విషయ పట్టిక
1. ఎరుపు రంగు అర్థం
2. నీలి రంగు అర్థం
3. నారింజ రంగు అర్థం
4. తెలుపు రంగు అర్థం
5. పసుపు రంగు అర్థం
6. నలుపు రంగు అర్థం
7. వైరాగ్యం

సద్గురు: రంగులు మానవుని చైతన్యం మీద, లేక ఏదైనా ఆధ్యాత్మిక ప్రక్రియ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? మీరు ప్రతిబింబించే రంగు సహజంగా మీ కాంతి శరీరం ప్రకాశానికి విలువను జోడిస్తుంది అనే కోణంలో ఇది ముఖ్యమైనది. సన్యాస మార్గంలో ఉన్న వారు ఏమీ ధరించడానికి ఇష్టపడరు ఎందుకంటే, వారు తమకి తాము కొత్తగా ఇంకేదీ జోడించాలనుకోరు. వారు ఉన్నదానితో పని చేయాలనుకుంటారు. ఇంకేమీ తీసుకోవాలనుకోరు. మీరు ప్రస్తుతం ఏమిటో, దానిని అర్థం చేసుకోవడమే చాలా ఎక్కువ. మరో విషయం జోడిస్తే అది మరింత క్లిష్టతరం అవుతుంది. కాబట్టి వారు నగ్నంగా నడుస్తారు. నగ్నంగా నడవడం సామాజికంగా కష్టంగా ఉంటే, వారు గోచీ గుడ్డ ధరిస్తారు. అసలు ఉద్దేశం ఏమిటంటే వారు, తమ దగ్గర అప్పటికే ఉన్నదానికంటే మించి ఏమీ తీసుకోరు. తాము ఏమిటన్నది చాలా గణనీయమైనదని వారికి తెలుసు. దీనిలో ఇతర అంశాలు కూడా ఉన్నాయి కానీ రంగుల పరంగా చూస్తే మాత్రం విషయం ఇదే.

అసలు, రంగు అంటే ఏమిటి? ఏదైనా పదార్థానికి రంగు ఆ పదార్థం వల్ల రాదు, అది దేన్ని తిరస్కరిస్తుంది, అది ఏమి విడుదల చేస్తుంది లేదా ఏమి ప్రతిబింబిస్తుందో దాని వలన వస్తుంది. ఏదైనా వస్తువు ఎరుపు రంగులో కనిపిస్తుంది అంటే అది ఎరుపు రంగులో ఉంటుందని కాదు. అది తెలుపు కాంతిలో ఉన్న ప్రతి రంగునీ తనతో ఉంచుకొని ఎరుపుని మాత్రం వదిలేస్తుంది. కాబట్టి, ఎరుపు అంటే అది ఎరుపు రంగులో ఉందని కాదు. ఎరుపు అంటే అది ఎరుపును వదిలిపెట్టేసిందని! అలాగే ప్రపంచంలో కూడా, మీరు ఏది ఇస్తారో, అది మీ గుణం అవుతుంది.

ఎరుపు రంగు అర్థం

మీరు అడవిలో నడుస్తున్నప్పుడు, అంతా ఆకుపచ్చగా ఉంటుంది. కానీ ఒక్క చోట మాత్రం ఎరుపు ఉంటుంది - ఎక్కడో ఒక ఎర్రటి పువ్వు వికసిస్తూ ఉంటుంది - ఇది మీ దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే మీ అవగాహనలో, ఎరుపు అన్ని రంగులలోకి అత్యంత ఉత్తేజ భరితమైనది. మిగతా రంగులన్నీ అందంగా, చక్కగా ఉండవచ్చు కానీ ఎరుపు మాత్రం ఉత్తేజం కలిగించేది.

మీకు ముఖ్యమైన అనేక విషయాలు ఎరుపు. ఉదాహరణకు మీ రక్తం రంగు ఎరుపు. మానవ చేతనలో ఆలోచనలపై రంగులు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి, ఎరుపు అన్నిటికంటే ఎక్కువగా ఉత్తేజాన్నిస్తుంది. ఉత్సాహభరితమైనది ఏదైనా అది ఎరుపు రంగులో ఉంటుంది. "painting the town red" గురించి మీరు వినే ఉంటారు. మీరు సృష్టించే దేవతలలో స్త్రీ రూపాలు అత్యంత ఉత్సాహభరితమైనవి. లింగ భైరవి ఎరుపు రంగులో ఉంటుంది ఎందుకంటే ఆమె ఎరుపు రంగును ప్రసరిస్తుంది. దేవి ఉత్సాహానికి ప్రతిరూపంగా ఉంటుంది. ఆమె శక్తి ఉత్తేజ పూరితం ఇంకా ఉత్సాహభరితం. ఆ కారణంగా, దేవి ఎరుపు రంగులో ఉంది - అంతేకానీ ఆమె ఎరుపు కాదు!

రంగులు - నీలం రంగు అర్థం

నీలం రంగు అంటే అన్నింటినీ తనలో కలుపుకునే తత్త్వం. మీరు సృష్టిలో చూస్తే, విస్తారమైనది, మీ అవగాహనకు మించినది ఏదైనా, సాధారణంగా అది నీలం రంగులో ఉంటుంది, అది సముద్రం అయినా, ఆకాశం అయినా సరే. మీ అవగాహనకు అందనిది ఏదైనా నీలం రంగులో ఉంటుంది ఎందుకంటే నీలం కలుపుకునే తత్వానికి ఆధారం. అందు మూలంగానే భారతదేశంలో చాలా మంది దేవుళ్ళు నీలం రంగు చర్మంతో చూపించబడతారు. శివుడికి నీలం రంగు చర్మం, కృష్ణుడి రంగు నీలం, రాముడి రంగు నీలం.. వారి చర్మం నీలం రంగులో ఉందని కాదు. నీలం రంగు కాంతి లేక ‘కాంతి శరీరం’ కలిగి ఉన్నందున వారిని నీలపు రంగులో ఉన్నదేవతలుగా పేర్కొన్నారు.

దీంట్లో మరో అంశం కూడా ఉంది. ఒకరి పరిణామక్రమం పరంగా, వారి 'Aura' అంటే కాంతి శరీరం, వివిధ రంగులను తీసుకోగలదు. మన సాధనలో 'ఆజ్ఞా' చక్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తే, అప్పుడు నారింజ రంగు అవుతుంది. అది పరిత్యాగ క్రియ రంగు. ఎవరికైనా స్వచ్ఛమైన తెల్లని కాంతి శరీరం ఉంటే, అంటే వారు స్వచ్ఛమైన జీవం అని అర్థం. అలాంటి వ్యక్తి ఉనికి అద్భుతంగా ఉంటుంది, కానీ అతను అంత క్రియాశీలకంగా ఉండడు. ఎవరైనా తమ అత్యున్నత స్థాయిని చేరుకున్నప్పుడు, అయినప్పటికీ ప్రపంచంలో చురుకుగా ఉండటానికి ఎంచుకున్నప్పుడు, అతని కాంతి ఎల్లప్పుడూ విద్యుత్ నీలం రంగులో ఉంటుంది. క్రియాశీలకంగా ఉన్న ఎవరైనా నీలం రంగులో ఉంటారు. ఈ రకమైన కాంతి, ఇతర వ్యక్తులు మానవాతీతమైనదిగా భావించే విధంగా ప్రపంచంలో పనిచేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

 నారింజ రంగు అర్థం

ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వ్యక్తులు నారింజను తమ రంగుగా ఎందుకు ఎంచుకుంటారు, కనీసం ఈ దేశంలో? ఎందుకంటే, నారింజ చాలా విషయాలను సూచిస్తుంది. ఒక వ్యక్తి ఆజ్ఞా చక్రం వైపు కదులుతున్నప్పుడు, ఆజ్ఞా రంగు నారింజ రంగులో ఉందని చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఇది సహజమైనది, సజీవమైనది కూడా. మీరు కొన్ని ధ్యానాల్లోకి వెళితే, ఆజ్ఞాచక్రం నారింజ లేదా కాషాయరంగులో ఉందని మీరు స్పష్టంగా చూస్తారు. వాస్తవానికి అది కాషాయ రంగు కాదు, జేగురు మన్ను రంగు. ఆజ్ఞా చక్రం ఎరుక లేదా జ్ఞానోదయానికి సంబంధించిన చక్రం, దీనిని 'మూడవ కన్ను' అని కూడా అంటారు. శరీరంలో 114 చక్రాలు ఉంటాయి. వీటిలో రెండింటికి ఏ రంగూ ఉండదు ఎందుకంటే అవి భౌతికమైనవి కావు. మిగిలిన 112 చక్రాలకు ఏదో ఒక రంగు ఆపాదించబడింది. ఉనికిలో భౌతికంగా ఉన్నది ఏదైనా సహజంగా కాంతిని ప్రతిబింబిస్తుంది. అది ప్రతిబింబించిన కాంతి మీ దృష్టిలో దాని రంగుగా గుర్తింపబడుతుంది.

 జ్ఞానోదయం కోసం, మూడవ కన్నుగా సూచించబడే ఆ జ్ఞాన పార్శ్వాన్ని వికసింపచేసే సాధనా పథంలో ఉన్న వ్యక్తులు జేగురురంగును ఎంచుకుంటారు. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ ఆ రంగుని ప్రసరింపజేయాలనుకుంటున్నారు.

ఒకవేళ మీరు పారదర్శకంగా మారితే, మీ వెనుక ఉన్నది ఎరుపు రంగులో ఉంటే, మీరు కూడా ఎరుపు రంగులోకి మారతారు. మీ వెనుక ఉన్నది నీలం రంగులో ఉంటే, మీరు కూడా నీలం రంగులోకి మారతారు. మీరు ఎక్కడ ఉన్నా, మీరు దానిలో భాగం అవుతారు. కానీ మీకు ఏదీ అంటదు.

సాధారణంగా, నారింజ రంగుకు మారిన వ్యక్తి, పాత వాటినన్నిటినీ - తన పేరు, తన గుర్తింపు, తన కుటుంబం, రూపం, తనకు సంబంధించిన ప్రతివిషయాన్నీ వదిలేస్తాడు - ఇక భిన్నమైన జీవితంలోకి మారతాడు. అంటే, అతను కొత్త ప్రారంభాన్ని చేస్తున్నాడు, అతని జీవితంలో ఒక కొత్త సూర్యుడు ఉదయించాడు. తనకి ఉన్న ప్రతిదీ విసర్జించి, జీవితం యొక్క మరొక పార్శ్వంలోకి, మరొక సంభావ్యతలోకి నడవడానికి కావలసిన ఎరుక కలిగింది. ఇది జ్ఞానం, అవలోకనం-వీటిని కూడా సూచిస్తుంది. ఒక వ్యక్తి పరిణతి చెందాడు లేదా అతను అవలోకనా దృష్టిని పొందేలా పరిణతి చెందాలనుకుంటున్నాడు, అందుకే అతను అందులోకి ప్రవేశిస్తున్నాడు. ఇద్దరికీ నారింజరంగు వస్త్రధారణ మేలు చేస్తుంది.

నారింజ ఒక ప్రతీక కూడా. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, అది నారింజ రంగులో ఉంటుంది. మీ జీవితంలోకి ఒక కొత్త కాంతి వచ్చిందని ఇంకా మీ లోపల ఒక కొత్త ఉదయం జరిగిందని సూచించడానికి మీరు ఈ రంగును ధరిస్తారు - ఒక కొత్త ఉదయం. మీలో ఒక కొత్త సూర్యుడు ఉదయించడం ప్రారంభించాడు. మరో అంశం ఏమిటంటే, పండు పరిపక్వత చెందినప్పుడు, అది నారింజ రంగులోకి మారుతుంది. నారింజ పరిపక్వతకు చిహ్నం. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట స్థాయి పరిణతి లేదా పరిపక్వతకి చేరినపుడు, అతను ఈ రంగును ఉపయోగిస్తాడు.

తెలుపు రంగు అర్థం

తెలుపు లేదా ఆట్వారంగ్ అంటే ఎనిమిదవ రంగు. ఏడు రంగులు ఉన్నాయి; తెలుపు ఎనిమిదవ రంగు. ఈ ఎనిమిదవ రంగు లేదా ఆట్వారంగ్ అంటే జీవితం యొక్క ఆ అతీతమైన కోణం. నిజానికి తెలుపు ఒక రంగు కాదు. ఏ రంగూ లేనప్పుడు, తెలుపు మాత్రమే ఉంటుంది. రంగు లేకపోవడం వల్ల అది తెల్లగా అగుపిస్తుంది. అదే సమయంలో, తెలుపు అన్నింటినీ కలుపుకొని ఉంటుంది. మీరు చూసే తెల్లని కాంతి ఏడు రంగులు కలిగి ఉంటుంది. మీరు ఆ తెల్లటి కాంతిని వక్రీభవనం చేసి, ఆ రంగులను ఏడింటినీ వేరు చేయవచ్చు.

తెలుపు మీపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా మీరు ఉష్ణమండల దేశంలో నివసిస్తున్నప్పుడు, ధరించడానికి అత్యుత్తమమైన రంగు - తెలుపు. ఇది వాతావరణ పరంగా కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. సాంప్రదాయంలో, నారింజ రంగు ధరించిన వ్యక్తి, కుటుంబం ఇంకా సామాజిక పరిస్థితుల నుండి తనను తాను విడదీసుకుంటాడు. తెలుపును ఎంచుకునే వారు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తారు, అయినప్పటికీ జీవితంలోని ఇతర అంశాలలో కూడా నిమగ్నమై ఉంటారు. ఏమీ సేకరించడానికి ఇష్టపడని మార్గంలో ఉన్నవారు తెలుపు ధరిస్తారు. వారి సాధన మంద్రస్థాయిలో ఉంటుంది. కానీ, వారు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు. వారు జీవితంలోని వివిధ అంశాలతో నిమగ్నం అయి ఉంటారు, కానీ వారు తమ చుట్టూ ఉన్న వాటిని సేకరించడానికి ఇష్టపడరు. వారు జీవితంలో పాల్గొనాలని కోరుకుంటారు, కానీ వారు ఏమీ సేకరించడానికి ఇష్టపడరు, అటువంటి వ్యక్తులు తెలుపును ధరించడానికి ఎంచుకుంటారు.

పసుపు రంగు అర్థం

బౌద్ధ సంప్రదాయంలో, అర్హత్ స్థాయికి పట్టభద్రులైన సన్యాసులు జేగురు రంగు దుస్తులు ధరిస్తారు. మిగిలినవారు పసుపు రంగు దుస్తులు ధరిస్తారు. ఎందుకంటే, గౌతముడు బౌద్ధ సన్యాసులకు ప్రారంభ దశలో ఇచ్చిన ప్రక్రియ చాలా ప్రాథమికమైనది. ఆయన వారి కోసం ఈ ప్రక్రియను ఎందుకు ఎంచుకున్నాడంటే, దీనికి ఎటువంటి ముందస్తు తయారీ అవసరం లేదు. ఆయన జ్ఞాన తరంగాలను సృష్టించాలనుకున్నాడు. ఆయన ఏ పట్టణంలోనూ ఎక్కువ కాలం ఉండలేదు. నిరంతరం గ్రామం నుండి గ్రామానికి, పట్టణం నుంచి పట్టణానికి కదలిపోతూ ఉండేవాడు. ప్రజలను ఏ విధమైన అభ్యాసానికి సిద్ధం చేయడానికి సమయం లేదు కాబట్టి, ఆయన వారికి చాలా ప్రాథమిక ప్రక్రియను ఇచ్చాడు. అయినప్పటికీ వారిని సన్యాసులుగా మారుస్తూ ఉన్నాడు. ఆయన వారి జీవితాలను సరి చేస్తున్నాడు కానీ, వారికి తగినంత సాధన సామగ్రిని ఇవ్వలేదు. కాబట్టి పసుపు వస్త్రాన్ని ధరించమని చెప్పాడు, ఎందుకంటే, పసుపు రంగు మూలాధార చక్రపు రంగు. శరీరంలో అత్యంత ప్రాథమిక చక్రం మూలాధారం. వారు స్థిరంగా ఉండాలని గౌతముడు కోరుకున్నాడు.

మీరు కొన్ని జీవిత కాలాల పాటు ఆధ్యాత్మిక మార్గాన్ని రూపొంది౦చేటప్పుడు, అలా౦టి ప్రక్రియ నేర్పిస్తారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ బౌద్ధ జీవన విధానంలో కొనసాగుతోంది. వారు మరలా, మరలా, మరింత పని చేయడానికి తిరిగి వస్తారు. ఎందుకంటే ఈ ప్రక్రియ వారిని స్థిర పరుచుకోవడం కోసం కానీ, తమని తాము తెలుసుకోవడం కోసం కాదు. కాబట్టి ఆయన వారిని పసుపు దుస్తులు ధరించమని చెప్పాడు.

నలుపు రంగు యొక్క అర్థం

మీరు శక్తివంతం చేయబడిన ఒక నిర్దిష్ట స్థలంలో ఉండి, దానిని మీరు గ్రహించాలనుకుంటే, నలుపు మంచిది. నలుపు దేనినీ బయటకు ఇవ్వదు, ప్రతిదాన్నీ శోషించుకుంటుంది. మీరు నలుపు ధరించి మంచి స్థలానికి వెళితే, మీరు దానిని గ్రహిస్తారు. కానీ మీరు నలుపు ధరించి చెడ్డ స్థలానికి వెళితే, మీరు దానిని కూడా గ్రహిస్తారు.

కాబట్టి, ప్రతి ఒక్కరూ నలుపు ధరించడానికి అర్హులు కారు. మీరు నిరంతరం నల్లని దుస్తుల్లో ఉండి, మిమ్మల్ని మీరు వివిధ పరిస్థితులలో ఉంచుకున్నట్లయితే, మీ శక్తులు హెచ్చుతగ్గులకు గురవుతున్నట్లు మీరు గమనించవచ్చు. అది మీ నుండి అన్ని భావోద్వేగాలను పీల్చి వేసుకుని మీ మనస్సును చాలా అస్థిరమైన, అసమతుల్య స్థితులలోకి తీసుకువెళ్తుంది. ఇది మిమ్మల్ని అనిర్వచనీయమైన బాధకి గురిచేస్తుంది. మీ బాధలకు వ్యక్తీకరణ కూడా దొరకని విధంగా మీరు బాధపడతారు.

అదే ఒకవేళ మీరు చాలా ఉత్సాహభరితమూ, సకారాత్మకమూ అయిన సందర్భాల్లో నలుపు ధరిస్తే, అప్పుడు మీకు చాలా మంచి చేసే అద్భుతమైన శక్తిని మీరు గ్రహిస్తారు. స్థలం సరైనదని తెలిసినప్పుడు మాత్రమే మీరు నలుపు ధరించాలి.

రంగులు - వైరాగ్యం

మీరు "వైరాగ్యం" అనే పదాన్ని వినే ఉంటారు. "రాగం" అంటే రంగు అని అర్థం. "వై" అంటే అంతకు మించి, అతీతంగా అని అర్థం. "వైరాగ్" అంటే రంగులకు అతీతమైనదని అర్థం. మీరు పారదర్శకంగా అయ్యారు. ఒకవేళ మీరు పారదర్శకంగా ఉన్నట్లయితే, మీ వెనుక ఉన్నది ఎరుపు రంగులో ఉన్నట్లయితే, మీరు కూడా ఎరుపు రంగులోకి మారతారు. మీ వెనుక ఉన్నది నీలం రంగులో ఉంటే, మీరు కూడా నీలం రంగులోకి మారతారు. మీ వెనుక ఉన్నది పసుపు రంగులో ఉంటుంది, మీరు కూడా పసుపు రంగులోకి మారతారు. మీరు పక్షపాతం లేనివారు. మీరు ఎక్కడ ఉన్నా, మీరు దానిలో భాగం అవుతారు, కానీ మీకు ఏదీ అంటదు. మీరు ఇలా ఉంటేనే, మీరు వైరాగ్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే, జీవితంలోని అన్ని కోణాలను అన్వేషించడానికి మీరు ధైర్యం చేయగలరు.