దేశంలోని ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంకా భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్వీయ-నిర్మిత మహిళలలో ఒకరైన డాక్టర్ కిరణ్ మజుందార్-షా, ఇంకా సద్గురు, 22 ఏప్రిల్ 2017 న, మానవులు ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు బెంగళూరులో సమావేశమయ్యారు. అందులో నుంచి తీసుకోబడిన ఈ భాగంలో, వారు పర్యావరణ క్షీణత, జనాభా పెరుగుదల, కన్జ్యూమరిజం, ఇంకా చైతన్యం గురించి చర్చిస్తున్నారు.

మన సామాజిక బాధ్యత ఎక్కడ ఉంది?

డాక్టర్ కిరణ్ మజుందార్-షా: ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బెంగళూర్ నుండే కాబట్టి, నేను మన అందరికీ ప్రతిరోజు ఇబ్బంది కలిగిస్తున్న ఒక అంశం గురించి మాట్లాడతాను. అదేంటంటే అన్నిచోట్లా, ఎక్కడపడితే అక్కడ చెత్త ఉంటుంది. చెరువులు కలుషితమైపోయాయి - ఈ నగరంలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి దానిలో మనం చేయాల్సింది కూడా ఉంటుంది. అంతా ప్రభాత్వాన్నే చేయమని అడుగుతూ కూర్చోలేము. ఏదేమైనా ఇది స్వచ్ఛభారత్ కదా. .

ఒక విధంగా మనందరం 2020 కల్లా భారతదేశం స్వచ్ఛమైన దేశంగా అవ్వాలని ఒప్పుకున్నాము. అయినా సరే మూడేళ్లు గడిచాక, నిజానికీ మనం ఏం చేస్తున్నామో చూస్తే, మనం మన అలవాట్లను మార్చుకోవడం లేదు. ఇప్పటికీ మనం ఎక్కడపడితే అక్కడ చెత్త పడేస్తూ ఉన్నాము. మనం చెరువులను కలుషితం చేస్తున్నాము. దేశంలో ఎవరికీ కూడా సామాజిక బాధ్యత ఉన్నట్లు కనిపించడం లేదు. .

కాబట్టి, మన దేశంలో పౌర కర్తవ్య భావనను ఎలా తీసుకురావాలి? మనలో చాలామంది అలా చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆఖరికి వదిలేస్తారు. ఇలాంటి సమస్యలతో మనం ఎలా వ్యవహరించాలి?

సద్గురు: ఇటీవలే, వాట్సాప్ లో ఒక ఫోటో తిరుగుతూ ఉంది. హనుమాన్ జయంతి రోజున, ముంబై-పూనే రోడ్డు మధ్యలో ఎక్కడో , ఎవరో దాదాపు ఒక వంద కోతులకు చక్కని భోజనాన్ని పెట్టారు. అవన్నీ ఒక వరుసలో కూర్చుని అరిటాకుల్లో తింటున్నాయి. కాబట్టి ఎవరో నాతో, “సద్గురు ఇది ఎలా సాధ్యం? వాళ్ళు ఫోటో షాప్ చేశారా?“ అన్నారు. నేను, “లేదు, ఫోటో షాప్ చేయలేదు. అవసరమైనదల్లా ఇదే. మీరు అందరికీ సరిపడా అందేలా చేస్తే, వాళ్ళు సహజంగానే నాగరికులుగా అవుతారు” అన్నాను. ప్రస్తుతం ప్రతిదీ కొరతగా ఉంది. ప్రతిదీ కొరతగా ఉన్నప్పుడు, ప్రజలు ఒకరినొకరు నెట్టుకుంటారు, అలాగే కొంత చెత్తపనులు చేస్తారు. మనుషుల విషయంలో ఇంకొంచెం ఎక్కువ ఎడం అవసరం. మనం మంచి వాళ్ళమే, కానీ మనం మరీ ఎక్కువ మంది ఉన్నాం.

20వ శతాబ్దం మొదట్లో ఈ గ్రహం మీద మానవ జనాభా కేవలం 1.6 బిలియన్లు. ఇప్పుడు మన జనాభా 7.5 బిలియన్లు. 1947 లో భారత దేశంలో మనం కేవలం 33 కోట్ల మంది. ఈ రోజు మనం 134 కోట్ల మంది. 70 సంవత్సరాలలో జనాభా నాలుగు రెట్లు పెరగడం అంటే అది బాధ్యతారాహిత్యం. కానీ ఇది జరిగింది కేవలం అతిగా పిల్లల్ని కనడం వల్ల మాత్రమే కాదు. ఇది జరుగుతున్నది, మానవుని సగటు ఆయుర్ధాయం గణనీయంగా పెరగటం వల్ల. 1947లో మనిషి సగటు ఆయుర్ధాయం 28 ఏళ్లు. 28 - విన్నారా?

డాక్టర్ కిరణ్ మజుందార్-షా : ఇప్పుడు అది 68.

సద్గురు: అది ఒక అద్భుతమైన విషయమే. మనం మరణాన్ని వాయిదా వేశాము. సరళమైన లెక్క: మనం మరణాన్ని వాయిదా వేసినప్పుడు, జననాన్ని కూడా వాయిదా వేయాలి కదా? ఈ దేశంలో ఒకప్పుడు దాదాపు యువ మహిళలు అందరూ 15, 16 సంవత్సరాలు వచ్చేసరికి గర్భం ధరించే వారు. ఈ రోజు సగటున, అది 20 ఏళ్లకు నెట్టబడింది. మనం దాన్ని 35 ఏళ్లకు నెట్టాలి. మీరు లింగ భేదం అంశాన్ని లేవనెత్తారు కాబట్టి - ఒక స్త్రీ ముప్పై ఐదు సంవత్సరాల వరకూ పిల్లల్ని కనకపోతే, ఒక విషయం ఏమిటంటే, చాలావరకు, ఆమె బాగా చదువుకుంటుంది, ఆమె వృత్తిపరంగా స్థిరపడుతుంది, ఇంకా బహుశా ఆమె తెలివి గలదై, అసలు పిల్లలే వద్దు అనుకోవచ్చు.

పిల్లల్ని కనటంలో తప్పేమీ లేదు - మనందరం ఆ విధంగానే పుట్టాము. అయితే మానవజాతి అంతరించిపోయే స్థితిలో లేదు, అంతే.

పిల్లల్ని కనటంలో తప్పేమీ లేదు - మనందరం ఆ విధంగానే పుట్టాము. అయితే మానవజాతి అంతరించిపోయే స్థితిలో లేదు, అంతే. మీరు ఒక పులి అయ్యుంటే, నేను సంతాన సాఫల్య కేంద్రాలు పెడదాము అనే వాడిని. కానీ మనం మనుషులం, అలాగే మనం బాగానే సంతానోత్పత్తి చేస్తున్నాము. సంతాన సాఫల్య కేంద్రాలని చూసినప్పుడు, నా గుండె తరుక్కుపోతుంది. అందుకు కారణం, మీ శరీరం నుండి వచ్చిన వారు మాత్రమే మీవారు అవుతారనే వెఱ్ఱి నుంచి వచ్చే ఒక ఆలోచన. మిగతా వారు కూడా మీ వారు ఎందుకు అవ్వకూడదు? మానవుడిగా ఉండటం అంటే ఇదే. మీరు సుముఖంగా ఉంటే మీరు ఇక్కడ ఎటువంటి హద్దులు లేకుండా జీవించవచ్చు. ప్రకృతి మీపైన ఎటువంటి హద్దులను నియమించలేదు. తెలియకుండా, నిర్భందంగా మీకు మీరే హద్దులను పెట్టుకుంటున్నారు. దానర్థం, మీరు మానవులుగా ఉండటం అనే పార్శ్వాన్ని అన్వేషించలేదు. మీరు ఇంకా, ఈ భూమి మీద ఉన్న ఇతర ప్రాణుల లాగానే వ్యవహరించాలని చూస్తున్నారు.

ఒక మానవునిగా ఉండడం అనే పార్శ్వాన్ని మీరు పరిశోధించినట్లయితే, మీరే చూస్తారు కలుపుగోలుతనం అంటే భౌతికత కాదు - కలుపుగోలుతనం అంటే, అది చైతన్యం. చైతన్యం జాగృతమైతే మీరు భిన్నమైన ఎంపికలు చేసుకుంటారు. మా వద్ద కొన్ని వందల జంటలు ఉన్నారు, వాళ్ళు ఫుల్ టైం ఇంకా పార్ట్ టైం వాలంటీర్లు, వాళ్ళలో ఎవరికీ పిల్లలు లేరు, వాళ్ళు కావాలనే తమ సొంత పిల్లలు వద్దని నిర్ణయించుకున్నారు, ఎందుకంటే నేను వాళ్లకి కొన్ని వేల పిల్లల బాధ్యతని అప్పగిస్తున్నాను, సిద్ధంగా ఉంటే కొన్ని లక్షల పిల్లల్ని అప్పజెబుతున్నాను. భౌతికంగా ఒక పిల్లవాడితో గుర్తింపు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎక్కడుంది. నేను ఎంతో సాహసవంతమైన ఒక దాని గురించి ఆలోచిస్తున్నాను, అందుకు నాపై ఎంతో వ్యతిరేకత రావొచ్చు. ఆరోగ్యంగా ఉండి, పిల్లలను కనగలిగే సామర్ధ్యం ఉండి కూడా, పిల్లలు వద్దనుకున్న మహిళలకు ఒక అవార్డును ప్రకటించాలని అనుకుంటున్నాను.

డాక్టర్ కిరణ్ మజుందార్-షా : సరే, ఆ విషయంలో మీకు చక్కటి మద్దతు లభిస్తుంది.

సద్గురు: ఎందుకంటే, ఈ రోజున మీరిది అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా…. మీరు సమస్య పార్కింగ్ అనో, లేదా చెత్త అనో, లేదా హెల్త్ కేర్ అనో అనుకుంటున్నారు. లేదు సమస్య జనాభా.

కన్సూమరిజానికి ఒక పరిష్కారం ఉందా?

ఆడియన్స్ నుండి ప్రశ్న: నమస్కారం, సద్గురు. హిందుస్థాన్ అనేది ఎప్పుడూ కూడా స్వావలంబన కలిగినదిగా(self-reliant) ఉంది. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు ఒక కన్జ్యూమర్ గా అయ్యారు. కన్జ్యూమరిజం రోజు రోజుకి పెరుగుతుంది, దానితోపాటు గుట్టలుగుట్టలుగా చెత్తా ఇంకా నదుల కాలుష్యం కూడా పెరుగుతోంది. ఈ తరంలో మనం, స్వశక్తితో నిలబడే వారిగా ఎలా అవ్వాలో మీరు సలహా ఇస్తారా?

సద్గురు: మానవ ఆకాంక్షలను అదుపు చేయడంలో మీరు ఎప్పటికీ సఫలం కాలేరు. కానీ మీరు మానవ జనాభాను అదుపు చేయవచ్చు. ప్రస్తుతం, ఐక్యరాజ్య సమితి ఇంకా ఇతర సంస్థలు కూడా, 2050 నాటికి ఈ భూమి మీద మన జనాభా 970 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరు నగరంలో జీవితాన్ని ఒకసారి ఊహించి చూడండి. ప్రస్తుతం మనకు ఉన్నవాటి కంటే మనం 40 శాతం తక్కువ వనరులతో జీవించాలి. వనరులు అన్నప్పుడు నేను మాట్లాడుతుంది ముడి చమురు, బంగారం, వజ్రాలు, అటువంటి వాటి గురించి కాదు. నేను మాట్లాడుతుంది ఆహారం, నీరు, గాలి గురించి. ఒక నిమిషంలో మీరు సుమారు 12 నుండి 15 సార్లు శ్వాస తీసుకుంటారు. ఒకసారి పది సార్లు మాత్రమే శ్వాస తీసుకొని, ఎలా అనిపిస్తుందో చూడండి.

2050 లో మీకు ఈ విధంగానే అనిపిస్తుంది, మనం జనాభా పెరుగుదలను అదుపు చేస్తే తప్ప. అది చేయటంలో మనం విఫలమైతే ప్రకృతి అది మనకు ఎంతో క్రూరమైన విధానంలో చేసి, బహుశా దాన్ని సరి చేస్తుందేమో. కానీ మనం చక్కదిద్దే చర్యలు చేపట్టకపోతే, మనం దాన్ని ఎరుకతో సరి చేయకుండా ఉండి, ప్రకృతి దాన్ని క్రూరంగా సరి చేసేదాకా తెస్తే, అది మానవత్వానికి ఇంకా మన మేధస్సుకు ఒక అవమానం కాదా ?

అన్నింటినీ మించి, దీన్ని సరి చేయడానికి, చాలా ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే - ప్రజలు ఈ రెండింటికీ ఒకదానితో ఒకదానికి సంబంధం లేదని అనుకున్నప్పటికీ - స్వభావరీత్యా మీరు ధ్యాన పరులు అయితే, ఇక్కడ కూర్చున్నప్పుడు, మీరు సంపూర్ణంగా ఉన్నట్లు అనుభూతి చెందుతుంటే; బయటి ప్రపంచంలో ఏది అవసరమో మీరు అది మాత్రమే చేస్తారు - ఎక్కువ చేయరు, తక్కువ చేయరు. ప్రస్తుతం, మీరు ఒక నిర్బంధ స్థితిలో ఉన్నారు. ఈ నిర్బంధ స్థితిలో మీరు కన్జ్యూమరిజాన్ని ఆపలేరు.

మీ అందరూ ఇంటికి వెళ్లి చెక్ చేయండి, మీ ఇంట్లో ఎన్ని వస్తువులను మీరు గత సంవత్సరంగా అసలు వాడనే లేదో.

మానవ ఆకాంక్షలను అదుపు చేయాలని ప్రయత్నించకండి, అలా చేస్తే ప్రజలు వంచకులుగా అవుతారు. మనం మానవ జనాభాని అదుపు చేస్తే, అలాగే స్వభావరీత్యా వాళ్ళు ఆనందంగా ఉండేలా చేస్తే, అప్పుడు, నిజంగా వాళ్ళు ఏది చేయాలనుకుంటారో అదే చేస్తారు. నిర్బంధంగా ఏదీ చేయరు. ప్రస్తుతం, వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళు ఎన్నో విషయాలు చేయాలి.

మీరు మానవులను ఒక అంతర్గత శ్రేయస్సుకు తీసుకురావాలి, అతను లేదా ఆమె ఇక్కడ కూర్చుంటే, జీవితం సంపూర్ణంగా అనిపించే స్థితికి తీసుకు రావాలి. ప్రస్తుతం మనందరం ఇక్కడ ఇదే హాల్ లో కూర్చుని ఉన్నాము, ఒకే గాలిని పీలుస్తున్నాము, బహుశా ఒకే రకమైన ఆహారాన్ని కూడా తింటాము. కానీ, నేను ఈ క్షణంలో నాలో నేను ఎలా ఉన్నాను అన్నదాన్ని, నేను దాన్ని ఈ ప్రపంచంలో దేనికీ బదులుగా ఇవ్వను. మీరు నాకు ఈ మొత్తం ప్రపంచాన్నీ ఇచ్చినా సరే, “బదులుగా దాన్ని(అంతరంగ స్థితిని) ఇవ్వను” అంటాను. మీరు ఈ విధంగా ఉండి ఉంటే, అప్పుడు మేము మీతో కన్జ్యూమరిజం గురించి మాట్లాడాల్సి వస్తుందా? మీరు ఏది అవసరమో అది చేస్తారు. అవసరం లేనిది మీరు ఎప్పుడూ చేయరు.

మీ అందరూ ఇంటికి వెళ్లి చెక్ చేయండి, మీ ఇంట్లో ఎన్ని వస్తువులను మీరు గత సంవత్సరంగా అసలు వాడనే లేదో. బహుశా వాటిలో చాలా వరకూ, మీరు వాటిని ఇక ఎప్పటికీ వాడకపోవచ్చు. అయినా అవి అక్కడ ఉంటాయి. మీరు చనిపోయిన తర్వాత, ఇంకెవరికో వాటన్నింటినీ పారవేసే శ్రమ ఉంటుంది. దయచేసి వాటిని ఎవరికన్నా ఇచ్చేయండి. ఒక సంవత్సరం నుండి మీరు వాడకుండా ఉన్న వస్తువులన్నింటినీ, ఎవరికన్నా ఇచ్చేయండి.

Editor’s Note: Sadhguru explores the science behind Bharat, India’s original name, and looks at how the culture in this nation was carefully crafted for ultimate wellbeing in the ebook, “Bha-ra-ta: The Rhythm of a Nation”. Pay what you wish. For a free download, in India, click “Claim for Free”. Elsewhere, enter “0” in the price field.

A version of this article was originally published in Isha Forest Flower June 2017.