ప్రశ్న: నమస్కారం సద్గురు. పెళ్ళైన జంట ఇద్దరూ ఒకే ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం ఎంత వరకూ ముఖ్యం?

ఆధ్యాత్మిక మార్గం అనేది ఒక అనుసరణ కాదు, ఒక నమ్మక వ్యవస్థ కూడా కాదు. ఆధ్యాత్మిక మార్గమంటే, అందులో మీరొక అన్వేషి అంతే. మీరు తెలుసుకోవాలనుకునే ఒక జిజ్ఞాసి. మీకు సమర్ధవంతమైన మార్గాన్ని మీరు ఎంచుకుంటారు. నేను మీకు ఇచ్చేది మీ అన్వేషణకు ఉపయోగపడే సాధనలు మాత్రమే-అదే మీ గమ్యం కాదు. మీ భర్త, భార్య లేదా ఇంకెవరైనా సరే మీలా సత్యాన్వేషి కాకపోతే సహజంగానే వారు ప్రశ్నించేవారు అయ్యుంటారు. ఈ ప్రపంచం అంతా అంతే-ఎప్పుడూ ఇంకేదో కావాలనే అంటూ ఉంటుంది. మీరు జిజ్ఞ్యాసులు అయితే మీలో కోరుకునే లక్షణం తగ్గిపోతుంది. ఏదైనా అవసరమైతేనే కొంటారు-తృప్తి కోసం కాదు.

మీరు ఆధ్యాత్మిక జిజ్ఞ్యాసువు అయినా, ఏదో ఒకటి కొంటూ ఉండే మామూలు వ్యక్తి అయినా, ఇద్దరూ కోరుకొనేది తృప్తే. జిజ్ఞ్యాసిగా మీరు తెలుసుకున్నదేంటంటే, ఈ కొనుగోళ్ళతో వచ్చే తృప్తి సంపూర్ణమైన తృప్తి కాదని. ఊరికే ప్రశ్నించటం, సొంతం చేసుకోవటం వలన మీరు ఎప్పటికీ సంపూర్ణమైన తృప్తి పొందలేరని మీకు తెలుస్తుంది. మీరు కేవలం అత్యవసరాల కోసo ఖర్చు పెడతారు, తృప్తి కోసం కాదు. ఎందుకంటే అది ఎందుకూ ఉపయోగపడని తృప్తి అని మీకు తెలిసు.

ప్రతి రోజూ మీకంటే మీ భాగస్వామే ఎక్కువ ముఖ్యమైన వ్యక్తని అనుకుంటే, అది తప్పకుండా పని చేస్తుంది.

మీరు జిజ్ఞాసువుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సంపూర్ణమైన తృప్తి గలవారిగా చేసుకోవాలో మీకు అర్ధంకాదు. మీరు శాంభవి కానీ వేరే ఏదైనా ఇతరత్రా యోగిక పద్ధతులు కానీ అవలంబించినపుడు మీకొక పనిముట్టు దొరుకుతుంది అంతే-అదే గమ్యం కాదు. మీరివన్నీ సంపూర్ణంగా లీనమై చెయ్యవలసిన పద్ధతులు, లేకపోతే అవి పనిచెయ్యవు మరి. జీవితంలో అన్ని విషయాలూ అంతే. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేనికైనా సమర్పించు కోకపోతే అత్యద్భుతమైన విషయాలు కూడా మీకు పనిచెయ్యవు. అవసరమైనంత మేరకు మీరు లీనం కాకపోతే అన్నీ మీకు అందని ద్రాక్షలే అవుతాయి.

భగవంతుడు ఇక్కడ లేడనుకోకండి

మీరు దైవత్వంతో పూర్తిగా లీనం కాకపోతే, ఆ తత్త్వం మీ పక్కనే ఉన్నా మీరు చూడలేరు. మీరు పీల్చే గాలి దేవుడు కాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరొక ప్రయోగం చెయ్యచ్చు. మీరు ఒక రెండు నిమిషాల పాటు మీ ముక్కు మూసుకుని కూర్చోండి. కొంతసేపయ్యాక మీకు దేవుడు కావాలా? గాలి కావాలా? అని మిమ్మల్ని మీరు అడగండి. మీకు ఏం కావాలి? గాలి. ఔనా? అంటే, మీరు దేవుడి కన్నా ఎక్కువగా గాలినే కోరుకున్నారనమాట. మరి ఆ విషయం మీకు ముందే ఎందుకు తెలియలేదు? ఇప్పుడెందుకు గాలే ముఖ్యం అనిపించట్లేదు? మీరు సంపూర్ణంగా మమేకం అవ్వకపోవడం వల్లనే ఆ భగవంతుడు కనిపించట్లేదు, అంతే. మీలో చాలా మంది ఇక్కడ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పుడు మీరు ఊరికే కూర్చుని శ్వాసిస్తూ ఉంటేనే, మీ కళ్ళలో నించి ఆనందభాష్పాలు రాలేవి. మీరు ఇప్పుడు కూడా శ్వాసిస్తున్నారు, కానీ ఆ అనుభవం కలగటం లేదు. ఎందుకంటే అప్పుడున్న తాదాత్మ్యత ఇప్పుడు లేదు.

ఈ ఆధ్యాత్మిక ప్రక్రియంతా ఏంటంటే, మీలో ఒక తీవ్రమైన తాదాత్మ్య భావన పెంపొందించటం, మీరు “నేను” అనే హద్దులము దాటి అందులో లీనమవటం జరుగుతుంది. అది ఎంతటి తాదాత్మ్య భావన అంటే, మీరు తీసుకునే శ్వాస, తినే ఆహారం అన్నీ ఒక విస్ఫోటనంలా మిమ్మల్ని ముంచెత్తుతాయి. మీరు తినే ఆహారం మీకు ఆహారంలా అనిపించకుండా కొన్ని మూలకణాలలాగా కనిపిస్తూ, మీరు వాటిని తిన్నాక మీలో జరిగేది ఏంటో మీకు తెలుస్తున్నప్పుడు ఒక అద్భుతం సాక్షాత్కారమవుతుంది. ఇది నా అనుభవంలోకి వచ్చినప్పుడు నాలో ఒక విస్ఫోటనం జరిగి అది నన్నుమహాద్భుతానికి లోను చేసింది.


మీరు నోట్లో ఒక అన్నం ముద్ద పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడగలిగినా అనుభవించగలిగినా, మీరు ఒక నీటి బిందువు తాగినా ఒక శ్వాస పీల్చినా, “మీరు” అనుకుంటున్న మీకూ, మీ బయటి ప్రపంచానికీ మధ్య జరుగుతున్నదేంటో మీకు అర్ధమైనా మీకు విస్మయం కలుగుతుంది. కానీ మీరు అందులో అవసరమైనంత లీనంకాలేకపోవటం వల్ల ఏదీ మీకు చేరదు. మీరు ఎన్నిసార్లిలా స్వర్గాన్ని తప్పించుకున్నారో నేను చెప్పలేను. ఒక సారో రెండు సార్లో కాదు మీరు వేసే ప్రతి అడుగులోనూ దాన్ని విస్మరిస్తున్నారు. ఎందుకంటే అది ఎక్కడో లేదు-మీలోనే ఉంది.

మీరు ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉండి, మీ భాగస్వామి ఇంకొక ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే, దాని అర్ధం ఇద్దరూ పోట్లాడుకొమ్మని కాదు. మీరు పోట్లాడుకుంటే, మీరిద్దరూ వేర్వేరు మతాలవారని అర్ధం-వేర్వేరు ఆధ్యాత్మిక మార్గాల ఎంచుకున్న వారు కాదు. ఇద్దరు వేర్వేరు ఆధ్యాత్మిక మార్గాలలో పయనిస్తున్న వ్యక్తులు ఒక ఇంటిని ఎంత అందంగా ఆనందంగా మార్చగలరో తెలుసా!.ఆధ్యాత్మిక మార్గమనేది ఒక అనుభవపూర్వకమైన ప్రక్రియ. గొడవలు పడటానికి అది మీ చుట్టూ ఉన్న ఒక బాహ్యమైన విషయం కాదు. కానీ మీరు ఆధ్యాత్మికత పేరుతో ఒక నమ్మక వ్యవస్థని దృఢపరుచుకొని ఉంటే, అది మీకొక పెద్ద వివాదమై కూర్చుంటుంది.

బలవంతం మీద కాదు ఎరుకతో సాధించాలి

మీరు చాలా సార్లు తెలీని ఒక నిర్భంధ స్థితిలో ఉంటారు కాబట్టే కొన్ని స్పర్ధలు వస్తాయి. మనందరం ఎన్నో పనులు ఈ స్థితిలోనే చేస్తాం. మీరు జీవితంలో ఏ పనులను తెలీని నిర్భంధ స్థితిలో చేస్తున్నారో, ఏ పనులను ఎరుకతో, స్పృహతో చేస్తున్నారో మీరు గుర్తించాలి. మీరు ఆ విషయాన్ని ఒక చోట రాసుకుని, ప్రయత్నంతో కనీసం ఆరు నెలలకొకసారి అయినా ఒక నిర్బంధనాన్ని ఎరుకతో, స్పృహతో చెయ్యటం మొదలు పెట్టాలి. ఇలా క్రమంగా నిర్భంధ స్థితిని దాటుకుని చైతన్యానికి లేదా ఎరుకకు చేరువకండి. మీరిది చేస్తూ ఉంటే అతి కొద్ది సమయంలో మీరు సమస్థితికి వస్తారు.

భారతదేశంలో అన్నిటికంటే అందమైన విషయం ఏంటంటే, ఒకే ఇంట్లో ఉన్న ఐదుగురు, ఐదుగురు దేవుళ్ళను పూజిస్తూ హాయిగా గొడవ లేకుండా ఉండగలరు. ఈరోజుకీ ఒక ఇంట్లోని పూజగదిలో దాదాపుగా ఇరవై ఐదు దేవుళ్ళుంటారు. మగవారు ఒక దేవుణ్ణి పూజిస్తే, ఆడవారు ఒక అరడజను దేవతలను పూజిస్తారు. పిల్లలు వారికి నచ్చిన దేవుళ్ళని పూజిస్తారు. ఇదే కాకుండా ఎవ్వరూ పెద్దగా పూజించని దేవుళ్ళు కూడా ఉంటారు మందిరంలో, ఎందుకంటే ఆ ప్రతిమలు వాళ్లకి పక్కింటినించి వచ్చుంటాయి. ఇదంతా ఇక్కడ తప్ప ప్రపంచంలో వేరేచోట్ల దాదాపు అసాధ్యం. కొన్ని దేశాల్లో అధికారంలో ఉన్నవారిని కాకుండా ఇంకెవరినైనా పూజిస్తే మీకు మరణశిక్షే పడుతుంది. అలాంటి దేశాల్లో ఎవరైనా వేరే దేన్నైనా పూజిస్తే, వాళ్లకి మరణదండన విధించాలని నేర్పబడుతుంది.

రెండు ఆధ్యాత్మిక మార్గాలు ఎప్పుడూ ఒక సమస్య కాదు.ఇద్దరూ ఆధ్యాత్మిక అన్వేషులైనప్పుడు సమస్య ఏముంది?

మీరు, మీ భాగస్వామి ఇద్దరూ రెండు వేర్వేరు ఆధ్యాత్మిక మార్గాల్లో ఉంటే అది సమస్య కాదు. కానీ ఒకరు ప్రశ్నించే వ్యక్తి మరొకరు అన్వేషి ఐతేనే సమస్య.ఎందుకంటే, ఒకరు సత్సంగానికి వెళ్ళాలనుకుంటారు, ఇంకొకరు బజారు వెళ్లి కొనుగోళ్ళు చెయ్యాలనుకుంటారు. మీరు అలా నడిచి రావాలనుకుంటారు, అతడు ఇంకేదో చెయ్యాలనుకుంటారు. నిజానికి అది కూడా సమస్య కాదు. కాస్త వైరుధ్యం కూడా మంచిదే. కాస్త పరిణితి ఉన్నవారు, ఈ వైరుధ్యాన్ని సర్దుకుంటారు. అలా కాలేని వారు దాన్నొక సమస్యగా చేస్తారు.

రెండు ఆధ్యాత్మిక మార్గాలు ఎప్పుడూ సమస్య కాదు. ఇద్దరూ అన్వేషులైతే సమస్య ఏముంది?.మీకేదైనా సరిగ్గా పనిచేస్తోంది అని అనిపిస్తే అది మీ భాగస్వామికి అందజేయచ్చు మీరు. అలాగే అతనికి ఏదైనా సరైనది అనిపిస్తే అది అతడు మీకు అందించవచ్చు. అందులో నాకు సమస్యేమీ కనిపించట్లేదు.

సమస్యలే లేని చోట లేనిపోని సమస్యలు సృష్టించకండి. ఒక తెలీనితనం వల్లే ఈ అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఒకసారి ఏం జరిగిందంటే, శంకరన్ పిళ్ళై, అతని ఇద్దరు స్నేహితులూ కలిసి రైల్వే స్టేషన్ కు వెళ్ళారు. వాళ్ళంతా తాగి ఉండటం వల్ల రైలు ఎక్కటానికి కష్టపడుతున్నారు. రైలు కదలటం మొదలైంది, వారు తొందరపడ్డారు. అది చూసిన ఒక వ్యక్తి వారికి సాయం చేసి వారిలో ఇద్దరిని రైలు ఎక్కించాడు. అతను మూడో వాడైన శంకరన్ పిళ్ళైని ఎక్కించే లోపు రైలు వేగం పెరిగింది. దానితో ఆతను ఎక్కించలేక శంకరన్ తో “క్షమించండి నేను మిమ్మల్ని ఎక్కించలేకపోయాను.” అన్నాడు. అప్పుడు కొంచెం తేరుకున్న శంకరన్ పిళ్ళై “ఔనండి! పాపం నన్ను దిగబెట్టటానికి వచ్చిన నా స్నేహితులు కూడా ఇంతే బాధ పడుతూ ఉంటారు” అన్నాడు.

ఎవరు గొప్ప అనే దృష్టితో చూడకండి మీరు-అది చాలా పెద్ద సమస్య అవుతుంది. ఈ స్థితిలో ఎదుటివారు మీకంటే మెరుగు అనుకుంటే చాలా మంచిది. ఇద్దరూ అలాగే అనుకుంటే మరీ మంచిది. మీకు పెళ్ళైన కొన్ని రోజుల్లోనే నేనే గొప్ప అనే భావనలొస్తే, అది ఎక్కడికో పోయే ఆస్కారం ఉంది. మీరు మీ జీవితంలో ప్రతి రోజూ మీకంటే మీ భాగస్వామే ఎక్కువ ముఖ్యమైన వ్యక్తని అనుకుంటే, అది తప్పకుండా పని చేస్తుంది.