సద్గురు:: జీవితానికి అనేక అంశాలు ఉన్నాయి. జననం, బాల్యం, యౌవ్వనం, వృద్ధాప్యం. అంతేకాక ప్రేమ, సౌకుమార్యం, సంబంధాలలో మాధుర్యం, కాఠిన్యం, విజయంలోని ఆనందం, సంతృప్తి, సుఖం, దు:ఖం అనేకం ఉన్నాయి. మీ మనస్సుని కొంత ఎరుకతో ఉంచితే, ఇవన్నీ మీరు గ్రహించగలిగినవే. జీవితం యొక్క అతి స్పష్టమైన అంశం- మరణం- అది ఏ బుర్రకీ అంతు చిక్కనిది- మీకు ఎంత తెలివి తేటలున్నా, చురుకైన వారైనా, మీరెంత మేధావి అనుకున్నా. జీవం అలా మనల్ని ఆడించటానికి కారణం, మనం మర్త్యులమవడం వల్లనే. మనం అమరులమైతే, బాల్యం, యౌవ్వనం, వృద్ధాప్యం ఉండవు- అసలు జన్మించడం ఉందా అని కూడా మనం ప్రశ్నించవచ్చు.

మరణం, జీవితానికి ఆధార రేఖ(baseline) లాంటిది. మీరు మరణాన్ని అర్థం చేసుకోకపొతే, జీవితం గురించి మీకెప్పుడూ తెలియదు, మీరు దాన్ని నిర్వహించనూ లేరు, ఎందుకంటే జీవితం-మరణం, ఉఛ్వాస నిశ్వాసాల లాంటివి. అవి రెండూ అవిభక్తంగా కలిసే ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రక్రియ మీరు మరణాన్ని ఎదుర్కొన్నప్పుడే సాధ్యం- స్వయంగా నైనా, లేదా మీకు ఆప్తులెవరైనా సరే, ఎవరు లేకుంటే మీరు, నేను జీవించలేను అనుకున్నారో, వారు. మరణం దగ్గిర పడ్డప్పుడు, లేక అది జరిగినప్పుడూ, ఆ సమయాల్లో చాలా మందిలో ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది, "ఇదంతా ఏమిటి? దీని తర్వాత ఏమి జరుగుతుంది?" అని. జీవిత అనుభవాలు ఎంతో యదార్థం అని అనిపిస్తున్నంత కాలమూ, అది ఉన్న పళంగా ముగుస్తుందని మీరు నమ్మలేరు. ఒక్కసారి, మరణ కాలం దగ్గరయితే, మనస్సు తప్పకుండా మరింకేదో ఉన్నది అని చూపుతుంది. మనస్సు ఎంత పరికల్పన(project) చేసి చూపినా, దానికి పూర్తిగా తెలియదు, ఎందుకంటే అది అప్పటి దాక సేకరించిన సమాచారం ఆధారంగానే పని చేస్తుంది. మనస్సుకి, మరణంతో కలిసి సాగడం తెలియదు ఎందుకంటే దానికి విశ్వసనీయమైన సమాచారం లేదు- కేవలం వ్యర్థప్రసంగాలు తప్ప.

మీరు, చనిపోయిన తర్వాత, ఎట్లా పైకి వెళ్లి దేవుని ఒళ్ళో కూర్చుంటారో అన్న వ్యర్థప్రసంగాలు చాలా విన్నారు. అది నిజమే అనుకుంటే, మీరు ఈ రోజే వెళ్ళాలి. అంత విశేష అధికారం మీకు ప్రసాదిస్తుంటే, మీరు దాన్ని వాయిదా వేసే కారణం నాకు కనబడటం లేదు. స్వర్గం, నరకం లాంటి వ్యర్ధ ప్రసంగాలు విన్నారు. అలాగే అప్సరసలు, ఇంకా ఏమేమిటో విన్నారు, కానీ ధృవీకరించిన సమాచారం లేదు, మరణం తరువాత ఏమి జరగబోతున్నదూ అంటూ అలోచిస్తూ, మీరు సమయం వృధా చేయవద్దు, ఎందుకంటే అది మీ మనసు పరిధిలో లేదు.

దానిని తెలుసుకోవడానికి ఏకైక మార్గం, భారతీయ భాషలలో మనం "ప్రజ్ఞ" అనే దాని ద్వారానే. ఇంగ్లీష్ లో మనం ‘ఎవేరెనెస్’ అని అంటాం కానీ ఆ శబ్దాన్ని సామాన్య అర్థంలో తీసుకోవద్దు. మీకు ప్రజ్ఞ ఉంటే, ఎన్నో విషయాల గురించి ఆలోచించకుండానే, వాటి సమాచారం పొందకుండానే, వాటి జ్ఞానం మీకు ఉంటుంది. మీ చుట్టూ ఉన్న జీవుల మీద మీకు నిశిత దృష్టి ఉంటే, ప్రతి జీవికి, ఆలోచించకుండానే వాటికి తెలిసిన విషయాలు ఎన్నో ఉంటాయి. నిజానికి, మీరు ఆలోచించేటట్లయితే, మీకు శ్వాస ఎలా పీల్చాలో కూడా తెలియదు. అది అలా జరిగిపోతుంది. అది మీ తెలివి తేటలు కాదు- సృష్టికర్త తెలివి తేటలు. మీ దేహం లాంటి క్లిష్టమైన యంత్రాన్ని, మీ నిర్వహణకు వదిలేస్తే, అది ఒక విపత్తే అవుతుంది.

ఎన్నో విషయాలు, మీ సహాయం, గ్రహింపు, ఆలోచనలు లేకుండానే జరుగుతున్నాయి. ప్రజ్ఞ అనేది ఆలోచనలకు మించినది. ఏదయితే సృష్టికి మూలాధారమో అదే ప్రజ్ఞ. దానిని మీ అందుబాటులోకి తెచ్చుకుంటే, మీరు జీవన్మరణాల సరిహద్దులను అధిగమించవచ్చు. నిజానికి వాటికి సరిహద్దు లేదు- ఈ క్షణాన మీరు పుడుతున్నారు, మరణిస్తున్నారు. సాంఘిక స్థాయిలో, పరిమితమైన అనుభవంతో, ప్రజల అనుభూతుల్లో, ఒకరు ఈ రోజున ఉండవచ్చు, రేపు పోవచ్చు. కానీ జీవిత పరిభాషలో, జీవన విధాన షరతుల్లో, బ్రతకడం, చావడం అనేవి లేనే లేవు. అది అంతా లీల - ఒక జగన్నాటకం.

ఇదంతా ఒక లీల అని మేమంటే దానర్థం, దైవం అనేది, మీ జీవితంతో ఆటలాడుకునే విద్రోహ శక్తి అని కాదు. దాన్ని నాటకమని ఎందుకు అంటామంటే, అంతా అల్లుకుని ఉండటం వల్ల. ఉనికి పరంగా, బాల్యాన్ని, యవ్వనాన్ని, మధ్య వయసుని, వృద్ధాప్యాన్ని వేరు పరచలేం-అవన్నీ ఒకదానికి ఒకటి అల్లుకొని ఉన్నాయి. ‘వ్యక్తి’ అని మనం పిలిచే వానిని, ‘విశ్వం’ అని మనం అనేదానిని, మనం వేరు చేయలేం. మీరు అండము అనే దానిని, బ్రహ్మాండం అనే దానిని వేరు చేయలేం. ఈ రకంగా, ఆ అర్థంలో అదొక నాటకం.

ఎప్పుడైతే మీరు ఒక దానికి, మరొక దానికి మధ్య సరిహద్దులు ఏర్పరిస్తే, ఇక నాటకం ఉండదు. మీరు ఇక్కడ కూర్చుని ఉంటే, శ్వాస అనేది మీకూ, చెట్టుకి మధ్య నాటకం ఆడుతోంది. "నేను నా శ్వాస తీసుకుంటాను - నీ శ్వాస నీవు తీసుకో" అని దానిని వేరు చేయలేరు. "నాది నేను చేసుకుంటాను- నీది నీవు చేసుకో" అని ఇది ఎన్నో ఇళ్లల్లో జరుగుతోంది. ఇలా ఆటని ఎప్పుడయితే పరిమితి చేస్తారో, అప్పుడు జీవితం మీ చేయి దాటి పోతుంది.

జీవన్మరణాల స్వభావం ఏమిటో తెలుసుకోవడానికి ప్రజలు ఎన్నో రకాల పనులు చేసారు. ప్రయోగాలు చేసి కానీ, వాటిని గురించి ఆలోచించి గానీ దానిపై మీకు అవగాహన రాదు. అనుభవ పూర్వకంగానే, దాని అవగాహన మీకు వస్తుంది. నన్ను ఎప్పుడయినా ప్రజలు మరణం గురించీ, మరణం తర్వాత ఏమి జరుగుతుంది అని ప్రశ్నలు అడిగితే, అది అనుభవ పూర్వకంగానే తెలుస్తుందని నేను వారికి గుర్తు చేస్తూ ఉంటాను. వాళ్ళు మరణించాలని నేను సూచించడం లేదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, మీలో అంతర్గతంగా ఉన్న ,"జీవాన్ని", అనుభవం చెందాలి. మీరు కేవలం దేహాన్ని మాత్రమే అనుభూతి చెందుతుంటే, నేను ఏమి చెప్పినా, మీరు అపార్థం చేసుకుంటారు. మీ జీవిత అనుభవం, మానసిక, భౌతిక వ్యవస్థల మీదనే ఆధారపడితే, మీరు ఈ కోణాన్ని గ్రహించలేరు. మరణం, మరణానంతరం అనేవి, స్వర్గం లోనో, నరకం లోనో దాగి ఉన్న రహస్యాలు కావు- అది ఇక్కడే ఉంది, ఈ క్షణంలోనూ ఉంది. ఇతర విషయాలలో పడి, దాన్ని గురించి మానవులు తగినంత శ్రద్ధ చూపించక పోవడమే అసలైన కారణం.

వారి వృత్తి, వారి జీవితం కంటే ఎంతో ముఖ్యం. వారి ప్రేమ వ్యవహారాలే జీవితం కంటే ఎంతో ముఖ్యం. తమ చుట్టూ ఉన్న వారితో ఉండే చిన్న తగాదాలు వారికి జీవితం కంటే చెప్పలేనంత ముఖ్యం. ఎటువంటి దుస్తులు ధరిస్తారో అనేది, జీవితం కంటే అతి ముఖ్యం. ఇవి కేవలం ఉదాహరణలే. మీకు జీవితం గురించి తప్పుడు భావనలు ఉండటం వల్లనే, జీవితం మీకు దొరక్కుండా పోతోంది. నిజానికి జీవితం మీకు దొరక్క పోవడం కాదు- మీరు జీవితాన్ని తప్పించుకుంటున్నారు. జీవితం మీ నుండి తప్పుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు- మీరు జీవితం నుండి తప్పించుకు తిరగడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

జీవితంలోని చేదైన, బాధాకరమైన అనుభవాలు, జీవం కారణంగా ఎప్పుడూ కలుగలేదు. అవి కలగడానికి కారణం, మీ దేహాన్ని, మనస్సుని నిర్వహించడంలోని మీ అసమర్థత వల్లనే. జీవం మీకు ఎప్పుడూ నొప్పిని కానీ, కష్టాలను కానీ కల్గించలేదు. అది దేహము, మనస్సుల వలనే. మీకు మీ భౌతిక, మానసిక వ్యవస్థలను ఎలా నిర్వహించుకోవాలో తెలియదు. రెండు అద్భుతమైన పరికరాలు మీకు ఇవ్వబడ్డాయి, కానీ మీరు వాటిని అస్తవ్యస్తం చేస్తున్నారు. మీ నొప్పులు, బాధలు, మీ నుండి వచ్చినవే కానీ జీవం నుంచి కాదు.

జీవం అనేదానిని, దాని స్వభావాన్ని, దాని మూలాధారాన్ని, మీకు అందుబాటులోకి తెచ్చేదే ప్రజ్ఞ. ఇవి వేరు వేరు విషయాలు కావు- జీవానికి మనం ఆపాదించే వివిధమైన పేర్లే. దానికి మూలం లేదు, ప్రకటమయ్యేదీ లేదు- అదంతా ఒకటే. జీవం, మరణం అనేవి లేనే లేవు. అది జీవమూ కాదు, మరణమూ కాదు- అది కేవలం వీటి ఆట మాత్రమే. దానితో ఒక ఆట ఆడవచ్చు, ఒక రోజు దానిని ఆపి వేయావచ్చు. జీవం ఆట ఆడుతుంది ఆపేస్తుంది, ఆట ఆడుతుంది ఆపేస్తుంది, కానీ అసలు జీవం, ఒక కార్యకలాపం కాదు, ఒక నిర్దిష్ట సంఘటన కాదు. అది ఒక విశేషఘటన, కేవలం అలాఉంది. అది సృష్టికి ప్రాతిపదిక. అది సృష్టికి మూలాధారం..

ప్రేమాశీస్సులతో,

సద్గురు


Editor’s Note: Get the latest updates from the Isha Blog. Twitter, facebook, rss or browser extensions, take your pick.

This article is based on an excerpt from the May 2014 issue of Forest Flower. Pay what you want and download. (set ‘0’ for free). Print subscriptions are also available.