంటే, మీరేమీ చేయనక్కర్లేదు. కొద్దికాలం వేచి ఉండాలి, అంతే. మీరు ప్రేమలో ఉన్నప్పుడు మాత్రమే వేచి ఉండగలరు, ఎందుకంటే మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నప్పుడు, భావోద్వేగాల పరంగా మీరు ఆహ్లాదకరంగానే ఉంటారు. కానీ మానసికంగా మాత్రం ఎంతో ఆందోళనకి గురవుతూ ఉంటారు, ఎందుకంటే మీ దృష్టిలో శ్రద్ధ చూపించడమంటే అదే మరి. మీ ఆలోచనలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, భావోద్వేగాలు ఆహ్లాదకరంగా ఉంటే , అది ఎంతో అమూల్యమైనది.


మీరు చిరాకుగా, కలవరపాటుగా, విసుగ్గా ఇంకా కోపంతో ఉన్నప్పుడు, మీరు అసౌకర్యంగా ఉంటారు కాబట్టి, వేచి ఉండలేరు. మీకున్న కర్మ సంబంధిత పదార్థం ఏ రకానికి చెందినది ఇంకా బయటి నుండి మీకు లభించే చురుకైన, సమర్థవంతమైన సహాయంపై ఆధారపడి, వేచి ఉండాల్సిన సమయం మారొచ్చు. అది కొన్ని క్షణాలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు… కేవలం కూర్చుని వేచి ఉండండి. మీ అంతరంగం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు, కొన్నేళ్ళ పాటు నిరీక్షించడం పెద్ద సమస్యేమీ కాదు. వేచి ఉంటారు అంతే.

ఎడిటర్  గమనిక: ఈశా హఠ యోగా స్కూల్ నిర్వహించే 21 వారాల హఠ యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో, సద్గురు ఇచ్చిన ప్రసంగం నుండి ఈ వ్యాసం సంగ్రహించబడింది. ఈ కార్యక్రమం యోగ వ్యవస్థపై లోతైన అవగాహనను ఇంకా హఠ యోగాను బోధించే నైపుణ్యాన్ని పొందేందుకు అసమానమైన అవకాశాన్ని అందిస్తుంది. తదుపరి 21 వారాల సెషన్ సమాచారం కోసం, www.ishahathayoga.com లో చూడండి లేదా info@ishahatayoga.com కు మెయిల్ చేయండి