సద్గురు: మనిషికి హద్దులు లేని అనంతత్వ స్థితి అనుభవించే అవకాశం ఉన్నా, చాలామంది మనుషులు ఒక ఎలుకలాగో, ఉడత లాగో మనుగడ సాగిస్తే చాలనుకుంటారు. భూమిలో అచ్చంగా మీకే సొంతంగా ఒక చిన్న బొరియ తవ్వుకోవటం, మీరు మీ మనిషిగా భావించే ఒక మనిషితో బంధం పెట్టుకొని కాలక్షేపం చెయ్యటం.

'ఇది నాదీ, ఇది నాది కాదు!' అని అన్న భావన ముఖ్యంగా మెదడులోని సరీసృప (ప్రాకే జీవుల) భాగం నుంచి కలుగుతుందనీ ఇప్పటి ఆధునిక నాడీ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనిషి శరీరమూ, మెదడూ జీవ పరిణామ ప్రక్రియలో ఎంత ముందుకు పోయినా, చాలా మంది మనుషులు తమకు సహజంగా లభించిన సామ్రాజ్య దిశగా పురోగమించ లేకపోతున్నారు. ఈ అనాశక్తతకు కారణం, వాళ్ళ శరీరాలు తమ ముందుతరాల వారి అనుభవాల జ్ఞాపకాలనే కాక, జీవ పరిణామంలో తమకంటే ముందు వచ్చిన జంతు జాతుల జ్ఞాపకాలను కూడా వదలలేకపోవటమే.

'ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, ఇది నాదీ, ఇది నాది కాదు!' - ఈ భావనలన్నీ ప్రధానంగా, మీ మెదడులో జీవ పరిణామ పురోగతిని తిరస్కరించే భాగం నుంచి కలిగేవి. ఈ భాగం మీకు స్వీయ రక్షణకు తోడ్పడేందుకు కేటాయించబడిన భాగం. ఇలా కేవలం తమ ఆత్మ రక్షణ గురించి, భద్రత గురించి ఆలోచించవలసిన అవసరం లేని పరిస్థితులు సృష్టించగలిగితే, మనుషులు మరింత నిశ్చింతగా జీవించగలిగితే, తమ చుట్టూ ఉన్న జీవంతో మరింత సంతృప్తిగా సహజీవనం చేయగలిగితే, కొన్ని తరాల తరవాత, వాళ్ళ మెదడులో ఉన్న సరీసృప (ప్రాకే జీవుల) భాగం కుంచించుకు పోయి క్రమంగా అంతరించే పోవచ్చు కూడా.

ధ్యానం అంటే, ప్రధానంగా, అజ్ఞానం వల్ల ఏర్పడిన అదృశ్యమైన అడ్డుగోడలను కరిగించేసుకోవటం. ఓ రకమైన ధ్యాన స్థితిలో నిమగ్నులై ఉండే వారిలో మెదడులో కొన్ని భాగాలు దాదాపు నిద్రాణంగా అయిపోతాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అవెప్పుడూ జాగృతం కావు. అవి ఎప్పటికీ క్రియాశీలంగా ఉండవు.

తను మనిషిగా జీవించాలో, లేక ఎలుకలాగో, ఉడతలాగో జీవించాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ కూడా మనిషికే ఉంది. మనిషి ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తన ఇచ్ఛా పూర్వకంగా తీసుకోవచ్చు. భౌతిక రూపంలో మన పుట్టుక జరిగినప్ప్పుడే, మాతృ గర్భంలో నుంచి మనం బయటకు వచ్చిన క్షణం నుంచే ఒక అధ్బుత సంభావనీయత. భౌతిక శాస్త్ర రీత్యానే అయితే, మీది ఒక మామూలు జంతు జన్మే. ఆ స్థితినుంచి మిమ్మల్ని మీరు మానవుడిగానే తీర్చిదిద్దుకొంటారో, లేక అంతకంటే ఉన్నతంగా దివ్యత్వమే సంతరించుకోగలుగుతారో, అదంతా మీరు మీకుగా తీసుకొనే నిర్ణయాల మీద ఆధారపడుతుంది. మనిషి చేయవలసింది అది. తనలో ఉన్న జంతువును అంతం చేసి, దివ్యత్వాన్ని వికసింపజేసుకొనేందుకు ఎరుకను పెంపొందించుకొని మనిషి సన్నద్ధుడైతే, మానవ జన్మ సార్థకమైనట్టు. ఈ అవకాశం మీ జీవితంలో ప్రతి క్షణం మీ ముందు ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు