మీ జీవితాన్ని మీరే మలచుకోండి..

ముంబైలో ఫిబ్రవరి 17న జరిగిన ‘మేక్ ఇన్ ఇండియా’ డిజైన్ ఫోరంలో సద్గురు ప్రసంగం నుండి తీసికొన్న భాగం ఈ వ్యాసం.
 

మనం డిజైన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ విశ్వంకంటే గొప్పడిజైను మరొకటి లేదు. అది విపరీతమైందేకాదు, ఉన్మత్తమైంది కూడా. అదే సమయంలో దాని మూలలక్షణం చాలా సాధారణమైనది. ఒక అణువు అయినా, ఒక ఆకు అయినా, సౌరవ్యవస్థ అయినా, విశ్వం అయినా దాని డిజైనులోని మౌలికాంశాలు ఒక్కటేనంటారు శాస్త్రజ్ఞులు. కేవలం కృత్రిమతలోను, సంక్లిష్టతలోను బహురూపాలుగా గుణాకారం చెందుతాయి. అంటే మీరు డిజైనును అర్థం చేసుకొని ఒక సృష్ట్యంశ నిర్మాణాన్ని తెలుసుకుంటే దాని సామ్యంలో మొత్తం విశ్వం డిజైనును తెలుసుకోగలుగుతారు.

యోగ విధానంలో, ఒక వ్యక్తి సృష్టికీ, ఈ బ్రహ్మాండ సృష్టికీ భేదంలేదని మేము చెప్తుంటాం. ‘మీరు’ అనే ఈ సృష్టిని తెలుసుకుంటే, మీరు సృష్టికి సంబంధించిన ప్రతికోణాన్నీ అర్థం చేసుకుంటారు. యోగా అంటే ఇదే. దురదృష్టవశాత్తు చాలామంది యోగా వ్యాయామరూపం అనుకుంటారు. అటువంటి అభిప్రాయం అమెరికా తీరం నుండి పాకింది. సారాంశ రూపంలో యోగా మీ వ్యక్తిగత జ్యామితిని, విశ్వాంతరాళ జ్యామితితో అనుసంధానం చేసి ఈ విశ్వంలో ఉన్న సమస్తాన్నీ అందుబాటులోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. విశ్వాన్ని డౌన్‌లోడ్ చేసుకునే సామర్థ్యం మీకు ఏర్పడుతుంది.

జనం డిజైనర్ వస్త్రాలు ధరిస్తారు. డిజైనర్ కార్లు నడుపుతారు, కాని మీరు డిజైనర్ జీవిగా ఉన్నారా?

ఉదాహరణకు 1980 లలో మీరు, టి.వి. లో మీ ఇష్టమైన కార్యక్రమం చూసేటప్పుడు అది అకస్మాత్తుగా చెదిరిపోయేది. అప్పుడు మీరు ఇంటి కప్పు మీదికి పరిగెత్తి అక్కడ అల్యూమినియం గొట్టాల్ని సరిచేసేవారు. మీరు కిందికి వచ్చేటప్పటికి మళ్లీ ప్రపంచమంతా మీ ముందుండేది. మానవశరీరం కూడా అటువంటిదే. దాన్ని సరైన రీతిలో ఉంచగలిగితే మొత్తం విశ్వాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోగలరు. దీన్ని అర్థం చేసుకోవడం, వ్యక్తి, విశ్వజ్యామితులకు అనుసంధానాని కనుగొనడమే యోగశాస్త్రమూ, సాంకేతికతా.

డిజైనర్ జీవితం

మన జీవితాల్లోకి వద్దాం. జనం డిజైనర్ వస్త్రాలు ధరిస్తారు. డిజైనర్ కార్లు నడుపుతారు, కాని మీరు డిజైనర్ జీవిగా ఉన్నారా? డిజైనర్ జీవి అంటే మీరు ఏమి కావాలనుకుంటే దానిగా పరివర్తనం చెందడం. సారభూతంగా మీ భవిష్యత్తును మీరు డిజైను చేసుకోగలగాలి. ఇది జరగాలంటే మీరెవరు అన్న అంతర్గత కోణాన్ని మీరు మీ అధీనంలోకి తెచ్చుకోవాలి.

ఈ విశ్వంలో అత్యద్భుతమైన ఇంజినీరు మీ లోపలనే ఉన్నాడు. మీరొక రొట్టెముక్క తింటే రెండు, మూడు గంటల్లో అది మనిషవుతుంది. మీ రొట్టెముక్కతో మీరు ఈ భూగోళం మీద అత్యంత సంక్లిష్ట వ్యవస్థను నిర్మించగలుగుతున్నారు. అంటే అత్యద్భుతమైన ఇంజినీరు మీలోనే ఉన్నాడు. దీని ఆధారంగానే మేము అంతర్గత ఇంజినీరింగును(Inner Engineering) అందిస్తున్నాం – మీ జీవితపు బాధ్యతను తీసికొనే మీ అంతర్ముఖాన్ని ఇంజినీరింగు చేయడానికి. మనం ఎలా పుట్టాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఎలాంటి అనుభూతులు పొందుతున్నాం, మన జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం, ఎక్కడ అంతమవుతాం – ప్రతిదీ వ్యక్తి నిర్ణయించుకొనేదే. ఇది డిజైనర్ జీవితం. ఇది యోగి జీవితం. ఇది ఈ సంస్కృతి నుండి వికసించిన డిజైను భావన.

మనకు ముక్కోటి దేవతలెందుకున్నారని మీరనుకుంటున్నారు. అది అప్పట్లో మన జనాభా కాబట్టి.

మీ దేవుణ్ణి డిజైన్ చేసుకోండి

ఈ సంస్కృతి మీరు కోరుకున్న రీతిలో దేవుణ్ణి డిజైను చేసుకొనే స్వేచ్ఛను కూడా ఇచ్చింది. ఇష్టదేవత అన్నమాట ఉంది, అంటే మీకు ఇష్టమైన దేవతను మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఒక పురుషుణ్ణి పూజించవచ్చు, స్త్రీని పూజించవచ్చు, ఆవును పూజించవచ్చు, చెట్టును పూజించవచ్చు. మీరు దేనికి దైవత్వం ఆపాదించదలచుకుంటే దాన్ని పూజించవచ్చు. ఎవరూ దీన్ని వింతగా భావించరు. డిజైనును దాని పరాకాష్ఠకు చేరడమే ఇది. మనకు ముక్కోటి దేవతలెందుకున్నారని మీరనుకుంటున్నారు. అది అప్పట్లో మన జనాభా కాబట్టి. కానీ ఎప్పటి నుండి మనం పాశ్చాత్యవిద్య  నేర్చుకుంటున్నామో, ఇలా చేసేందుకు కొంచెం సిగ్గు పడుతున్నాం.

ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తును తామే డిజైను చేసుకోవాలని నా ఆకాంక్ష, ఆశీస్సులు కూడా. ఈ సంస్కృతి స్వభావం ఇది. ఈ దేశం స్వభావం ఇది. భారత ప్రజలకు ఈ ప్రగాఢమైన  బాధ్యతా ఉంది, హక్కూ ఉంది. మానవ సంక్షేమాన్ని సృజించే విషయంలో విజయవంతమైన ఒక కొత్త కూర్పు చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉంది. కావలసిన అంతర్గత సాంకేతికతలు, వివేకం మనకున్నాయి. మనం ఈ ప్రపంచాన్ని సుందరప్రదేశంగా చేయాలి. అది జైత్రయాత్రల ద్వారా కాదు, ప్రపంచాన్ని ఒక పూలమాలలా హత్తుకోని..!

ప్రేమాశిస్సులతో,
సద్గురు